పింగళి బాలాదేవి
”పొద్దుట ఏడుగంటలదాకా అక్కడే ఉంటాను నేను. ఈ లోగా నీ మనసుగానీ మారిందంటే – మార్తుందనే అనుకుంటున్నాను. అక్కడికిరా. రాజీ పడదాం. రాకపోతే మటుకు నిన్నే దేవుడూ రక్షించలేడు.”
పశువు, పశువు….. శార దీమాటే పదే పదే అనుకుంది, మనసులో తన గదిలో వెనుకకూ, ముందుకూ పచార్లు చేస్తూ ఆమె కళ్లల్లోని తెలుపు అక్కడ గూడ కట్టుకుంటున్న క్రోధపు జీరల ఎరుపు దనాన్ని అణగద్రొక్క లేకపోతున్నది. అతనన్న మాటలు ఆమె చెవుల్లో గింగురుమని మాటిమాటికీ మ్రోగు తున్నాయి. తలుపు మీద చెయ్యివేసి, వెనక్కు తిరిగి ఆ మాటలంటున్న భార్గవ రూపం ఆమె కళ్లముందు ప్రత్యక్ష మయింది. ఏ రూపమయితే తనని ఈ స్థితికి తెచ్చిందో, ఆ అందమయిన రూపం…. అందమయిన రూపం…. అందం…. అందం…. వయసులో ఉండే ఒకే ఒక ఆకర్షణ….. ఆ స్పర్శ…. మనిషికి ఆ వయసులో అందంతో పాటు స్పర్శ కూడా!…. అనే ఆకర్షణలు…. జీవితంలో ఎన్నో ఏమీ కనిపించవప్పుడు!
”నన్నూ నా చెల్లినీ నడివీధిలో పెట్టేస్తావా? అదేనా నీ మగతనం? ఇంత నీచుడివా నువ్వు? నీకు మనస్సు లేదు. కానీ…. నడివీధిలో పెట్టు! ఛండాలుడా! ఎందుకలా చూస్తూ నిలబడతావు? కానీ… కానీ….” ఏం చేస్తావో చెయ్యి తను మాట్లాడుతున్నది ఎదురుగా ఉన్న తన ప్రతిబింబంతోనే కాని భార్గవతో కాదని స్ఫురణకు వచ్చిందామెకు. హఠాత్తుగా అటూ ఇటూ గదంతా కలయ చూసిందామె. ఎదురుగా అద్దం ముందు నిల్చుంది తను – ఇంకాసేపట్లో తయారయి, హాస్పటలుకు నైట్ డ్యూటీకి వెళ్లాలి. చెయ్యవలసిన పన్లు మరిచిపోయి అద్దం ముందు ఆలోచనల్లో పడిపోయిందామె. ఆమె కళ్లు బెదిరిపోయిన అడవి లేడి కళ్లను గుర్తుకుతెస్తున్నాయి. ఆ అందమైన కాటుక కళ్లు… ఇప్పటికీ ఈ వయస్సులోనూ ఎందరినో ఆకర్షిస్తూనే ఉన్నాయి. తన కళ్ల క్రింద నేల ఎక్కడికో అగాధాల్లోకి జారిపోతున్నట్లుగా అనిపిస్తోంది. మరి నిలబడేశక్తి లేక కూలబడి పోయిందామె, అద్దం దగ్గరున్న కుర్చీలో.
భార్గవ – భార్గవ! పదేళ్ల క్రిందట ఎవరయినా అతన్ని పశువంటే తాను నమ్మలేకపోయి ఉండేది! కాని, ఈ రోజు మటుకు ఏ మాత్రం సందేహమూ లేదు – అతడు పశువే అనేందుకు! పదేళ్ల క్రిందట తన మీద ఉన్న ప్రేమను వెల్లడించినప్పుడున్న జంకు, బిడియం, ఏమైపోయిందో ఈరోజు! కాని, అదే ప్రేమ కాదు, అతన్ని కదిలించిన ప్రేమ కాదది అని తనకప్పుడు తెలియదు. తెలియదు కాదు, తెలిసింది కాదు ఆ వయసు వేడిలో, అది ప్రేమ కాదు, అతన్ని కదిలించింది కామం మాత్రమే. అప్పుడూ ఇప్పుడూ కూడా అదే – కామం!…. తనకా సంగతి అర్థం కాలేదు ఆరోజుల్లో.
”నువ్వు కావాలి నాకు శారదా – నిన్నొదిలి ఉండలేను. ఇన్నేళ్లూ నీకు దూరంగా ఉన్నానంటే నువ్వక్కర్లేదని కాదు. కాని…. చూడు…. నీకు తెలుసు, డబ్బు లేని మనిషి ఎందుకూ కొరగాడని, చిల్లిగవ్వ పాటి చేయడని! నాన్నగారు బ్రతికున్నంత కాలం ఆయన్ని కాదనలేకపోయాను. మన పెళ్లి అవడానికి వీలు కాదన్నారాయన. కారణం లేకుండా అనలేదని నీకూ తెలుసు. ఆయనకు మీ అమ్మ సంగతి పూర్తిగా తెలుసు. ఆయనలా అన్నాక, నేనా పని చేసి ఉండకూడదు. కాని….” అతని పెదవులమీద కాస్త కపటం నిండిన చిరునవ్వు కదలాడిందీ రోజు, ఆ మాటల్లో. ”ఆరోజు నిన్ను చూస్తూంటే నాన్న గారన్న మాటలు నీతో అనడానికి బుద్ధి పుట్టింది కాదు. ఆ రోజు…. జ్ఞాపకం ఉంది కదూ…. గోదావరి లంకలో ఇసుక వెన్నెల మీద…. నీతో అబద్ధం చెప్పాను. అది తప్పు కాదు, నీ తప్పే…. అంత అందంగా ఉన్నందుకు….” కొన్ని క్షణాలాగి మొదలుపెట్టాడతడు ఇప్పటికే మారని ఆమె శరీరపు నిమ్మోన్నతాలను మెరిసే కళ్లతో, ఆబగా, పరీక్షగా చూస్తూ” ఈరోజూ అంత అందంగానే కనిపిస్తున్నావు శారదా నీ అతిలోకసౌందర్యపు అంచుల్ని కూడా తాకలేక, స్తంభించి పోయినట్లున్నాయి ఈ గడిచిన పదేళ్లూ – ఆ రోజులాగే ఈరోజూ నా కళ్లను కట్టి పడేస్తోంది నీ అందమైన రూపం” ఉత్తవంచన…. మోసం….. పచ్చిమోసం!
అందం…. అందం….. అందంగా ఉన్నందుకు, ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తమే పొందింది తాను. అతనిలో చిన్న సంచనలం కలిగించినందుకు ప్రతిఫలంగా ఎన్నో ప్రళయ సంచలనాలు రేగాయి తన జీవితంలో. ఎంతో బ్రహ్మప్రయత్నంతో ఆ ప్రళయాన్నెదుర్కుని, దాన్నొక మూల బందీ చేసింది. అమ్మని…. ఎంతో కష్టపడి, ఒంటరిగా, సంఘాన్నెదిరించి, తననీ, చెల్లెలినీ పెంచి పెద్ద చేసిన అమ్మని…. ఎంత బాధపెట్టింది తను! గతమంతా మరిచి, ఎలాగో ఒక లాగ ఉద్యోగం సంపాదించుకుని, కష్టపడి, ఏదో ఒకలా హాయిగా, చల్లగా నడుస్తున్నదనుకున్న ఇప్పుడు…. చెల్లెల్ని కష్టపడి మనిషిని చేస్తున్నాననుకుంటున్న సమయంలో… మళ్లీ తన జీవితంలో అడుగుపెట్టాడు…. రాక్షసుడు….. త్రాష్టుడు…. దుష్టుడు… తన బ్రతుకుని పైకెత్తి తిన్నగా నరకంలో కుదెయ్యడానికి! ”ఎలా తప్పుకోవడం?” బాధతో గట్టిగా అరిచిందామె, అనుకోకుండానే.
పేకముక్కలతో మేడేకట్టుకుంది తను. ఈ పదేళ్లుగా అందులోనే ఉంటున్నది తను, అదే సిమెంటూ, ఇసుక, ఇటుకల్తో కట్టిన భావనమని నమ్మి! ఎక్కడికి పోయింది తన తెలివంతా? ఆ ఇంట్లో శాశ్వతంగా ఉండడం సాధ్యం కాదని తను గ్రహించి ఉండవలసింది. పడిపోయి, చెల్లాచెదరైన పేకముక్కల మధ్య తాను ఒంటిగా ఇలా కూర్చోవలసిన రోజు వస్తుందని తెలుసుకుని ఉండవలసింది. పశ్చాత్తాపం ఆమెని దహించుతోంది.
హఠాత్తుగా ”ఉండలేను, నేనుండలేను” వెర్రికేక పెట్టి, లేచి, నిలబడిందామె. తన చెల్లెలి ప్రాణం లేని దేహం, చుట్టూ చిందరవందరగా పడున్న పేక ముక్కల నడుమ పడుక్కోపెట్టినట్లయింది, ఊహా పథంలో, తన చెల్లెలు ఆశలతో, యౌవనంలో పొంగులుదేరి, ఉరకవేసే తన ప్రాణ ప్రదమైన అనూ ప్రాణం లేక, ఆశలు జారి, నిశ్చలంగా, చెల్లాచెదరైన పేకముక్కల మధ్య, తను కోరుకున్నవాడికి దూరమై, గౌరవంగా బ్రతికే యోగ్యతకు దూరమై శాశ్వతమైన సంరక్షిత జీవితానికి కరువై! ”ప్రేమ” అనుకుని వయస్సులో ఆకర్షణకు లొంగి పోయిన తనలాంటి బ్రతుకు దానికి రాకూడదని తను ఎంతో అపురూపంగా పెంచుకున్న చెల్లెలు అది!
తాను, ఆమె ఎంచుకున్న గిరిని నిందించి లాభం లేదు. అతడూ మగవాడే. తన గత చరిత్ర, భార్గవ చెప్పింది గాని విని, అతనూ అనూరాధను వదిలేస్తే? అది అనూరాధ గతచరిత్రకాదు, నిజానికి, సరిగ్గా తమ తల్లిదీ తనదీ మాత్రమే. అయినా కూడా….. ”ఆ రహస్యం దాచడానికి…. ఈ పశువు…. భార్గవ అడిగిన ప్రతిఫలం నేనివ్వగలనా? మళ్లీ అతనికి ఆహూతి చెయ్యగలనా నా ఈ శరీరాన్ని అంత ఖరీదు నేనివ్వలేను. ఇవ్వలేను” ఈ మాటలు పైకి రాలేదుగాని, తన మనసులో, తన శరీరంలో అణువణువునా మారుమ్రోగుతున్నాయి.
ఆ పేకముక్కలని సిమెంటు దిక్కులుగా కూర్చడానికి ఎంత ప్రతిఫలం కోరుతున్నాడు భార్గవ! ఎంత నీచుడు…. ఒక వేళ తానందుకు ఒప్పుకున్నా తన మనసులో ఇంకెంత ద్వేషం నిండుకుంటుందో ఆ పశువుకి తెలిసినా కూడా తనని అందుకుని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడా రాక్షసుడు. ఇదివరలో అతనిలో ఏవో కోమల భావాలూ, సున్నితమైన మనసూ ఉన్నాయని తను అనుకోవడం తన తప్పే. అతనికేమీ తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ మోసగాడే. ఏ మానవతా లక్షణాలు లేని రాక్షసుడు వాడు. అతనిలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా ఆ రోజలా తనని వదిలేసి వెళ్లి ఉండే వాడు కాదు, అతడు నాటిన బీజం ప్రాణంతో కదలాడ్తూ, మొలక రూపంగా వెలుగు చూడడానికి ఉరుకు లాడేదప్పుడు : ఆ మొలకకూడా ఎంత పాపం చేసుకుందో, లేక పాపం అర్థం చేసుకుందో మరి – కొద్దిరోజులు కూడా ఉండలేదు, ఆ వెలుగు లోనికి రావడానికి తన గర్భం నించి! అదీ మంచిదే అయిందందరికీ అదే ఇప్పుడు పెద్ద మొక్కై, తన ఎదురుగా నిలబడి ఉంటే తను సహించగలదా దాన్ని ద్వేషించకుండా?
టేబుల్ మీది అలారం గణగణమని మ్రోగడంతో, త్రుళ్లిపడిన శారద చూపులు ఆ గడియారం మీదకి వ్రాలాయి. రాత్రి ఎనిమిది గంటలైందప్పుడు, తను బట్టలు కూర్చుకుని డ్యూటీకి వెళ్లే టైమయిందని తెలియచేస్తూ, యంత్రంలా లేచి బట్టల అల్మయిరావైపు ఒకడుగు వేసింది. మళ్లీ ఆగిపోయింది. ఎనిమిది! మరి తనకు నరకానికీ నడుమ ఉన్నవి మరొక్క పన్నెండు గంటలు!
”పొద్దున్న ఏడుగంటల దాకా అక్కడే ఉంటాను నేను…..” భార్గవమాటలు ఆమె చెవుల్లో మళ్ళీ హోరు మొదలుపెట్టాయి.
ఇప్పుడెనిమిదైంది. తెల్లవారి, ఏడుగంటల్లో తానేదో ఒక నిశ్చయానికి రావాలి. ఎటైనా తను నరకంలో దిగడానికి దారి మాత్రమే మిగిలింది. ఆ దారిలో వెళ్తేనే తను తన చెల్లెల్ని రక్షించుకోగలదు. ఇంకొక్కదారి ఉంది. కాని అది తన శక్తికి మించిన పని. తాను ఆ దారి తొక్కలేదు.
”పనికిరాదు” ఆమె మనస్సు ఘోషించింది. ఇంకా నిశ్చయానికి రాలేక పోతున్నది తను. చెల్లెల్ని రక్షించడానికి తాను ఇవ్వవలసిన మూల్యం చాలా ఎక్కువే, కాని… చెల్లిస్తే చెల్లించేస్తుంది. చెల్లిస్తే ఏమిటి…. చెల్లించి తీరాలి.
”శక్తి లేదు”
శక్తి లేదూ చెల్లెల్ని కాపాడుకోవడానికి? తనకి శక్తి లేదూ? నరక కూపంలో చెల్లెలు పడిపోకుండా ఆపడానికి తను ఆమాత్రం అడ్డుపడలేదూ? తానింకా పవిత్రమైనదేనా? తాను చెయ్యగలిగినంతా చేసేశాడు- ఎన్నేళ్ల కిందటో! అప్పుడు హృదయ పూర్వకంగా ఒప్పుకుందామె- అతనన్న ప్రతీమాటా నమ్ముతూ! మళ్లీ ఎందుకొప్పుకోలేదూ తాను, అతన్ని ద్వేషిస్తూనే, మోసగాడని తెలిసీకూడా, ….. తన చెల్లి కోసం…. ఆ మాత్రం చెయ్యగల శక్తి లేదూ తనలో, అది తన చెల్లెల్ని మంచిదారిలో బ్రతికేలా చేస్తుందని తెలిసినప్పుడు? ఈరాత్రి దాటిపోతే పొద్దున్నే కాచుకుని కూర్చుని ఉంటాడు భార్గవ! తన విశ్రాంతి గడియలు గౌరవ నరకంగా మార్చడానికి-
నైట్ డ్యూటీకి బట్టలు మార్చుకోబోతూ తన చెల్లెలుగదిలో లైటు లేకపోవడం ఆమె కంటపడింది. ఎందుకో అని ఆశ్చర్యంగా ఉండిపోయింది కొంచెం సేపు. అనూ ఎక్కడికి వెళ్లింది? మామూలుగా రాత్రిల్లు ఎక్కడికీ వెళ్లదు అది. తనూ పెళ్లిచేసుకోపోతోన్న గిరి కూడా గత నాలుగు రోజుల్నించీ ఊళ్ళోలేడు, ఎక్కడికయినా తీసుకువెళ్లడానికయినా. అనూరాధే చెప్పిందా మాట మొన్న. ఇంత వేగం నిద్రపోయే అలవాటూ లేదనూకు. ఏపుస్తకమో చదువుతూంటుందని శారదకు బాగా తెలుసు. ఇప్పుడింకా ఎనిమిదే దాటింది. ఆశ్చర్యపడుతూ వెళ్లి చెల్లెలి గదిలో లైటు వేసిందామె.
మంచంవైపు చూసి గతుక్కుమని ఒకడుగు వెనక్కువేసింది. ఏదో భయం. గుండెల్లో హఠాత్తుగా ఒక పోటు పొడిచింది. ముందుకి వంగి గాభరాగా మంచం క్రిందకి చూసిందామె. అక్కడుండవలసిన సూట్‌కేసు కనిపించలేదామెకు. ఒక్కసారిగా స్తంభించిపోయింది ఆమె. తనతో ఏమీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లిందనూ? ఎక్కడికి వెళ్లింది తన చెల్లి?
అంతలో ఆమె దృష్టి గాజులు పెట్టిన కర్ర స్టాండు మీద పడింది. ఒక శాఖమీద కొక్కానికి తగిలించి ఉన్నదొక మడత పెట్టిన కాగితం. పక్కన పైన గోడ గడియారం టిక్కుటిక్కుమని చప్పుడు చేస్తూ సెకండ్లనొక్కొక్కటిగా అనంతమైన కాలం అనే శూన్యంలోకి జారవిడుస్తున్నది, చల్లగా, తీరుబడిగా.
ఒక గంతువేసి, వణికి పోతున్నవేళ్లతో కాగితాన్నందుకుని తెరిచింది శారద. నుదుటి నించి, చెంపల మీదనుంచి చెమట చుక్కలు క్రిందకి జార్తున్నాయి ఆమె కళ్లు. అందులో రాసిన అక్షరాలమీదుగా పరుగులు పెట్టాయి తమ చూపుల్తో.
”శారదక్కకు,
నిన్న అర్థం చేసుకున్నాను నేను, మనిషికి ఉన్నది ఒకటే బ్రతుకనీ అదీ నిలిచి ఉండగానే దాన్నిపూర్తిగా అనుభవించాలనీ – అదీ భార్గవ దయ వల్లనే తెలిసింది. గిరిని పెళ్లిచేసుకుందామను కోవడంలో పొరపాటు చేశాను. అయినా ఆ తప్పుదిద్దుకునే అవకాశమూ భార్గవ వల్లనే దొరికింది.
మేము వెళ్లిపోతున్నామీ రోజు. ఎక్కడికో చెప్పలేను. నాకు తెలియదు. భార్గవకూ తెలియదేమో? అదేదో అందమై తొలి సంజ వెలుగుల వింత సైకతాల సీను అయి ఉండాలి!
