యస్.బి. అలి
మనిషిలోని భావుకత మెదడులో చలనాన్ని కలిగి స్తుంది. ఆ చలనాన్ని తనకొచ్చిన భాషలో ప్రతిభా వంతంగా వ్యక్తీకరిస్తే ఓ స్పార్కులా మెరుస్తుంది. ఆ మెరుపే కవిత్వం. శ్రీమతి శారదాహన్మాండ్లుగారి కవిత్వం లో విరజిమ్మే వెలుగులు ఉన్నాయి. ఆత్మీయత, ఆర్ద్రత, సానుభూతి ప్రేమ, దయనీయ సామాజిక పరిస్థితులపై విచారం, ఆక్రోశం, మార్పు జరిగితే బాగుండుననే ఆశ – ఇవన్నీ కలబోసిన కలశమే ‘మనోదర్పణం’.
సమాజాన్ని చదవడం నేర్పిన తల్లి అవ్యాజానురాగం, అనిర్వచనీయం.
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలకు స్పందిస్తూ ‘అమ్మతనాన్నివీడి ‘కాళి’ గా మారు’ అని ఆక్రోశిస్తుంది.
చాతుర్వర్ణ వ్యవస్థకు కొత్త నిర్వచనిమిస్తూ ‘మానవత్వం’ నా మతం- వృత్తి నా బ్రాహ్మణత్వం ప్రవృత్తి క్షత్రియత్రం- సేవాపరాయణత్వం శూద్రత్వం. అంటూ ”నా రూపం (పంతులమ్మగా) భారతీయ సంస్కృతికి నిదర్శనం” అంటుంది, ఈమె.
నావకు తెరచాపలుగా, రాళ్లరాగాలు పలికించే సాధకులుగా, సమసమాజ నిర్మాణపు పునాదిరాళ్లుగా పంతుళ్లు ఉండాలని ఆశించడమే కాదు, ఆదేశిస్త్తుంది కూడ. తలిదండ్రులపట్ల కర్తవ్యమేమిటో తెలిపే కవిత ”పుత్రుడు” లో – ‘పూటగడవక పాట్లు పడే అమ్మ నాన్నలు గుర్తు లేరా’? అని ఎత్తిపొడుస్తుంది.
‘జీవితం’ సుఖదుఃఖాల కలయిక’ జయాపజయాల అల్లిక అంటూ అనుభవ పూర్వక తాత్వికదృష్టిని ప్రదర్శిస్తుంది. ‘మనిషి’ని నిలదీస్తూ – నటన డబ్బే సర్వసం అనుకునే తత్వం కలిగి, పది పదుల జీవితాన్ని శాశ్వతమనుకుని బతికే ఓ మనిషి నీవెప్పుడు అవుతావు ‘మనిషి’ అంటుంది పవిత్రమైన వైద్యవృత్తిలో ఆదర్శం ఉందని, మృత్యువును ఆపే ప్రయత్నం, స్త్రీలకు మాతృత్వం అందించడంలో వైద్యుల శ్రమ, తపన అభినందనీయం అనే ‘శారద’ గారు నేటి వైద్య వృత్తిలో జరుగుతున్న అపశృతులపై మరో ‘కవిత’ రాస్తారని ఆశిద్దాం.
భారతదేశంలో సగటు బాలుని బాల్యం గురించి రాసిన ‘చెదిరిన బాల్యం’, విద్యకు నోచుకోని కృష్ణ జీవితాన్ని గడుపుతున్న పిల్లలు బాలకార్మికులుగా బతికే పిల్లల్ని ఎవరైనా ఉద్ధరిస్తారేమోనని, ఆశగా ఎదురుచూస్తోంది బాల్యం అంటున్న కవయిత్రి ద్రవీభవించిన హృదయం ఈ లాంటి సామాజిక రుగ్మతకు కారణం చెప్పలేకపోయారు. ఉపాధ్యాయుల విద్యుక్తధర్మాన్ని ప్రబోధిస్తూ నిరక్షరాస్యలే కష్టాలకు మూలమైతే అక్షరాల ఆలయాల ‘చిరుదివ్వెలు’ వెలిగిద్దాం పదండి అంటుందీ కవయిత్రి పంతులమ్మా.
ఇక ‘సమతుల్యత’ సాధించడంలో మనుషులకన్నా జంతువులే నయం’ అనే ఈమె తాత్విక దృష్టిని గమనించాలి. జంతువులకు అనంత కోరికలు లేవు. కూడబెట్టాలనే పేరాశ లేదు. మరి మనిషికో మట్టిలో మట్టై, అప్పులపాలయి, కష్టపడకుండానే ధనికులవ్వాలనే స్వార్ధపరుల చేతుల్లో బుగ్గిపాలై ఆకలికి చిరునామాగా ‘రైతు’ బతుకుతున్నాడని, విపరీతమైన బాధ, సానుభూతి ఆక్రోశం వెళ్లగక్కుతూందీ రచయిత్రి. కాని అసమతుల్యత పోవాలంటే ఏమి చేయాలో చెప్పలేదు.
నేటి ఆధునిక యుగంలోని నిర్లక్ష్యపు ప్రయాణాలు సెల్‌ఫోన్ల సొల్లు కబుర్లు అనేక ప్రాణాలు బలిగొంటున్నాయి అంటు వాపోయిందీ. ‘జాగృతి’ అనే కవితలో…. పచ్చనోట్ల కట్టలు, కుంభకోణాలు కొండచిలువలుగా మారి బడుగు జీవితాల్ని మింగేస్తున్నాయి. నీతి, ధర్మం భయపడి పుస్తకాల అక్షరాల్లో దాక్కున్నాయి. సంస్కారానికి సంకెళ్లు పడ్డాయి. ఆయష్సు పోయింది అని ప్రాధేయపడుతుంది. ప్రాధేయపడడం కంటే ‘జనాన్ని మేల్కొలిపి’ చైతన్య పరచాలనే సైద్ధాంతికంగా ‘శారద’ గారు ప్రగతి పథంలో నడవడానికి ఆమెకు కాస్త సమయం పట్టినా ఆమె తార్కిక దృష్టి ‘సమత’. ఆర్థిక సూత్రాల శాస్త్రీయ దృక్పథం వైపు నడిపిస్తుందని ఆశిద్దాం.
ఇక ‘ఇందిరమ్మ’ కవిత ఇరవై సూత్రాల పథకం పాకిస్తాన్‌పై విజయం. సిక్కుల అణిచివేతలాంటి చారిత్రికాంశాలు ఒక న్యూస్‌రీల్ లాంటివే.
ఆడబిడ్డ చెత్తకుండీల పాలవుతూంది. ముళ్ళపొదల్లో ముద్దు పాపలు పడుతున్నారు, అనేవి ఇటీవల సర్వసాధారణంగా జరుగుతున్నాయి. విసిరి వేయబడ్డ ఆడబిడ్డ మరో అమ్మ అక్కున చేరితే అది భగవత్కటాక్షమనే నమ్ముతుందీ కవయిత్రి తథాస్తు అందామా?
పర్యావరణ పరిరక్షణపై కూడ ఈమెకు అవగాహన వుంది. ‘వృక్షదేవోభవ’ అంటే అదే కదా ‘శ్రమదేవోభవ’ అనే కవితలో శ్రమజీవులారా ఈ దేశ భవితకు పునాదిరాళ్లు, పట్టుగొమ్మలు మీరేనంటా అని ఓదార్చుతుంది. మరి ఇలా ఓదార్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? కవికి? సహేతుంగా ముందుకు సాగుతుందని ఆశిద్దాం.
ఇలా విశ్లేషిస్తూ పోతే ఈమె ‘మనోదర్పణం’లో అనేక ప్రశ్నలు ప్రతిబింబిస్తాయి. ఈమె ఆలోచనల ‘పొదరిల్లు’. వివేకానందుని మేథస్సులా విన్యాసం చేస్తుంటాయని భావించవచ్చు. ‘తార్కికదృష్టి శాస్త్రీయ పరిజ్ఞానం అలవడితే శారద గారి కవిత్వం బాగా పదునెక్కుతుందని భావించవచ్చు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags