గోళ్లమూడి పద్మావతి
త్రిలోక సంచారియైన నారదుడు బ్రహ్మలోకానికి వచ్చాడు. బ్రహ్మ, సరస్వతు లకు నమస్కరించాడు. అలాగే నిలబడి పోయి, పరధ్యానంగా వున్న నారదుణ్ణి బ్రహ్మదేవుని మాటలు వాస్తవంలోకి తెచ్చాయి.
ఏమిటి నారదా… ఏమాలోచిస్తున్నావు! అంత పరధ్యానంగా వున్నావు!… భూలోకం నుంచేనా రాక!… విశేషాలేమిటి… అనడిగాడు బ్రహ్మ.
అదే ఆలోచిస్తున్నాను స్వామీ…. సృష్టికర్త మీరే కదా! ముల్లోకాలనూ సృష్టించింది మీరేకదా!..
ఏమా ప్రశ్న నారదా!… అన్నాడు బ్రహ్మ.
నాకో సందేహం స్వామీ… ఈనాడు భూలోకంలో శాస్త్రజ్ఞులు విత్తనాలు లేకుండానే కొత్త వంగడాలు సృష్టిస్తున్నారు. కృత్రిమ పద్ధతులలో జీవులను సృష్టించగల్గుతున్నారు. ప్రకృతి సహజంగా కాక, కృత్రిమ పద్ధతుల్లో మానవ సృష్టికూడా చేయగల్గుతున్నారు. ఇది చివరికెటుదారి తీస్తుందో… అని ఆలోచిస్తున్నాను స్వామీ…. అన్నాడు… నారదుడు.
ఇదంతా విన్న బ్రహ్మదేవుడు కూడా ఆలోచనలో పడ్డాడు. ఇదిలాగే కొనసాగితే, మున్ముందు తన పనేమిటా అని….
అంతా వింటున్న సరస్వతీదేవి… మానవుడంతటి మేధాసంపన్నుడా!… సృష్టికి ప్రతి సృష్టి చేయగల దశకు చేరుకున్నాడా! అందరూ బాగా విద్యనభ్యసిస్తున్నట్లున్నారు… అవునా నారదా…. అంది.
అవును తల్లీ, ‘విద్యలేని వాడు వింత పశువు’ కదా!… ప్రజలలో బాగానే చైతన్యమొచ్చి, తమ పిల్లలను చదివించాలనుకుంటున్నారు.
కాని ‘విద్య’ ఈనాడు ‘అందని ద్రాక్షపళ్లు పుల్లన’ చందాన ఉన్నది.
రెండేళ్ల వయసు పని వాళ్లనే విద్యాలయాల్లో చేర్పిస్తున్నారు. ఓనమాలు నేర్చుకోవటానికి వేలల్లో ధనం చెల్లించాలి తల్లీ… ఇదివరలో లాగా గురుకులాలు లేవు. ఇక పెద్ద చదువులకయ్యే వ్యయం లక్షల్లోనే వుంటుంది.
పూట గడవటమే కష్టంగా వుండే సామాన్యుడెలా విద్యానభ్యసిస్తాడు?… అన్నాడు నారదుడు.
అదేమిటి నారదా!… స్త్రీలు, బాలికలకు పూర్తి వుచిత విద్య, పాఠ్య పుస్తకాలన్నీ ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని విన్నానే!….
అవును తల్లీ… కానీ ఋజువుకోసం ఎన్నో కాగితాలు సమర్పించవలసి వుంటుంది. ఆ ఋజువు పరచే పత్రాలు ఇవ్వవలసిన వారు, పత్రానికింత… అని… వందలనుండి వేలల్లోనే… వుంటుంది…. ‘ఏ రాయి అయితేనేమిటి, పళ్లూడగొట్టుకోటానికి’ అన్న తీరున వుంది తల్లీ… అన్నాడు నారదుడు.
కొంతమంది…. బాగా మార్కులు రాకపోయినా…. వాళ్లకు కేటాయించిన సీట్లు భర్తీ చేయబడతాయి. మరికొంత మంది… బాగా తెలివిగల వారికి, ఆసక్తి గల వారికి, స్థోమతలేక, చదువుకొనే అవకాశం కోల్పోతున్నారు. ”డబ్బుంటేనే విద్య” అనే పరిస్థితి… ప్రస్తుతం.
ఆలోచనల్లోకి జారుకున్న సరస్వతీదేవిని చూసి… ఆమె ఇప్పటిలో ఆలోచనలనుండి బయటకు రాదని అర్థమై… అక్కడి నుండి బయలుదేరాడు… నారదుడు.
జ జ జ
నారాయణ…. నారాయణ…. నారాయణ…. అంటూ వైకుంఠంలో అడుగు పెట్టాడు…. నారదుడు.
విష్ణుమూర్తి కనులు మూసుకొని వున్నాడు. ఆయన పాదాలు వత్తుతూ లక్ష్మీదేవి… నమస్కరించాడు నారదుడు.
కుశలమా నారదా!… ఏమిటి విశేషాలు?…. అనడిగింది లక్ష్మీదేవి.
‘తల్లీ నువ్వెప్పుడూ ధనికులనే అనుగ్రహిస్తావా!….’ లక్ష్మిచంచలా అనే నానుడిని మారుస్తున్నావా తల్లీ. స్థిరంగా వుండి ధనికులను అధిక ధనవంతులుగా, కోటీశ్వరులుగా, కోటికి పడగలెత్తే విధంగా కనికరిస్తున్నావు. సామాన్యునికి, బీదవానికి ఏ మాత్రము సాయపడలేవా? కారణమేమిటి తల్లీ!
నిన్ను వశం చేసుకోవటానికి మానవుడెన్ని అడ్డదార్లు తొక్కుతున్నాడో చూస్తున్నావా తల్లీ?…
కష్టపడి, సక్రమ మార్గంలో, సవ్యంగా సంపాదించే వారి నుండి, వృత్తి పన్ను, నిత్యావసర సరుకులు కొంటే వాటి మీద పన్ను, ఇలా…. సంపాదనలో మిగిలేదేమీ లేక, సామాన్యుడు చాలా సామాన్యంగా, చాలీ చాలని అవసరాలతో బ్రతుకీడుస్తున్నాడు.
వ్యాపారస్తులు, రాజకీయవేత్తలు, బడావ్యాపారవేత్తలు, కూడబెట్టిన డబ్బుకు లెక్కుండదు. కనుక పన్ను కట్టవలసిన అవసరం వుండదు. ఆ డబ్బును బ్యాంకుల్లో దాస్తే… లెక్క చూపాలి కదా!… అందుకని ఇంట్లోని బీర్వాలల్లోనో, గోడలలోనో లేక నేల మాళిగలలోనో దాస్తున్నారు. అలా కొంత మంది వద్దే, బందీగా, ఎలా వుండగల్గుతున్నావు తల్లీ!…
అంతా మీ పిల్లలే కదా!… మరెందుకీ వ్యత్యాసం. కొంత మంది పూటైనా గడవక, నానా అవస్థపడుతుంటే, మరికొంత మంది డబ్బేం చేయాలో తెలియక, విచ్చలవిడితనంతో తప్పుదోవ పడుతున్నారు. ఇంకా ఏమో అనబోతుండగా, కనులుతెరిచిన విష్ణుమూర్తి నారదుని వంక చూశాడు. నారదుడు మరలా చెప్పబోగా… అంతా విన్నాను… నారదా… అన్నారు.
అంతా నీ బిడ్డలే కదా!…. అందరూ సమానమే కదా!…. అందరికీ సమానంగా న్యాయం జరగదా!… నారదుడడిగాడు.
కలిప్రభావం నారదా… అంటూ మరల కళ్లుమూసుకున్నాడు విష్ణుమూర్తి. లక్ష్మీదేవికి నమస్కరించి, నారదుడు అక్కడి నుండి నిష్క్రమించాడు.
కైలాసం చేరుకున్న నారదుడు శివపార్వతులకు అభివాదం చేశాడు.
వారు నారదుని పరామర్శించి, భూలోక విశేషాలేమిటని ప్రశ్నించారు.
ఏం చెప్పమంటారు స్వామీ… మీరు ‘లయ’ కారకులు కదా! ‘శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు’ అంటారు కదా!
కాని ఆ భూలోకం మీద మీ ప్రభావ మేమీ వున్నట్లు కనిపించదు. లేక మీరే విరామం లేకుండా శ్రమిస్తున్నారా!…. అన్నాడు నారదుడు. ఏ రోజు చూసినా రోడ్లమీద యాక్సిడెంట్లలో, కక్షలు కార్పణ్యాలతో కొట్టుకుని చస్తున్నారు. రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. వీటికి తోడు దృశ్యశ్రవణి యంత్రం (టీవీ)లో ప్రసారం చేసే కథలలో కూడా, వీరి చేష్టలకు మరింత మెరుగుపెట్టే పద్ధతులు కొత్త, కొత్తవి చూపిస్తున్నారు.
అంతే కాదు స్వామీ… అత్తలు, భర్తలు, ఆయింటి కోడల్ని ఎన్ని రకాలుగా బాధలు పెట్టవచ్చో చూపిస్తున్నారు. చివరకు అడిగిన కట్నం తేలేదని, కొడుక్కు మరో వివాహం చేసి, ఎక్కువ కట్నం కోసం… కోడళ్లను చంపటమెలా అని…. రకరకాలుగా చూపిస్తున్నారు.
అదేమిటి నారదా…. ఆడవాళ్లు విద్యావంతులై, సమజంలో నిలదొక్కుకుని, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడి, సబలలైనారని భావిస్తున్నాను…. అంది పార్వతీదేవి.
ఎంత విద్యావంతులైనా, సంపాది స్తున్నా, వారి మాటెక్కడ చెల్లుతోంది తల్లీ… కొంత వరకు పరిస్థితి మెరుగ్గా వున్నా, వారి కష్టాలు పూర్తిగా తీరలేదు.
అంతేకాక చదువుకుంటున్న విద్యార్థులను, ప్రేమపేరుతో వేధించి, వారు యిష్టపడకపోతే…. వారిని మెడ నరికో, వారి మీద ద్రావకం పోసో, పెద్ద ఎత్తైన భవనాల మీంచి తోసేసో, వారిస్నేహితురాళ్లను కూడా వదలక వేధించి చంపుతున్నారు. పెళ్లైన వారిని, ఈనాటికీ… యింకా రకరకాల వేధింపులు బాధిస్త్తూనే వున్నాయి.
విద్యాలయాల్లో, ర్యాగింగ్ పేరుతో మగవారు ఆడవారిని, నానా రకాలుగా వేధించి ఆనందిస్తున్నారు. ఈ మధ్య కొత్తగా, మగవారిని మగవారు, ఆడవాళ్లను ఆడవాళ్లు కూడా…. వారు భరించలేనంతగా వేధించి, వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు.
ఈ ఆడవాళ్లు మానసికంగా ఎంత ధృడ చిత్తులో, శారీరకదుర్భలత్వం వల్ల గెలవలేక పోతున్నారేమో తల్లీ.
ఆది పరాశక్తివి… నువ్వే వారికి మరింత శక్తినిచ్చి, కాపాడాలి తల్లీ… అన్నాడు నారదుడు.
ఆలోచనలోకి జారిపోయిన పార్వతీదేవి నుండి సెలవు తీసుకొని, నారదుడు ఇంద్రలోకానికి బయలుదేరాడు.
జ జ జ
ఇంద్రుడు అష్టదిక్పాలకులతో కొలువై వున్నాడు. నారదుడు సభలో ప్రవేశించి, పెద్దలకు నమస్కరించి, ఆసీనారూధుడైనాడు.
అందరూ నారదుణ్ణి చూస్తున్నారు… ఏమి విశేషాలు చెప్తాడా అని. విశేషాలేమిటి నారదా!… అని అడిగారు.
ఆ… ఏమున్నాయి… మామూలు విషయాలే…. అన్నాడు.
ఇంద్రుడడిగాడు… భారతదేశంలో ఎన్ని కల హడావుడి బాగా జోరుగా వున్నట్లుంది….
ఆ వివరాలు చెప్పు నారదా…. అన్నారంతా.
మన దేవలోకంలో మీరే దేవరాజు (ఇంద్రుడు), వాయు, వరుణ, అగ్ని మొదల యిన అష్టదిక్పాలకులు, ఎల్లప్పుడూ తమ తమ శాఖలనే చూసుకుంటూ వుంటారు.
భూలోకంలో అలాకాదు దేవేంద్రా…. అక్కడ ఐదు సంవత్సరాలకొకసారి ఎన్నికలు జరిగి, ప్రజాప్రభుత్వాలేర్పడతాయి. ప్రజలు తమ ప్రతినిధులను – వివిధశాఖలకు, ఎన్నుకుంటాడు. ఆ ప్రతినిధులు పరిపాలన సాగిస్తాడు.
కానీ… కలికాలం… ప్రజాప్రతినిధుల ముసుగులో…ప్రజలను పాలించక…. భక్షిస్తు న్నారేమోననిపిస్తుంది. ఆ ప్రజాప్రతినిధులు పరిపాలన కాక, స్వలాభం, స్వపరివార లాభం….అంతేకాకుండా వారికి, వారి కుటుంబ సభ్యులకే పరిపాలనాధికారం దక్కాలని చూడటం వల్ల, కుటుంబ పాలనగా మారిపోతోంది.
అధికారంలో వున్న పార్టీకి చెందిన మంత్రుల దగ్గరనుండి ఆ పార్టీ కార్యకర్తల వరకూ అందరూ తమ కుటుంబ సభ్యులకు, వారి అనుకూలురకు తరతరాలకూ తరగని స్థిరాస్థులు భూముల రూపంలో మరియు యింకా అనేక రకాలుగా, పదవీకాల మున్నంతవరకూ ఒక మహాయజ్ఞం లాగా నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం నడిపే పార్టీని, సవ్యంగా, సక్రమంగా నడిపించటానికి ప్రతిపక్షాలు దోహదం చేస్తాయి. కాని యిప్పుడు రెండు పార్టీలు ప్రభుత్వాన్ని నడిపించటానికి కాక, వారి వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు జోడించి, సమయాన్ని వృధా చేస్తూ, ప్రజలనెవరూ పట్టించుకోవటం లేదు.
ఎన్నికల్లో పోటీ చేయటానికి స్థానం దొరకని వారు, ప్రజలేమని అనుకుంటారో అనే ఆలోచన కూడా లేకుండా, ఈ పార్టీ లోంచి ఆ పార్టీకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీకి దూకేస్తున్నారు.
పైగా ఎన్నికల్లో పోటీ చేయటానికి స్థానం దొరకని వారు, ప్రజాసేవ చేద్దామంటే, మాకు పోటీ చేసే అవకాశం యివ్వటం లేదని తగాదాలు, వాపోవటాలు.
ప్రజాసేవ చేయటానికి పదవులెందుకు నారదా!… అన్నాడు ఇంద్రుడు.
అయ్యో… స్వామీ…. మీకర్థం కాదు.
ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే, అధికారం చాటున ఏ పనైనా చేయొచ్చు…. అక్రమంగా సంపాదించొచ్చు, భూములు కబ్జా చేయొచ్చు, వారి కుటుంబాలకు తరతరాలకు తరగని ఆస్థులు సంపాదించుకోవచ్చు, కావలసిన విద్యనభ్యసించవచ్చు (అర్హత లేకపోయినా), విదేశాలకు విహార యాత్రలకెళ్లొచ్చు… ఒకటేమిటి… ఎన్నో లాభాలుంటాయి మరి… అన్నాడు నారదుడు.
మరి ప్రజల సంగతి… అడిగాడు వాయుదేవుడు. ఆ… ప్రజలదేముంది, గొర్రెలమంద చందం. మళ్లీ ఐదేళ్ల తరువాత, ఎలక్షన్లొచ్చినప్పటి సంగతి కదా!…
ప్రజలు, పరిపాలనా, అభివృద్ధి… అన్నీ గాలికే వదిలేయబడతాయి. నిజంగా వారంతా ప్రజాసేవ చేసేవారే అయితే, కనీసం ఒక్కపూటైనా తిండికి నోచుకోని పేదలెందు కుంటారు స్వామీ.
మరి వీటికి పరిష్కారం లేదా! త్రిమూ ర్తులు సృష్టి, స్థితి, లయ కారకులే!… వారేమీ మార్గం చూపలేరా!… యిదంతా కలిప్రభావమా…. కలికాలం తీరే యింతా?
నారదుడేదో చెప్పబోయాడు…. ఇంతలో….
బర్…. బర్… బర్
బర్…. బర్…. బర్…. బర్
ఎక్కడోలా వినిపిస్తున్న శబ్దం, రాను రాను దగ్గరా వినిపించి, గాఢ నిద్రలో వున్న శారద…. ఒక్కసారిగా వులిక్కిపడి లేచింది.
చుట్టూ చూసింది. అయోమయంగా…. నారదుడు, ఇంద్రుడు ఎక్కడా…. ఇదంతా కలా!….
కాలింగ్ బెల్ మోగుతూనే వుంది. చప్పున ఈ లోకంలోకి వచ్చి, వెళ్లి తలుపు తీసింది…. ఎదురుగా…. భర్త… రవి.
కాఫీ తేవటానికి లోపలికెళ్లి, కాఫీ పెడుతుంటే, తనకొచ్చిన కలగురించి ఆలోచిస్తే…. నవ్వొచ్చింది. అలాంటి కలెందు కొచ్చిందా అని ఆలోచించింది.
టీవీలో ఏదో పౌరాణిక సినిమా చూస్తూ, పేపరులో వార్తలు చూస్తూ… అలాగే నిద్రలోకి జారుకుంది. అందుకే తనకలాంటి కలొచ్చుంటుంది. కానీ అన్నీ నిజాలే కదా!…. అనుకుంటూ భర్తకు కాఫీ ఇవ్వటానికి హాల్లోకి వెళ్లింది.
(భూమిక కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించింది)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags