వీరేశలింగం నుండి వి.ఎస్‌.నాయ్‌పాల్‌ దాకా…

ఈ మధ్య వి.ఎస్‌.నాయ్‌పాల్‌ వాచాలత్వం, అహంకారం గురించి చదివాక కోపంతో పాటు కొండంత దిగులూ కలిగింది. ఎవరైనా గానీ తమ తమ రంగాల్లో ఆకాశమంత ఎత్తు ఎదిగినా గానీ స్త్రీల విషయంలో ఎందుకంత దిగజారి ప్రవర్తిస్తారు? నోటి కొచ్చినట్టు ఎందుకు వాగుతారు? మహిళలందరి  గురించీ మాట్లాడే గుత్త హక్కులు వీళ్ళకెవరిచ్చారు?
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో  ఛీప్‌ జస్టిస్‌ హోదాలో వుండి ఒకనాడు రంగనాధమిశ్రా స్త్రీలు ఇంటికే పరిమితమవ్వాలిలాంటి మూర్ఖపు మాటలు పలికి దేశంలోని స్త్రీలందరి కోపానికీ గురయ్యాడు. ఆ రోజు అన్నీ మహిళా సంఘాలూహైదరాబాదులో హైకోర్టు ముందు ధర్నా చేసి రంగనాధమిశ్రా దిష్టిబొమ్మను తగులబెట్టడం జరిగింది. తనకు మాలిన ధర్మంలా, తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి మహిళల గురించి తీర్పులు ప్రకటించే వాళ్ళు చాలామందే వున్నారు. విఎస్‌ నాయ్‌పాల్‌ తనను తాను గొప్ప రచయితగా చూసుకుని, మురిసి ముక్కలైపోవచ్చు. దానిపట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రపంచంలోకెల్లా తానే, తాను మాత్రమే గొప్ప రచయితనని, మహిళా రచయితలు భావోద్వేగాల్లో కొట్టుకుపోయి చెత్తరాస్తారని, తాను వారి రచనలు అసలు చదవనని ఇంకా ఏమేమో చెత్త మాట్లాడాడు. ఒకవైపు చదవనని చెబుతూనే వాళ్ళు ట్రాష్‌ రాస్తారని ఎలా మాట్లాడతాడు? ఎలాంటి సెంటిమెంట్లు, భావోద్వేగాలూ లేని బండబారిన మనుష్యులు ఇలాగే వాగుతారేమో! పూర్వం ఒక కోడిపుంజు, నేను కొక్కోరొకో అని కూయకపోతే ప్రపంచం తెల్లవారదు. ఆహా నేనేంత గొప్పదాన్ని అని తెగ వీర్రవీగిందట. అలా వుంది ఈయన వ్యవహారం. మహిళల్ని కించపరుస్తూ మాట్లాడితే ఇన్‌స్టెంట్‌గా పతాక శీర్షికలకు ఎక్కవచ్చని పన్నాగం పన్నినట్టున్నాడు. అనవసరంగా నోరు పారేసుకుని అంతర్జాతీయంగా విమర్శలపాలయ్యాడు.
అసలు స్త్రీలు ఏం రాయాలి? ఎలా రాయాలి? ఏది రాయాలి? ఏది రాయకూడదు అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. ఆ మధ్య భోపాల్‌ నుంచి అనుకుంటాను  కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడొకడు ఇలాగే నోటికొచ్చినట్టు రచయిత్రుల గురించి పేలాడు. స్త్రీలు ఫోర్నోగ్రఫి రాస్తారని వ్యభిచారులనీ వాగాడు. జాతీయ స్థాయిలో విమర్శలు చెలరేగి చావుతప్పి కన్నులొట్టబోయి ఆఖరికి క్షమాపణలు చెప్పాడు. అడుసుతొక్కనేల? కాలు కడగనేల? అవాకులూ, చవాకులూ పేలనేల? ఆపై క్షమాపణలు చెప్పనేల?
మన తెలుగు నేల మీద కూడా నాయ్‌పాల్‌లకు తక్కువేమీలేదు. గొప్ప కథలూ, నవలలూ రాసిన ప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాధశాస్త్రి ఫెమినిస్టులను గయ్యాళులని నిందించారు. దీనిమీద  ఓల్గా ”ఔను మేము గయ్యాళులమే” అని కవిత కూడా రాసింది.  ”మీరు స్త్రీవాదులని గయ్యాళులని ఎందుకన్నారని అబ్బూరి ఛాయాదేవి గారడిగితే ” నాకు మల్లాది సుబ్బమ్మ గుర్తొచ్చి అలా అన్నాను” అని జవాబిచ్చారట. రావిశాస్త్రి అసలు స్త్రీవాదం గురించిగానీ, స్త్రీవాద రచనల్ని  గానీ చదివాడా? నేను స్త్రీవాదుల్ని చదవను అని అహంకరించే వాళ్ళకి, అసలు వాళ్ళు ఏమి రాసారో అర్ధం చేసుకోలేని వాళ్ళకి స్త్రీవాదుల్ని నిందించే హక్కు ఎవరిచ్చారు? అయినా ఫలానా వారి రచనలో  లోపాలున్నాయి? ఈ అవగాహనా రాహిత్యముంది? అని చెప్పకుండా మొత్తం స్త్రీవాదుల్ని నిందించడం వెనుక ఉన్నదొక్కటే పురుషహంకారభావజాలం. పురుషుడిననే పొగరుబోతుతనం.
ఇంక జ్వాలాముఖిని ఈ అంశంలో ఎంత తక్కువ గుర్తుకు  తెచ్చుకుంటే అంతమంచిది. ఆయన రావిశాస్త్రి కన్నా ఓ అడుగు ముందేసి స్త్రీవాదులవి నీలి రచనలని గేలి చేసాడు. జ్వాలాముఖి సాధారణ,  మాములు వ్యక్తికాదు. దిగంబర కవుల్లో ఒకరు. అభ్యుదయం పేరుతో, విప్లవం పేరుతో రచనలు చేసినవాడు. అనర్ఘళంగా విప్లవోపన్యాసాలు యివ్వగలిగిన మేధావి. ఇంతటి మేధావి, అభ్యుదయవాది కూడా స్త్రీవాదులవి నీలి రచనలని అనగలిగిన కుసంస్కారాన్ని ప్రదర్శించడం ఎంతో విస్మయాన్ని కలిగిస్తుంది. ఇపుడాయన మన మధ్య లేరు కాబట్టి అవన్నీ తవ్వడం అవసరమా అని ఎవరైనా అంటే నా సమాధానం ఒక్కటే. వ్యక్తులున్నా లేకపోయినా వారి రచనలు మిగిలే వుంటాయి. వి.ఎస్‌.నాయ్‌పాల్‌ అయినా జ్వాలాముఖి అయినా మరెవరైనా వారి రచనలు మిగిలే వుంటాయి.ఎవరైనా సరే రచయిత్రుల మీద పురుషాహంకార ధోరణిలో మాట్లాడితే అవి ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతాయి. ఇతరత్రా వాళ్ళెంత గొప్ప వారైనా స్త్రీల పరంగా వారి సంస్కార రాహిత్యం, సంకుచిత మనస్తత్వం మాయని మచ్చలాగా వారి జీవితాల మీద వుండిపోతుంది. వారెంత ప్రయత్నించినా వాళ్ళు చిమ్మిన విషం వాళ్ళని వొదలిపోదు. క్షమాపణలు గాయపడిన మనసుల్ని సేదతీర్చలేవు. విఎస్‌నాయ్‌పాల్‌ రచయిత్రుల గురించి చేసిన వికృత వ్యాఖ్యల నేపధ్యంలోంచి చూసినపుడు సాహిత్య చరిత్ర పొడవునా స్త్రీలకి జరిగిన అన్యాయం ప్రస్ఫుటంగా అర్థమౌతుంది. ముద్దుపళని గురించి వీరేశలింగం పంతులు చేసిన అవమానకర వ్యాఖ్యలు గుర్తురాకమానవు. ఆయన స్వయంగా శృంగార రచనలు చేసి కూడా ముద్దుపళనిని అది, ఇది అని సంభోదిస్తూ ”రాధికాసాంత్వనం” కావ్యాన్ని ఓ బూతు కావ్యంగా అభివర్ణించడం వెనుక వున్నదికూడా పురుషాహంకారమే.  రాధికా సాంత్వనం పుస్తకాన్ని ప్రచురించినందుకు బెంగుళురు నాగరత్నంను ఎన్ని తిప్పలు పెట్టాడో ‘ఆమె ఆత్మకథ’ను చదివితే అర్థమౌతుంది. ప్రభుత్వం చేత ఆ పుస్తకాన్ని నిషేధింపచేయించాడు కూడా.స్త్రీలకోసం పెద్ద ఎత్తున సంస్కరణోద్యమాన్ని నడిపిన వీరేశలింగం కూడా స్త్రీల విషయంలో, (వితంతు వివాహాలు పక్కన పెడితే) సంకుచితంగా, ఫక్తు మగాడిలాగానే వ్యవహరించాడు.
అంతెందుకు తెలుగులో తొలికథ రాసిన భండారు అచ్చమాంబ కథని, తెలుగు సాహిత్యంలో మొదటి కథగా, అంగీకరించడానికి ఈనాటికీ మన పురుషపుంగవులకి మనస్కరించడంలేదు. గురజాడ కధని పట్టుకుని ఇదే తొలికథ  అంటూ భీష్మించుక్కూర్చున్నారు. తెలుగు కథకి వందేళ్ళ పండగ అంటూ ఊరేగుతున్నారు. బహుశ అచ్చమాంబ పురుషుడై  వుంటే  ”ధనత్రయోదశి”ని వీరు తలకెత్తుకుని తొలికధగా కీర్తించివుందురు. రచయిత్రుల రచనల విషయంలో ఆనాటికీ, ఈనాటికీ పురుషుల దృక్పధాల్లో ఏమి మార్పు రాలేదని చెప్పడానికి నాయిపాల్‌ ఉదంతం చక్కని ఉదాహరణ. అదే అహంకార ధోరణి, అదే అధిపత్య దృక్పథం ఆధునిక కాలంలో కూడా కొనసాగడం ఎంత విషాదం??? అందుకే నాకు అంత దిగులు కలిగింది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

2 Responses to వీరేశలింగం నుండి వి.ఎస్‌.నాయ్‌పాల్‌ దాకా…

  1. pullaa rao says:

    మనిషికి ముఖంలాంటిదే పత్రిక్కి సంపాదకీయం. మీది స్త్రీవాదముఖం. కాబట్టీ అందంగా వుంటుంది. ఎందుకంటే స్త్రీ అంటేనే అందానికి నిర్వచనం కదా..! ఎంత అందమైన ముఖంలో అయినా ఒకటి రెండు మచ్చలుండకపోతే అందముండదు. అందుకే కాబోలు చందమామలో కూడా మచ్చలున్నాయి.
    అలాగే మీ అచ్చతెలుగు సంపాదకీయంలోకి కూడా కొన్ని ఆంగ్ల మచ్చలు వచ్చి చేరాయి.

    “ఛీఫ్ జస్టిస్ , హై కోర్టు , ట్రాష్ , ఇన్ స్టాంట్ గా , అకాడెమీ , పోర్నో గ్రఫీ , ఫెమినిస్టులు”

    ఈ పదాలన్నిటినీ కూడా తెలుగు చేసుకోవచ్చు. అర్ధం కావేమో అనే అనుమానం కూడా అక్కర్లేదు. అలాంటప్పుడు తెలుగు పదాలనే వాడవచ్చు కదా ? ఆయా ఇంగ్లీషు పదాలని వాడటం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనం కూడా ఏమీ కలగలేదు.

  2. జ్వాలాముఖి గురించి స్త్రీవాద వివాదాలు పుస్తకంలో చదివాను. రంగనాయకమ్మ & ఆవిడ రెండవ భర్త గాంధీ గార్ల వ్యక్తిగత జీవితం గురించి చెత్తగా మాట్లాడినవాళ్ళలో జ్వాలాముఖి ఒకడు. జ్వాలాముఖి ఎంత చెత్త సన్నాసో రంగనాయకమ్మ గారు “జన సాహితీతో మా విబేధాలు” పుస్తకంలో వ్రాసారు.

Leave a Reply to pullaa rao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.