శివరాణీదేవి ప్రేమ్‌చంద్
అనువాదం : ఆర్. శాంతసుందరి
ఈయన ఎక్కడున్నా, ఏ ఊళ్లో ఉన్నా, ఈయన్ని కలిసేందుకు వచ్చేవాళ్లకి కొదవ ఉండదు, బొంబాయిలోనూ అదే ధోరణి. ఉదయం ఐదు గంటలకి ఈయన వ్యాహ్యాళికి వెళ్లి వచ్చేవారు, ఏడున్నరకి టిఫిన్ చేసి, బీడా వేసుకుని తన గదిలోకి వెళ్లిపోయేవారు. ‘పని చేసుకుంటాను,’ అంటూ ఆయన గదిలోకి వెళ్లీ వెళ్లగానే ఎవరో ఒకరు వచ్చేవారు. ఆయన పని చేసుకునే సమయం వాళ్లతో గడిచిపోయేది. తరవాత భోంచేసి స్టూడియోకి వెళ్లేవారు, రోజూ ఆయన ఇదే రొటీన్‌ని పాటించేవారు. ఇక రాసుకునేందుకు సమయం లేక, అర్థరాత్రి రెండూ రెండున్నరకి నిద్రలేచి గదిలోకెళ్లి రాసుకునేవారు. నాలుగు రోజులు ఇలా చెయ్యటం చూసి, ”నాకు తెలీకడుగుతాను, అర్థరాత్రి లేచి రాసుకోవల్సిన అవసరమేమొచ్చింది మీకు?” అసలే మీకు ఆరోగ్యం బావుండదు, అలాంటప్పుడు రాత్రికూడా విశ్రాంతి తీసుకోకుండా రోజంతా పనిచేస్తారేమిటి? మీరేమైనా మిషను అని అనుకుంటున్నారా?” అన్నాను కోపంగా.
”అనవసరంగా కోప్పడకు, పగలూ రాసుకోక, రాత్రీ రాసుకోక, మరెప్పుడు రాసుకోమంటావు?”
”పెళ్లయినప్పట్నించీ చూస్తూనే ఉన్నాను. పనిలోపడి నలిగిపోతూనే ఉంటారు ఎప్పుడు చూసినా. మీ ఆరోగ్యం చెడితే బాధపడేది నేనేగా?”
”పగలంతా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, వాళ్లని కలవాలికదా? రాత్రేకదా రాసుకునేందుకు తీరిక చిక్కుతుంది?”
”అలా అయితే కలిసేందుకు వచ్చేవాళ్లని ఫలానా టైముకి రమ్మని కొంత సమయం వాళ్లకి కేటాయించండి.”
”అదెలా సాధ్యం, నువ్వే చెప్పు!”
”ఒక చిన్న పలకమీద పెద్ద అక్షరాలతో టైము రాసి, బైట తగిలించండి.”
”ఓహో! నన్ను కూడా గొప్పవాళ్లలాగ తయారవమంటావా? నీకు గుర్తుందో లేదో, ఒకసారి గాంధీగారిని కలిసేందుకు నేను ప్రయాగకి వెళ్లాను కానీ కలవలేకపోయాను, రెండు రోజులు వేచి ఉన్నా ఆయన్ని చూడటం పడలేదని ఎంత విసుక్కున్నానో అప్పుడు! గాంధీగారి లాంటి గొప్ప వ్యక్తి మీద కోపం రాకూడదు, విసుక్కోకూడదు, అయినా కలవలేకపోయానన్న నిరాశతో చాలా కోపం వచ్చింది. అలాగే నన్ను చూడాలని వచ్చేవాళ్లకి కూడా కోపం రాదూ? పైగా నేనంత గొప్ప వ్యక్తినేమీ కాదు కూడా! ఎంతో దూరం నించి నన్ను చూడాలనీ, నాతో మాట్లాడాలనీ వస్తారు పాపం, ఫలానా టైములోనే రావాలి, అంటే ఎంత బాధపడతారు? అసలే నాకు గొప్పవాళ్లంటే గాభరా, అలాంటప్పుడు నేనూ అలాగే ప్రవర్తిస్తే ఎంత తప్పు? అయినా మనని కలవటానికి వచ్చేవాళ్లు కూడా మనలాగే పేదవారు.”
”పేదవారో, ధనికులో, అదంతా అనవసరం. మీ పనికి అడ్డొస్తున్నారన్నదే అసలు సమస్య.”
”ఇన్నాళ్లూ జరిగినట్టే ఇప్పుడూ జరిగిపోతుంది. ఇక బాధ దేనికి?”
”అయితే మీరు రాత్రిళ్లు పనిచెయ్యకండి. జీతం ఎలాగూ దొరుకుతున్నప్పుడు నిద్ర మానుకుని పనిచెయ్యటం దేనికి?”
”ఇప్పుడు నాకంత పనేం ఉందని? స్టూడియోలో రోజంతా పోచికోలు కబుర్లు చెప్పుకోటం తప్ప నాకేమీ పనుండదు, నిజం!”
”అయితే ఇంత దూరం పనికిమాలిన కబుర్లు చెప్పేందుకే మిమ్మల్ని వాళ్లు పిలిపించినట్టున్నారు! ఇంత పెద్ద బొంబాయి నగరంలో అలా కబుర్లు చెప్పేందుకు వాళ్లకెవరూ దొరకలేదేం పాపం?”
”నిజం, అసలు పనే ఉండదు. నువ్వు నమ్మవేమిటి?”
”ఎలా నమ్ముతాను? మీ గురించి నాకు తెలీదా! పనిలో ఎంత తలమునకలుగా ఉండి అవస్థ పడుతున్నా, నాకు మాత్రం పనిలేదనే చెపుతారు ఎప్పుడూ.”
”సరే ఇక్కడున్నన్నాళ్లూ ఇంకేమీ పని చెయ్యకపోయినా గడిచిపోతుంది. కానీ మాటిమాటికీ వెళ్లిపోదాం అంటూ ఉంటావుగా, మరి మళ్లీ వెనక్కి వెళ్లాక ఎలా గడుస్తుంది, చెప్పు? అంతే కాదు నాకు బద్ధకం అలవాటైపోతుంది. పేదవాడైనా, డబ్బున్నవాడైనా, ఎవరూ చెడు అలవాట్లు చేసుకోకూడదు. ఏ పనీ లేకుండా కూర్చోటం అలవాటైతే, వాడు పనికిమాలిన వెధవైపోతాడు. తక్కువ ఖర్చు చెయ్యటం, ఎక్కువ పని చెయ్యటం వల్లే జీవితంలో ఏదైనా సాధించగలం. ఈ విషయం తెలుసుకుంటే ఇక ఎవరూ బానిసలా బతకక్కర్లేదు.”
”ఇది మీరెప్పుడూ చెప్పే వాదమే.”
”నా వాదం కాదు, నిజంగానే చెపుతున్నాను. ఎవరైనా సరే తమ అవసరాలని పెంచుకుంటూ పోయినకొద్దీ, సంకెళ్లు మరింత బలంగా అతన్ని బంధించి, బానిసని చేసేస్తాయి.”
”అవన్నీ సరే, కానీ నేను మిమ్మల్ని రాత్రిపూట పని చెయ్యనివ్వను.”
”చెయ్యనివ్వకపోతే, చెయ్యను!”
”దొంగతనంగా మీ మాటే నెగ్గించుకుంటారు.”
”నన్నేమైనా పిచ్చికుక్క కరిచిందా అలా పనిచేస్తూ కూర్చోటానికి? నాదేం పోయింది, పని మానేస్తాను!”
ఒకసారి స్టూడియో వాళ్లు ఆయన్ని తమతో ఏడాది పాటు ఉండేందుకు ఇంగ్లాండుకి రమ్మన్నారు. ఈయన వచ్చి నాకా సంగతి చెప్పారు. అక్కడ సినిమా తీస్తున్నారనీ, సంవత్సరం పాటు పని ఉంటుందనీ, పని అయిపోయి వెనక్కి వచ్చాక తను ఇష్టం వచ్చిన చోట పని చేసుకోవచ్చనీ, ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తామన్నారనీ చెప్పారు. ఐదు సినిమాలకి కథలు రాయాలని, ఒక రకమైన కాంట్రాక్టు లాంటిదనీ అన్నారు.
”లేదు, మీరు వెళ్లటానికి వీల్లేదు, నేను వెళ్లనివ్వను,” అన్నాను.
”నీకేం నష్టం నేవెళితే?”
”నష్టం లేకపోయినా సరే, వెళ్లనివ్వను.”
”నువ్వు నన్ను వెళ్లనివ్వవని వాళ్లకి ముందే చెప్పాను. దానికి వాళ్లు, నీ టిక్కెట్టు ఖర్చుకూడా తామే పెట్టుకుంటామనీ, నిన్ను కూడా వెంటపెట్టుకు రమ్మనీ అన్నారు.”
”నేనూ రాను, మిమ్మల్నీ వెళ్లనివ్వను.”
”పిల్లలెలాగూ వేరే ఊళ్లో చదువుకుంటున్నారు. ఇద్దరం వెళ్తే ఏం పోయింది?”
”అయినా సరే, వీళ్లని వదిలి నేను అక్కడికి రావటం ఏమిటి?”
”సరే, నన్నైనా వెళ్లనీ. మంచి అవకాశం, ఇక జీవితాంతం సుఖంగా బతకచ్చు, హాయిగా బెనారెస్‌లోనే ఉండి నా రాతపని చూసుకుంటాను.”
”లేకపోయినా హాయిగానే గడుస్తుంది.”
”ఇంట్లో కూర్చోవటం కన్నా ఏదో ఒక పని చెయ్యటమే సుఖంగా ఉంటుంది కదా? నా పని చేసుకున్నా నచ్చదు, బైటికి వెళ్లినా నచ్చదు నీకు, మరెలా చెప్పు?”
”ఇప్పుడు జరుగుబాటు బాగానే ఉందిగా? మీరు వెళ్లటం నాకిష్టం లేదు, పిల్లల్ని వదిలి నేను రాను!”
జ జ జ
ఒకప్పుడు ఒక్క ఏడాది ఆయన్ని విడిచి ఉండటం చాలా కష్టం అనుకున్నాను. ఇప్పుడు అదే మనిషిని, ఇంకా ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా కాలం గడపాలో తెలీదు! వెళ్లిపోయేప్పుడు ఆయన వెళ్లనా వద్దా అని కూడా నన్నడగలేదు. అంతా రెండేళ్లలో ముగిసిపోయింది. ఆ గొప్ప వ్యక్తి నన్నొదిలి వెళ్లిపోయారు, నేను బాధపడుతూ మిగిలిపోయాను. ఇంత త్వరగా వెళ్లిపోతారని అనుకోలేదు. ఇలాంటి బాధ అనుభవించిన వాళ్లకే అర్థం అవుతుంది. మనిషి చేతిలో ఏమీ లేదు, అయినా అహంకారంతో విర్రవీగుతాడు. నేనూ అలాంటి దాన్నే. అందుకే ఆ గొప్ప మనిషిలో ఉండే ఆత్మ ఎంత గొప్పదో తెలుసుకోలేకపోయాను. ఆయన్ని అర్థం చేసుకోలేకపోయాను. వ్యక్తి ఎంత గొప్పవాడైనా సొంతవాడైనప్పుడు బహుశా ఆ గొప్పదనాన్ని తెలుసుకోవటం అసాధ్యమేమో! ఎందుకంటే ఆత్మీయత మనిషికున్న గొప్పదనాన్ని కప్పేస్తుంది. అది అంతకన్నా గొప్పది! అందుకే అన్నీ మర్చిపోయి ఆయన మీద అధికారం చెలాయించేదాన్ని. ఆయన గొప్పవాడు కాబట్టే నా ప్రవర్తనని నవ్వుతూ భరించారు, పెద్దవాళ్లు చిన్నపిల్లల అల్లరిని భరించినట్టు! అప్పుడప్పుడూ నన్ను, ”నువ్వుత్త పిచ్చిదానివి” అనే వారు. అలా అంటే నాకు చాలా సంతోషం వేసేది. ఇప్పుడు నన్నలా అనేవాళ్లెవరూ లేరు!
జ జ జ
మద్రాసు అనుభవాలు
మద్రాసు హిందీప్రచార సభవాళ్లు ఈయన్ని ఆహ్వానించారు. నా దగ్గరకొచ్చి, ”పద మద్రాసు వెళ్లివద్దాం,” అన్నారు.
”ఎందుకు?” అన్నాను.
”హిందీప్రచారసభా వాళ్లు పిలిచారు.”
”చాలా ఖర్చవుతుంది.”
