నా రాజకీయ ప్రస్థానం-మహిళాఉద్యమంలో అనుభవాలు

టి. సావిత్రి దేవి

నాకు పదమూడేళ్ల వయస్సులోనే మా గ్రామంలో (బేతపూడి, రేపల్లె దగ్గర) మూడు భిన్నమైన రాజకీయధోరణులు కనిపించాయి.

మా చిన్నన్నయ్య కుడితిపూడి సత్యనారాయణ కాంగ్రెసువైపు ఆకర్షితుడయ్యాడు. మా పెదనాన్న కొడుకు పుండరీకాక్షయ్య గూడ అప్పటికే కాంగ్రెస్‌ కార్యకర్త. ఒకసారి మా ఇంటికి భారతీదేవిరంగా వచ్చారు. మా అన్నయ్య కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో భాగంగా దేశభక్తి ప్రబోధించడం, మాలపల్లెల్లో గూడ రాజకీయ చైతన్యం కొరకు కృషి చెయ్యడం, ఖద్దరు ధరించడం, ఖద్దరు మూటలు నెత్తిన పెట్టుకొని అమ్మడం చేసేవాడు. కృష్ణాపత్రిక విధిగా తెప్పించేవాడు. నేనుగూడా చదువుతూ ఉండేదాన్ని. త్రిపుర కాంగ్రెస్‌ మహాసభ విశేషాలు చదువుతూ సుభాష్‌చంద్రబోస్‌ అంటే అభిమానం పెంచుకున్నాను.
ఇక రెండవది – జస్టిస్‌ పార్టీ. కాంగ్రెస్‌ మాదిరి సత్యాగ్రహ కార్యక్రమాలు కాకుండా బ్రిటిష్‌వారిని ప్రసన్నం చేసుకొంటూ హక్కులు సాధించడం. కల్లూరి చంద్రమౌళిగారు ఆ సందర్భంగా మా ఊరికి వచ్చారు.
మూడవ రాజకీయ సిద్ధాంతం సోషలిజం. మా ఊరికే చెందిన కామ్రేడ్‌ వేములపల్లి శ్రీకృష్ణ ఎసి కాలేజీలో చదువుతూ ఇంటికి వచ్చినపుడు ఒకసారి మా బజారులోనే మీటింగుపెట్టి సోషలిజం గురించి ఉపన్యాసం ఇచ్చారు.
ఆరోజుల్లో హిందీభాషా ఉద్యమం గూడా ఉండేది. మా బంధువు ఒకరు బీహారులో దేవఘర్‌లో హిందీవిద్యాపీఠ్‌లో చదువుతుండేవాడు. శెలవులకు మా ఇంటికి వచ్చినపుడు అలహాబాదులోని ప్రయాగ మహిళా విద్యాపీఠ్‌లో చేర్పించమని మా అన్నయ్యకు చెప్పాడు. ఆ సంస్థకు ప్రిన్సిపాల్‌ ప్రముఖ కవయిత్రి శ్రీమతి మహాదేవివర్మగారు. దక్షిణాది నుండి వచ్చిన విద్యార్థినులకు ప్రోత్సాహక రాయితీలుండేవి. హాస్టల్‌ ఫీజు, స్కూలు ట్యూషన్‌ ఫీజు కలిపి నెలకు పది రూపాయలు మాత్రమే. మా అన్నయ్య నన్ను ఆ విద్యాపీఠ్‌లో చేర్పించాడు. నేను మా ఊరిలో మాధ్యమిక పాఠశాలలో 8వ తరగతి ప్రథమస్థానంలో ప్యాసైనాను. మా స్కూలులో మగపిల్లలకు ఇంగ్లీషు పీరియడ్‌ ఉంటే అమ్మాయిలకు సంగీతం క్లాసు ఉండేది. కాని నేనుమాత్రం క్లాసులోనే కూర్చుని ఇంగ్లీషు పాఠాలు వింటూ ఉండేదాన్ని. అందుచేత పెద్దగా ఇంగ్లీషు నేర్చుకోలేదు కాని డిబేట్సులో మాత్రం పాల్గొనేదాన్ని. విద్యాపీఠ్‌లో ఇంగ్లీషు, హిందీ పరిజ్ఞానం లేకపోయినా నన్ను 9వ తరగతిలో చేర్చుకొని, క్లాసులు ఇంగ్లీషు పీరియడ్‌ ఉంటే నాకు ప్రత్యేకంగా ఒక ఇంగ్లీషు టీచరుని, హిందీ క్లాసు జరుగుతున్నపుడు ఒక హిందీ పండితుని ఏర్పాటుచేశారు. మూడుమాసాల్లోనే 9వ తరగతి విద్యార్థినులతో కలిసిపోయాను. అందుకు నాకు ఆ టీచర్లు బహుమతి గూడా ఇచ్చారు.
ఆ హిందీ పండిట్‌ దేశాభిమాని. హిందీ బాగా నేర్చుకొన్న తరువాత ఆయన నాకు భారత్‌ సంగ్రామ చరిత్ర, వీరసావర్కర్‌ చరిత్ర చదవమని ఇచ్చారు. 1938-39 సంవత్సరంలో అలహాబాదులో జవహర్లాల్‌ నెహ్రూ భార్య కమలానెహ్రూ పేరిట ఆస్పత్రికి శంఖుస్థాపన జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మహాత్మాగాంధీ. ఆ సభకు వాలంటీర్లుగా మా విద్యాపీఠ్‌ నుండి మహిళా వాలంటీర్లను సెలెక్టు చేసి పంపమని మా ప్రిన్సిపాల్‌కు వర్తమానం వచ్చింది. మా ప్రిన్సిపాల్‌ నివాసానికి, హాస్టల్‌కు మధ్య గోడ ఉన్నది. ప్రిన్సిపాల్‌ అవతలివైపు నుండి ఎత్తుగా ఉన్న అమ్మాయిలను సెలెక్టు చేస్తున్నారు. నేను రెండు ఇటుకలపైన నిలబడి ఉన్నాను. నన్ను సెలెక్టు చేశారు. అదే గొప్ప అదృష్టంగా భావించాను. గాంధీ నెహ్రూలను ఒకేసారి దర్శించుకొన్నాను. మర్నాడు గాంధీగారు ఆనందభవన్‌లో బసచేసిఉన్నారని తెలిసి పిల్లలందరినీ అక్కడకు తీసికొని వెళ్లారు. ఒక్కొక్కరుగా వెళ్లి వారిని దర్శించుకొని, నమస్కరించి వచ్చాం. ప్రక్కనే ఉన్న స్వరాజ్యభవన్‌ గూడా చూశాం.
తర్వాత కొన్నాళ్లకు ఇంటికి తిరిగిరావడం, గుంటూరులో మా అన్నయ్య స్నేహితుడు కమ్యూనిస్టు అయిన కామ్రేడ్‌ చదలవాడ పిచ్చయ్య గారింట్లో ఉంచి ట్యూషన్‌ ద్వారా చదువు కొనసాగించారు. ఆయన రైతు సంఘంలో పనిచేసేవారు. 1940 నాటికి కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంఘాలను ఏర్పాటు చేయలేదు. అప్పటికే పనిచేస్తున్న రైతుసంఘంలో పనిచేసి పార్టీ విధానాలకు అనుకూలమైన కార్యాచరణ రూపొందించడానికి కృషి చేసేవారు. ఆ సందర్భంగా ఒకసారి చదలవాడ పిచ్చయ్య గారింట్లోనే సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఎన్‌.జి.రంగా గారు గూడా వచ్చారు. సైద్ధాంతిక కారణాలపై వాగ్వాదం జరిగింది. అలాగే కొందరు కమ్యూనిస్టు నాయకులు అజ్ఞాతంలో ఉన్న కామ్రేడ్‌ పులువుల శివయ్య వస్తూ ఉండేవారు. మోటూరు ఉదయంగూడ అక్కడ కొన్నాళ్లు ఉన్నది. అజ్ఞాతంలో ఉన్న నాయకుల కొరకు మేమున్న ఇంటిపై పోలీసు నిఘా ఉండేది. ఆ రోజుల్లో సిఐడిలను గుర్తుపట్టగలిగే విధంగా వారి డ్రెస్‌ ఉండేది. బెంగాలీ ధోవతి ధరించేవారు. పెన్సిల్‌, నోట్‌బుక్‌ చేతిలో పెట్టుకొని ఇంటి చుట్టుప్రక్కల గమనిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఆ నాయకులనే ఎక్కడికి వెళ్తున్నారు, వగైరా వివరాలు అడిగి వ్రాసుకునేవారు. మా ఇంటిముందు వేసవికాలం తాటిఆకుల పందిరి ఉండేది. ఇంటికి దగ్గరలో స్టూడెంట్స్‌ లాడ్జి ఉండేది. మాకినేని బసవపున్నయ్య, వేములపల్లి శ్రీకృష్ణ మొదలైన కామ్రేడ్స్‌ ఉండేవారు. ఒకసారి అక్కడ దాడి జరగగా కామ్రేడ్‌ కట్టయ్య డాబాపై నుండి తాటాకుపందిరి మీద దూకి క్రింద పడి పారిపోయాడు.
మా అన్నయ్య గూడా కాంగ్రెస్‌ భావాలనుండి కమ్యూనిస్టుగా మారాడు. పార్టీ వారిద్వారా టి.వి.కృష్ణతో ఆ డాబా మీదనే దండలపెళ్లి జరిపించారు.
టి.వి.కె. ఉద్యోగరీత్యా రేపల్లె తాలూకా భట్టిప్రోలులో ఉన్నాం. అక్కడ లైబ్రరీకి వెళ్తుండేదాన్ని. ఒక కాంగ్రెస్‌ మహిళ పరిచయమైంది. మహిళా సంఘం ఏర్పాటు చేయాలనుకొన్నాం. అప్పటికే తూర్పు కృష్ణా మహిళాసంఘాల గురించి తెలుసుకొని ఉన్నందువల్ల కాట్రగడ్డ హనుమాయమ్మతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. సంఘ నిర్మాణం గురించి తెలుపమని వ్రాశాను. జవాబు గూడ వచ్చింది. బెంగుళూరు నుండి ప్రచురితమవుతున్న ‘ప్రజామత’ అనే వారపత్రికకు స్త్రీల సమస్యల గురించి ఏదో ఒక విషయంపై వ్రాసేదాన్ని. దానిపై వాద, ప్రతివాదనలు గూడ ప్రచురితమయ్యేవి.
1942 ఆగస్టులో క్విట్‌ ఇండియా ఉద్యమం వచ్చింది. ఆ తరువాత కొన్నాళ్లకు పార్టీ బహిరంగంగా పనిచేయడం ప్రారంభించింది. జిల్లా పార్టీ ఆఫీసు తెనాలిలో ఉండేది. అప్పటికే కార్మికోద్యమం ఉన్నదిగాని ప్రజాసంఘాలు ఏర్పాటుచేయాలని, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసికొని వెళ్లడానికి రైతు, వ్యవసాయకూలి, యువజన, మహిళా, బాలసంఘాలను నెలకొల్పాలని పార్టీ భావించింది. నన్ను వెంటనే తెనాలి రమ్మనమని మాకినేని బసవపున్నయ్య గారు కబురు పంపారు. మహిళా ఉద్యమనిర్మాణం గురించి చర్చించి ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలోని మహిళా కార్యకర్తలకు రాజకీయ పాఠశాల నిర్వహించారు, మోటూరు ఉదయం, మాకినేని జగదాంబ, పద్మాక్షమ్మ, దుర్భా హనుమాయమ్మ, మాదాల రాజ్యలక్ష్మి, బసవ పున్నమ్మ, సరస్వతి, మహంకాళి పార్వతి మొదలైనవారు 30 మంది హాజరైనారు.తరువాత తెనాలి దగ్గర కంచర్లపాలెంలో మొదటి జిల్లా మహాసభ జరిగింది. శాఖమూరి కోటమ్మ అధ్యక్షురాలిగా, టి.సావిత్రి ప్రధాన కార్యదర్శి; మోటూరు ఉదయం సహాయకార్యదర్శిగా మరికొంతమంది సభ్యులతో కార్యవర్గం ఏర్పడింది.మరల జిల్లా పార్టీ ఆఫీసు గుంటూరుకు మార్చినపుడు మహిళా సంఘం కార్యాలయం గూడ గుంటూరుకు మార్చబడింది.
1943లో పార్టీ రాష్ట్రంలోని మహిళా కార్యకర్తలకు రాజకీయ పాఠశాల నడిపింది. నేను గూడ పాల్గొన్నాను. ఇందులో రాజకీయాలు, దేశచరిత్ర, ఆరోగ్యశాస్త్రం మొదలగు విషయాలు బోధించారు. డాక్టర్‌ కొమర్రాజు అచ్చమాంబ ప్రసూతి శిశుపోషణ గురించి, మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి బోధించారు.
అవి జపాన్‌ మన భూభాగంపై దాడులు చేసే ప్రమాదమున్న రోజులు. కాకినాడపై బాంబులు విసిరారు. వైమానికదాడుల నుండి ఎలా రక్షించుకోవాలి, శత్రువు ఎదురుపడితే ఎలా ప్రతిఘటించాలో మాకు శిక్షణ ఇచ్చారు. పొట్టు నింపిన డమ్మీని వేలాడగట్టి కుడిచేతి చిటికెనవేలు నుండి మణికట్టు వరకు ఉన్న భాగంతో గట్టిగా కొట్టి ప్రాక్టీస్‌ చెయ్యమని చెప్పారు. చివరిరోజున పరీక్షగా అంగుళం మందం ఉన్న టేకుముక్కను కొట్టమన్నారు. ఒక్క దెబ్బతోనే ఆ టేకు కర్ర విరిగిపోయింది. శత్రువు మెడ ఎముక అలా కొడితే విరగడం ఖాయం. అలాగే ఇల్లు మంటల్లో చిక్కుకుంటే మెట్లు తగలబడుతుంటే ఎట్లా రక్షించుకోవాలో నేర్పించారు.  కొమర్రాజు అచ్చమాంబగారి మేడపైనుండి పెద్ద మోకు కట్టి క్రిందకు దిగమన్నారు. నేను కూడా దిగాను.
బయటి శత్రువులే కాదు, రౌడీలను ఎదుర్కొనడానికి గూడా కర్రసాము నేర్పించారు. నాకు మహిళా విద్యాపీఠ్‌లో నేర్చుకొన్న అనుభవంతో బాగా చేసేదాన్ని. చండ్ర రాజేశ్వరరావుగారు కొంతసేపు అందరికీ నేర్పించి, ఇక సావిత్రి నేర్పుతుందనేవారు. ఖాకీ నిక్కర్లు, షర్టులు ధరించి విజయవాడ వీధుల్లో ప్రదర్శన ఇచ్చాం.
1943లో బొంబాయిలో తొలిసారి పార్టీ బహిరంగంగా మహాసభ జరిపింది. ఆ సభకు నేను కూడా హాజరయ్యాను. ఆ సభలో సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వడానికి మాకు వి. మధుసూదనరావు, ముక్కామల నాగభూషణం మొదలైనవారు శిక్షణ ఇచ్చారు. చండ్ర సావిత్రమ్మ, కాట్రగడ్డ హనుమాయమ్మ, వెల్లంకి అన్నపూర్ణ, మావెంపాటి కమల, కోగంటి గోపాలకృష్ణయ్య, కోసూరు పున్నయ్య, మొదలైనవారితోబాటు నాకు కూడా శిక్షణ ఇచ్చారు. అక్కడ కోలాటం, చిందు నృత్యంలో నేను పాల్గొన్నాను. పార్టీ సిద్దాంతాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయా కళారూపాలను రూపొందించారు. ఆ కార్యక్రమాలు చూసి ప్రతినిధులంతా ఆశ్చర్యం, సంభ్రమాలకు లోనయ్యారు. అదే కార్యక్రమాన్ని బొంబాయిలోని ఒక హాలులో గూడా ప్రదర్శింపజేశారు. అక్కడ నుండి వచ్చిన తరువాత విజయవాడ జింఖానా క్లబ్బులో గూడా ప్రదర్శించారు.
పార్టీ మహాసభ సందర్భంగా అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన మహిళా ప్రతినిధుల సమావేశం ఏర్పాటుచేసి రాజకీయాలు, మహిళా సమస్యలపై వివరించారు. నేను, రేణు చక్రవర్తి, పెరిన్‌ బరూజా (తర్వాత పెరిన్‌ రమేశ్‌చంద్ర) కల్యాణి కుమారమంగళం, పార్వతీ కృష్ణన్‌, విమలా రణదివే, కామ్రేడ్‌ అధికారి భార్య, ఇంకెందరో నాయకులతోబాటు నేనుగూడా హాజరయ్యాను.
మరొకసారి బొంబాయి వెళ్లాను. ఎఐడబ్ల్యుసి, ఆలిండియా వుమెన్స్‌ కాన్ఫరెన్సు శ్రీమతి విజయలక్ష్మి పండిట్‌, శ్రీమతి సరోజినీ నాయుడులను సన్మానిస్తున్న సభకు నన్ను, మల్లాది రామకృష్ణ భార్య విజయలక్ష్మిని, హాజరు కావల్సిందిగా పార్టీ పంపింది. విజయవాడ నుండి హైదరాబాదు వచ్చి రైలు మారాలి. మాకు సహాయం చేయవలసిందిగా కామ్రేడ్‌ ఎస్‌.వి.కె.ప్రసాద్‌ గారికి పార్టీ కబురు పంపింది. ఆయన ఇక్కడ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చి మమ్మల్ని రిసీవ్‌ చేసికొని సికిందరాబాదులో కామ్రేడ్‌ అయ్యంగారింటికి తీసికొనివెళ్లారు. స్నానాలు, భోజనాలు ముగించుకొని, మరల రాత్రికి బొంబాయి రైలు ఎక్కించారు. మా అయ్యంగార్‌ కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య గారికి తోడల్లుడు. ఆ సభనుండి వచ్చి మహిళా సంఘ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాను.
గుంటూరు జిల్లాలో బాగా వెనుకబడివున్న ప్రాంతాలైన గుంటూరు, సత్తెనపల్లి, నర్సరావుపేట తాలూకాల్లో సంఘ నిర్మాణం, సభలు, సమావేశాలు నిర్వహించడం, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం, స్త్రీవిద్యా వ్యాప్తి, హిందూ వివాహ చట్టంలో మార్పులు కోరుతూ బి.ఎన్‌.రావు కమీషన్‌కు సంతకాలు సేకరించడం, ఆరోగ్యసూత్రాలు మొదలైన సాంఘిక సమస్యలు వివరించడం చేసేవారం. గ్రామాల్లో మరుగుదొడ్ల సమస్య గురించి కృషి చేశాం. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు తక్కువ. కాలినడక, ఎర్రబస్సు ప్రయాణాలు, ఎడ్లబండి ప్రయాణం, జట్కా బండి, రిక్షా ఇవే ఆనాటి ప్రయాణసాధనాలు. ఒకసారి నేను గుంటూరు తాలూకా మహిళాసభ జరపడానికి స్త్రీలను సమావేశానికి తీసికొని రావాలని ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న మహిళా కార్యకర్తలకు చెప్పడానికి ఉదయం బయలుదేరి పొన్నేకల్లు, తాడికొండ, తుళ్లూరు, నేలపాడు, దొండపాడు చేరేసరికి రాత్రి 8 అయింది. తాడికొండలో జరిగిన మహాసభకు చాలామంది వచ్చారు. జయప్రదంగా జరిగింది. ఆ రోజుల్లో ఒక గ్రామంలోని మహిళలను ఒకచోటికి చేర్చడానికి కష్టమయ్యేది. గ్రూపు మీటింగులు, వీధికొక మీటింగు, పేరంటానికి పిలిచినట్లు పిలిచి చెప్పేవారు. అత్తచాటు కోడళ్లు, భర్త ఆంక్షలున్న అమ్మాయిలు రావడం కష్టమయ్యేది. పావలా సభ్యత్వ రుసుము ఇవ్వడానికి గూడా పెద్దవాళ్ళు ఏమంటారో అన్న బెదురు ఉండేది. పాటల ద్వారా, ఉపన్యాసాల ద్వారా చైతన్యపరచడానికి కృషిచేశాం.
మహిళా రాష్ట్ర నాయకత్వానికి నన్ను పంపవలసిందిగా రాష్ట్ర పార్టీ కోరినపుడు మా జిల్లా కార్యదర్శి మోటూరు హనుమంతరావు గారు మా జిల్లా ఆర్గనైజేషన్‌కు ఆమె అవసరం ఉందని పంపలేదు. అలాగే ప్రజానాట్య మండలి వారు నన్ను అడిగినా ఇక్కడ మహిళా ఉద్యమం దెబ్బతింటుందని పంపలేదు.
గదర్‌ నాయకుడు పృథ్వీసింగ్‌ ఆజాద్‌ను అండమానుకు పంపడానికి రైలులో మద్రాసు తీసుకొనివెళ్తున్న సమయంలో రాత్రిపూట బాపట్ల పరిసరాల్లో రైలునుండి దూకేశారు. దెబ్బలు తగిలాయి. కొంతమంది ఆయనకు సాయం చేయడానికి వెళ్తే భాష తెలియక దేశభక్తం, స్వరాజ్యం అన్న రెండు పదాలు మాటిమాటికీ చెప్పేవారట. అది గ్రహించిన వారు కమ్యూనిస్టుపార్టీ ఆఫీసుకు తీసికొనివచ్చారు. నేను వారిని పార్టీ ఆఫీసులో చూశాను. ప్రముఖ హిందీ రచయిత ‘వోల్గా సే గంగ’ అనే గ్రంథం వ్రాసిన రాహుల్‌ సాంకృత్యాయన్‌ కూడా గుంటూరు రావడం జరిగింది.
1944లో విజయవాడలో జరిగిన ఆలిండియా రైతు మహాసభకు మహిళా వాలంటీర్లను నియమించారు. మానికొండ సూర్యావతి కమాండర్‌ గాను, నన్ను అసిస్టెంట్‌ కమాండర్‌ గాను నియమించారు. ఆ మహాసభ చాలా జయప్రదంగా జరిగింది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు.
తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నపుడు మల్లు స్వరాజ్యం విజయవాడలో మా ఇంట్లో కొద్దిరోజులు ఉన్నారు. రజాకార్ల దాడుల సందర్భంలో కూడా ఎందరో ఈ ప్రాంతాలకు వచ్చినపుడు వారికి సహాయసహకారాలు అందించాం. అలాగే బెంగాల్‌ కరువు బాధితులు ఎందరో వచ్చారు. వారికి కూడా తగిన సాయం అందించగలిగాం.
1947లో గుంటూరులో పుగాకు కంపెనీలున్నాయి. ఐఎల్‌టిడి బ్రిటిష్‌ ఇండియా టుబాకో కంపెనీ మొదలైంది. వాటిలో ఎక్కువమంది మహిళలే పనిచేస్తారు. వారి సమస్యలు తీసికొని పోరాడాం. సమ్మె జరిగినపుడు మేము పికెటింగ్‌ చేశాం. మమ్మల్ని అరెస్టు చేశారు. వారంరోజులపాటు శిక్షలు విధించారు. బాపట్ల సబ్‌జైలుకు పంపారు. నాతోబాటు శ్రీమతి టి. లక్ష్మీకాంతమ్మ గూడా ఉన్నారు. తరువాత ఆమె కాంగ్రెస్‌లో చేరిరది.
1948లో కలకత్తాలో పార్టీ తీసికొన్న నిర్ణయాలవల్ల పార్టీని ప్రభుత్వం నిషేధించింది. దమనకాండ మొదలైంది. ఎందరో నాయకులను అరెస్టు చేసింది. ఎందరో కామ్రేడ్లను కాల్చి చంపారు. ఆంధ్రరాష్ట్ర మహిళా సంఘం నడుపుతున్న ‘ఆంధ్రవనిత’ పత్రికను కూడ నిషేధించింది. ఈ దమనకాండను నిరసిస్తూ విజయవాడ వీధుల్లో ప్రదర్శన జరపాలని నిర్ణయించింది రాష్ట్రసంఘం. ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించింది. ప్రదర్శనను నిషేధించింది. 400 మందిమి బయలుదేరాం. పోలీసులు బాష్పవాయుగోళాలు కురిపించారు. 40, 50 మందిని అరెస్టు చేశారు. నందిగామ జైలుకు పంపినవారిలో నేనూ ఉన్నాను. కేసు గూడా పెట్టారు.
నా భర్త టి.వి. కృష్ణను గూడా అరెస్టు చేసి వెల్లూరు జైలుకు  డిటెన్యూగా పంపారు.
ఇక జీవనసమస్య ఎదురైంది. అత్తవారింటికి వెళ్లాను. అంతకుముందే అదే ఊళ్లో మహిళల ఊరేగింపు సభ జరిపాం. కొడుకు జైలు పాలయ్యాడని అక్కడ ఉండవద్దన్నారు. ఉద్యోగం వదులుకొని పార్టీలో చేరినందువల్ల జైలుపాలయ్యాడని బాధ.
భట్టిప్రోలులో ఉన్నాను. చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ కాలం గడిపాను. ”చైనా స్త్రీలు” అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాను. ఒకరోజున పోలీసులు వచ్చారు. సోదా చేశారు. ఏమీ దొరకలేదు. వెళ్లిపోయారు. కాని అక్కడివాళు,్ల చేనేతకార్మికులు భయపడినారు. అందువల్ల అక్కడనుండి మకాం మార్చవలసి వచ్చింది. దగ్గరలోనే ఉన్న వెల్లటూరులో మన కామ్రేడ్స్‌ ఇంటి దగ్గర ఉన్నాను. ఆ కామ్రేడ్‌ అజ్ఞాతంలో ఉన్నాడు. కొందరు మహిళలకు హిందీ పాఠాలు చెప్పేదాన్ని. అక్కడ గూడా పోలీస్‌ సోదాలు తప్పలేదు. ఒకరోజున నేను ఆ ఇంటి ఇల్లాలు కలిసి భట్టిప్రోలు సినిమాకు వెళ్లాం. రాత్రి 9 గంటల తరువాత తిరిగి నడుచుకొంటూ వస్తున్నాం. రెండు కిలోమీటర్లు దూరం అనుకొంటాను. పోలీసులు మీరు ఎక్కడనుండి వస్తున్నారని అడిగాను. సినిమాకు వెళ్లి వస్తున్నామని చెప్పాం. కాని మీరు రహస్య నాయకునికి కొరియర్‌గా పనిచేస్తున్నారంటూ అరెస్టుచేసపోలీసుస్టేషనుకు తీసికొని వెళ్లారు. గ్రామ మునసబ్‌ కావాలని అరెస్టు చేయించినట్లు తెలిసింది. నా విద్యార్థినులలో ఒకామె భర్త అక్కడ కెనాల్‌ లాకుల వద్ద పనిచేసే ఓ వర్కరు. ఆయనవచ్చి ఈమె హిందీ పాఠాలు చెప్తున్నదని, వదలివేయమని అడిగారు. అయినా నేను కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని బోధిస్తున్నానంటూ రేపల్లె మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. నాతో ఉన్న ఆమె గర్భవతి. ఆమెనుమాత్రం 15 రోజుల తరువాత విడిచిపెట్టారు. నామీద కేసు బనాయించారు. తరువాత తెనాలి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా నాకు ఆరునెలల శిక్ష విధించడం రాయవేలూరు సెంట్రల్‌ జైలుకు పంపడం జరిగింది.
జైలులో పోరాటం – అక్కడ నాలాగా శిక్షపడిన కామ్రేడ్‌ తమిళనాడు నుండి వచ్చింది. అక్కడే మానికొండ సూర్యావతి, మరొక తమిళ కామ్రేడ్‌ డిటెన్యూలుగా ఉన్నారు. ప్రతి సోమవారం ఉదయం ఆయావార్డుల్లో ఉన్న ఖైదీలు తమ వార్డుల్లో తమకిచ్చిన కంబళి, కంచం ముందు పెట్టుకొని నిలబడి ఉండాలి. జైలు సూపరింటెండెంట్‌, జైలరు, ఇతర అధికారులు వచ్చి చూస్తారు. నేను మొదటిరోజునే జైలు మాన్యుయల్‌ కావాలని, పత్రికలు ఇవ్వాలని అడిగాను. ఇవ్వమని జైలురుకు చెప్పాడు. కాని మాన్యుయల్‌ మాత్రం ఇవ్వలేదు. పత్రికలు సెన్సారుచేసి ఇస్తారు. మేము, డిటెన్యూలం ఒకే పార్టీకి చెందిన రాజకీయ ఖైదీలం గనుక కలిసి మాట్లాడుకోవడానికి అనుమతించవలసిందిగా కోరాను. ఒప్పుకోలేదు. మా కోర్కెలు తీర్చాల్సిందిగా గోడలమీద ఆకులు నూరిన పసరుతో తమిళంలో ప్రభుత్వం నశించాలి, విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు వ్రాశాం. మా ఇద్దరిని ఇతర ఖైదీలతో కలవకుండా ఒక వార్డులో ఉంచారు. మేము ఆందోళనలు సాగిస్తూంటే మా ఇద్దరిని విడదీసి వేర్వేరు గదుల్లో నిర్బంధించారు. అయినా మేము నిరసనవ్రతం చేశాం. తరువాత కొద్దిరోజులకే నేను విడుదలై రేపల్లెకు వచ్చాను. మరల జీవన సమస్య. ఇక్కడకూడా ట్యూషన్లు చెప్పాను. 1951లో టి.వి. కృష్ణ విడుదల కావడం, విజయవాడలో కాపురం. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు కర్నూలుకు విశాలాంధ్ర విలేఖరిగా కృష్ణను పంపినపుడు మకాం కర్నూలుకు మారింది.
1956లో హైదరాబాదు: పిల్లల బాధ్యత, టీచరుగా పనిచేయడం మూలంగా ఉద్యమాలకు దూరంగా ఉన్నాను. మేము 8 సంవత్సరాలు ఆంధ్రదేశానికే దూరంగా ఢిల్లీలో ఉన్నాం.
ఢిల్లీలో ఉండగా నేను చండ్ర సావిత్రమ్మ రాజేశ్వరరావులను కలిశాను. రాజేశ్వరరావు గారు విమలాఫారూఖీ గారిని పిలిచి నన్ను పరిచయంచేసి మహిళాఉద్యమానికి నన్ను ఉపయోగించు కోవాల్సిందిగా చెప్పారు. ఎన్‌.ఎఫ్‌.ఐ.డబ్ల్యులో ఆఫీసు సెక్రటరీగా పనిచేశాను. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను.
1974లో హైదరాబాదుకు తిరిగి వచ్చిన తరువాత గుజ్జల సరళాదేవిగారు బ్రిజరాణిగౌడ్‌ గారు నడుపుతున్న వర్కింగ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు చేశాను. సోషల్‌ వెల్‌ఫేర్‌ బోర్డు వారి కార్యక్రమాలైన వయోజన మహిళలు, బీదవారు, వితంతువులు మొదలగువారికి వొకేషనల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ నడిపాను. సోషల్‌ వెల్‌ఫేర్‌ బోర్డు వారు ఇచ్చే నిధులతో మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం నడిపే సర్టిఫికేట్‌ కోర్సుకు పంపించాను. వారికొరకు హాస్టలు గూడ నడిపాను. అలాగే మధ్యలో చదువు నిలిపివేసిన మహిళలకు పదవతరగతి పరీక్షకు శిక్షణాతరగతులు నిర్వహించాను. వీరికి కూడా హాస్టలు వసతి కల్పించాను. అలాగే సోషల్‌ వెల్‌ఫేర్‌ బోర్డు వారిదే మరొక ప్రోగ్రాం. 14,16 వయస్సు ఉన్న బాలికలకు హాలిడే హోం క్వారీ నిర్వహించాను. విశాఖపట్నంలో ఒక హైస్కూలులో వసతి కల్పించారు. డి.ఇ.ఓ గారితో ప్రారంభోత్సవం చేయించాను. ప్రముఖ రచయిత వాకాటి పాండురంగారావు గారిని ఆహ్వానించాను. వారు కూడ పిల్లలనుద్దేశించి ప్రసంగించారు. సోషల్‌ వెల్‌ఫేర్‌ బోర్డు వారి తరఫున ఆఫీసరు వచ్చి బాగా జరిపారని ప్రశంసించారు. ఒక విషయం, ఈ యాత్ర కొరకు రైల్వే అధికారుల చుట్టూ తిరిగి స్పెషల్‌ బోగీ ఏర్పాటు అయ్యేలా చేశాను.
హాస్టలు విద్యార్థినులకు విహారయాత్రలు గూడా ఏర్పాటుచేశాను. అజంతా, ఎల్లోరాలకు తీసికొని వెళ్లాను.
మరొక ముఖ్యమైన కార్యక్రమం… మహిళల కొరకు వయోజన పాఠశాలల ద్వారా విద్యావ్యాప్తికి కృషి చేయడం – దీనికి రాష్ట్రప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి మొదట 100 పాఠశాలలు, మరొక సంవత్సరం మరో 100 పాఠశాలలకు శాంక్షన్‌ తెచ్చాను. తద్వారా వేలాదిమంది మహిళలు అక్షరాస్యులయ్యారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో నేటి ఆం.ప్ర. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుణ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. వేలాదిమంది మహిళలను అక్షరాస్యులను చేయగలిగాం.
వర్కింగ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌కు పనిచేస్తూనే రాష్ట్ర మహిళా సమాఖ్య కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. నన్ను ఎన్‌.ఎఫ్‌.ఐ.డబ్ల్యు జాతీయ కౌన్సిల్‌ మెంబరుగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఆఫీసులో గూడా పనిచేస్తూ ఉండేదాన్ని. ఎన్‌.ఎఫ్‌.ఐ.డబ్ల్యు ఆఫీసుకు పంపవలసిన వర్క్‌ రిపోర్టులు ఇంగ్లీషులో వ్రాసి పంపుతుండేదాన్ని. అలాగే రాష్ట్ర మహాసభలు జరిగినపుడు తీర్మానాలు రూపొందించడం, సభకు సమర్పించవలసిన రాష్ట్ర రిపోర్టు తయారుచేయడం. వివిధ ఉద్యమాలు, సతీసహగమనంకు వ్యతిరేకంగా, చెన్నారెడ్డి పాలనలో కూరగాయల ఎగుమతిని నిరోధిస్తూ మొదలైన ఉద్యమాల సందర్భాల్లో కరపత్రాలు వ్రాయడం, నినాదాలు వ్రాయడం గూడా చేసేదాన్ని. సారా వ్యతిరేకోద్య మంలో గూడా పాల్గొనేదాన్ని. సారా వ్యతిరేకోద్యమ కమిటీలో ప్రచార కార్యదర్శిగా పనిచేశాను. పత్రికలకు ప్రెస్‌నోట్‌ పంపించడం చేసేదాన్ని. ధర్నాలో పాల్గొనడం, అరెస్టులు, విడుదల జరిగాయి.
నాకు గర్వకారణమైన విషయం ఒకటుంది. ప్రపంచ మహిళల శాంతి మహాసభకు ఎన్‌.ఎఫ్‌.ఐ.డబ్ల్యు తరఫున ఏకైక ప్రతినిధిగా, ఇతర సంఘాల నాయకురాండ్రతో కలిసి టాష్కెంట్‌లో జరిగిన మహాసభకు హాజరై ప్రసంగించాను. ఇది 1986 సెప్టెంబరు అక్టోబరులో జరిగింది. పీస్‌  (ఆజూజ్పుుజూ )అనే అక్షరాల మాల (కంచులోహంతో తయారుచేసినవి) సోవియట్‌ ఉమెన్స్‌ కమిటీ ప్రెసిడెంటు అంతరిక్షంలో ప్రయాణించిన వాలంటీనా టెరిష్కోవాకు అందజేశాను.
తరువాత నా ఆరోగ్యం దెబ్బతినడం. ఆస్టియోఫొరోసిస్‌ వల్ల కొన్నాళ్లు, తర్వాత హార్ట్‌ఎటాక్‌ రావడంవలన ఉద్యమానికి దాదాపుగా దూరమయ్యాను.
వ్యక్తులు దూరమైనా ఉద్యమాలు సజీవనదిలా ముందుకు సాగుతూనే ఉంటాయి. సమాజానికి, నవ్యసమాజసృష్టికి కృషిచేస్తూనే ఉంటాయి.
(టి. సావిత్రి దేవి గారి గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలను కునేవారు ఆమె కుమార్తె, ఛైర్‌పర్సన్‌, స్ట్రాటజిక్‌ మానేజ్‌మెంట్‌ ఆడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ, గారి బ్లాగ్‌  (kinneratalluri.blogspot.com) లో వ్యాస పరంపర చూడండి.)

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.