జూపాక సుభద్ర
సెప్టెంబర్ 17 రాంగనే రాజకీయ పార్టీలు చాన హడావుడి హల్‌చల్ జేస్తరు కాని తర్వాత సప్పబడ్డ సొప్పకట్టలోలె సప్పుడు జెయ్యరు. ఒకడు విమోచన అంటడు యింకోడు విలీనమంటడు. లేదు లేదు సెప్టెంబర్ 17 అనేది ఒక దురాక్రమణ అనీ, భారత సామ్రాజ్యవాదం హైద్రాబాద్ స్టేట్‌ని దురాక్రమించిందని తెలంగాణ వాదులు అంటారు. నిజానికి సెప్టెంబర్ 17 ఒక వూచకోత జ్ఞాపకం. నెత్తురు చిందిన మరణ విషాదాల యాది. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర సంబరాలు యిక్కడ జాగలే. నిజామ్ నవాబు అతని కింద వుండే దేశ్‌ముఖ్‌లు, బహుదుర్‌లు, రెడ్డి, వెలమదొరలు వంటి అనేక తాబెదారులు యిక్కడి జనం మీదబడి వేటకుక్కల్లాగ వారి రక్తాన్ని, చెమటను పిండుకొని కోట్లకు పడగలెత్తిండ్రు. ప్రపంచంలోనే రిచ్చెస్టు హైద్రాబాద్ స్టేట్‌గా కీర్తి పొందింది. నిజామ్, అతని తాబేదార్లు చెమటోడ్చినందువల్ల ఒనగూడిన సంపద కాదు. ప్రజల గోల్లూడగొట్టి వాళ్ళ పొట్టలు గొట్టిన కోట్ల సంపద అది. అంగల్ల ముత్యాలు, గోల్కొండ వజ్రాలు అన్నీ ప్రజల చెమట చుక్కలే. అట్లాంటి నిజాం రాజ్యాన్ని భారత్‌లో కలవడమంటే 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యాలు అక్రమంగా, దురాక్రమిస్తూ పగడ్బందిగా ఆక్రమించుకున్నయి. ఆ దురాక్రమణలో కొన్ని లక్షలమంది ముస్లిమ్స్‌ని, నిజాం సైనికుల్ని వూచకోత కోచింది. యీ వాస్తవాలు, యీ నెత్తుటి జ్ఞాపకాలు, విషాదాలు, అమరత్వాలు ఎక్కడా రికార్డు కావు, స్మరణకు రావు.
విలీనాలు, విమోచనలు అంత సజావుగా జరగలేదనే దాని మీద, పారిన నెత్తుటి మీది ప్రశ్నల మీద ఏ సభలు జరగవు. యీ నిశ్శబ్దాల మీద. యీ హింసాకాండల మీద, వూచకోతల మీద దురాక్రమణల మీద మాట్లాడాల్సిన అవసరముంది. కేవలం మాటలుగాకుండా సావిత్రిబాయి, పూలే అంబేద్కర్‌లలాగా ఒక సంస్థాగతమైన ఫోర్స్‌గా మాట్లాడాల్సిన అవసరముంది.
హిందూ బ్రాహ్మణ వ్యవస్థ బ్రిటిష్ పాలకులతో మిలాఖత్ కావడం వల్లనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంగా వందల ఏండ్లు మనగలిగిందనీ, బ్రిటీష్ వాల్లతో చేతులు కలిపి ముస్లిం రాజ్యాల్ని కూలదోసిందనీ, వాల్లతో సజావుగా దర్జా పదవులు, ఉన్నత పదవులు అనుభవిస్తూ వారి కులాల్లో వుండే దురాచారాల్ని సంస్కరించుకున్నదనీ, దుర్గంధమైన కుల సంస్కరణ జోలికి పోకుండా, కులపునాదైన హిందూ మతాన్ని మాత్రం కీర్తిస్తూ కొనసాగిస్తూ వచ్చిందనీ చరిత్రకారులు ఋజువు చేశారు. అదే కొనసాగిస్తూ యిక్కడి హిందూ బ్రాహ్మణ శక్తులను కలుపుకొని ముస్లిం నిజాం రాజ్యమ్మీద బడి లక్షలమందిని చంపి ఆక్రమించుకొని అన్ని రంగాల్లో వున్నత పదవుల్ని పొంది పాలించింది. అందికే హైద్రాబాద్ స్టేట్‌ని భారత్ ఆక్రమించుకున్నాక రాజకీయ నాయకులుగా, సాంఘిక, ఆర్థిక రంగాల్లో బ్రాహ్మణులే కనిపిస్తారు. (పివి, బూర్గుల, టంగుటూరి ప్రకాశం పంతులు మొ||)
ఆశ్చర్యమేందంటే తెలంగాణ ఉద్యమం కూడా సెప్టెంబర్ 17 మీద సీరియస్ చారిత్రక అంశాల మీద ఒక నిర్దిష్ట అవగాహన యివ్వలేకపోవడం. యిది చాలా ముఖ్యమైన చారిత్రక సందర్భం తెలంగాణకు. దురాక్రమణ అనేది రాజకీయంగా యిక్కడ మొదలైంది. కాని కావాలనే కొన్ని శక్తులు యీ సెప్టెంబర్ 17ను దడ్కం దుడ్కం చేసి వదిలేస్తున్నరు, అట్లా చరిత్రల్నే మూసేస్తున్నరు. కాని అట్టడగున పడి కనిపించని లోతుల్ని తొవ్వాల్సిన అవసరముంది.
ఓ దిక్కు తెలంగాణ జిల్లాలు కవాతు జేస్తున్నయి. యింటికో మనిషి చేతిలోనిండా పిలుపులు ధ్వనిస్తున్నయి. తెలంగాణ కోసం అందరు కూడిన గొంతు ఢిల్లిని తల్లడియ్య జెయ్యాలెనని. మీకు మీ వూరు పల్లెలున్నయి పోండ్రి పోండ్రి అని 60 సం|| సంది తెలంగాణోల్లు ఆందోలిస్తనే వున్నరు. కొట్టినా తిట్టినా ధూ.. అన్నాయీన్నే పడి ఏడ్వకుంటే ఎల్లిపోవచ్చు గదా యీ సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు. అరే తెలంగాణ బిడ్డలు వాల్లకువాల్లు చచ్చిపోయేట్లుగా చంపుకుంటూ బండపాకురోలె పట్టుకొని వుండుడు ఏం ఆత్మగౌరవం? తెలంగాణల బహుజన కులాల పిల్లలు 60 ఏండ్లకాంచి వేలమంది సచ్చిపోయినాకూడా యీన్నే పీఠాలు గట్టుకొని కదుల్తలేరు. గింత జరుగుతున్నా గీ తెలంగాణల ఏం గాలిపోయిందో అర్తం కాదు. ఆంధ్రదిక్కుకూడ సెట్లు సేమలు, పచ్చ, పైర్లు బోలెడు బొచ్చెడు నీల్లు, సముద్రాలు, బంగారు గనులు రాతి సంపద కోకొల్లలు వదులుకొని వూరుగాని వూల్లల్లకొచ్చి పల్లెగాని పల్లెలకొచ్చి ఎనుకది ముందుది నేల, నీల్లు ఆక్రమించుకొని మా కట్టుబొట్టును, భాష, యాస హేళన జేస్తుంటిరి. చీ.. పో… అన్నా అవమానించినా యీన్నే ఎందుకుంటరో గీ ఆంద్రోల్లు.
తెలంగాణ ఉద్యమం సామాజికంగా వచ్చింది. సమైఖ్యాంధ్ర వుద్యమం పోటి ఉద్యమంగా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునే దానికి వచ్చింది. అట్లనే దండోర ఉద్యమం ఎస్సీ కులాల న్యాయపంపకాలకై వచ్చిన సామాజిక వుద్యమం. దీనిమీద పోటీగా ఎస్సీల న్యాయపంపకాలను అడ్డుకునేందుకు మాల మహానాడు వచ్చింది. మరి సామాజికంగా న్యాయమైన తెలంగాణ ఉద్యమం పోటీ సంగమైన తెలంగాణ మాలమహానాడును ఎందుకు భాగస్వామ్యం చేసుకున్నదనీ, తెలంగాణ దండోర కుల సంగాల్ని భాగస్వామ్యంగా ఎందుకు ప్రకటించడం లేదని దండోర సంగాలు ఆందోళన పడ్తున్నరు. కులం ఒకటి గుండి కుర్చీలు పదై కావాలనే చైతన్యాల్తో పాలక కులాలుంటే మాదిగమాలదళిత కులాలకు కుర్చీ వూసు పట్టదిగాని కులంగా మాత్రం పేల్కలు పేల్కలు. ఎన్నన్న వుండనీ ముందు చలో తెలంగాణ మార్చ్‌కు కదులుదాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags