సునీతా విలయమ్స్. స్ఫూర్తికి మారు పేరు. సంచలనాల చిరునామా. అంతరిక్షంలో 195 రోజులు గడిపిన తొలి మహిళ. చిరునవ్వుల సునీత భారత సంతతికి చెందడం, ఇంత ఘనమైన ప్రపంచ రికార్డును సాధించడం, అపూర్వం. అపురూపం. భారతీయులందరికి గర్వకారణం. భారతీయ మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆకాశం మా హద్దంటూ నినదించిన మహిళోద్యమం, ఇక నుండి అంతరిక్షం మా ధ్యేయం అంటూ సునీత స్ఫూర్తిని గర్వంగా స్వీకరిస్తుంది.
జూన్ 22, 2007 రోజున అట్లాంటస్ వ్యోమనౌక భూమిని తాకే వరకు సర్వ మానవాళి ఉద్విగ్నంతో సతమతమయ్యింది. నరాలు తెగే ఉత్కంఠని అనుభవించింది. కల్పనా చావ్లా విషాద మరణం మనోఫలకం మీదికి పదే పదే దూసుకొచ్చి గుండెను వొణికించిన సందర్భం. 2003లో కొలంబియా పేలిపోయి కల్పనాచావ్లా ఆకాశంలోనే అంతర్థానమై పోయిన దుర్ఘటన ఆ రోజు అందరి కంట నీరు పెట్టించింది. అంతటి ఉద్విగ్న ఘడియలకి చెక్ పెడుతూ జూన్ 22న సునీత బృందం క్షేమంగా నేలమీద అడుగు పెట్టారు. సమస్త ప్రపంచం హాయిగా ఊపిరి పీల్చుకుంది. అంతరిక్షం నుంచి కిందికి వచ్చిన వెంటనే తనకి మళ్లీ అంతరిక్షంలో వెళ్ళాలనుందని, చంద్రుడి మీద అడుగు పెట్టాలనుందని సునీత చెప్పడం వెనుక నిలువెత్తు ఆత్మవిశ్వాసం కన్పిస్తుంది.
అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మహిళగానే కాక సునీత మరెన్నో అద్భుతమైన రికార్డుల్ని నెలకొల్పింది. 29 గంటల 17 నిముషాల పాటు అంతరిక్షంలో నడిచి ప్రపంచం రికార్డు సృష్టించింది. అలాగే అంతరిక్ష కేంద్రంలోనే వుంటూ ట్రెడ్‌మిల్‌పై మారథాన్ రన్‌లో పాల్గొని మరో రికార్డును కూడా సునీత సృస్టించింది. 41 సంవత్సరాల సునీత 1965 సెప్టెంబరు 19న యూక్సిడ్, ఓహియోలో పుట్టింది. ఆమె తండ్రి డా. దీపక్ పాండ్య గుజరాత్‌కి చెందినవారు. తల్లి బోనీ స్లావేనియా దేశస్తురాలు. ఆమె భర్త విలియమ్స్ అమెరికా దేశస్తుడు. సునీత చదువంతా అమెరికాలోనే చదివింది. భారత సంతతికి చెందినప్పటికీ సునీత అమెరికా పౌరురాలే. అమెరికా పౌరురాలుగానే అంతరిక్షంలోకి వెళ్ళింది.
1998లో సునీత ‘నాసా’లో ఎంపికయ్యింది. అదే సంవత్సరం ఆగష్టులో ఆమె శిక్షణ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆమె ప్రయాణించిన అట్లాంటిస్ వ్యోమనౌకలో ఫ్లయిట్ ఇంజనీర్‌గా వున్న సునీత అమెరికా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం పనుల్లో పాలుపంచుకొంది. భూమికి 320 కిలోమీటర్ల ఎత్తులో అమెరికా నిర్మిస్తున్న ఈ అంతరిక్ష కేంద్ర నిర్మాణం 1998లో మొదలైంది. ఎన్నో దేశాలకు చెందిన వ్యోమగాములు ఈ కేంద్రాన్ని సందర్శించారు. 2010 లో దీని నిర్మాణం పూర్తవుతుంది. మనవాళి బాగుకోసం, వివిధ రకాల పరిశోధనల కోసం నిర్మిస్తున్న ఈ కేంద్రంలోనే సునీత 195 రోజులు గడిపి విజయవంతంగా తిరిగివచ్చింది. అంతకు ముందు సునీత అమెరికా నావికాదళంలో పనిచేసింది. ముఫ్ఫై రకాల విమానాల్లో వివిధ ప్రాంతాలకి ప్రయాణాలు చేసింది. ఈ అనుభవమే సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపేందుకు దోహదం చేసింది.
సునీతని ఎన్నో అవార్డులు వరించాయి. ఎన్నో రికార్డులు ఆమె పేరిట నెలకొన్నాయి. మూడు సార్లు స్పేస్‌వాక్ చేసిన సునీత భూమికి తిరిగి రాగానే ఎబిసి టెలివిజన్ నెట్‌వర్క్ ”పర్సన్ ఆఫ్ ది వీక్”గా ఎంపిక చేసింది. అంతరిక్ష కేంద్రంలో వుండగానే ” మీ కలలపై నమ్మకముంచండి. విజయం మీ సొంతమవుతుంది” అని భూమి మీద వున్న మానవాళికి సందేశం పంపిన సునీత ఆత్మవిశ్వాసంతో తొణికిస లాడుతుంది. ” మేము దేనిలోనూ తీసిపోము. అవకాశం రావాలే గాని అంతరిక్షయానం మాకో లెక్కా?” అంటూ ఛాలెంజ్ విసిరింది. మనల్ని అణిచివుంచే సవాలక్ష వివక్షల ఉక్కు సంకెళ్ళని తెంచుకోవాల్సిన అవసరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాల్సిన ఆవశ్యకతని సునీత అద్భుతమైన తన ఆచరణ ద్వారా మన ముందుంచింది. ‘అబల’ అనే పదాన్ని శాశ్వతంగా డిక్షనరీ నుంచి తుడిచేసిన సునీతకు భూమిక జేజేలు పలుకుతోంది. ఆమె స్ఫూర్తిని గుండెల్లో నింపుకోమంటోంది.
సునీత అంతరిక్షము లోకి వెళ్ళిన మహిళ గా సంతోషించినా ఆవిడ ప్రయోగాల వెనుక అమెరికా అంతరిక్ష ఆయుధ పోటీ ముఖ్య ఉద్దేశ్యము. ఈ విషయమ్మీద గర్వించ తగ్గ , ఆనందిచ తగ్గ పని సునీత చేయలేదనేదె నా అభిప్రాయము.
మానవ జాతికి ప్రమాద కరమైన ప్రయోగాలు ఆడవారు చేసినా ప్రమాదమే.
కాబట్టి ప్రయోగాల అసలు ఉద్దెశ్యము వ్రాయటము మర్చిపోయి చేసినది స్త్రీ యా లేక పురుషుడా అని గర్వించడము సముచితము కాదు అని మనవి.
ఆనందు.