లకుమ
తొలి మహా మంత్రిణి నాయకురాలు నాగమ్మ అనటంలో వై.హెచ్.కె. మోహనరావు (పుస్తకరచయిత) లాగే నాకు ఎటువంటి సందేహమూ లేదు. ముందుగా వారికృషికి అభినందనలు నా పక్షానా, స్త్రీ వాదుల పక్షానా.
దాదాపు వెయ్యేళ్ళ కిందట ఒక స్త్రీ అందునా భర్తను కోల్పోయిన స్త్రీ ఒక రాజ్యానికి మహామంత్రిణీ కాగలిగిందంటే అది ఆమె ప్రతిభకు తార్కాణం. ఆమె నాయకత్వాన్ని అంగీకరించిన అప్పటి ప్రజల సహృదయతకు దర్పణం.
నాగమ్మ తండ్రి రామిరెడ్డి కరీంనగర్ జిల్లా, పెగడపల్లి మండలం, అరవెల్లి గ్రామం నుండి తనబావమరిది మేకపోతుల జగ్గారెడ్డి వుంటోన్న పల్నాడులోని జిట్టగామాలపాడు గ్రామంకు రావటంతో నాగమ్మ గురించిన పుట్టు పూర్వోత్తరాల సమాచారం కొంత మనకు లభిస్తుంది.
శివభక్తుడైన గోపన్న మంత్రి వద్ద చదువుతో పాటు సాముగరిడీలు, ధనుర్విద్య, అశ్వశిక్షణ పొందడం, సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషల్లో పాండిత్యం సంపాదించడం, తత్వశాస్త్రం, రాజనీతిశాస్త్రం అధ్యయనం చేయడం చూస్తే నాగమ్మ బహుముఖ ప్రజ్ఞ అవగతమౌతుంది. వెయ్యేళ్ల నాడే ఆధ/నిక స్త్రీ లక్షణాలను అందిపుచ్చుకున్న నాగమ్మ ఆనాటి స్త్రీల కంటే వెయ్యేళ్ళు ముందున్నదన్నది నిజం. నాగమ్మ జీవన నేపథ్యం చూసినప్పుడు ఈమెతో పోల్చటానికి ఆకాలంలో భారతాన నాకు ఒక్కరూ దొరక్కపోవటం విచారంగానూ, సంతోషంగానూ వుంది.
చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోవడం ఆమె దురదృష్టాన్ని తెలియపరుస్తుంది. ఇంక భర్త సింగారెడ్డి అకాల మృతి ఆమె దురదృష్టానికి పరాకాష్ట నాగమ్మ లౌకిక వ్యవహారాల్లోకి మళ్ళటానికి ప్రధాన కారణం ఒక చెరువు త్రవ్వకంలో జరిగిన రాజకీయ కుట్రలో భాగంగా బ్రహ్మన్న తండ్రి దొడ్డ నాయుడు, రామిరెడ్డి సాగు భూమిని ఎంపిక చేయడం, ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ఘర్షణల్లో తండ్రి రామిరెడ్డి, మామ జగ్గారెడ్డి ప్రాణాల్ని కోల్పోవడం ఒక పెను విషాధం. ఒక తీరని దుఃఖం, దీని కంతకు కారణం మన చేత ‘చాపకుటితో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న’ అని కీర్తింపబడుతున్నవాడు. ఇక్కడ మనం ఒకసారి శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ మననం చేసుకుంటే మనకు కొంత జ్ఞానోదయం కొత్తగా పల్నాడు విషయంలోనూ కలుగుతుంది. చరిత్రను ఎంతగా వక్రీకరించవచ్చునో ఈ పుస్తకం చదివితే అవగతమవుతుంది.
ఈ పుస్తకానికి సంబంధించి కొన్ని ముఖ్య రిఫరెన్సులను చివర్లో మన ముందు వుంచిన రచయిత కృషిని, ముందుచూపును మనసారి అభినందిస్తున్నాను.
ఇది చదివాక నాగమ్మ పట్ల నాకు అంతకుముందు లేని ప్రేమ, అభిమానం కలిగాయి. అందిరలాగే నాకూ వున్న కొన్ని అపోహలు తొలిగిపోయాయి.
నాగమ్మ మనోధైర్యం అచంచలం, అనూహ్యం. అనితర సాధ్యం కూడా. బ్రహ్మనాయుడు బంధుగణం అక్రమంగా దాచిన (మన రాజకీయ నాయకుల్లాగే) రాజ్యసంపదను తిరిగి ఖజానాకు రాబట్టడం, ఆమె దేశభక్తికి నిదర్శనం. స్విస్ బాంకుల నుండి మన సంపదను తిరిగి తీసుకురాలేని మన పాలకులు నాగమ్మ కాలిగోటికి కూడా సరిరారు. నలగాముడు విచారంలో వున్నప్పుడు అర్జునుడైతే, అప్పుడల్లా ధైర్యవచనాలు పలికిన నాగమ్మ సాక్ష్యాత్తూ శ్రీ కృష్ణుడే. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడం ద్వారా బ్రహ్మన్నకు తరచు నాగులేటి నీరు తాగించింది నాగమ్మ.
కోడిపందాలలో (ఇవి పానగల్లు కోళ్ళు), బ్రహ్మనాదులు 4 ఏళ్ళు (ఏడేళ్ళకు గాను) రాజ్యం విడిచి వనవాసం వెళ్ళడం ఇట్లాంటి సంఘటనలు మనకు మహాభారతంలోనే కనబడతాయి. అడవులకు వెళ్ళినా ఇక్కడ బ్రహ్మన్న వర్గాన్ని పాండవులతో పోల్చడానికి లేదు. చాలా సందర్భాల్లో మనం బ్రహ్మనలో దుర్యోధనుడ్ని చూస్తాం. బాలచంద్రుడు విషయానికొస్తే మాత్రం బ్రహ్మన్న సాక్షాత్తు ధృతరాష్ట్రుడే. ఇంక నాగమ్మ ద్రౌపది కష్టాలు, అవమానాలు పడ్డది. ద్రౌపది లాగే నాగమ్మ శక్తి స్వరూపిణి.
బ్రహ్మన్న అనుచరులు గోసంగులు (మాదిగలు) ధర్మం నాయకురాలి వైపే వుందనటం, కీలక సమయాల్లో తమ సహాయ నిరాకరణను ప్రకటించటం వారి విచక్షణకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును. ఇప్పటికీ మాదిగలు ధర్మ పోరాటం చేయటం బహుశా అప్పటి స్ఫూర్తేనేమో? నాగమ్మ ఆమెగా సంధికి రావటం, బ్రహ్మన్న అనుచిత కోర్కెలను ఆమె అంగీకరించటం గోసంగులను ధర్మం వైపున వుండేలా కట్టిపడేశాయి. ఆమె పై మనం ఇంకా ఎందుకు యుద్ధం చేయాలి? అకారణంగా ఎవరి తలలు నరకాలి? అనటం వారి ధర్మ నిబద్ధతను తెలియజేస్తోంది. నాగమ్మ ఇట్లా అన్ని వర్గాల మనసులను గెలిచింది కాబట్టే యుద్ధంలోనూ గెలిచింది. చాలా సందర్భాల్లో బ్రహ్మానాయుడి అంతరాత్మను గెలుచుకునే వుంటుంది. బ్రహ్మనాయుణ్ణి సత్యపీఠం ఎక్కిస్తే ఈ విషయం ఆయన నోటివెంటే మనం వినొచ్చును.
నాయకురాలి చేతిలో శీలం బ్రహ్మనాయుడు ఒరిగాడని ఈ వ్యాసకర్త, రచయితతోనూ, తిరుపతి, మద్రాసు ప్రాఛ్యలిఖిత వ్రాతప్రతులతోను ఏకీభవిస్తున్నాడు. మహావీరులని ప్రచారం గావించబడ్డ బ్రహ్మన్న పక్షంలోని వారంతా నాయకురాలి పక్షం వారిచేత హతులయ్యారన్నది కూడా సత్యదూరం కాదు.
వీటనన్నింటినీ ఆమె దౌత్య సంబంధాలు నెరపిన తీరు బలపరుస్తోంది. ఒక్క మాచర్లతో తప్ప మిగిలిన ఏ రాజ్యంతోనూ నాగమ్మకు పేచీలు లేకపోవడం యుద్ధంలో చాలామంది రాజులు నాగమ్మకు వెన్నుదన్నుగా నిలవడం చూస్తే నేటి ప్రజాస్వామ్య లక్షణాన్ని, ధర్మాన్ని రక్షించటంపట్ల వారి కర్తవ్యదీక్షనూ ఆనాడే ప్రజలు చూడగలగడం అది వారి అదృష్టం.
వ్యూహప్రతివ్యూహంలోనూ, యుద్ధతంత్రంలోనూ నాగమ్మ ఎంత అందె వేసిన చేయో నల్లగొండ నుండి మేళ్ళవాగు కనుమ వరకూ పొడవాటి నగులేరూ చెప్తాయి.
బహుళ ప్రచారంలో వున్నట్లు (సినిమాల్లో చూపినట్లు కూడా) నాగమ్మ పదవి కోసం వెంపర్లాడిన మాట నిజం కాదు. ఇప్పటి నాయకురాళ్ళు (33%లేకుండానే)నాగమ్మను చూసైనా తెలుసుకోవాలి. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం విజ్ఞత. అట్లాంటి విజ్ఞతనే నాగమ్మ ప్రదర్శించింది.
అనుగురాజు కోరుకోమన్న వరాన్ని మొదట సున్నితంగా తిరస్కరించడం చూస్తే ఆవిడలో ఒక విరాగిని కనిపిస్తుంది. ఒత్తిడి కారణంగానే మంత్రి పదవిని స్వీకరించడం, యుద్ధానంతరం విజయం సాధించినా మంత్రి పదవిని కాదనడం చూస్తే పదవీ కాంక్షతో ఆమె ఎన్నడూ రగిలిపోలేదు బ్రహ్మన్నలా అని చెప్పుకోవచ్చును.
చివరి రోజుల్లో స్వగ్రామంలో ప్రజా సేవలో, దైవచింతనలో గడపడం చూస్తే ప్రజలతో, ప్రజలమధ్యన, ప్రజల కోసం బతకాలనుకున్న నాగమ్మ ఎప్పటికీ ప్రజల మనిషే. బందిపోట్లు తరచు తన గ్రామం మీద దాడి చేస్తుంటే ప్రజలందర్నీ ఒక త్రాటిపై నడిపి నిన్న విడిచిన పోరాటం నేడు అందుకొనక తప్పదని పల్నాటి ప్రజలకు చాటి చెప్పిన వీరనారి నాగమ్మ. గురజాలలో నాగమ్మ దూబచెరువు త్రవ్విస్తే మనం ఒక చెరువులోనూ పూడిక తీయించలేకున్నాం. ఆమె జన్మస్థలం అరవెల్లిలో నాగమ్మ పేరున గుడీ, వాగూ పిలువబడటం అదీ వెయ్యేళ్ళ తర్వాత కూడా ఓ గొప్ప చారిత్రక విశేషం.
చివరగా ఒక్కమాట, ఒక స్త్రీని తొలి మహామంత్రిణిగా అంగీకరించిన, ఆనాటి పల్నాడులోని ప్రతి పౌరునికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ‘నాగమ్మ’ పేరున ఒక నవలను తేవాలని రచయితను తెలుగు ప్రజలందరి తరపునా కోరుతున్నాను. అట్లాంటి నవల మీదా ఇప్పట్లాగే తప్పక నా అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకుంటాను.
‘పల్నాటి యుద్ధం’ సినిమాను నాగమ్మ (నాయిక) ప్రధానంగా పునః నిర్మించే బాధ్యతను పల్నాడులోని మనసున్న మా రాజులు మరియు కోటీశ్వరులు చేపట్టాలని ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చదవాలనీ కోరుతున్నాను.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags