కన్నతల్లికి కడపటి ఉత్తరం

తమ్మెర రాధిక
అదో మహానగరం! అత్యంత ఖరీదైన నగరం. ఊపిరి ఒదలాలన్నా ఊపిరి పీల్చాలన్నా డాలర్ల లెక్కన, యూరోల లెక్కన లెక్క వుంటుంది. భోజనం చెయ్యడానికీ, నీళ్ళు తాగడానికీ ఓ లెక్క వుంటుంది. బ్రతకడమే ఓ లెక్క అక్కడ. నాణ్యతా ప్రమాణాలు దిగజారకుండా నాణ్యమైన బ్రతుకును గడపడమే ఆ నగరం విశిష్ఠత. అందుకే ప్రపంచ దేశాలల్లో అద్భుతమైన జీవన ప్రమాణాల విషయంలో ఆ దేశం, దేశంలోని ఆ నగరం ప్రథమ స్థానంలో నిలిచాయి.
సుబ్బారావు నగరంలో మంచి ఉన్నతమైన పదవిలో, ఉన్నతమైన కంపెనీలోనే పని చేస్తున్నాడు. అతనే కాదు ఇంట్లో వున్న జనాభా అంతా ఏదో ఒక పనిలో నిమగ్నమైన వారే! అతని భార్యా, యిద్దరు కొడుకులూ, కోడళ్ళూ ఉద్యోగస్తులే! కొడుకుల పిల్లలూ చదువులైపోయి క్రొత్తగా ఉద్యోగాల్లో కుదరుకున్న వాళ్ళే. ఇద్దరు కొడుకుల రెండో సంతానాలు చదువుల్లో వున్నారు. అంతా బైటికి వెళ్ళే వారే కనుక తెల్లవారుతూనే ఇల్లు ఖాళీ అవుతుంది. రాత్రయ్యే సరికి చెట్ల మీది పక్షుల్లా ఇల్లంతా సందడిగా వుంటుంది. ఆ యింట్లో సందడికీ, నిశ్శబ్దానికీ అలవాటు పడ్డ ప్రాణి ఒకటుంది. ఆమె సుబ్బారావు తల్లి జానకమ్మ!
సూర్యుడింకా ఇలాతలంమ్మీదకు ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టకముందే నీలవేణి అనే నీలమ్మ ఆధునిక పద్ధతిలోనైతే నీలమ్‌ లేచి అత్తగార్ని లేపుదామని చూసే సరికి, ఆవిడ ఎప్పుడో లేచేవుండేది. రాత్రి భోజనాలు కాంగానే ఎవ్వరి కంచాలూ, గ్లాసులూ వారు కడిగి బోర్లించేస్తారు. మిగిలిన అంట్లు ప్రొద్దున్నే జానకమ్మ సింకు దగ్గర కూర్చునో, నిలబడో చిన్నగా తోమిపెట్టాలి కోడలికి. ఆ పని కాంగానే అత్తాకోడళ్ళు చిక్కని ఆవుపాల ప్యాకెట్‌ విప్పి నీళ్ళు కలపకుండా వెచ్చ చేసుకుని త్రాగేస్తారు. కొవ్వు లేని, కల్తీ లేని ప్యాకెట్లు మాత్రమే దొరికే షాపుల్లో తెస్తారు ఎంచి ఎంచి మరీ. ఆ తరువాత బాత్రూంలో గీజర్‌ స్నానాలు చేసి, వంటయింటిలోనే ఓ మూల చిన్న నీళ్ళ టబ్బూ కూరల ప్యాకెట్లూ పెట్టుకొని జాగర్తగా కడిగి బుట్టకు వేస్తుందావిడ. ఆ కూరలన్నీ రసాయనాలూ, ఎరువులూ వెయ్యకుండా ప్రత్యేకంగా పండించిన కూరగాయలు. నగరంలో అలాంటి షాపులు అక్కడక్కడా వున్నాయి. అలాంటి వాటిల్లోంచి మాత్రమే సుబ్బారావూ అతని కొడుకులూ సామాను తెస్తారు. ఈ లోపున కోడళ్ళు కొడుకులూ ఎవరి గదుల్లో వారు యోగాలూ, ఆసనాలూ, ఆరోగ్య సమస్యలూ పరిష్కారాలూ సాధన చేసి, ఆదాయ వ్యయాల లెక్కలు పూర్తి చేసి, ఎవరెవరు ఎక్కడెక్కడ సంపాదన మదుపు పెట్టాలి? అదుపు తప్పిన ఖర్చును ఎక్కడ పొదుపులో చెక్‌ పెట్టాలి లాంటి వాటి మీద చర్చలూ శషభిషలూ పూర్తి చేసి బైటికి వచ్చే సరికి కూరగాయలు ఉడికి ఉంటాయి. వాళ్ళు స్నానాలూ పూజలూ కానిచ్చుకుని వంటగదిని స్వాధీనం చేసుకుని ఎవరికి కావల్సిన దాన్ని వారు తయారు చేస్తారు సుబ్బారావూ అతని తల్లి ప్రొద్దుటి పూట పళ్ళముక్కలు తప్ప ఏమీ తినరు. కోడళ్ళూ అత్తగారు మొలకలు తప్ప తినరు. కొడుకులు కూరగాయల సలాడ్స్‌ తింటారు. వాళ్ళ పిల్లలు మాత్రమే టిఫిన్స్‌ తింటారు! అది పూరీ కావచ్చు, ఇడ్లీ వడా కావచ్చు వాళ్ళ తల్లులు వాటిని తయ్యారు చేసేలోపు వాళ్ళ పన్లు వాళ్ళు కానిచ్చుకుంటూ మధ్య మధ్యలో ఒకర్నొకరు మర్చేపోకుండా పలకరించుకుంటూ వుంటారు. సుబ్బారావుకు అరవయి ఏళ్ళు వస్తున్నా రిలాక్స్‌డుగా ఎప్పుడూ వుండడు! ఆఫీసుకు వెళ్ళేంత వరకూ కంప్యూటర్‌ ముందో, తమ గదిలోని లాప్‌టాప్‌ ముందో కూర్చుని పని చేస్తూనే వుంటాడు.
నీలమ్‌ కూడా ఆఫీసు స్టాఫ్‌కు ఫోన్స్‌ చేస్తూ, ఎంతసేపూ ఆఫైల్‌ సంగతేంటి? ఎవరి లీవ్‌ సాంక్షన్‌ చేస్తే ఎలాంటి సాధిక బాధకాలు ఎలా వుంటాయి లాంటివి చిన్న గొంతుతో మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతూ ఏదో పని చక్కబెడుతూ వుంటుంది.
కోడళ్ళు సరేసరి పిల్లలకు రకరకాల సలహాలిస్తూ, ఆ సైటు అలా వుందీ, ఈ సైటు నార్త్‌ బాగాలేదూ, ప్లాటైతే ఎలా వుంటుందీ లాంటి ముచ్చట్లూ అవి కాక పోతే లేదా చందన్‌ లాల్‌లో రవ్వలసెట్‌ బావుందీ సాయం కాలం చూసి రమ్మని పురమాయిస్తూనో, కొత్త జీన్స్‌ ఎక్స్‌రేలో బావుందనో చెప్తూ కనిపిస్తారు. సుబ్బారావు కొడుకులు మరీ బిజీ, ఇంట్లో వున్న కాసేపూ ఎవరి గదుల్లో వారు ప్రపంచాన్ని కొనేస్తూ వుంటారు. చెవులకు సెల్లులు వేలాడేసుకు తిరుగుతూ ఏ ప్రాజెక్టు ఎలా ఫాలో అయితే ఎన్ని కోట్లు కంపెనీకి లాభం వస్తుందీ? ఏ కాంట్రాక్టరు ఎన్ని లక్షలు క్రింది ఉద్యోగస్తులకు పంచిపెట్టిందీ లాంటివన్నీ ఆఫీసుకు తయ్యారవుతూనే మాట్లాడేస్తుంటారు ఫోన్లో అవతలివారితో. పిల్లల దగ్గర్నించీ పెద్దల దాకా ఎవరి జీతాలు వాళ్ళు జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటారు. ఏ పనికైనా ఆఫీసు క్యాబ్‌లు వాడుకుంటారు. ఇంట్లో కూడా పనిమనిషి లాంటి వ్యవహారం వుండదు. ఎందుకంటే లాండ్రీ, పనిమనిషి జీతాలు చాలా ఎక్కువగా వుంటాయి. తిండి విషయంలో ఆరోగ్యం పాడు కాని  మంచి ఆహారం అవడం వల్ల ఏ చిన్న జబ్బు చేసినా డాక్టర్ను కలవడం అన్నది ఖరీదైన వ్యవహారంగా తయ్యారైంది. ఎంతసేపూ యోగా క్లాసులకు అటెండ్‌ అవడమూ, ధ్యానసెంటర్‌కి వెళ్ళడమూ చేస్తుంటారు. ఉద్యోగాలు చేస్తున్నా ఎవరి డబ్బులకు వారే బాసులు. ఉమ్మడిలోకి ఎవ్వరూ ఖర్చు చేయ్యరు దాదాపుగా.
