డా.రోష్ని
ఇంతకుముందు రక్తహీనతను పోగొట్టటానికి బీట్‌రూట్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. కాని కొన్ని ఊళ్లలో ఆకుకూరలే దొరకవు, ఇక బీట్‌రూట్ కూడానా అని వాపోతూ ఉండొచ్చు మీరు. అటువంటి వారికోసం ఒక దివ్యమైన ఆకు రెడీగా ఉంది. రెడీగా లేకున్నా ఒక కొమ్మ పాతి రోజూ కొద్దిగా నీళ్లు పోస్తే చెట్టయి తీరుతుంది. అదేనండీ, మనందరికీ తెలిసిన మునగచెట్టు.
మనల్ని ఎవరయినా పొగుడుతుంటే మునగచెట్టెక్కిస్తున్నాడండీ, కిందికి పడ్డం తప్పదు అని వేళాకోళాలాడతాం. కాని ఇక్కడ వేళాకోళానికి తావే లేదు. చాలా సీరియస్. ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అనే సామెతలో ఉల్లి బదులు మునగ అనే మాట చేర్చుకోవచ్చు. అన్ని లాభాలు ఉన్నాయి ‘మునగ’ వల్ల.
మునగలో ఉన్న గొప్ప గుణాలేమిటి?
మునగచెట్టులో ఉపయోగపడని భాగం లేదు. ఆకు, కాయ, పువ్వు, బెరడు అన్ని ఉపయోగపడతాయి. కాయలు పాలుపోసి బీన్స్‌లా వండితే భలే టేస్ట్‌లే. పువ్వును వండితే పుట్టగొడుగులకూర మాదిరి ఉంటుంది. ఇక ఆకులైతే చాలా పోషకాలు ఉంటాయి. బీటా కరోటిన్, విటమిన్ సి, మాంసకృత్తులు, ఇనుము, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుల్ని పాలకూర లాగే వండుకోవచ్చు. వాటిని ఆరబెట్టి కరివేపాకు కారంలా కూడా చేసుకొని తినొచ్చు. ఆకుల పొడి రూపంలో కూడా పోషకవిలువలు తగ్గవు.
మునగాకు, కాయలు తల్లిపాల వృద్ధికి తోడ్పడతాయి. 3 ఏళ్ల పిల్లకి ఒక టేబుల్‌స్పూను మునగాకు పొడి వల్ల 14% మాంసకృత్తులు, 40% కాల్షియం, 23% ఇనుము చాలావరకు విటమిను ఎ లభిస్తాయి. ఆరు చెంచాల పొడి గనుక తింటే గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు కావలసిన ఇనుము, కాల్షియం లభిస్తాయి.
మునగాకు పోషకవిలువలు ఈ క్రింది విధంగా ఉంటాయి. (100 గ్రా||లకి)
నీరు-75.9% కాల్షియం-440 మి.గ్రా.
మాంసకృత్తులు-6.7% పాస్ఫరస్-70 మి.గ్రా.
కొవ్వుపదార్థాలు-1.7% ఇనుము-7 మి.గ్రా.
పీచుపదార్థం -0.9% ‘సి’ విటమిను-220 మి.గ్రా.
ఖనిజలవణాలు-2.3% కొద్దిగా ‘బి’ కాంప్లెక్సు
పిండిపదార్థాలు-12.57% కాలరీలు-92
అటువంటి మునగను మనం ఒక రక్తహీనతకే కాకుండా వేరే జబ్బులకు కూడా ఉపయోగించవచ్చు.
పిల్లలకు టానిక్కుగా : ఆకుల రసాన్ని పాలతో కలిపి పిల్లకు ఇస్తే ఎముకలు బలపడతాయి. వంట్లోకి రక్తం పడుతుంది.
గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు : ఈ టానిక్కు వల్ల వీరికవసరమైన కాల్షియం, ఇనుము, విటమిన్లు లభిస్తాయి. గర్భసంచిని సరయిన స్థితిలో ఉంచి, కాన్పు సులభంగా అయ్యేలా చేస్తుంది. కాన్పు తర్వాత ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. పాలిచ్చే తల్లులకు కూరగా వండిపెడితే పాలు వృద్ధి చెందుతాయి. కోస్తా ప్రాంతంలో బాలింతలకు తెలగపిండి (నువ్వుల నుంచి నూనె తీయగా మిగిలిన కేకు) మునగాకు వండి తినిపించడం సాంప్రదాయంగా వస్తుంది.
శ్వాసకోశ వ్యాధులకు : గుప్పెడు ఆకులు 80 మి.లీ. నీటితో 5 నిమిషాలు మరగనిచ్చి, చల్లారనివ్వాలి. దానికి కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టిబి, మామూలు దగ్గుని తగ్గించొచ్చు.
ఇన్‌ఫెక్షన్‌లకు : మునగాకు పెన్సిలిన్ యాంటిబయోటిక్‌లా సూక్ష్మజీవుల్ని నివారిస్తుంది. మునగాకు, పువ్వులతో చేసిన సూప్ తాగడం వల్ల గొంతునొప్పి, చర్మవ్యాధులు నివారించవచ్చు.
జీర్ణకోశ వ్యాధులు : ఒక చెంచా తాజా రసానికి తేనె, గ్లాసు కొబ్బరినీళ్లు కలిపి రోజుకు మూడుసార్లు ఇస్తే కలరా, జిగట విరేచనాలు, నీళ్ల విరేచనాలు, పచ్చకామెర్లకు ఉపశమనం కలుగుతుంది.
సౌందర్యపోషణ : తాజా ఆకులరసం, నిమ్మరసం కలిపి రాస్తే మొటిమలు, బ్లాక్‌హెడ్స్ పోయి ముఖం తాజాగా ఉంటుంది.
ఇన్ని ఉపయోగాలున్న మునగాకు ఇంకా మార్కెట్లో అమ్మే ఆకుకూరగా మారలేదు. చెట్ల మీద ఉచితంగా కోసుకోవచ్చు. వెంటనే దీన్ని ఉపయోగించి రక్తహీనత నుండి కోలుకోవడమే కాకుండా బలమైన ఎముకలు కలిగిన ఆరోగ్యవంతులుగా తయారవ్వండి. ఆలస్యం చేయకండి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags