రేణుకఅయోల
ఒంటరిగా ఏకాంతాన్ని కోరుకుంటూ
నదితో పాటు నడవాలన్న కోరిక
మనసు తెలిసిన అలల నవ్వాయి
ఒంటరితనానికి ముగింపులా
ఎంత ప్రకృతివో
నదీ జలాలని ఆవిరించుకుని
నింగిదాకా పచ్చని కాంతితో
మనసులోకి నిర్లిప్తత అలముకోకుండా
ప్రశాంతత గాఢంగా పెనవేసుకుంది
ఒంటరిగా ఉన్నపుడే ఎదుటలేని ప్రకృతంతా
మనసులోకి జొరబడి తోడు నిలుస్తుంది
ఒంటరితనం భావన నెపం మాత్రమే
ఖాళీ ఖాళీగా కనిపించే పాత్రలో నిండి వుండే గాలిలా
ఒంటరితనం కూడా ఖాళీగా వుండదు
సుడులేత్తె ఆలోచనలతో, జ్ఞాపకాలతో
ఎప్పుడూ సందడి సందడిగా వుంటుంది.
దూరమైన గతానికి దగ్గరగా
వర్తమానంలోంచి పైకిలేపి
ఒంటరితనంలోకి ఒంపుకుంటుంది
గాలిపటంలా ఎగురుతున్న
అనేక ఆలోచనలు పక్కన పెడుతూ
ఒంటరితనం ఒంటరిగా మిగిలిపోయింది
అప్పుడే చుట్టుకుంది వెన్నెల
సంగీత వాహినిలాస్పర్శిస్తూ
గుండె శృతి కలిపి పాడగానే
ఒంటరితనం దూదిపింజలా ఎగిరిపోయింది
నది నాతో అంటుంది
నీ ఒంటరి నౌకని ఇక్కడే వదిలేసి పోమ్మని
అదెలా సాధ్యం?
అ నౌక ఉంటేనే కదా నా నడక నీదాకా…
అబలవు కాదు.. నీవు
కె. ప్రభాకర్
ఆడపిల్లలంటే
అంట్లు తోమడం, ఇల్లూడ్చడం
వంట చేయడం, వంటింటి
కుందేటిలా బతుకీడ్చడం చూసిన వాణ్ణి..
మా అయితే అంతో ఇంతో
చదువుకొని వేన్నీళ్ళకు
చన్నీళ్ళలా తోడవ్వడం చూశా!
చంద్రమండలాన్ని
భూమండలాన్ని చుట్టి రావడం చూశా..
అన్యోన్య దాంపత్యంలో
వంటగదినుండి
పడగ్గదికీ.. పడగ్గది
నుండి బజారుకీ
బుర్ఖా మాటున
ఆయన వెనకాల
మోసుకొచ్చే
క్యారీబ్యాగ్‌లా చూసినోణ్ణి..
సినిమాలకో షికార్లకో
షాపింగులకో షాదీలకో
దుఃఖాలకో సంతోషాలకో
పరిమితమైన దానివి కదా!
నీకూ మనసుంటుందని
నువ్వూ రెక్కవిప్పిన రాగోలా
పోరుగీతం పాడగలవని తెలవనోణ్ణి..
ఐరోమ్ షర్మిలానో
ఆండమాన్ సుఖీలాగో
‘అస్మా మొహఫౌజ్’ ఫేస్‌బుక్‌తో
ముప్ఫైఏళ్ళ ముభారక్‌ను
గద్దె దింపిన నీసాహసం
చూశాక.. నువ్వు అబలవు కాదు..
వట్టి సబలవు కాదు!
సమరశీల పోరుకు
ఊపిరులూదిన
నిప్పురవ్వలు మీరు
సకల పీడనలకు చరమ గీతం పాడుతున్న గాజుల చేతులకు చెయ్యెత్తి నమస్కరిస్తున్నా!
మేమింకేం అడగాలి!
తమ్మెర రాధిక
తనను తాను ఎరుక
నశించి…
వంటిల్లే వైకుంఠంగా
తలచి…
ఇడ్లీ ఉప్మా వడా
రుచి రుచిగా వార్చి
అందరూ మెచ్చుకుని తినిపెడితే
ఆనందంతో కన్నీళ్ళు కార్చి
ఎందుకొచ్చిన అవస్థ!
కళ్ళు మండుతూ, చెమటలు కారుతూ
చేతులు పుండ్లు పడుతూ
గది గదినీ శుభ్రించి,
మనసుని అలసటతో దుఃఖంపించి,
పెదాల మీద నవ్వును సాకుతూ
ఇంటిల్లి పాది మదిని గెలవాలన్న
తపన…
శారీరకంగా కృంగిపోతున్నా
తగునా…!
మోనోపాజ్ దుఃఖం కణకణాన్ని
మెలిపెడుతుంటే
అనవసరపు ఆలోచనలు చెయ్యద్దంటూ
అందరితో గొడవలు వద్దంటూ
క్లాసు తీసుకునే ప్రతీ ఒక్కర్నీ
ఆడమనసు… పాడు మనసు..
ఇంకా ఏవో భ్రమలు పాతో
తన స్వేచ్ఛకు తనే సంకెళ్ళు వేసుకుంటూ
దేవుడి గదిలో
అలుగులు పోస్తోంది ఆవేదనని!
ప్రభూ!
‘ఎప్పుడో అలలా వచ్చిన భావావేశం,
స్వేచ్ఛ కావాలనీ, సమానత్వం కావాలనీ
కనీస కోర్కెలు కోరాను,
వాటి రెక్కలను నేనిప్పుడే నరికేసుకున్నాను.
ఇక మేమెవ్వర్నీ ప్రశ్నించము,
మాకు జరుగుతున్న అన్యాయాలకు
అవమానాలపై పెదవి విప్పము.
ఎందుకంటావా?
మరణం బాధాకరం
అయినా కావాలని కోరుకోరు కదా!
అలానే ఆత్మగౌరవం మాకుండటం
ఎదుటి వాళ్ళకు బాధాకరం.
అందుకే నిన్ను కోరిన వరాలు
నీకు ఇవ్వడానికే,
వచ్చాను ప్రభో!’
ముత్యాలసరాలు
కాశీవఝల రమానరసింహం
కష్టాలు రానీ కాలమే తరమనీ కళ్లు
కన్నీటి కల్హారాలుగా మారనీకు చెలీ
కలుషం లేని జాబిలీ మందార మాలినీ
సుమధుర సుశ్యందనాల కల్పవల్లే.
కలతల పడతిలా వగవకే బాలా
నలతల వనితలా మారతావు యేలా
పొలతుల పిడికిళ్ల వాటం చూడవేలా
చెలగి విజృంభ జృంభణం చూపవదేలా
పొంతలో చెలి వంతలన్నీ ఒదిలి పోవ
అంతలో మర్లి ముడుల సుడులన్ని రావ
చెంతలో ఒదిగున్న కడగండ్లు పోపోవ
సుంతలో చూపితే అడుగు అడుగుల్ల చేవ
వడివడిగ తడబడక నడవవే
కాళిలా గిరుల ఝరులన్ని చెదరగా
ఉరమవే పిడుగులా మెరవవే తారలా
నిలవవే క్రాంతిలా జ్యోత్నావతంసిలా
చాలా బాగుంది.