సుబ్బారావు మాత్రమే ఇంటి వ్యవహారాలు చాలా వరకు చూసుకుంటూ వుంటాడు. ఆయనకు కూడా ఇంకా మనవలూ, మనవరాళ్ళు బాధ్యత వుందని కొడుకులూ కోడళ్ళూ గుర్తు చేస్తూ వుంటారు. అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయాక జానకమ్మ ఒక్కత్తీ బాల్కనీలోకి వచ్చి కూర్చుంది కాసేపు. రోడ్డు మీద మనుష్యుల ప్రవాహం ఎడతెరిపి లేకుండా వుంది. ఎదుటి బహుళ అంతస్తుల్లో కూడా నిశ్శబ్దం తాండవిస్తోంది. తామున్న అంతస్తుల్లోని వారంతా కూడా ఉద్యోగస్తులే, ఏడింటి నించి తొమ్మిది లోపు ఫ్లాట్లన్నీ ఒంటరి దీవులు అవుతాయి. రోడ్ల మీద మాత్రమే జనం కనిపిస్తారు.
జానకమ్మకు కొన్నాళ్ళుగా తాను పుట్టి పెరిగిన ఊరు మీదకు ధ్యాస మళ్ళింది. ఒక్కత్తీ అక్కడికెలాగూ వెళ్ళలేదు. ఎవరూ తీసికెళ్ళే వాళ్ళు లేరు. అదీ కాక తన వూళ్ళో తన వాళ్ళంటూ కూడా ఎవరైనా వున్నారో లేరో కూడా తెలుసుకునే ఆసక్తి పిల్లలకు లేదు. ఒకే ఇంట్లో వుంటున్నా కొడుకు పిల్లల్తో మాట్లాడి ఎన్ని రోజులైందో! వాళ్ళ పిల్లలు సరేసరి తను వున్నా తన ఉనికి లేనట్టే వుంటారు. సుబ్బారావు ఒక్కడే కొడుకవడం వల్ల ఆమెకే వేరే ఎక్కడా ఆశ్రయం లేకుండా పోయింది.
ఒక మంచి రోజు చూసి పిల్లలిద్దరూ తమ తమ సొంత ఇళ్ళకు మారిపోయారు. ఇంట్లో కొడుకూ కోడలూ తనూ తప్ప వేరే లోకం లేదు. ఈ వంటరితనం ఇంకా భరించలేకుండా వుంది.
”ఒక్కత్తి వని బాధ పడకు… ఏ గుడికో పార్కుకో వెళ్తానంటే ఏర్పాటు చేస్తా… వెళ్ళిరా నెలకో సారి.” సుబ్బారావు మాటలకు మంచంలో కూర్చున్న జానకమ్మ బేలగా, అసహాయంగా చూసింది. ‘అమ్మా’ అన్న సంబోధన కొడుకేనాడో మర్చీపోయాడు. మాట్లాడటమే యాధృచ్ఛికం! పార్కులకూ, గుళ్ళకూ వెళ్ళినా ఒంటరితనమే, మనసులో లేని కలివిడీ, బంధుత్వాలూ అక్కడ మాత్రం దొరుకుతాయా! కోడలు చేతి నిండా పని కల్పించుకుంది. ప్రాజెక్టు వర్క్‌ ప్రత్యేకంగా చేస్తోంది కాబోలు ఒక్కొక్కసారి ఇంటికి రావడం కూడా పడటం లేదు. ఆ పని మీదే వేరే ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఇంట్లో సుబ్బారావూ, జానకమ్మ మాత్రమే వుంటున్నారు. అప్పుడు కూడా కొడుకుతో మనసు విప్పి మాట్లాడాలన్న ఆరాటం తొలిచేస్తున్నా గదిలో అతను టీవీ చూస్తూనో, ఆఫీస్‌ పని చూసుకుంటూనో, గ్లాసులు ఖాళీ చేస్తూనో కనిపించేవాడు. ఆమెని ఒంటరితనం విచలితం చేయడం వలన తనను తాను ఒకసారి అద్దంలో చూసుకొని భయపడింది.
తలంతా ముగ్గు బుట్ట! కళ్ళ క్రింద నీటి బుగ్గలు క్రిందికి జారి ఎర్రగా కందిపోయిన లావు చెంపలు రోతగా కన్పిస్తున్నాయి. మోకాళ్ళు దిగిన గళ్ళ గౌనూ, నడుముకు బెల్ట్‌ లాంటి తోలు పట్టీ వుంది. రెండు మూడు నెల్లకొకసారి బ్యూటీషియన్‌ ఇంటికొచ్చి తలంతా నీటుగా చేసి, చిన్న క్రాఫ్‌ పెట్టి పోతుంది. ‘బ్యూటీ’ అని బుగ్గతట్ట. జానకమ్మకిప్పుడు నూటా పదేళ్లు! మాట తగ్గిపోయి మంచు ముద్దలా వుందిప్పుడు. కోడలు నీలమ్‌ పోయి కూడా పదేళ్ళు దాటింది. సుబ్బారావుకే తొంభయ్యేళ్లు! ముసలమ్మని చూస్తే అతనికి ఆశ్చర్యం వేసేది ఒక్కోసారి. ఎన్నాళ్ళు బ్రతుకుతుందని. ఒకరోజు జానకమ్మ నిశ్చలంగా పడుకొని కన్పించింది సుబ్బారావుకు. ఎలాగో అవస్థ పడి శవాన్ని మూటలాగా కట్టి మంచం క్రిందకు నెట్టి, కొడుక్కు ఫోన్‌ చేసి తను అక్కడికి వస్తున్నట్టు చెప్పాడు. అన్ని బంధనాలూ తొలిగిపోయాయన్న ఆలోచనతో. తల్లి దహన సంస్కారాలు నిర్వహించాలంటే తనబోటివాడికి అందని ద్రాక్ష! అదీ కాక ముందు స్మశానంలో స్థలం బుక్‌ చేసుకోకపోవడం పెద్ద తప్పిదమయ్యింది. ఈ కారణాలన్నింటివల్లా సుబ్బారావు కొడుకింటికెళ్ళి ఇంటి తాళం చెవులు అతనికిచ్చి ఓల్డేజ్‌ హోంలో చేరిపోయాడు. ముసలమ్మను గురించి వాకబు చేసే ఓపికా, తీరికా ఎవ్వరికీ లేకపోయింది.
జ               జ               జ
ఇరవయ్యేళ్ళ తరువాత ఆ యిల్లు అమ్మకం అయినప్పుడు ఇంట్లో అస్థిపంజరం బైటపడింది మూట కట్టి వున్నదది. పోలీసులూ పత్రికల వాళ్ళూ ఇల్లంతా చెక్‌ చేసినప్పుడు బల్ల క్రింద చిన్న పర్సులో ఒక కాగితం దొరికింది.
‘ఈ నగరంలో అన్నీ ఖరీదే ఒక్క మనిషి ప్రాణం తప్ప! అందుకే ఏ రోగాలూ రాకుండా బ్రతికినంత సేపూ ఎవ్వరికీ భారం కాకుండా వుండగలగడమే ఇప్పటి పరిస్థితులలో నేను చేయగలిగింది. తల్లి ఋణం ఏ విధంగానూ తీర్చుకోలేకుండా కొడుకింటికి పారిపోతున్న ఓ అభాగ్యుడు! దహన సంస్కారాలు చెయ్యడానికి అంత డబ్బు నిలవలేనందుకు నన్ను క్షమించమ్మా.” అంటూ రాసి వుందా కాగితంలో.
తండ్రి పోయాక ఎప్పుడూ ఆ యింటికి పోవడం గానీ, తలుపులు తెరిచి చూడటం గానీ ఆ కొడుకులు చెయ్యలేదు. ఇప్పుడు ఇల్లుమ్ముకున్న తరువాత బైటపడిన ఉత్తరం చదివి కళ్ళు మూసుకున్నారు బాధగా. ఖరీదైన నగరాల్లో రక్తసంబంధాలు ఎంత పేదరికంలో వున్నాయో కదాని!
(జపాన్‌లో తల్లి చనిపోతే మూటకట్టి 32 ఏళ్ళు ఇంట్లోనే వుంచిన సంఘటన చదివాక.)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.