ఉత్తరం ఉత్త కాయితమేనా???

ఈ మధ్య ‘హిందూ’, న్యూస్‌ పేపర్‌లో ప్రతీ ఆదివారం ప్రచురించే ‘ఒపెన్‌పేజీ’లో ఉత్తరాల మీద చాలా అర్థవంతమైన చర్చ జరిగింది.

ఉత్తరాల ప్రేమికురాలిగా నేను ఆ చర్చనంతా చదివాను. మ్యూజియమ్‌లో వస్తువులాగా మారిపోయిన ఉత్తరం గురించి బాధపడుతూ ఒకాయన చాలామంచి వ్యాసం రాసారు. ఆయన్ని సమర్ధిస్త్తూ బోలెడన్ని వ్యాసాలు, ఉత్తరాలు ఎడిటర్‌కి వచ్చాయి. వాటన్నింటిని చదువుతుంటే చాలా సంతోషమన్పించింది. నాలాంటి ఉత్తరాల పిచ్చివాళ్ళు ఇంకా చాలామందే వున్నారని సంబరమన్పించింది.
ఉత్తరం ఉత్త కాయితమేనా? కార్డు, ఇన్‌లాండ్‌ కవర్‌, ఎన్వలప్‌ ఈ మూడు సమాచార వాహికలు, ఈ సమాచారాన్ని మోసుకొచ్చే పోస్ట్‌మేన్‌/ వుమెన్‌ మన జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ప్రభావం చూపి వుంటాయి. బహుశ ఈ తరానికి చెందిన వాళ్ళకి ఉత్తరంతో అంత గాఢమైన అనుబంధం ఉండకపోవచ్చు. చిట్టి పొట్టి ఉత్తరాల, ఇ మెయిళ్ళ యుగమిది. వాళ్ళ కమ్యూనికేషన్‌ అంతా ఎలక్ట్రానిక్‌ వస్తువులద్వారానే. పోస్ట్‌మేన్‌/వుమెన్‌ వాళ్ళకేమీ కాడు. పోస్ట్‌మేన్‌/వుమెన్‌ కోసం ఎదురు చూడడటమంటే ఏంటో కూడా వాళ్ళకి అనుభవం కాదు. ఉత్తరం రాయడం, డబ్బాలో వేయడం, అవతలి వాళ్ళు అందుకోవడం, తిరిగి సమాధానం రాయడం. ఈ మొత్తం ప్రాసెస్‌లో వున్న ఏకాంతం, ఎదురుచూపు, ఉద్వేగం, సంతోషం, దు:ఖం- ఈ నవీన నాగరికులకి ఎప్పటికీ అనుభవంలోకి రాదు. ఆ అనుభూతి కావాలని కూడా వాళ్ళు కోరుకోవడం లేదు. నిజానికి  వాళ్ళ దృష్టిలో అదో టైమ్‌ వేస్ట్‌. ‘సెండ్‌’ బటన్‌ నొక్కగానే, కాంతి వేగంతో సమాచారం వెళ్ళిపోతుంటే ‘మీరేంటండి ఉత్తరాలు అంటూ ఊదరకొడుతున్నారు’ అంటారు. వేగం వేగం వేగం అన్నింటా వేగమే రాజ్యమేలుతున్న చోట నాలుగైదు రోజులగ్గాని అందని ఉత్తరం ఎవరిక్కావాలి?
నాకు ఇప్పటికీ ఉత్తరాలంటే వెర్రిప్రేమ. ఉత్తరం  రాయడమంటే ఎంతో ఉత్సాహం. నా ఆత్మీయ మితృలందరికీ కట్టలు కట్టలుగా రాస్తూనే వుంటాను. వాళ్ళందరి దగ్గరా నేను రాసిన ఉత్తరాల ఫై¦ళ్ళున్నాయి. స్నేహం చిగురించిన రోజున మొదలైన ఉత్తరాల ప్రవాహం- ఆ  స్నేహం మారాకు తొడిగి, పుష్పించి, ఫలించిన వైనాలు, కలిసి తిరిగిన ప్రాంతాలు, కలబోసుకున్న కబుర్లు, కలత చెందిన సందర్భాలు అన్నీ ఉత్తరాల్లో ప్రతిఫలిస్తాయి. రచయిత్రులతో చేసిన సాహితీ ప్రయాణాల సందర్భంలో రాసిన ఉత్తరాలు చాలానే వున్నాయి. సమాధానాలు రావడం మాత్రం అరుదే. అయినా నేను రాస్తూనే వుంటాను.
ఏకాంతంగా కూర్చుని ఉత్తరం రాయడం ఎంత హాయిగా వుంటుందో!!! ఉత్తరాన్ని అందుకోబోయే వ్యక్తి గురించిన ఊహాలు, చెప్పాలనుకున్న ఊసులు అక్షరీకరించిడంలో ఎంత ఆత్మీయత వొలుకుతుందో. ఉత్తరం రాస్తేనే అర్థŠమౌతుంది. వేళ్ళ కొసల్లోంచి వాక్యం తర్వాత వాక్యం జాలువారడం ఎంత మనోహరంగా వుంటుందో వర్ణించలేను.
దిగులు మంచమెక్కి ముడుచుకుని పడుకున్న ఓ మధ్యాహ్నం వేళ ఓ నీలిరంగు ఉత్తరం రెక్కలు కట్టుకొచ్చి నీ ఇంటి కిటికీలోంచి లోపలికి ఎగిరొచ్చి పడితే, ఆ  ఉత్తరాన్ని నీ ప్రాణనేస్తమో, ఊరిలో వున్న అమ్మో, నాన్నో, మేనత్తో, మేనబావో ఎవరో ఒకరు నీ అత్మీయులు అక్షరాల్లో  నిన్ను పలకరిస్తే నీ దిగులు, దు:ఖం పలాయనం చిత్తగించవా? అక్షరాల వెంబడి నీ కళ్ళు పరుగులు తియ్యవా?
ఉత్తరం రాసేవాళ్ళకి, ఉత్తరంలో తమని తాము ఆవిష్కరించుకునే వాళ్ళకి వొత్తిళ్ళుంటాయంటే నేను నమ్మను. ఉత్తరం రాయాలంటే తన లోపలికి తాను చూసుకోవాలి. చీకటి కోణాల మీద వెలుతురు ఫోకస్‌ చేసుకోవాలి. ఉప్పొంగే సంతోషాన్ని, ఉరకలెత్తే ఉత్సాహాన్నే కాదు గుండెను పిండుతున్న దు:ఖాన్ని, మనసుకు పట్టిన ముసురుని అక్షరాల్లో అనువదించేదే ఉత్తరం. తనలోని   ఉద్వేగాన్ని, ఉన్మత్తపు ఆలోచనలని ఉత్తరం లోకి వొంపేసాకా ఇంకెక్కడి స్ట్రెస్‌? ఇంకెక్కడి టెన్షన్‌. ఉదయం లేచిందగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ”వొత్తిడి” జపం చేసే ఈ తరానికి ఉత్తరం రాయడం ఎంతటి ఉల్లాసకరమైన అనుభవమో చెప్పినా అర్థం కాదు. ఈ నాటి వొత్తిళ్ళని జయించగలిగేది ఉత్తరమే! కాదనగలరా ఎవరైనా?
‘ఐయామ్‌ ఎ స్ట్రెస్‌ ఫ్రీ బర్డ్‌’  అని నన్ను నేను నూటికి నూరుపాళ్ళు నిర్వచించుకోవడానికి, ఉత్తరం ఒక కారణమైతే నేను చేసే పనిని ప్రేమించడం, నా చుట్టూ అల్లుకున్న స్నేహాలు మరో కారణం. స్నేహంలో ఉత్తరం ఓ ముఖ్య భాగం. స్నేహాన్ని సెలయేరులా ఉరికించేది ఉత్తరమే. ఇక ప్రేమలేఖల గురించి చెప్పేదేముంది? సమస్త వస్తు సముదాయాన్ని స్వంతం చేసుకుంటున్న ఇప్పటి యువతకి అదే జీవితమనుకుంటున్న వాళ్ళకిి ప్రేమలేఖ రాయడంలోని మాధుర్యాన్ని చెప్పినా అర్థం కాదు. అసలు వీళ్ళ దృష్టిలో ప్రేమ నిర్వచనమే మారిపోయింది. ఎన్నో భావోద్వేగాల్ని, అంతరంగ దు:ఖాల్ని, మానసికోల్లాసాల్ని మడత పెడితే ఉత్తరమౌతుంది. ఎవరికి వారు వొంటరులౌతున్న ఈనాటి సందర్భంలో  తోటి మనిషితో తొలకరిజల్లులాంటి సంబంధాన్ని ప్రోదిచేసే ఉత్తరం బతికి బట్టకట్టాలని ఆశించడం ఆత్యాశేనేమో!!!

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to ఉత్తరం ఉత్త కాయితమేనా???

  1. నేను 100% అంగీకరిస్తాను . ఉత్తరాల్లొ అవతల వ్యక్తి ముఖ కవలికలు కూద కనిపిస్తయనిపిస్తుంది నాకు . చేతి రాత లో వ్వ్యక్తిత్వము కనిపిస్తుందనిపిస్తుంది
    నాకు. ఈ ఉత్తరాలు జీవము ఉంతుంది.
    వసంత .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.