ఓ ఆడపిల్లా! నీ అడుగులెటు?

పుష్పాంజలి
ఒక వైపు స్త్రీవాదం వేయి దుందుబుల నినాదంతో జ్వలితజ్వాలలా ముందుకు సాగుతుంటే, మరొక వైపు యువతులు ఆదర్శం లేని ఆధునికతకు ‘బానిసలై’ సమాజ పయనంలో వెనుకడుగులు వేస్తూ, ప్రగతి బాట నుంచి వైదొలగటం నేటి అత్యాధునిక పోకడల్లో ఒకటైపోయింది.
బతుకుపోరాటం స్త్రీ పురుషులిద్దరికీ సమానమే. అయితే స్త్రీ  తన బతుకుపోరాటంతో పాటు అస్థిత్వ పోరాటం కూడా చేయవలసి వుంటుందన్న విషయం ఆధునిక యువతి పూర్తిగా విస్మరించింది. ఈ ప్రత్యేకమైన పోరాటానికి తను  ఎటువంటి వ్యక్తిత్వం సమకూర్చుకోవాలి? ఎలా సిద్ధం కావాలి అన్న విషయాలను ఈనాటి యువతీతరం మర్చిపోయింది. సమాజంలోని పురుషునికన్నా తనది విశిష్టపాత్ర అన్న స్పృహ ఈనాటి అమ్మాయిలకు లేదు. స్త్రీ అడుగులింకా తడబడుతూనే ఉన్నాయని, స్త్రీ ఇంకా యుద్దభూమిలో తన అస్తిత్వాన్ని బుజువు చేసుకోవడానికి సమరాలు సాగిస్తూనే ఉన్నదన్న ‘ఎరుక’ యువతులలో లోపించడం కనిసిస్తూ ఉంది. తను స్థిరమైన వ్యక్తిత్వంతో ఆదర్శప్రాయురాలిగా ఉంటూ, సాటి స్త్రీలను, కనీసం రేపు తనకు పుట్టే పిల్లలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తన పైనే ఉన్నదని యువతీతరం పూర్తిగా మర్చిపోయింది. వాళ్ళ అభిరుచులూ, వేష భాషలూ, భావాలూ చూస్తే ఎవరికైనా విచారం కలుగుతుంది.
నా స్నేహితుని కుమార్తెను బి.టెక్‌ చదివించాడు. బోలెడంత కట్నమిచ్చి వివాహం చేశాడు. నా స్నేహితుడు దిగువ మధ్య తరగతి ప్రభుత్వోద్యోగి. కుటుంబబాధ్యతలు ఎక్కువ. ఈ అమ్మాయి భర్తతో బాటూ మరో ఊర్లో ఉంటూ ఉద్యోగంకూడా వెలగబెడుతున్నది. తొలి కాన్పు మలి కాన్పు రెండూ తల్లిదండ్రులే చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఆ తండ్రి మీద అంత బాధ్యత మోపడం సమంజసమేనా అన్న ఇంగిత జ్ఞానం ఆ చదువుకున్న పిల్లకి లేకపోయింది. పైగా తన భర్తను అల్లుడుగారు” అనాలని ఇన్స్‌ట్రక్షన్‌ ఒకటి! పెద్దలను గౌరవించమని శాస్త్రాలు చెబుతున్నాయ్‌గాని అల్లుడైన పాపానికి పిన్నను కూడా గౌరవించమని  ఏ శాస్త్రమూ చెప్పడం లేదు. అనేక విషయాల్లో ఆడపిల్లలకు సరైన అవగాహన కల్పించకపోవడం తల్లిదండ్రుల్లో లోపమేనని అనిపిస్తుంది.
నా స్నేహితురాలి కోడలు, పెళ్లై ఆరు నెలలైనా చేతులకు గాజులమలారంలా గాజులు వేసుకొని వస్తుంది. ఇంకా కొత్త పెళ్లి కూతుర్లా ఉండడమే సుఖమనుకుంది కాబోలును! జడలో మూడు వరుసల పువ్వులూ! పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిందట పైగా. మొత్తం చమ్కీలు కుట్టిన చీరలు! ఆమె స్నేహితురాళ్ళు నలుగురు ఆమెను చూట్టానికొచ్చారు. వాళ్ళకింకా పెళ్ళిళ్లు కాలేదు. ఐనా వాళ్ళ వేషధారణ కూడా ఇలాగే ఉంది. ఏవగింపు కలిగిస్తున్న ఈ సినిమాటిక్‌ గెటప్పుల్ని గురించి అడిగితే” ఇవి పార్టీ చీరలాంటి… చీర తీసుకెళ్తే షాపువాడే గాజులు, పూసలూ అన్నీ సెట్‌ చేసిస్తాడు” అన్నారు. ఇవన్నీ తగిలించుకుని మా ఇంటికి పార్టీకొచ్చిన వాళ్ళని కవ్వాలీలు పాడే వాళ్ళొచ్చారేమో అనుకున్నారందరూ.
కట్నాలను నిషేధించాలన్న నియమం గంగలో కలిసింది. కట్న మిచ్చి వరుణ్ణి కొనుక్కోవడం తమ జన్మ హక్కు అన్న అభిప్రాయం ఇప్పటి అమ్మాయిల్లో బలపడిపోవడం గమనిస్తున్నాం. నగలూ, పెట్టు పోతల విషయంలో కూడా లోపం జరక్కుండా చూసుకుంటున్నారు కొందరు.
ప్రస్తుతం ఆడపిల్లలు పూలు పెట్టుకొనే విధానంలో విపరీత పోకడలు చూస్తూనే ఉన్నాం. దీన్నే ”మోడ్రనైజేషన్‌” అని పొరబడుతున్నారు. పండక్కీ పబ్బానికి పద్దతిగా పూలు పెట్టుకునే విధానానికి స్వస్తి  పలికి దినచర్యలో ఇదీ ఇక భాగంగా మేకప్‌లో ఇదీ ఒక ఐటమ్‌గా పరిగణిస్తున్నారు. హైస్కూళ్లలో సాధారణంగా శుక్రవారం  యూనీఫాం ఉండదు. ఆవాళ మార్కెట్లో పూలే దొరకవనుకుంటా. ప్రతి అమ్మాయి జడలో రెండు మూడు వరుసల పూలదండలు తోకల్లా జడపొడుగునా వేళ్లాడుతూ కనిపాస్తయి. డిగ్రీ కాలేజీల్లో చదివే అనేకమంది అమ్మాయిలు ఇలా పూలదారులుగా రావడం వాళ్ళని టీజ్‌ చేయడం చూస్తున్నాం. కొందరు క్లాస్‌రూంలోకి మువ్వల సవ్వడులు వినిపించుకుంటూ వస్తుంటారు. వీళ్ళకంతా ఏదో ఒక సినిమా యాక్టర్‌ ఆదర్శంగా ఉంటుంది. తలలో పూలు వేళ్లాడేసుకున్నంత మాత్రాన తమనెవరూ సినిమా  యాక్టర్లను కోరన్న ఇంగిత జ్ఞానం అమ్మాయిలకు లేకపోవడం విచారకరం. ఇదలా ఉంచి పరీక్షలు రాయడానిక్కూడా ఒక పూల తట్ట జడలో ఏ మారకుండా రావడం ఎంతైనా ఏవగింపు కలిగిస్తూ వుంటుంది. ఒక పోవర్‌ కట్టింగూ, మెయింటెనెన్స్‌ లేకుండా కూడా జట్లు విరబోసుకోడం ఇంకో విపరీత ధోరణి. పాపం.  ఇంట్లో తల్లిదండ్రులు ముచ్చట పడుతూఉంటే వీళ్లే చేస్తారులే!
నీ హాబీలేంటమ్మా అంటే ”టీవీ, సినిమా” అన్న సమాధానమే నూటికి తొంభై మంది చెబుతుంటారు. ఏం పుస్తకాలు చదివావు? అంటే మాత్రం బుర్రలు వేళ్లాడేస్తుంటారు.
చాలామంది అమ్మాయిలకు చీర కట్టుకోడం రాదు. నాకు తెలిసిన చాలామంది డేనిష్‌ అమ్మాయిలూ, అమెరికన్‌ అమ్మాయిలూ చీర కట్టడం ఇట్టే నేర్చెేసుకుని తడబడకుండా అవలీలగా కట్టుకోడం చూశాను. మా ఆంటీ కూతురు చీర కట్టాలంటే ఇద్దరు మనుషులు ఒక గంట సేపైనా ” సహాయం చేయాల్సిందే. కొంతమంది తల్లులు ”మా అమ్మాయికి టీ పెట్టడం రాదు. చీరకట్టుకోడం రాదు. సేమ్యాలు ఏ  చెట్టుకి కాస్తాయో తెలియదు.” అని చెప్పుకోడం గొప్పగా భావిస్తారు. వీళ్లు, వీళ్ళ పిల్లలూ అందరూ కలిసి ఎటువంటి నిర్వీర్యమైన యువతీతరాన్ని తయారు చేస్తున్నారో ననుకుంటే విచారం కలుగుతుంది.
ఇది వర్కింగ్‌ మదర్స్‌ తరం. ఇంట్లో ఉండే ఆడమగా పిల్లలంతా ఎటువంటి వివక్షలూ లేకుండా తల్లికి సాయపడాల్సిన తరుణం. మంచిచెడ్డలూ కష్టసుఖాలూ పిల్లలు తెలుసుకోవాలి. తెలుసుకునేటట్టు చేయడం తల్లిదండ్రుల బాధ్యత.
అందరూ ఇలానే ఉన్నారని నేనకపోయిన కనీసం నూటికి అరవైశాతం చదువుకున్న ఆడపిల్లల పరిస్థితి ఇలాగే ఉంటున్నదని మాత్రం చెప్పగలను. ముందు తల్లిదండ్రులు మేలుకుని తమ పిల్లలను వివేకవంతులుగా చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఒక స్త్రీ విద్యా (అన్ని రంగాలలో) వంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతులవు తారన్న నానుడి ఎవ్వరూ మరచిపోరాదు. ఆడపిల్లల్ని మంచి పుస్తకాలు చదివించి, వాళ్లల్లో మంచి అభిప్రాయాలూ, ఆశయాలకు పునాదులు వేయకపోతే, వాళ్లు వాళ్ళ పిల్లలు అంతా తరాల తరబడి విషసంస్కృతులకు బానిసలై నిర్వీర్య సమాజాన్ని సృష్టిస్తారన్న అవగాహన తల్లిదండ్రులకు కలగాలి.
ఆడపిల్లలు మేలుకొని సునిశితమైన ఇంగిత జ్ఞానం అలవరచుకొని సమాజంలో సున్నితమైన (సెన్సిటివ్‌) తమ పరిస్థితిని రియలైజ్‌ కాకపోతే ఈ వెనుకడుగులు తప్పవు. ఈ పరిస్థితి నుంచి మేలుకోకపోతే వీళ్లంతా ”కళ్ళు తెరవని సీతలు”గానే మిగిలిపోతారు.  సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ నేర్పాలి. స్త్రీ శక్తిని మేల్కొల్పాలి. తల్లిదండ్రుల పెంపకంలోనే మార్పు రావాలి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.