తీర్తం బోదాం తిమ్మక్క

జూపాక సుభద్ర
తెలంగాణలో జాతర్లకు తీర్తాలు అనే వాడకం కూడా వుంది. యిక్కడ తీర్తాల సంబరాలెక్కువ. యిది వరకు పల్లెజనానికి తీర్తాలే ప్రధాన ప్రచార సమాచార ప్రసార సాధనకూడలి. యిక్కడ జిల్లాకు పది జాతర్లుంటాయి. బుగులోని జాతర, ఎల్లమ్మ జాతర. ఏడుపాయల జాతర, కొత్తకొండ, ఐలోని, ఇల్లెంతకుంట, కోటంచె, నాగోబ, కోమురెల్లి, కుంకుమయ్య, సట్టితీర్తం, మేడారం యింకా ఎన్నో జాతర్లున్నాయి తెలంగాణలో జాతర్లో జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర చాలా పెద్ద జాతర.
తమ సమూహం హక్కు కోసం బతుక్కోసం బాగుకోసం పోరాడినోల్ల పేరును జ్ఞాపకంగా తరతరాలు మోసుకుపోయే జీవనది కూడలి జాతర. వారున్న వూరు, పేరు యాదులు జాతర్లయినయి. జాతరంటే పల్లెలు పల్లెలు ఖాలి అవుతయి. ఎక్కడెక్కడో వుంటున్న వాళ్ళు, ఎన్నాళ్లకెన్నాళ్లకో చూసుకున్న వాళ్ళు యీ జాతరలో కలుస్తరు. ఎవరేం జేస్తున్నరు, పిల్ల, జెల్ల మంచి చెడ్డ, సావులు, పుట్టుకలు సంబంధించిన సమాచారమే జీవిత కలబోతలుంటాయి. స్థానికంగా స్థానికమైన బేరాలు జోరుగా సాగేది సంత తరవాత జాతరలోనే.
ఎంతలేమిలో వున్నా ఎంత కలిమిలో వున్నా కూడా జాతరను ఒక బాధ్యతగా పిల్లాది మారకాంచి గంగవెర్రులెత్తినట్లు జనం ముఖ్యంగా బహుజన కులాలు వెళ్తారు. వూరి నుంచి వాడనుంచి యితర వూర్లకు వలస బోయినవాళ్ళు, పెండ్లయి పోయిన మహిళలు యితర కారణాల రీత్యా బతక్కబోయిన వాళ్ళు పంటలకాన్నుంచి, గొడ్డుగోద, ఆపతి సంపతి కష్టసుఖాలు ముంగేసుకునే జాగ జాతర. జీవితాల్లో జరుగుతున్న మార్పుల్ని వల్లె వేసుకొని పంచుకునే ఒక పుర్సత్‌ కూడలి జాతర.
నిత్యం పనుల్తో చేతికి మూతికి తీరని బతుకు పోరాటంలో కూలి పనులు, పొలం పనులు, యింటి పనులతో సతమతమయ్యే   బహుజన కులాల మహిళలకు జాతర ఒక ఆట విడుపు. జాతర్లెక్కువగా స్థానికంగా గ్రామదేవుల్ల, దేవతల పేరుతో జరిగినా అది హిందూమత అనేక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడినవాళ్ళు. వారి పోరాట చరిత్రకు గుర్తుగా చేసేదే జాతర.
సమ్మక్క సారక్క జాతర మేడారంలో జరుగుతుంది. యీ మహిళలు కాకతీయుల రాజ్యంలో పన్నుకు వ్యతిరేకంగా పోరాడినోల్లు. రాజ్యాధికారాన్ని ధిక్కరించినవాల్లు. పోరాటంలో ప్రాణాలు పోయినవాళ్ళు. వారి జ్ఞాపకార్థమే మేడారం సమ్మక్క సారక్క జాతర. గుడులు, ఆలయాల వ్యవస్థ వుండదు. ఒక చెట్టుకింద రాయిగా, గద్దెగా వీరి ఆనవాల్లు, రూపాలు, జ్ఞాపకాలుంటాయి.
పల్లెల్లో ఏనాడు యింటికి తాళమెయ్యరు. గొడ్డున్నది, గోదున్నది, కోడిపిల్లెట్ల కొంక నక్కెట్ల, పిల్లెట్ల జెల్లెట్ల అని లక్ష ప్రశ్నలేసుకుంటరు యిల్లు బైల్దేరనీకి ఆడవాల్లు. కాని జాతర సందర్భాల్లో మాత్రమే వీటన్నింటికీ ఏదో ఒక బందబస్తు చేసి యిల్లెల్లుతరు. జాతరను వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు జనం. అనేక సాదక బాదకాలకు చర్చలు చేసే దానికి, పరిష్కారాలు పంచాదులు నడిసేదానికి, అలుపు తీర ముచ్చట బెట్టుకునేదానికి, మాట్లాడుకునే దానికి, ఉప్పుసకు, వూరటకు, ఓదార్పు జాతర. కొత్త కొత్త వస్తు పరిచయం, వినిమయం యీ జాతర్లనే జరిగేది. పూర్వం యితర నాగరికతలు ఆదాన ప్రదానములు జరిగేది కూడా జాతరలోనే తెలంగాణ కొన్ని జిల్లాల్లోని జాతర్లలో సిడీలెత్తుడు – జోగినీతో శివాలు తూలించడం వుంటది. కాని సమ్మక్క సారక్క జాతర్లో జోగినీల కంటే శివసత్తులు ఎక్కువగా కనిపిస్తది. శివసత్తులు, జోగినీలు వేరువేరు. శివసత్తులంటే శివాలు తూలే వాల్లు. జోగినీలకుండే దురాచారాలు వీరికి లేవు.
యిదివరకు, యిప్పటిక్కూడా అక్కడక్కడ ఎడ్లబండ్లు కట్టుకుని వస్తరు జనం. జాతరలో వసర్తు వున్న కాడ బండి బెట్టుకొని అక్కడ తిండి పంట పండక ఎండకు నీడకు ఎడ్లబండే. బండి యిడుసుకొని జాతరంతా తిరుగుతరు. చుట్టాల కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం, తెల్సినోల్ల కోసం కల్సినోల్లను ఎడ్లబండి అడ్డాకాడికి తీసుకొచ్చి తాపిచ్చి తినిపిచ్చి మర్యాద చేస్తరు. మల్లా వీళ్లను వాల్లు తీస్కపోయి తినతాగ చెస్తరు. అదొక గొప్ప మర్యాదగా యిచ్చిపుచ్చుకునుడు జరుగుతది.
యిక వయసు పిల్లలకు జాతరంటే యమజోరు మీదుంటరు. యిష్టమైన వాల్లకు దగ్గరోల్లకు ప్రేమికులకు నచ్చినవి. కొత్త వస్తువుని వదలకుండా కొంటుంటరు. మగవాల్లు తమకు యిష్టమైన ఆడవాల్లకు గాజులు, పిన్నీసులు, దండలు అత్తర్లు జడకుచ్చులు, పూలు, చెవిపోగులు, జడపిన్నీసులు కొనిస్తుంటరు. జాతర్లో వస్తువు అందులో నచ్చిన వాడు కొనియ్యడము ఆ ఆడవాల్ల ఆనందాలకు అంతుండది. అట్లనే ఆడవాల్లు తమ ప్రియమైన మగవాల్లకు లుంగీలు, తువాల్లు, చేతికి ఫ్యాన్సీ కడియాలు, కొనిచ్చి సరదా పడ్తరు. తిననీకి కుడుకల పేర్లు సిల్కల పేర్లు ఒకరికొకరు కొనిస్తరు యిక చిన్న పిల్లల ఆనందానికి అంతుండది. లాయిలప్పేలు, కాశిబుగ్గలు, పుంగీలు, చాలు వాల్లకు. అవి కూడా అందరి పిల్లలకు అందుబాటులో వుండవు.
కొన్నాళ్ల నుంచి యీ జాతర్లని హిందుత్వంగా మార్చేస్తున్నరు. గుడులు కట్టడం. దూపదీపనైవేద్యాలు, మంత్రాలు, వైదిక పూజల్తో జాతర నైజాన్ని, గొప్పతనాన్ని దెబ్బదీస్తున్న పరిస్థితులు విస్తరిస్తున్నయి. ప్రకృతిలో సహజాతి సహజంగా జరిగే మానవసంబంధాల సంబురాలకూడల్ని కలుషితం చేసే శక్తుల్ని అడ్డుకోవాల్సి వుంది. పచ్చటి సముద్రాల్ని, జంపన్న వాగు జలాల్ని కాపాడుకొనే జాతర్లకు బోదాం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.