ప్రయత్నించకక్కా, నా జాడ తెలుసుకుని, మళ్లీ వెనక్కి నన్ను లాక్కుని రావడానికి – నీ ఆ గౌరవ ప్రదమైన ఊపిరి తిరగని బ్రతుకులోనే, నరకం లోకీ. ఈ సంఘం, సమాజం మనకేమిస్తాయి? వాళ్ళతో పాటు అదే ఊబిలో బ్రతికే అవకాశమేనా? యాంత్రికపు మానసిక విలువల సంఘర్షణ – సాంఘికపు విలువల్తో బ్రతకడం – అదేనా?
నాకోసం నువ్వు పడ్డ కష్టానికి, మానసిక శ్రమకు నీ ఋణమెలా తీర్చుకోగలను నేను? నేనిలా వెళ్లిపోవడం, నువ్వు బ్రతుకుతున్న నీ ఆ కృత్రిమ సంఘంలో నీకు పెద్ద దెబ్బని నాకు తెలుసు. అయినా, నువ్విది భరించగలవని నాకు బాగా తెలుసు. సెలవక్కా
నీ ప్రియమైన,
అనూ.
తన కళ్లని తను నమ్మలేక చాలా సార్లు చదివిందా ఉత్తరం శారద చదువుతూంటే ”తొలి సంజ వెలుగుల” అనే మాట దగ్గర ఆగిపోయి, గట్టిగా కాతర, కరుణ, నిండిన కంఠంతో ”అనూ” అని అరిచింది, గుండెలు గట్టిగా, వేగంగా, దడదడ కొట్టుకుపోతూంటే.
ఆ కాగితాన్ని చేతుల్తో నలిపేస్తూ ఒకే ఊపున తన గదిలోకి పరుగెత్తిందామె. ఆ కాగితపు ఉండనొక మూలకు విసిరి, అల్మయిరాలో డ్రాయరులోనించి అందులో ఉన్న వస్తువుల్లోంచి, వెతికి, వెతికి తడిమి తడిమి, చిన్నబూడిద రంగు కాగితం పొట్లమొకటి బయటికి తీసిందామె. అది తెరిచి చూసిందామె. పొటాషియం సైనేడ్ పలుకులవి. ఒక నాలుగయిదు ఉన్నాయి నక్షత్రాల్లా మెరుస్తూ.
కుడి చేతి వేళ్లతో రెండు పలుకుల్ని పైకి తీసింది. అంతలో కాలింగ్ బెల్ గణగణమని ఒకే స్వరంలో నిరాటంకంగా మ్రోగడం మొదలు పెట్టింది. ఆ సైనేడు పలుకుల్ని మళ్లీ అదే కాగితంలో పెట్టి మడత పెట్టి, తను వేసుకున్న గౌన్ జేబులో పెట్టుకుని, మెట్లుదిగి క్రిందకి వెళ్లింది ఆమె.
మెట్లక్రింద, బయట ద్వారం దగ్గర హాస్పిటల్ వార్డ్‌బోయ్ రమణ నిలబడి ఉన్నాడు. ఆమెను చూడగానే కంగారుగా అన్నాడు. ”మధ్యాహ్నం డ్యూటీ సిస్టరు ఏదో ఫోన్ కాలొచ్చి, కంగారుగా వెళ్లిపోయారమ్మ. ఏదో ఎమర్జెన్సీ కేసొచ్చింది. మేట్రనమ్మగారు తొందరగా రమ్మంటున్నారు. ఇరవై ఏళ్ల చిన్నమ్మాయి. పురుగుల మందు తినేసింది. డుపుతో కూడా ఉందంటున్నారు డాక్టరుగారు.
”వస్తున్నాను అంబులెన్సు తెచ్చావా ఏమిటి? తాళం పెట్టి వస్తున్నాను” అంటూ మేడమీదికి పరుగు పెట్టింది శారద.
తాళంవేసి , ”షూస్” కాళ్లకి వేసుకుని, క్రిందకు వచ్చిందామె స్థిర నిశ్చయంతో, గౌను జేబులో ఉన్న ఆ కాగితం పొట్లంతోపాటు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags