పి.సత్యవతి
పందొమ్మిది వందల అరవై డెబ్భై దశకాలలో వచ్చిన ”ప్రయాణం” ”సుఖాంతం” అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి. ”ప్రయాణం” కథ ఒక గంభీరమైన సమస్యను తీసుకుని ఎలాంటి మెలోడ్రామా లేకుండా అండర్‌టోన్‌లో వ్రాసిన కథ. అలాగే సుఖాంతం కూడా. ఈ కథ నెమ్మదిగా నడుస్తూనే చివరికి పాఠకులకి ఒక షాక్ ఇస్తుంది. వస్తువు ఎంతో గంభీరమైనదిగా పాఠకులను చుట్టూ కూర్చోబెట్టుకుని, కథ చెప్పినట్లే వుంటుంది కానీ చదువుకోడానికి వ్రాసినట్టు వుండకపోవడం కూడా ఆ కథలు జ్ఞాపకం వుండిపోవడానికొక కారణం కావచ్చు. అదే అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేకత.
ఇటీవల ఆమె వ్రాసిన ”ఆఖరికి అయిదు నక్షత్రాలు” కూడా జరిగిన కథంతా ఒక ప్రేక్షకురాలిగా వ్యాఖ్యాన రహితంగా చెబుతారు. చివరికి ఆమె చేసిన ఒక తాత్వికమైన వ్యాఖ్య మినహాయించి… ఈ కథ ఒక మంచికథగా నిలిచిపోవడానికి వస్తు గాంభీర్యంతోపాటు ఆమె శైలిలోని నిరాడంబరత, చాలా సున్నితమైన వ్యంగ్యమూ కూడా కారణాలే. ఛాయాదేవి గారి కథలు ఎక్కువ ఉత్తమపురుషలో వుండడం వలన అవి పాఠకులకి మరింత సన్నిహితంగా రాగలిగాయేమో కూడా!
1933లో జన్మించిన ఛాయాదేవి 1954లో తొలి కథ ”విమర్శకులు” వ్రాసినప్పటినుంచీ ఆమె కథలన్నీ స్త్రీల జీవితాల చుట్టూ నడిచినవే. అంతకు ముందు ఆమె నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లో వ్రాసిన నాటిక ”పెంపకం” 1952లో నిజాం కాలేజి పత్రికలో వ్రాసిన ”అనుబంధం” అనే కథ కూడా ఆడపిల్లలకి స్వేచ్ఛ ఇవ్వకుండా పెంచడాన్ని గురించే వ్రాసారు. బాల్యమంతా కూడా ఒక సాంప్రదాయపు కట్టడిలో గడపడం కూడా స్వేచ్ఛ విలువ తెలియడానికి దానికోసం పరితపించడానికి కారణమౌతుంది. అందుకే ఆమె మొదటినించీ ఒక ఆడపిల్లగా, గృహిణిగా, ఉద్యోగినిగా, తల్లిగా స్త్రీల జీవితాలచుట్టూ వుండే పరిధులనూ పరిమితులనూ తన కథల్లో చిత్రించారు. స్త్రీవాదం అనే పదం సాహిత్యంలో వినపడకముందే స్త్రీల పరాధీనత గురించే ఎక్కువ వ్రాశారు. రొమాంటిక్ నవల విజృంభణ కాలంలో కూడా నవల వైపు చాపల్యం చూపక తను గమనించిన విషయాలను, వాటిపట్ల తన అవగాహననూ తనదైన తాత్విక దృక్పథంతో కథలుగా వ్రాసి కథారచయిత్రిగా వుండిపోయారు. తాను మానవతావాదిగా కన్న స్త్రీవాదినని చెప్పుకోడానికే ఇష్టపడతానన్న ఛాయాదేవి కథలన్నీ దాదాపు స్త్రీల జీవితాలను తడిమినవే. ఆమె చెప్పినట్లు అవి ”తీవ్రంగానో, నిష్ఠూరపూర్వకంగానో కాక, ఆర్ద్రత కలిగించేటట్లూ హాస్యస్ఫోరకంగానూ వ్యంగ్యపూర్వకంగానూ” వుంటాయి. అనేక కట్టడుల మధ్య పెరిగిన ఆడపిల్ల, భర్త కనుసన్నలలో నడవవలసిన భార్య, భర్తే కాక పిల్లల అధీనతలో కూడా వుండవలసిన తల్లి వరకూ వివిధ దశలలో స్త్రీల జీవితాలను గురించి వ్రాసారు.
ఛాయాదేవి కథారచన ప్రారంభం నాటికి, లేదా ఆమె చదువుకుంటున్న కాలంనాటికి, ఆడపిల్లల్లో చదువుపట్ల, వైవాహిక జీవితం పట్ల, జీవన సహచరుని ఎంపిక పట్ల కొన్ని స్వతంత్రమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. తమ తల్లుల అధీనత, అస్వతంత్రత, ఇంట్లో అన్నిటికీ తండ్రుల పెత్తనం, తల్లులకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం గమనిస్తూ పెరిగిన ఆనాటి అమ్మాయిలు, ఇందుకు భిన్నంగా జీవించాలని ఆశపడడం సహజం. అయితే అప్పటి సంప్రదాయ కుటుంబాలలో ఆ ఆశల సాకారానికి అవకాశాలు తక్కువ కనుక, వాళ్ళు పెద్దలు కుదిర్చిన వివాహాలకే తలవంచి, అందులోనే రాజీపడి బ్రతకవలసి వచ్చేది. ఇలాంటి అమ్మాయిలకథే ”విమర్శకులు”. ఆడపిల్లలను కుండీల్లో మర్రిచెట్టుల వలె మరుగుజ్జుచేసి పెంచడాన్ని ప్రతీకాత్మకంగా చెప్పిన ”బోన్సాయి బ్రతుకు” అనే కథ 74లో వ్రాశారు. స్వేచ్ఛగా పెరిగిన పెద్ద చెట్టు జడివానలోనూ, పెనుగాలిలోనూ పదిమందికి నీడనిస్తుంది. అదే కుండీలో కుదించి పెంచిన మొక్కని జడివాననుంచీ మనమే కాపాడి లోపల పెట్టాలి. ఈ కథ అనేక భాషాసంకలనాలలో చోటుచేసుకుంది. తండ్రులంటే విపరీతమైన భయంతో పెరిగిన ఆడపిల్లలు ఆ తండ్రి స్పర్శ ఎరుగరు. పొరపాటున ముట్టుకోవలసివచ్చినా జంకుతారు. తండ్రికి వృద్ధాప్యం వచ్చినప్పుడు మాత్రమే ఆ స్పర్శను అనుభవించగలగడాన్నీ, ఆ స్పర్శకోసం తపించడాన్నీ హృద్యంగా చెప్పిన కథ ”స్పర్శ”. పిల్లలకి శారీరక స్పర్శే కాదు ఆత్మిక స్పర్శ కూడా ఎంతో అవసరం. తండ్రీకూతుళ్ళ మధ్య ఈ ఆత్మిక స్పర్శని తాత్వికత రంగరించి, అంతే హృద్యంగా చెప్పిన పెద్ద కథ (నవలా?) ”మృత్యుంజయ”. ఛాయాదేవికీ, ఆమె తండ్రికీ మధ్య నడిచిన ఉత్తరాలకు కథారూపం. ఈ పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రి పురస్కారం లభించింది.
జీవనసహచరుని ఎన్నిక గురించి హాస్యప్రధానంగా వ్రాసిన కథ ”ఎవర్ని చేసుకోను” ”నిర్ణయం” ”స్థానమహిమ” అనే కథల్లోకూడా ఈ విషయాన్నే ప్రస్తావించారు. సహచరుణ్ణి ఎంచుకోడం అనే విషయంలో కొంత ప్రాక్టికల్‌గానూ, కొంత సాహసంతోనూ, కొంత భావసారూప్యతతోనూ వుండాలి. అయినప్పటికీ ఎంత జాగ్రత్తగా ఎంచుకున్నా ”ఎవర్ని చేసుకున్నా భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల మనస్థైర్యాన్ని అలవర్చుకోవాలి. అంతేగాని మన ఊహల ప్రకారమే జీవితం సాగాలంటే ఎల్లప్పుడూ సాగదు. దేనికైనా సిద్ధపడి వుండాలి మానసికంగా” అంటారు. ఛాయాదేవి ”స్థానమహిమ” కథలో మాధవి ప్యారిస్‌లో వున్నన్నాళ్ళూ మురళితో సన్నిహితంగా మెసిలి, ఇండియా రాగానే అతన్ని పెళ్ళి చేసుకోడానికి తిరస్కరిస్తుంది. దానికి కారణం అతని కుటుంబసభ్యుల అలవాట్లూ, అతని కుటుంబమూ తనకి నచ్చలేదంటుంది. తన రిసెర్చి చేసుకోవాలంటుంది. ఆమె తీసుకున్న ప్రాక్టికల్ నిర్ణయాన్ని రచయిత్రి సమర్థిస్తుంది. ఈనాటి చదువుకున్న స్త్రీల ఆలోచనలకి ప్రాజ్ఞతకూ మాధవి ఒక ఉదాహరణ. ప్రేమ అనేది సాహచర్యంలోనూ సహజీవనంలోనూ వికసించి పెంపొందాలంటారు ఛాయాదేవి.
ఎంత చదువుకున్నా, ఎన్ని అభిరుచులున్నా, కోరికలున్నా అవి భర్త అభిరుచులతోనూ, ఆయన కోరికలతోనూ కలిసినప్పుడే నెరవేరతాయి. లేకపోతే ఆమె జీవితం అతని చుట్టూ తిరిగే ఉపగ్రహం లాంటిదేనని చెప్పే కథ ”ఉపగ్రహం”.
ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల పైన కూడా ”సటిల్ డిక్టేటర్‌షిప్” వుంటుందని దాన్ని సమ్మతించకపోయినా సర్దుకుపోవడం తప్పదనీ అర్థం చేయిస్తుంది ”శ్రీమతి ఉద్యోగిని” అనే కథ. తను చేసే ఉద్యోగానికి తనెంత అంకితభావంతో పనిచెయ్యాలన్నా పురుషుల వలె స్త్రీలు అదనపు సమయాన్నీ ఆఫీసుల్లో గడపలేరు. ఆఫీస్ పని ఇంటికి తెచ్చుకుని చేసుకోలేరు. అలాగే బంధుమిత్రుల రాకపోకలు, మర్యాదలు కూడా వాళ్ళ ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తాయి. ప్రశ్నోత్తరాల రూపంలో నడిచిన ఈ కథలో హాస్యస్ఫూర్తి వున్నా అంతర్లీనంగా ఈ విషయాలన్నీ స్పృశించారు ఛాయాదేవి. ఉద్యోగినులైన శ్రీమతుల గురించి పరిశోధనకు వచ్చిన అమ్మాయి వేసిన ప్రశ్నలకు ఇంట్లో తన భర్త పెత్తనాన్నీ, ప్రాబల్యాన్నీ కొంత హాస్యమూ, కొంత లౌక్యమూ కలబోసి సమాధానాలిస్తుంది. ”వచ్చే జన్మలో కూడా ఈయననే మీ భర్తగా ఎంచుకుంటారా?” అనే ప్రశ్నకు అవునంటూ లైక్యంగా చెప్పినా, తనలోపల ”అట్లా అనడం భారతనారీధర్మం కదా” అనుకుంటుంది ఆ శ్రీమతి ఉద్యోగిని.
భార్యాభర్తలిద్దరూ సమానమైన మేథోవంతులైనా ఒక్కొక్కసారి భార్య అతని నీడనే అనామకంగా వుండిపోతుంది. ఆమె అతనికిచ్చిన ప్రోత్సాహమూ, సహకారమూ కూడా గుర్తింపులేకుండా పోతాయనేదానికి ఉదాహరణ ”సతి” ”ఆయన కీర్తి వెనక” కథలు. సాహితీ సతి అయిపోయిన ఒక రచయిత్రి కథ. భర్తతో పాటు తనూ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొనక సంసారాన్నీ పిల్లలన్నీ చూసుకుంటూ అతని కీర్తికి పరోక్షంగా కొంగుపట్టిన ఆమె కనీసం అతనితో పాటు ఫోటో దిగడానికి కూడా పనికిరాకుండా పోయింది. తనూ ఉద్యమంలో పాల్గొని వుంటే ఎలా వుండేది అనుకుంటుంది. ”మొగ్గు” కథలో ”నేను” భర్తకీ కొడుక్కీ మధ్య నలిగిపోతూ ఆమె మనసు కొడుకు పక్షమే వున్నా ”వాడో నేనో తేల్చుకో” అని భర్త మూర్ఖంగా అన్నప్పుడు ఆమె ఒక్క క్షణం ఆలోచించింది. భర్తయినా కొడుకైనా ఇద్దరూ పురుషులే. ఏ ఒకరి దగ్గరున్నా తనకి అధీనతే. తనూ ఉద్యోగస్తురాలే. ఎవరిదగ్గరా ఉండక్కర్లేదు. కొడుక్కి తన అవసరం లేదు చూసుకోడానికి అతనెంచుకున్న సహచరి వస్తోంది. ఇక తను లేకుండా గడవనిది భర్తకే. అని అతనిమీద సానుభూతితో ”పోరా పిచ్చి వెధవా!” అని కొడుకుని ముద్దుగా విసుక్కున్నట్టే ఒక తల్లిలా అతని వైపే మొగ్గింది. వయసులో భార్యలమీద పెత్తనం చేసిన భర్తలకి ముదిమలో భార్యలనే చేతికర్రలు చాలా అవసరం. అయినా బింకం.
పని ప్రదేశాలలో స్త్రీలపై చాపకింద నీరులా ప్రదర్శించే లైంగిక హింస, వివక్షా, అణచివేతలను ”కర్త కర్మ క్రియ” కథలోనూ పై అధికారుల మనస్తత్వాన్ని ”మార్పు” కథలోనూ సున్నితంగా చెప్పారు.
ఛాయాదేవి ప్రసిద్ధ కథ ”ప్రయాణం”లో రమ యూనివర్శిటీ విద్యార్థిని. అక్కడ లెక్చరర్‌గా వున్న మూర్తిని ప్రేమించింది. కానీ సంప్రదాయాలకు విలువఇచ్చే ఆమె కుటుంబం అతనితో కులాంతరానికి సమ్మతించిందని ఆమెకు తెలుసు. ఈలోగా ఆమెకు తల్లితండ్రులొక సంబంధం కుదిర్చారు. అతను అన్నివిధాలా అర్హుడని తేల్చారు. కానీ రమ తన అసమ్మతి తెలిపి హైదరాబాద్‌నించీ విశాఖపట్నంలో తనింకా చదువుకుంటున్న యూనివర్శిటీకి బయలుదేరింది. తన జీవితానికి సంబంధించిన ముఖ్యాంశం పట్ల రాజీపడే ప్రసక్తి లేదనీ తనని తను గౌరవించుకోవడం అంటే పెద్దల్ని ధిక్కరించినట్లు కాదనీ నమ్మిన వ్యక్తి ఆమె. హైదరాబాద్ నించీ విశాఖపట్నం దారిలో అనుకోకుండా రాజమండ్రిలో కలిసిన ఆమె స్నేహితురాలు సుధ ఆమెను తనతో ఒకరోజు ఉండిపొమ్మని బలవంతపెడితే అక్కడ దిగిపోయింది. కానీ అదేరోజు రాత్రి సుధ భర్త కక్కుర్తికి బలైంది. అతనలాటివాడని తెలిసీ సుధ ఆమెను కాపాడలేకపోవడానికి కారణం. తన ప్రియ స్నేహితురాలిమీద అటువంటి అఘాయిత్యం చేయబోడనే వెర్రి నమ్మకం. అప్పుడు కూడా తన భర్తకి ఇటువంటి దురలవాట్లు వున్నప్పటికీ తనంటే ప్రేమ అని చెబుతుంది సుధ. ఇటువంటి చాలా కథల్లోకిమల్లే జరిగిన విషయానికి రోతపడుతూ కూర్చుని ఏడ్చి మొత్తుకుని స్నేహితురాలిని నిందించి ఆత్మహత్యాప్రయత్నం చేసి తనను తాను కించపరుచుకోదు రమ. ఆ రోతనంతా తన మనసులోనే భరిస్తూ విశాఖపట్నం వచ్చింది. అయితే జరిగినదాంట్లో తన తప్పులేదని తెలిసినా తను అపరిశుద్ధం అయిపోయానని భావిస్తుంది. కనుక ఈ విషయం దాచి మూర్తిని పెళ్ళి చేసుకోలేనని నిజాయితీగా అతనికి ఈ విషయం చెప్పేసింది. అది విన్న అతను ”నీళ్ల కుండీలో పడ్డ ఎలుకపిల్ల గట్టు మీదకు రాలేక లోపల నీళ్లలోకి పోలేక గిలగిల్లాడినట్లు బాధపడ్డాడు. అతని మానసిక బలహీనత చూశాక ఆమెకి మరింత విరక్తి కలిగి సన్యాసం పుచ్చుకుని కలకత్తాలో రామకృష్ణ మిషన్లో చేరిపోవాలనుకున్నప్పుడు, ఆమెకు సంభవించినది కేవలమొక ప్రమాదం మాత్రమేననీ దానికీ పరిశుద్ధతకీ సంబంధమే లేదనీ, దాన్ని అక్కడికి మర్చిపోయి తన విలువైన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ తనకి సహచరిగా వుండమనీ, తనెవర్నైతే తిరస్కరించి వచ్చిందో ఆ శేఖరమే అర్థం చేయిస్తాడు. కొన్ని శతాబ్దాలుగా మనసులో ఇంకిపోయిన పరిశుద్ధత, కన్యాత్వం వంటి భావజాలం నించీ బయటపడలేని ఒక యువకుడు. వీటికి అతీతంగా ఆలోచించగలిగిన మరొక యువకుడినీ, అతనిలో తనను గౌరవించగల సహచరుణ్ణి గుర్తించిన రమనూ రాబోయే కాలానికి కావలిసిన వ్యక్తులుగా పాఠకులు గుర్తించారు. అందుకే ఈ కథకు మంచి పాఠకాదరణ లభించింది.
ఛాయాదేవి మరొక ప్రసిద్ధ కథ ”సుఖాంతం”. పిల్లలకు చదువులూ, పరీక్షలూ కంటినిండా నిద్ర పోనివ్వవు. పెరిగి పెద్దైనాక స్త్రీలకు సంసారమూ పిల్లల పెంపకం వాళ్ల చదువులూ వగైరాలతో నిద్ర వుండదు. పోనీ అన్నీ బాధ్యతలూ నెరవేరాకైనా అనుకున్నపుడు నిద్రపోడానికుంటుందా? ఎన్నో సమస్యలు – ఇంటివి, దేశానివి. పైగా పోస్ట్‌మ్యాన్‌కీ, ప్రతి పిలిచే గంటకీ టెలిఫోన్‌కీ వచ్చే పోయే వారికీ సమాధానాలు చెప్పాలి. ఒక వయస్సొచ్చేసరికి నిద్ర అసలు రాదు మాత్రలకి తప్ప. అప్పుడవి ఒకటీ రెండూ చాలవు. మంచి నిద్రకావాలంటే గుప్పెడే సరి అనుకుందావిడ. ఎందుకైనా మంచిదని ఒక చీటీ కూడా వ్రాసి పెట్టింది. ఇది ఆత్మహత్యాప్రయత్నం కాదు. కేవలం నిద్రకోసమే అని. ఈ కథ చదివి ”ఆమె ఎవరైతేనేం కాసేపు సుఖంగా నిద్ర పోనివ్వండి. కదిలించకండి” అనలేకపోతే మనం గుండెలేని మనుషులం అన్నమాట. కేవలం నిద్రేకాదు స్త్రీలకు దేనికీ వారి స్వంత సమయం అంటూ వుండదు.
ఇటీవలికాలంలో ఆమె వ్రాసిన ”ఆఖరికి అయిదు నక్షత్రాలు” కార్పొరేట్ వైద్యవ్యాపారాన్ని కళ్ళారా చూసి ఆవేదనతో ఆర్తితో వ్రాసిన కథ. ఇందులో ఆమె వాడిన మాటలు, షేర్‌హోల్డర్స్, రక్తసంబంధం (తడవకీ రక్తం తెమ్మనడం) బిల్లు సంబంధం! (ఎప్పటికప్పుడు వేలకొద్దీ బిల్లులు కట్టమనడం) చివరికి ఆమె చేసిన వ్యాఖ్య ”మరణాన్ని కొనుక్కోడానికి అంత దూరం అంత ప్రయాసపడి ఎవరూ వెళ్లక్కర్లేదు మనం పిలిచినా పిలవకపోయినా రావలసిన సమయంలో అదే వస్తుందని అర్థమైంది.” అన్ని సదుపాయాలూ వున్న అయిదు నక్షత్రాల హాస్పిటల్లో కనీసం శవాన్ని పెట్టడానికి కూడా సరైన సదుపాయం లేక ఐస్‌గడ్డ చుట్టూ ఉప్పు చల్లి ఆ శరీరాన్ని అప్పగించడానికి బిల్లు అడిగిన తెంపరితనం – ”ఏమీలేదు యాంజియోగ్రాఫే” అని నవ్వుకుంటూ వెళ్ళిన వ్యక్తి మరణించాడన్న వార్త చెప్పడానిక్కూడా ఆలస్యం చేసిన విష వ్యాపార సంస్కృతి ఇప్పుడు పాకుతోంది దేశమంతా. ప్రయివెటైజేషన్ విషసంస్కృతికి పుట్టిన వికృత శిశువుల్లా తయారయ్యాయి కొన్ని వైద్య వ్యాపార కేంద్రాలు.
వృద్ధాప్యంలో స్త్రీలను గురించి వ్రాసిన కథలు ”ఉడ్ రోజ్” ”తన మార్గం” ”పరిధి దాటిన వేళ” ”బోన్సాయి బ్రతుకు” వలె ”ఉడ్ రోజ్” కూడా ప్రతీకాత్మకమైన కథ. ఇకబెనా పుష్పాలంకరణలో ఉడ్ రోజ్‌ను వృద్ధాప్యానికి చిహ్నంగా ఉపయోగిస్తారట. తన ఇంట్లో గుబురుగా అల్లుకుపోయి పచ్చని పువ్వులతో నిండుగా వుండి, వాటిలోనించీ ఉడ్ రోజ్‌లు రాబోయే కాలానికి, తీగెని మొదలంటా పీకి పెడతాడు ఆమె కొడుకు. ఇంట్లో వెలుగుకు అవరోధంగా వుందని. వృద్ధాప్యంలో విశ్రాంతితో విసిగిపోయిన తల్లి ”మనిషికీ మనిషికి మధ్య మమత ఆ తీగంత దట్టంగా పెరగకూడదేమో! అలా పెరిగితే పిల్లలైతే పీకి పారెయ్యగలరు. తల్లికి అల్లుకుపోవడమే తెలుసు” అనుకుంటుంది కొంత తాత్వికంగా. అయితే ”తనమార్గం” కథలో వర్ధనమ్మ వృద్ధాప్యంలో ఎవరి పంచనా ఉండకుండా తన జీవనమార్గాన్ని తానే ఎంచుకుని ధైర్యంగా నిలబడింది. అలా నిలబడే అవకాశం ఆమెకు భర్త వ్రాసి యిచ్చిన ఇల్లు అనే ఆర్థికవనరు వల్ల సాధ్యమైంది. కొడుకుల విమర్శలకు తట్టుకుని నిలబడగలిగింది. ”పరిధి దాటిన వేళ” కథలో కథకురాలు ఎన్నడూ లేనిది స్వయంగా మందులు కొనుక్కోడానికి బజారుకు వెళ్ళి దారి తప్పిపోయింది. చివరికెలాగో చాలాసేపటికి ఇల్లు చేరింది. ఈలోగా ఇంట్లోవాళ్ల కంగారు, నిష్ఠూరాలు, ఎందుకెళ్ళావని గుచ్చిగుచ్చి అడగడాలు, కూతురూ కొడుకూ కోడలు ఎవరికి తోచింది వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. ”ఇంట్లో అలా ఒక్కణ్ణీ నన్నొదిలేసి అలా వెళ్ళిపోయావేమిటీ?” అంటాడు భర్త.
”ఒంటరితనం అంటే తనకున్న భయాన్నీ, ఇంట్లో పనులన్నింటికీ నామీద ఆధారపడుతున్నారన్న నిజాన్నీ తన ”అధికారం” ముసుగు కింద దాచి ”ఇంకెప్పుడూ అలాంటి పిచ్చి పనులు చెయ్యకు” అంటూ నిశ్చింతగా పడుకున్నాడాయన. అనుకోకుండా వీళ్లందరినీ కాసేపు ఓ ఆట ఆడించగలిగానని చాలాసేపు నిద్రపట్టలేదు నాకు” అని కథకు ఓ చక్కని మెరుపు ముగింపిచ్చారు.
”మూడునాళ్ల ముచ్చట”, ”ఎవరి ఏడుపు వాళ్లది”, ”నలుగురికోసం”, ”బ్రహ్మాస్త్రం” అనే కథల్లో ఛాయాదేవి నిశిత పరిశీలన వాస్తవికతా దృష్టి హాస్యమూ కలగలిసి వుంటాయి.
ఛాయాదేవి జీవన తాత్వికత జిడ్డుకృష్ణమూర్తిగారి తాత్వికతే.
అబ్బూరి ఛాయాదేవి కథలు, తన మార్గం అనే కథాసంపుటాలే కాక, ఆమె ”చైనాలో ఛాయాచిత్రాలు” అనే యాత్రాకథనం, అపరిచిత లేఖ, ఇతర కథలు, మృత్యుంజయ (ఒక తండ్రి కథ), వరదస్మృతి (సంకలనం), వ్యాసచిత్రాలు బొమ్మలు చెయ్యడం, ”స్త్రీల జీవితాలు, జిడ్డుకృష్ణమూర్తి”, మన సమస్యలు కృష్ణాజీ సమాధానాలు, మన జీవితాలు – జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు, మొదలైన పుస్తకాలు ప్రచురించారు. 1954లోనే ”కవిత” పత్రికకు సంపాదకత్వం వహించారు. తరువాత ఆంధ్ర యువతీమండలికి, ”వనిత” అనే పత్రికకు సంపాదకురాలిగా వున్నారు. 1989-90లలో ఉదయం పత్రికలో మహిళా శీర్షిక నిర్వహించారు. ఇటీవలి వరకూ స్త్రీవాద పత్రిక భూమికలో ‘ఆలోకనం’ పేరుతో కాలమ్ వ్రాశారు. ఇటీవలనే ఆమె జీవన సహచరుడు వరదరాజేశ్వరరావుగారి హాస్యోక్తులను ”వరదోక్తులు” పేరున కార్టూన్లతో సహసంకలనం చేసి ప్రచురించారు. ప్రస్తుతం తన జీవిత, సాహితీ ఛాయాచిత్రమాలిక రూపొందిస్తున్నారు. ఆమె కథల ఇంగ్లీష్ అనువాదాల సంకలనం కూడా రాబోతున్నది.
పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన ఛాయాదేవి 1953లో రచయిత, కవి అబ్బూరి వరద రాజేశ్వరరావు గారిని వివాహం చేసుకున్నారు. తరువాత లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. న్యూఢిల్లీలో కొంతకాలం (59-61) యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లైబ్రేరియన్‌గానూ, తరువాత జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్‌నేషనల్ స్టడీస్‌లో డిప్యూటీ లైబ్రేరియన్‌గా (72-82) పనిచేసారు. అప్పుడే ఉద్యోగరీత్యా డాక్యుమెంటేషన్ కోసం ఒక సంవత్సరంపాటు ఫ్రాన్స్‌లో (1976-77) వున్నారు. తరువాత స్వచ్ఛంద పదవీవిరమణ చేసి (1982) హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమే కాక సుశీలా నారాయణ రెడ్డి అవార్డు, కళాసాగర్ సాహితీ పురస్కారం, రంగవల్లి పురస్కారం, తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రి పురస్కారం, కలైంజర్ ఎమ్ కరుణానిధి పోర్కళి పురస్కారంతోపాటు ఇటీవలే అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags