పుష్పాంజలి
ఒక వైపు స్త్రీవాదం వేయి దుందుబుల నినాదంతో జ్వలితజ్వాలలా ముందుకు సాగుతుంటే, మరొక వైపు యువతులు ఆదర్శం లేని ఆధునికతకు ‘బానిసలై’ సమాజ పయనంలో వెనుకడుగులు వేస్తూ, ప్రగతి బాట నుంచి వైదొలగటం నేటి అత్యాధునిక పోకడల్లో ఒకటైపోయింది.
బతుకుపోరాటం స్త్రీ పురుషులిద్దరికీ సమానమే. అయితే స్త్రీ తన బతుకుపోరాటంతో పాటు అస్థిత్వ పోరాటం కూడా చేయవలసి వుంటుందన్న విషయం ఆధునిక యువతి పూర్తిగా విస్మరించింది. ఈ ప్రత్యేకమైన పోరాటానికి తను ఎటువంటి వ్యక్తిత్వం సమకూర్చుకోవాలి? ఎలా సిద్ధం కావాలి అన్న విషయాలను ఈనాటి యువతీతరం మర్చిపోయింది. సమాజంలోని పురుషునికన్నా తనది విశిష్టపాత్ర అన్న స్పృహ ఈనాటి అమ్మాయిలకు లేదు. స్త్రీ అడుగులింకా తడబడుతూనే ఉన్నాయని, స్త్రీ ఇంకా యుద్దభూమిలో తన అస్తిత్వాన్ని బుజువు చేసుకోవడానికి సమరాలు సాగిస్తూనే ఉన్నదన్న ‘ఎరుక’ యువతులలో లోపించడం కనిసిస్తూ ఉంది. తను స్థిరమైన వ్యక్తిత్వంతో ఆదర్శప్రాయురాలిగా ఉంటూ, సాటి స్త్రీలను, కనీసం రేపు తనకు పుట్టే పిల్లలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తన పైనే ఉన్నదని యువతీతరం పూర్తిగా మర్చిపోయింది. వాళ్ళ అభిరుచులూ, వేష భాషలూ, భావాలూ చూస్తే ఎవరికైనా విచారం కలుగుతుంది.
నా స్నేహితుని కుమార్తెను బి.టెక్ చదివించాడు. బోలెడంత కట్నమిచ్చి వివాహం చేశాడు. నా స్నేహితుడు దిగువ మధ్య తరగతి ప్రభుత్వోద్యోగి. కుటుంబబాధ్యతలు ఎక్కువ. ఈ అమ్మాయి భర్తతో బాటూ మరో ఊర్లో ఉంటూ ఉద్యోగంకూడా వెలగబెడుతున్నది. తొలి కాన్పు మలి కాన్పు రెండూ తల్లిదండ్రులే చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఆ తండ్రి మీద అంత బాధ్యత మోపడం సమంజసమేనా అన్న ఇంగిత జ్ఞానం ఆ చదువుకున్న పిల్లకి లేకపోయింది. పైగా తన భర్తను అల్లుడుగారు” అనాలని ఇన్స్‌ట్రక్షన్ ఒకటి! పెద్దలను గౌరవించమని శాస్త్రాలు చెబుతున్నాయ్‌గాని అల్లుడైన పాపానికి పిన్నను కూడా గౌరవించమని ఏ శాస్త్రమూ చెప్పడం లేదు. అనేక విషయాల్లో ఆడపిల్లలకు సరైన అవగాహన కల్పించకపోవడం తల్లిదండ్రుల్లో లోపమేనని అనిపిస్తుంది.
నా స్నేహితురాలి కోడలు, పెళ్లై ఆరు నెలలైనా చేతులకు గాజులమలారంలా గాజులు వేసుకొని వస్తుంది. ఇంకా కొత్త పెళ్లి కూతుర్లా ఉండడమే సుఖమనుకుంది కాబోలును! జడలో మూడు వరుసల పువ్వులూ! పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందట పైగా. మొత్తం చమ్కీలు కుట్టిన చీరలు! ఆమె స్నేహితురాళ్ళు నలుగురు ఆమెను చూట్టానికొచ్చారు. వాళ్ళకింకా పెళ్ళిళ్లు కాలేదు. ఐనా వాళ్ళ వేషధారణ కూడా ఇలాగే ఉంది. ఏవగింపు కలిగిస్తున్న ఈ సినిమాటిక్ గెటప్పుల్ని గురించి అడిగితే” ఇవి పార్టీ చీరలాంటి… చీర తీసుకెళ్తే షాపువాడే గాజులు, పూసలూ అన్నీ సెట్ చేసిస్తాడు” అన్నారు. ఇవన్నీ తగిలించుకుని మా ఇంటికి పార్టీకొచ్చిన వాళ్ళని కవ్వాలీలు పాడే వాళ్ళొచ్చారేమో అనుకున్నారందరూ.
కట్నాలను నిషేధించాలన్న నియమం గంగలో కలిసింది. కట్న మిచ్చి వరుణ్ణి కొనుక్కోవడం తమ జన్మ హక్కు అన్న అభిప్రాయం ఇప్పటి అమ్మాయిల్లో బలపడిపోవడం గమనిస్తున్నాం. నగలూ, పెట్టు పోతల విషయంలో కూడా లోపం జరక్కుండా చూసుకుంటున్నారు కొందరు.
ప్రస్తుతం ఆడపిల్లలు పూలు పెట్టుకొనే విధానంలో విపరీత పోకడలు చూస్తూనే ఉన్నాం. దీన్నే ”మోడ్రనైజేషన్” అని పొరబడుతున్నారు. పండక్కీ పబ్బానికి పద్దతిగా పూలు పెట్టుకునే విధానానికి స్వస్తి పలికి దినచర్యలో ఇదీ ఇక భాగంగా మేకప్‌లో ఇదీ ఒక ఐటమ్‌గా పరిగణిస్తున్నారు. హైస్కూళ్లలో సాధారణంగా శుక్రవారం యూనీఫాం ఉండదు. ఆవాళ మార్కెట్లో పూలే దొరకవనుకుంటా. ప్రతి అమ్మాయి జడలో రెండు మూడు వరుసల పూలదండలు తోకల్లా జడపొడుగునా వేళ్లాడుతూ కనిపాస్తయి. డిగ్రీ కాలేజీల్లో చదివే అనేకమంది అమ్మాయిలు ఇలా పూలదారులుగా రావడం వాళ్ళని టీజ్ చేయడం చూస్తున్నాం. కొందరు క్లాస్‌రూంలోకి మువ్వల సవ్వడులు వినిపించుకుంటూ వస్తుంటారు. వీళ్ళకంతా ఏదో ఒక సినిమా యాక్టర్ ఆదర్శంగా ఉంటుంది. తలలో పూలు వేళ్లాడేసుకున్నంత మాత్రాన తమనెవరూ సినిమా యాక్టర్లను కోరన్న ఇంగిత జ్ఞానం అమ్మాయిలకు లేకపోవడం విచారకరం. ఇదలా ఉంచి పరీక్షలు రాయడానిక్కూడా ఒక పూల తట్ట జడలో ఏ మారకుండా రావడం ఎంతైనా ఏవగింపు కలిగిస్తూ వుంటుంది. ఒక పోవర్ కట్టింగూ, మెయింటెనెన్స్ లేకుండా కూడా జట్లు విరబోసుకోడం ఇంకో విపరీత ధోరణి. పాపం. ఇంట్లో తల్లిదండ్రులు ముచ్చట పడుతూఉంటే వీళ్లే చేస్తారులే!
నీ హాబీలేంటమ్మా అంటే ”టీవీ, సినిమా” అన్న సమాధానమే నూటికి తొంభై మంది చెబుతుంటారు. ఏం పుస్తకాలు చదివావు? అంటే మాత్రం బుర్రలు వేళ్లాడేస్తుంటారు.
చాలామంది అమ్మాయిలకు చీర కట్టుకోడం రాదు. నాకు తెలిసిన చాలామంది డేనిష్ అమ్మాయిలూ, అమెరికన్ అమ్మాయిలూ చీర కట్టడం ఇట్టే నేర్చెేసుకుని తడబడకుండా అవలీలగా కట్టుకోడం చూశాను. మా ఆంటీ కూతురు చీర కట్టాలంటే ఇద్దరు మనుషులు ఒక గంట సేపైనా ” సహాయం చేయాల్సిందే. కొంతమంది తల్లులు ”మా అమ్మాయికి టీ పెట్టడం రాదు. చీరకట్టుకోడం రాదు. సేమ్యాలు ఏ చెట్టుకి కాస్తాయో తెలియదు.” అని చెప్పుకోడం గొప్పగా భావిస్తారు. వీళ్లు, వీళ్ళ పిల్లలూ అందరూ కలిసి ఎటువంటి నిర్వీర్యమైన యువతీతరాన్ని తయారు చేస్తున్నారో ననుకుంటే విచారం కలుగుతుంది.
ఇది వర్కింగ్ మదర్స్ తరం. ఇంట్లో ఉండే ఆడమగా పిల్లలంతా ఎటువంటి వివక్షలూ లేకుండా తల్లికి సాయపడాల్సిన తరుణం. మంచిచెడ్డలూ కష్టసుఖాలూ పిల్లలు తెలుసుకోవాలి. తెలుసుకునేటట్టు చేయడం తల్లిదండ్రుల బాధ్యత.
అందరూ ఇలానే ఉన్నారని నేనకపోయిన కనీసం నూటికి అరవైశాతం చదువుకున్న ఆడపిల్లల పరిస్థితి ఇలాగే ఉంటున్నదని మాత్రం చెప్పగలను. ముందు తల్లిదండ్రులు మేలుకుని తమ పిల్లలను వివేకవంతులుగా చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఒక స్త్రీ విద్యా (అన్ని రంగాలలో) వంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతులవు తారన్న నానుడి ఎవ్వరూ మరచిపోరాదు. ఆడపిల్లల్ని మంచి పుస్తకాలు చదివించి, వాళ్లల్లో మంచి అభిప్రాయాలూ, ఆశయాలకు పునాదులు వేయకపోతే, వాళ్లు వాళ్ళ పిల్లలు అంతా తరాల తరబడి విషసంస్కృతులకు బానిసలై నిర్వీర్య సమాజాన్ని సృష్టిస్తారన్న అవగాహన తల్లిదండ్రులకు కలగాలి.
ఆడపిల్లలు మేలుకొని సునిశితమైన ఇంగిత జ్ఞానం అలవరచుకొని సమాజంలో సున్నితమైన (సెన్సిటివ్) తమ పరిస్థితిని రియలైజ్ కాకపోతే ఈ వెనుకడుగులు తప్పవు. ఈ పరిస్థితి నుంచి మేలుకోకపోతే వీళ్లంతా ”కళ్ళు తెరవని సీతలు”గానే మిగిలిపోతారు. సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ నేర్పాలి. స్త్రీ శక్తిని మేల్కొల్పాలి. తల్లిదండ్రుల పెంపకంలోనే మార్పు రావాలి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
స్త్రీవాదం పుట్టింది ప్రధానంగా స్త్రీలు పురుషుల్నించీ ఎదుర్కొనే సమస్యల్ని ఎదిరించడానికే. కానీ ఎక్కువ మంది స్త్రీవాదం గురించి మాట్లేడప్పుడూ, రాసేటప్పుడూ, స్త్రీలని పురుషులకన్నా ఎక్కువ చేసి చూపించాలని తాపత్రయపడుతుంటారు. పుష్పాంజలిగారు “సమాజంలోని పురుషునికన్నా తనది విశిష్టపాత్ర…” అన్న మాటలలోని అర్థం అలాంటికోవలోకే వస్తుంది. సమాజంలోని పురుషునికన్నా తనది విశిష్టపాత్ర అంటే బయటిపనులు పనులూ, ఇంటిపనులూ తను ఒక్క మనిషే చేస్తుంది అన్న అర్థంలో వాడిందే అయితే, అది విశిష్ట పాత్ర అవదు. ఆ పరిస్తితులు మారాలి, అంటే ఇంటిపనులు పురుషులు కూడా సమానంగా పంచుకోవాలి అన్నదే కదా దానికి పరిష్కారం? అలా రెండు పనులూ మీద వేసుకున్నప్పుడు (సరిగా చెప్పాలంటే సమాజం ఆమెకి అంత బరువు బలవంతంగా అంటగట్టినప్పుడు) అది విశిష్టపాత్ర అని అనవల్సింది కాదు అని నా అభిప్రాయం.
కాళ్ళకి మువ్వలు పెట్టుకునే అందరికీ సినిమా యాక్టర్లు ఆదర్శంగా ఉండక్కర్లేదు. బాగా చదువుకున్నవాళ్ళు కూడా పెట్టుకుంటారు. అది యాంత్రికంగా మిగతావాళ్ళని చూసి నేర్చుకోవడమే. అలాంటి వేషాల్ని ఎవరైనా సులభంగా నేర్చుకుంటారు. నేర్చుకోనిది అలా ఎందుకు చెయ్యకూడదనే. బాగా చదువుకున్నవాళ్ళలో కూడా ఇలాంటి వేషాలు కనిపిస్తాయి.
స్త్రీవాదం పుట్టింది ప్రధానంగా స్త్రీలు పురుషుల్నించీ ఎదుర్కొనే సమస్యల్ని ఎదిరించడానికే. కానీ ఎక్కువ మంది స్త్రీవాదం గురించి మాట్లేడప్పుడూ, రాసేటప్పుడూ, స్త్రీలని పురుషులకన్నా ఎక్కువ చేసి చూపించాలని తాపత్రయపడుతుంటారు. పుష్పాంజలిగారు “సమాజంలోని పురుషునికన్నా తనది విశిష్టపాత్ర…” అన్న మాటలలోని అర్థం అలాంటికోవలోకే వస్తుంది. సమాజంలోని పురుషునికన్నా తనది విశిష్టపాత్ర అంటే బయటిపనులు పనులూ, ఇంటిపనులూ తను ఒక్క మనిషే చేస్తుంది అన్న అర్థంలో వాడిందే అయితే, అది విశిష్ట పాత్ర అవదు. ఆ పరిస్తితులు మారాలి, అంటే ఇంటిపనులు పురుషులు కూడా సమానంగా పంచుకోవాలి అన్నదే కదా దానికి పరిష్కారం? అలా రెండు పనులూ మీద వేసుకున్నప్పుడు (సరిగా చెప్పాలంటే సమాజం ఆమెకి అంత బరువు బలవంతంగా అంటగట్టినప్పుడు) అది విశిష్టపాత్ర అని అనవల్సింది కాదు అని నా అభిప్రాయం.
కాళ్ళకి మువ్వలు పెట్టుకునే అందరికీ సినిమా యాక్టర్లు ఆదర్శంగా ఉండక్కర్లేదు. బాగా చదువుకున్నవాళ్ళు కూడా పెట్టుకుంటారు. అది యాంత్రికంగా మిగతావాళ్ళని చూసి నేర్చుకోవడమే. అలాంటి వేషాల్ని ఎవరైనా సులభంగా నేర్చుకుంటారు. నేర్చుకోనిది అలా ఎందుకు చెయ్యకూడదనే. బాగా చదువుకున్నవాళ్ళలో కూడా ఇలాంటి వేషాలు కనిపిస్తాయి. – భూషణ్
పుష్పాంజలి గారూ,
1. మీరు, “సమాజంలోని పురుషునికన్నా తనది విశిష్టపాత్ర అన్న స్పృహ ఈనాటి అమ్మాయిలకు లేదు.” అని అన్నారు. “విశిష్ట” అనే పదం తప్పు ఇక్కడ. ఆ పదం వల్ల, స్త్రీలకి తమ ప్రస్తుత పాత్ర గొప్పది అనే అర్థం వస్తుంది. అసలు, ఎవరిదీ “విశిష్ట” పాత్ర కాకూడదు. సమానంగానే వుండాలి. అయితే, ఎక్కువ బాధ్యతలు స్త్రీలకు అంటగట్టడం వల్ల, మీరు ఆ పదం వాడారూ అని అంటే, అప్పుడు కూడా ఆ విషయమే రాయాలి. స్త్రీ, పురుషులు శతృవులు కారు. కానీ, ఎక్కువ మంది పురుషులు శతృవుల్లా ప్రవర్తిస్తారు. పెత్తనం చేసే పురుషుల్ని కిందకి దించి, అణగి వుండే స్త్రీలని పైకి తీసుకు వచ్చి, ఇద్దరినీ ఒక సమాన స్థాయిలో వుంచడమే సరైన పద్ధతి. సరి కానిది ఏదన్నా తప్పే.
2. ఒకమ్మాయి గురించి, “బోలెడంత కట్నమిచ్చి వివాహం చేశాడు.” అని రాశాడు. అలా పెళ్ళి చేసుకున్న అమ్మాయి చైతన్యం ఎలా వుంటుందీ? ఉద్యోగం చేస్తూ, కట్నం ఇప్పించుకుని, భర్త ఇంటికి వెళ్ళి పోయిన అమ్మాయి చైతన్యం గురించి ఆశ్చర్య పోతే, అర్థమే లేదు. ఆ స్థితిలో వుండే అమ్మాయిలు అలాగే వుంటారు. మీరేమో, “ఉద్యోగం చేస్తూ, కట్నంతో పెళ్ళి చేసుకుని, భర్త ఇంటికి చేరిన ఆడవాళ్ళు, ఇక పుట్టింటి వాళ్ళకి బాధ్యతలు పెట్టకూడదూ, కష్టం కలిగించ కూడదూ” అనే అర్థంతో రాశారు. పెళ్ళికి ముందర ఆ అమ్మాయికి వున్న చైతన్యాన్ని ప్రశ్నించాలి మీరు. “కాళ్ళు కడిగి కన్యాదానం” చేసిన ఆ తల్లిదండ్రులు, “అల్లుడు గారూ” అని పిలిస్తే, కొంపలంటుకు పోతాయా? కాళ్ళు కడిగిన నాడే, తమ అల్పత్వాన్ని ప్రదర్శించుకున్నారు కదా ఆ తల్లిదండ్రులు? “కాళ్ళు కడగడం” గురించి మీరు రాయలేదంటారా? అది వూహించుకోవచ్చు లెండి. కట్నాలిచ్చే తల్లిదండ్రులు కాళ్ళు కడగలేదంటే, నమ్మేదెవరు? ఇక భర్తని వుబ్బేయడానికి, ఆ అమ్మాయి తన తల్లిదండ్రులని అలా అడిగి వుండొచ్చు కూడా. ప్రతీ కాన్పుకీ పుట్టింటికి చేరే ఆ అమ్మాయీ, అలా చేసే ఆ తల్లిదండ్రులూ, అదంతా సంతోషంగా చూస్తున్న ఆ భర్తా, అంతా ఒకే స్థాయిలో వున్నారు. ఆ ఒక్క అమ్మాయి మాత్రమే మారే పరిస్థితి లేదు ఇక్కడ.
3. మీరు, “ఇంకా కొత్త పెళ్లి కూతుర్లా ఉండడమే సుఖమనుకుంది కాబోలును! జడలో మూడు వరుసల పువ్వులూ! పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందట పైగా.” అని రాశారు. “కొత్త పెళ్ళి కూతురు” అలా వుండటం సరి అయినది మీ దృష్టిలో. ఆడవాళ్ళు మాత్రమే గాజులేసుకోవడం మీద మీకు విమర్శ లేదు. ఎటొచ్చీ కొన్ని మాత్రమే వేసుకోవాలి? కొన్ని అంటే ఎన్ని? అవి ఎన్నో ఎవరు లెక్క వేస్తారు? మీకు రెండు ఇష్టమైతే, ఆ అమ్మాయికి ఇరవై ఇష్టం కావొచ్చు. అసలు విషయాన్ని వదిలేసి, రెండు గొప్పా, ఇరవై చెత్తా అనే లెక్క లేవిటీ? ఆడవాళ్ళు మాత్రమే జడలో పువ్వులు పెట్టుకోవడం మీద మీకు విమర్శ లేదు. అయితే, మూడు వరసల పువ్వులు వుండ కూడదు. ఎన్ని వరసలు వుండాలీ అనే విషయం ఎవరు నిర్ణయిస్తారూ? “పండక్కీ పబ్బానికి పద్దతిగా పూలు పెట్టుకునే విధానానికి స్వస్తి పలికి దినచర్యలో ఇదీ ఇక భాగంగా మేకప్‌లో ఇదీ ఒక ఐటమ్‌గా పరిగణిస్తున్నారు.” అని అన్నారు మీరు. ఆ పద్ధతిని ఎవరు నిర్ణయించారూ? ఈ పురుష పీడిత సమాజమేగా? ఒక తప్పు మీద ఆధారపడి వుండే వన్నీ తప్పులు గానే వుంటాయి. అసలు కారణం చూడాలి. స్త్రీలు పువ్వులెందుకు పెట్టుకుంటారు? మేకప్ ఎందుకు చేసుకుంటారు? ‘అందం’గా కనబడాలనీ! అలా ఎవరికీ కనబడాలీ? పురుషులకి. అలా పురుషులకి ‘అందం’గా కనబడాలనే పద్ధతిని ఒప్పేసుకుని, ఏది ఎక్కువా, ఏది తక్కువా అని చర్చిస్తే, అందులో అర్థమే వుండదు. పురుషులకు లేని బొట్లూ, పువ్వులూ, గాజులూ, గట్రా తమకి కూడా అక్కరలేదని, స్త్రీలు గ్రహించినప్పుడే, అభివృద్ధి అనేది వుంటుంది. మువ్వలూ, మిగిలిన నగలూ, అన్నీ ఈ కోవ లోకే వస్తాయి. బానిస సమాజం నించి, సంకెళ్ళు పొందిన రూపాంతరాలే ఈ నగలు స్త్రీలకి.
4. “మెయింటెనెన్స్ లేకుండా కూడా జట్లు విరబోసుకోడం ” అని రాశారు. మెయింటెనెన్స్ వుంటే, జుట్టు విరబోసుకోవచ్చా? ఆ జుట్టు ఇల్లంతా పడుతూ వుండదా? ఆ జుట్టూ, తినే పదార్థాల్లోకి చేరదా? ఎంతో మంది జుట్టుతో వున్న దువ్వెనలని డైనింగు టేబులి మీదే ఒదిలేస్తారు. ఎంత అసహ్యకరమైన సంగతులో ఇవి. జుట్టు విరబోసుకోవడం అనేదే సరిగా వుండదు లెండి.
5. “చాలామంది అమ్మాయిలకు చీర కట్టుకోడం రాదు.” అని రాశారు. ఇది చాలా తప్పైన ఆరోపణ. చీర కట్టుకోవడం ఎందుకు రావాలీ? అది, మన భారతీత సాంప్రదాయం అని చెబుతారా? మరి, “కట్నాలూ”, “పురుషుల్ని ఆకర్షించడం కోసం అలంకరణలూ”, “పురుషులకి అణగి మణగి వుండటాలూ” కూడా భారతీయ సాంప్రదాయాలేగా? అవన్నీ ఒప్పుకుంటారా? మను శాస్త్రంలో స్త్రీని ఎలా వుంచాలో చెప్పారు కదా? అలా వుండటానికే, స్త్రీలు అంగీకరించాలా? బట్టలు అనేవి దేహ రక్షణ కోసం, సభ్యత కోసం. అసభ్యత కానంత వరలూ, లూజుగా వుండే ఫాంటూ, చొక్కాలూ, చూడీదార్‌లూ స్త్రీలకు చక్కగానే వుంటాయి. చీర ఇష్టపడి, అది వేసుకునే వాళ్ళుంటే అది వాళ్ళిష్టం. మా అమ్మాయి అయితే, “నాకు చీర ఇష్టం లేదు. పొట్ట కనబడుతూ వుంటుంది. వీపు వెనక భాగం కూడా కనబడుతూ వుంటుంది” అని అంటుంది. చీర కట్టుకోవడం వచ్చి వుండాలీ అని అనడం నిరంకుశత్వమే అవుతుంది. అయితే, అసభ్యత లేకుండా, చీర కట్టుకునే వాళ్ళు చాలా మందే వున్నారు. అది వారి ఇష్టం. చీర కట్టుకోవడమే కరెక్టు అని అనుకోవడం సరి అయినది కాదు.
6. మీరు, “కొంతమంది తల్లులు ”మా అమ్మాయికి టీ పెట్టడం రాదు. చీరకట్టుకోడం రాదు. సేమ్యాలు ఏ చెట్టుకి కాస్తాయో తెలియదు.” అని చెప్పుకోడం గొప్పగా భావిస్తారు.” అని రాశారు. మరి అబ్బాయిల సంగతో? వాళ్ళకి పంచె కట్టుకోవడం వచ్చా? వాళ్ళకి టీ పెట్టడం వచ్చా? సేమ్యాల సంగతి తెలుసా? ఈ విషయాలు అమ్మాయిలకు మాత్రమే పరిమితం చెయ్యకూడదు. అసభ్యత లేని వస్త్ర దారణ వుంటే, మిగిలినవి అమ్మాయిలకీ, అబ్బాయిలకీ కూడా రావాలి. వంట ఆడవాళ్ళకి మాత్రమే కాదు. సేమ్యాల జనరల్ నాలెడ్జి అమ్మాయిలకు మాత్రమే కాదు.
7. మీరు, “ఆడపిల్లల్ని మంచి పుస్తకాలు చదివించి, వాళ్లల్లో మంచి అభిప్రాయాలూ, ఆశయాలకు పునాదులు వేయకపోతే, వాళ్లు వాళ్ళ పిల్లలు అంతా తరాల తరబడి విషసంస్కృతులకు బానిసలై నిర్వీర్య సమాజాన్ని సృష్టిస్తారన్న అవగాహన తల్లిదండ్రులకు కలగాలి.” అని రాశారు. నిజానికి, ఇది, “పిల్లల్ని మంచి పుస్తకాలు చదివించి, వాళ్లల్లో మంచి అభిప్రాయాలూ, ఆశయాలకు పునాదులు వేయకపోతే, వాళ్లు వాళ్ళ పిల్లలు అంతా తరాల తరబడి విషసంస్కృతులకు బానిసలై నిర్వీర్య సమాజాన్ని సృష్టిస్తారన్న అవగాహన తల్లిదండ్రులకు కలగాలి.
” అని వుండాలి.
8. మీరు, “ఈ పరిస్థితి నుంచి మేలుకోకపోతే వీళ్లంతా ”కళ్ళు తెరవని సీతలు”గానే మిగిలిపోతారు.” అని రాశారు. ఇది, “ఈ పరిస్థితి నుంచి మేలుకోకపోతే వీళ్లంతా ”కళ్ళు తెరవని సీతలు” గానూ, “కళ్ళు తెరవని రాముళ్ళు” గానూ మిగిలిపోతారు.” అని వుండాలి.
– ప్రసాద్
1 ) “వేయి దుందుభుల నినాదం” అంటే ఏమిటి ? నాదానికీ నినాదానికీ తేడా లేదా ?
2 ) నిజంగానే ఆధునిక యువతి అస్తిత్వ పోరాటాన్ని విస్మరించిందా ?
3 ) నిజంగానే అమ్మాయిలు కట్నమిచ్చి మొగుణ్ణి కొనుక్కోవడాన్ని జన్మ హక్కుగా భావించేంత అజ్నానంలో ఉన్నారా ?
4 ) యూనిఫాం లేని రోజుల్లో కూడా ఆడపిల్లలు తమకి నచ్చినట్టు ఉండకూడదా ?
5 ) పూలంటే ఏవగింపు కలిగి వుండటమే ఆధునికత అని మీరు భావిస్తున్నారా ?
6 ) మువ్వల పట్టీలకీ ఆధునికతకీ సంబంధం ఏమైనా వుందా ?
7 ) సినిమా యాక్టర్లని ఆదర్శంగా తీసుకుంటున్నారా లేక వారి వేష భాషల్ని అనుకరిస్తున్నారా ? ఈ అనుకరణ ఈ తరం అమ్మాయిల్లో మాత్రమే వుందా లేక సినిమా మొదలయినప్పటినించీ వుందా ?
8 ) ఇప్పుడు పూలని రెండు మూడు వరుసల్లో పెట్టుకుంటున్నట్టుగానే అప్పట్లో పూల జడలు కుట్టించుకునేవారు కాదా ?
9 ) చీర కట్టుకోవడం, టీ పెట్టడం, సేమ్యాల పుట్టు పూర్వోత్తరాలూ తెలియక పోతే స్త్రీ జాతి నిర్వీర్యం అయిపోతుందా ?
10 ) మీ రాతనిబట్టి చదువుకోవడం వల్ల అమ్మాయిలు చెడిపోతారనే అభిప్రాయం కలుగుతోంది. ఆ తరువాతి వాక్యంలోనే ఒక స్త్రీ విద్యావంతురాలయితే కుటుంబం మొత్తం విద్యావంతులవుతారనే నానుడిని గుర్తు చేశారు. ఇంతకీ చదువు వల్ల బాగు పడతారా ? చెడిపోతారా ?
11 ) మంచి పుస్తకాలంటే ఏవి ? ఒకప్పుడు చలం పుస్తకాల్ని చదివితే అమ్మాయిలు చెడిపోతారనేవారు. ఇప్పుడు అవే చలం పుస్తకాల్ని పెద్దలంతా తలలకెత్తుకుని గౌరవిస్తున్నారు ! మరి ఏది మంచి ? ఏది చెడు ?
12 ) మంచి పుస్తకాలే తప్ప మంచి సినిమాలూ మంచి టీవీ కార్యక్రమలూ ఉండవా ?
13 ) ఓ రచయిత్రీ.., మీ ఉద్దేశం ఏమిటి ?
పుల్లారావు గారూ,
మీరు రాసిన పాయింట్లన్నీ పట్టించుకోను గానీ, ఒక్క విషయంలో మీకు జవాబు ఇద్దామనిపించింది. కనీసం ప్రయత్నిస్తాను. నా జవాబులో మీకు ఏమన్నా అభ్యంతరకరంగా గానీ, తప్పుగా గానీ అనిపిస్తే తెలియజెయ్యండి, వీలైతే.
మీరు, “మరి ఏది మంచి ? ఏది చెడు ?” అని అడిగారు.
ఇదిగో, నా సాధారణ (simple) నిర్వచనం:
మన వల్ల, అంటే మన ప్రవర్తన వల్ల గానీ, మనం చేసే పనుల వల్ల గానీ, మనకి గానీ, మన చుట్టూ వున్న వాళ్లకి గానీ, శారీరకంగా గానీ, సామాజికంగా గానీ, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, హాని కలగితే, అది “చెడ్డ”. అలా హాని బదులు, మంచి జరిగితే, అది “మంచి”. ఏదీ కలగలేదనుకోండీ, అది మన సొంత విషయం.
ఏ కాలంలో అయినా సరే, మంచిని గ్రహించే వాళ్ళు కొద్ది మందయినా వుంటారు. చలం పుస్తకాలకి స్పందించిన వాళ్ళు ఆ కాలం లోనూ వున్నారు. ఈ కాలంలో పెరిగారు. కొంత మంది, ఆ కాలంలో ఆ పుస్తకాల గొప్పదనాన్ని గ్రహించకుండా, ఇప్పుడు గ్రహిస్తే, ఒకప్పుడు చెడ్డగా వున్న విషయం, ఇప్పుడు మంచి అయిపోయినట్టు కాదు. అప్పుడు జ్ఞానం లేని మనుషులు, ఇప్పుడు కొంత జ్ఞానాన్ని సంపాదించారని అర్థం.
ప్రసాద్
పుష్పాంజలి గారూ,
నా రాతల వల్ల, నేను మీ వ్యాసాన్ని పూర్తిగా వ్యతిరేకించినట్టు తప్పు అర్థం వచ్చేటట్టు వుంది. అందుకే ఈ చిన్న వివరణ.
కొన్ని విషయాల్లో ఆధునిక యువతులని విమర్శించాలని మీకున్న సదుద్దేశం అర్థం అయింది. మీరు కొన్ని మంచి విషయాలు చక్కగా చెప్పారు. కొన్ని విమర్శలు చక్కగా చేశారు. కొన్ని మాత్రం కొంత తప్పుగా వున్నాయని, నేను నా అభిప్రాయాలతో కొన్ని వివరణలు ఇచ్చాను. నేను రాసింది అసమగ్రం గానే వుంది.
ఆధునిక యువతుల మీద నాకూ కొన్ని విమర్శలు వున్నాయి. అది వేరే సంగతి.
మీ ఉద్దేశ్యాన్ని వ్యతిరేకించ లేదనీ, మీరు రాసిందానికి నా వివరణలు మాత్రమే ఇచ్చాననీ అర్థం చేసుకోవాలి మీరు.
– ప్రసాద్
ప్రసాద్ గారూ,
మీ వివరణ అర్ధవంతంగా వుంది. కృతజ్ణతలు.
నిజానికి మంచి చెడులు నిర్వచనాలకి లొంగని మౌలిక పదాలు. ఎందుకంటే, ఒకరికి మంచి అనిపించింది మరొకరికి చెడుగా కనిపించే అవకాశాలు ఎప్పటికప్పుడు ఉంటూనే వుంటాయి. ఆ రెండూ వెలుగు నీడల్లాంటివి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పరస్పరం ఒకదానికి ఒకటి అస్తిత్వాన్ని కల్పించుకుంటూ వుంటాయి. ఒకవేళ అలా జరక్కపోతే, ఒక వ్యాసం మీద ఇన్ని అనుమానాలు పుట్టుకొచ్చే అవకాశమే వుండదు.
అయినా ఈ వ్యాసం ఇన్ని ప్రశ్నలకి అవకాశం కల్పించేదిగా వుందనే నిషయం తెలియజెయ్యడమే నా ఉద్దేశం. కాబట్టీ ఆవిడ కూడా వీటికి జవాబులివ్వాల్సిన అవసరం లేదు. ఇన్ని ప్రశ్నలు ఎందుకొచ్చాయనే విషయం గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే చాలు. ఏదయినా ఒక విషయం గురించి విమర్శ రాసేవారు రాసేటప్పుడుగానీ, రాసిన తరువాతగానీ దాన్ని మరోసారి విమర్శనాత్మకంగా పరిశీలించుకోకపోతే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. నిజానికి దీన్ని వ్యాసరూపంలో కాకుండా ఏ కథ రూపంగానో రాసి వుంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ వుండేది కాదు. ఎందుకంటే, కథ అనేది కల్పితం.వ్యాసం కల్పితం కాదు. అందుకే వ్యాసం, దాన్ని రాసిన వారి అభిప్రాయంగా పరిగణింపబడుతుంది.
అయినా మీరు రచయిత్రికి వేసిన ప్రశ్నలకి స్పందించి సమాధానమివ్వడం నాకు నచ్చింది. అలాగే, రచయిత్రికి మరో వివరణనివ్వడం మరీ నచ్చింది. ఈ రెండూ మీ సంస్కారానికి నిదర్శనాలు.
పుల్లారావుగారూ,
మీరు చెప్పింది నిజం. మంచీ, చెడులు నిర్వచనాలకి లొంగని మౌలిక పదాలే. మీ అర్థం ప్రకారం “పదాలే” కాదు. వాటికి అర్థాలు కూడా. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒకామె జుట్టు విరబోసుకుని తిరుగుతోంది అనుకోండి. వెంట్రుకలు వాళ్ళింట్లో తినే కంచాల్లో కనపడిందనుకోండి. ఆ జుట్టు విరబోసుకున్నావిడాకి అది చెడుగా కనపడదు. ఎందుకంటే ఆ విషయం జరిగింది ఆవిడ వల్లే కదా! మిగిలిన కుటుంబసభ్యులకి అది చెడు.మళ్ళీ ఆ కుటుంబ సభ్యులకి అది మంచిదే. ఎందుకంటే ఆ జుట్టు ఆవిడ వాళ్ళ మనిషి కాబట్టి. మళ్ళీ ఆ జుట్టు మనిషికి అది చెడే. వెంట్రుకలు ఆహారంలో ఉండడం అపరిశుభ్రత కదా! అయినా ఇవి మళ్ళీ ఎప్పటికప్పుడు మారిపోతూవుంటాయి. ఎందుకంటే మంచీ, చెడూ ఎప్పటికప్పుడు మనుషుల అభిప్రాయాలకి తగినట్టు మారిపోతూవుంటాయి కదా మీ ప్రకారం ! లోకంలో మంచీ,చెడూ స్థిరంగా ఉండవన్న మాట! – భూషణ్
నాగభూషణం గారూ,
నా కంటె మీరే బాగా వివరణాత్మకంగా చెప్పారు. అభినందనలు.
ఒకవేళ మీరు దేనిగురించయినా స్పష్టంగా ఇదే ” మంచి ” లేదా ఇదే ” చెడు ” అని చెప్పగలరేమో ప్రయత్నించి చూడండి. ఒకవేళ చెప్పగలిగితే నాకు తప్పకుండా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అభివందనాలతో – పుల్లారావు.