”చూద్దాంలే ఖర్చు అయితే అయింది,” అన్నారు. నేను ప్రయాణానికి సిద్ధం అయాను. మద్రాసు చూడాలని నాకూ సరదాగా ఉండేది. 1934 డిసెంబర్ నెల. ఇక్కణ్ణించి నలుగురం వెళ్లాం. మేమిద్దరం, నాథూరామ్ ‘ప్రేమీ’, నాలుగో వ్యక్తి దక్షిణ భారతీయుడు.
రైలెక్కాం. ఐదారు స్టేషన్లు దాటామో లేదో నాకు విపరీతమైన తలనొప్పి మొదలైంది. రైలు బోగీ చాలా రద్దీగా ఉంది. నడుం వాల్చటానికి ఎక్కడా చోటు లేదు. కొంతసేపు నేను ఓర్చుకుని అలాగే కూర్చున్నాను. కానీ ఇంక భరించలేకపోయే స్థితికి వచ్చాక, నాకు చాలా తలనొప్పిగా ఉందనీ, కూర్చోలేక పోతున్నాననీ మా ఆయనతో చెప్పాను.
”ఉండు, ఇప్పుడే ఏదో ఒకటి చేస్తాను,” అన్నారు.
”నన్ను ఆడవాళ్ల కంపార్ట్‌మెంట్‌లో కూర్చోపెట్టండి,” అన్నాను.
”వద్దు. రాత్రివేళ, అక్కడ నీకు తోడెవరూ ఉండరు. నువ్వొక్కదానివీ అక్కడ కూర్చోవటం నాకిష్టం లేదు. నీ పరిస్థితి ఇంకా విషమంగా మారితే అక్కడ నీకెవరు సాయం చేస్తారు?” అని ‘ప్రేమీ’తో, ”మీ పరుపూ, నా పరుపూ పైన పెట్టెయ్యండి. ఈవిడకి చాలా తలనొప్పిగా ఉంది.” అన్నారు. ఆ తరవాత తనే స్వయంగా హాల్డాల్ విప్పి నాకు పక్క తయారు చేశారు.
”నువ్వెప్పుడూ తలకి రాసుకునే నూనె నీ సామానులో ఉందా?” అని నన్ను అడిగారు.
”నూనె దేనికి?”
”నీ తలకి మాలిష్ చేస్తాను.”
”వద్దు, అందరి ముందూ అసహ్యంగా ఉంటుంది,” అన్నాను.
”ఏమీ ఉండదు, ఒంట్లో బావుండక పోతే మందు వేసుకోరా? ఇదీ అంతే. నీకు ఎండ దెబ్బతీసింది. ఇప్పుడు చూడు, నేను మాలిష్ చేస్తే హాయిగా నిద్రపోతావు. నొప్పి తగ్గిపోతుంది.”
నేనెంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. సామాను వెతికి, నూనె సీసా తీసి నా తలకి మాలిష్ చెయ్యసాగారు. నిజంగానే నాకు చాలా హాయిగా అనిపించి నిద్రపోయాను.
వాళ్లు ముగ్గురూ రాత్రి పదిగంటలకి వెంట తెచ్చుకున్న పదార్థాలు తినటానికి కూర్చున్నారు. ‘ప్రేమీ’ నన్ను కూడా లేపమనీ, తినటానికేమైనా ఇవ్వమనీ, ఈయనతో చాలా గొడవ చేశారట.
”లేదండీ. ఒంట్లో బాగా లేని వాళ్లు సుఖంగా నిద్రపోతూంటే ఎప్పుడూ వాళ్లని లేపకూడదు. ఆవిడకి వచ్చింది మామూలు తలనొప్పి కాదు, చాలా బాధ పడింది. మామూలు తలనొప్పయితే చెప్పే తత్వం కాదు ఆమెది.”
రాత్రంతా నేనలా నిద్రపోతూనే ఉన్నాను. ఇంక నాకేమీ తెలీలేదు.
ఉదయం ఆరు గంటలకి రైలు మద్రాసు చేరుకున్నాక ఆయన నన్ను లేపారు. రాత్రంతా నిద్రపోవటం వల్ల నాకు చాలా తేలిగ్గా అనిపించింది. రైలు ఆగేసరికే ప్లాట్‌ఫార్మ్ మీద దాదాపు మూడువందల మందీ ఆడా మగా ఉన్నారు. అందరి చేతుల్లోనూ పూలదండలున్నాయి. కొందరి చేతుల్లో గులాబీల దండలూ, కొందరి చేతుల్లో, మద్రాసులో మాత్రమే దొరికే, కర్పూరమాలలూ ఉన్నాయి. మా ముగ్గురినీ వాళ్లు ఆ దండల్తో కప్పేశారు. అలాంటి స్వాగతం నేనెప్పుడూ ఎక్కడా చూడలేదు. ఆ తరవాత ఒక మార్వాడీ ఆయన మా ముగ్గుర్నీ తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ బస ఏర్పాటు చేశాడు.
ఆరోజు రాత్రి పదకొండుగంటలదాకా మేం ఇంటికి చేరుకోలేదు. రోజంతా మీటింగులూ, ఈయన్ని కలిసేందుకు వచ్చేపోయే జనంతో సరిపోయింది. ”చూశావా, ఇక్కడ హిందీకి ప్రచారం ఎంత గొప్పగా జరిగిందో! ఇదంతా గాంధీమహాత్ముడి ప్రయత్నం వల్లే సాధ్యమైంది. ఆయన ముట్టుకున్న పని విజయవంతం అయి తీరవలసిందే! అసలు మన దేశంలో అందరికన్నా ముందు ఇంగ్లీషు నేర్చుకున్నది ఈ ప్రాంతం వాళ్లే. మన పక్కల కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నది దక్షిణాత్యులే. ఈరోజు వాళ్లే హిందీ నేర్చుకునేందుకు తహతహలాడుతున్నారు. మనకి స్వాగతం చెప్పేందుకు మూడు వందలమందికి పైగానే స్టేషన్‌కి వచ్చారు. అంటే హిందీ భవిష్యత్తుకి ఢోకా లేనట్టే. ఒకసారి హిందీ ప్రచారం చేసేవాళ్లు మన ప్రాంతాలకి కూడా ఇక్కణ్ణించి వచ్చారు. ఇక్కడ ఎంతమంది స్త్రీలు వచ్చారో చూశావుగా? మన ఊళ్లో బహుశా ఇద్దరో ముగ్గురో స్త్రీలు వీళ్లకి స్వాగతం చెప్పేందుకు వచ్చి ఉంటారు. ఇక్కడ వీళ్లని చూస్తే ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు!” అన్నారాయన.
”వీళ్లకి ఉన్న ఆప్యాయతా, వీళ్లు చూపించే మర్యాదా, అంత కాదు కదా, దాన్లో నూరోవంతుకూడా మనవాళ్లకి లేదు. బెనారెస్‌కి ప్రచారం కోసం వీళ్లు వచ్చినప్పుడు, అప్పటికి నా కథలు ఐదో ఆరో తమిళం, తెలుగు భాషల్లోకి అనువదించబడ్డాయి. అయినా, బెనారెస్‌లోనే ఉంటూ కూడా వీళ్లొచ్చినప్పుడు నేను స్టేషన్‌కి వెళ్లలేదు. ఇక మిగతావాళ్లని ఎలా తప్పు పడతాను?” అన్నాను.
”లేదు, మన ప్రాంతమే అంత!” అన్నారు.
”మిగతా వాళ్ల విషయం వదిలెయ్యండి. ఒకపని తప్పు అని తెలిసి కూడా చేశామంటే, అందరికన్నా మనమే చెడ్డవాళ్లమని అనుకోవాలి. బొంబాయి వదిలి వస్తున్నప్పుడు పరాయి చోటికి వెళ్తున్నానని అనుకున్నాను. కానీ ఇక్కడి కొచ్చి ఈ ఆడవాళ్లని చూశాక, నా సొంత అక్కచెల్లెళ్ల మధ్య ఉన్నట్టే అనిపిస్తోంది.”
”మరదే వీళ్లలో ఉండే ప్రత్యేకత!” అన్నారు.
”కాదు, వీళ్లు నా కన్నా చాలా ఉత్తములు.”
మర్నాటు మీటింగు జరిగింది. మేం కూడా వెళ్లాం. మీటింగ్ పూర్తయాక, మిగతా ప్రాంతాలనుంచి వచ్చి మద్రాసులో నివాసం ఏర్పరుచుకున్న వాళ్లూ, ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఉంటున్న వాళ్లూ స్థానికుల గురించి ఫిర్యాదు చేస్తూ, మాకిక్కడ ఎటువంటి పోజిషనూ లేదని అన్నారు. – ఇంకా ఉంది
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags