కృతి (కె. కృష్ణకుమారి)
బీటలు వారిన నేల గుండెను
ఆర్తిగా హత్తుకున్న చినుకు చుక్కలా
నీ మాటలోని మానవీయ స్పర్శ
ఆత్మీయంగా నన్ను అల్లుకుంటే
వెలుగుదారులు పరిచినట్లయ్యింది
అది నోటిమాటకే పరిమితమైన
అవకాశవాదమని అర్థం కాక
నీవంటే నేనని
నీవు లేకుంటే నేను లేనని
నీకు నేనున్నాననడంలో
‘న’కారపు వ్యంగ్యం గుర్తించలేక
నన్ను నేను ఆర్దంగా మార్చుకుని
అఖండ పవ్రాహంగా మారాను
వంతెన దాటేందుకే ఈ మాటలని
ఈ మాటలు నీకలవాటేనని తెలిసి
యిదేమిటని ప్రశ్నిస్తే
ఏ పూవు అందం దానిదేనని
వెకిలినవ్వు నవ్వడమే కాక
నాది అసూయన్నావు
స్త్రీకి స్త్రీయే శతువ్రన్నావు
పేమ్రంటే అన్ని సహించడమన్నావు
పరపురుషుడి నీడ సోకితేనే
శీలపరీక్షపెట్టే నీవు
నీది మాతం మగతనమన్నావు
దంపతి ధర్మాన్ని
నా వరకే పరిమితం చేసి
నీ స్వేచ్ఛను ప్రకృతి సహజమన్నావు
నిజమే!
నీ కనుసన్నల్లో నా అస్తిత్వం కోసం
పాకులాడినంత కాలం
మాకు మేం శతువ్రులమే!
ప్రేమంటే
నువ్వు చెప్పే అర్థాన్ని
అంగీకరించినంత కాలం
నిన్ను మోసే గాడిదలమే!
నీ ద్వంద్వనీతిని
గుర్తించనంత కాలం
అసూయా పరులమే!
మనం
ఒకరికొకరం అనుకోనంతకాలం
నువ్వు నువ్వే!
నేను నేనే!!
యింతకాలం
నేనెలా వుండాలో
నువ్వు నిర్ణయించావు
యిక నేను నిర్ణయించుకుంటా