పి. ప్రసాదు, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఢిల్లీ కూడా కైరో బాట పట్టింది. జంతర్ మంతర్ కూడా త్రెహ్రిక్ స్క్వేర్‌ను అనుసరించింది. ఇక్కడ కూడా ‘ట్విట్టర్’ సందేశాలతో సైబర్ యువతరం మొదటిసారి రోడ్డెక్కింది. ‘ట్యూనీస్ సిటీ’లో ఓ యువకుని విషాదభరితమైన ఆత్మార్పణ అరబ్ జాతీయ వెల్లువకి నాంది పలికింది. ఢిల్లీలో ఓ యువతి వేదనాభరితమైన మరణం ఒక దేశవ్యాపిత నిరసన వెల్లువకి కారణమైనది. అక్కడ యువకుడు, ఇక్కడ యువతి! అక్కడ చిన్న పండ్ల వర్తకుడు, ఇక్కడ మెడికల్ విద్యార్థిని. అక్కడ ఆత్మార్పణ, ఇక్కడ మృగార్పణ! అక్కడ నడిరోడ్డుమీద, ఇక్కడ రోడ్‌మీద నడుస్తున్న బస్‌లో! అక్కడికీ, ఇక్కడికీ రూపంలో యిలాంటి కొన్ని తేడాలున్నాయి. కానీ సారంలో మాత్రం ఒక పోలిక వుంది. అక్కడా, యిక్కడా రోడ్డెక్కింది ఒకే రకం జనం! అదే హైటెక్ యువతరం. వారిని రోడ్డెక్కించిన ‘యంత్రాంగం’ ఒకటే! అదే ‘ఇంటర్నెట్’ వ్యవస్థ!
చీకటి క్షుద్రశక్తుల చేతుల్లో ‘నిర్భయ’ బలైపోయింది. అయితే అందులో ఆమె మొదటిది కాదు. చివరిదీ కాదు. ఇలాంటి ‘నిర్భయలు’ రోజూ ఏదో ఒక మూలన బలవుతూనే వున్నారు. ప్రజలు దోపిడీ పాలక వర్గాలపై పోరాడుతున్న సందర్భాలలో ఖాకీ దుస్తుల్లోని రాజ్య సాయుధ బలగాలే స్త్రీలపై అత్యాచారాలు సాగిస్తున్నాయి. సామాజిక ఆధిపత్య శక్తుల చేతుల్లో దళిత, నిమ్న వర్గాల స్త్రీలు అత్యాచారాలకు గురవుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో పౌర దుస్తుల్లోని సామాజిక క్షుద్ర శక్తులు కూడా యిలాంటి దారుణాలకే ఒడిగడుతున్నాయి. కాశ్మీరులోయ, ఈశాన్య రాష్ట్రాలు, వాకపల్లి సంఘటగలు మొదటి కోవలోకి వస్తాయి. పౌర దుస్తుల్లోని క్షుద్ర శక్తులే నేడు ‘నిర్భయ’పై అ(హ)త్యాచారం చేశాయి. ఏదో ఒక రూపంలో యివి దేశంలో నిత్యం జరుగుతున్నవే. అయితే అవి అడవులూ, కొండలూ, లోయలూ, వెలివాడల నుంచి క్రమంగా నగరాలకి కూడా విస్తరించాయి. ‘హైటెక్ సిటీలు’ కూడా నేడు మృగయారణ్యాలుగా మారుతున్నాయి. సైబర్ అడవుల్లో కూడా స్త్రీలపై పంజా విసురుతున్న ‘పులి’రాయుళ్ళున్నారు. వారిని తొండాలతో నలిపివేసే ‘గజ’రాయుళ్ళున్నారు. జూలు విదుల్చుతున్న నర ‘సింహాలు’న్నాయి. ఈ మృగాల గాండ్రింపులు, గర్జింపులు, ఘీంకరింపులతో నేడు సైబరు సిటీలు సైతం అదిరిపడుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో యిలాంటి నరశార్దూలాలకే ‘నిర్భయ’ బలైపోయింది.
‘పెట్టుబడి ఎక్కడ వుంటుందో అక్కడ ఒక క్షుద్ర సంస్కృతి పుడుతుంది. అది ఉచ్చ, నీచాల మధ్య తేడా తెలియని ఓ క్షుద్ర సంతతిని సృష్టిస్తుంది. ఇది ఆకాశం నుంచి వూడి పడదు. పౌరసమాజం నుంచే అట్టి శక్తులు మొగ్గతొడుగుతాయి. వీటినే రాజకీయ భాషలో క్షుద్ర (లంఫెన్) వర్గమంటారు. ఈ వర్గానికి ‘నిర్మాణం’ తెలియదు. ‘కూల్చివేత’ మాత్రమే తెలుసు. ఆయా కాలాలలోని అన్ని సామాజిక విలువలనూ అది నిర్దాక్షిణ్యంగా విధ్వంసం చేస్తుంది. అది కూల్చిన గోడల కింద నలిగిపోయే ‘రక్తమాంసాలు’ దానికి పట్టదు. ఎలాంటి కనికరమూ లేని ప్రత్యేక వర్గమది. అది ఇప్పుడు మన సమాజంలోనూ క్రమంగా రూపుదిద్దుకుంటున్నది. ఈనాటికీ సంఖ్యారీత్యా మన సమాజంలో అది అత్యల్పంగానే వుంది. అయితే అది వ్యవస్తీకృతరూపం ధరించే దిశలో క్రమంగా అడుగులుపడుతున్నాయి. తాజా ఢిల్లీ దుర్ఘటన ఈ పరిణామాన్ని సూచించే ఓ ప్రమాదకర హెచ్చరిక!
‘పెట్టుబడి’కి గోడలుండవు. హద్దులు అసలే వుండవు. అది ఇనప బీరువాలో గుర్రుపెట్టదు. బ్యాంకు లాకర్లులో నిశ్చింతగా పొదగదు. అది వేగంగా భ్రమణాలూ, పరిభ్రమణాలూ చేస్తుంది. అది అడవులను హరిస్తుంది. కొండలను పిండేస్తుంది. వాటిలోని సహజసంపదను భక్షిస్తుంది. నిశ్చింతగా సముద్రాలనూ, వాటి తీర ప్రాంతాలనూ కబళిస్తుంది. ప్రకృతిని విధ్వంసం చేస్తుంది. పల్లెలను వల్లకాళ్ళను చేస్తుంది. పొలాలను విషతుల్యం చేస్తుంది. అలా అడ్డదారుల్లో, అక్రమ పద్ధతుల్లో కొల్లగొట్టిన అమిత సంపదలతో నగరాలను మహానగరాలుగా అది రూపొందిస్తుంది. ఆ తర్వాత వాటిని జనారణ్యాలుగా మార్చుతుంది. వాటిలో మానవ మృగాలకి జన్మనిస్తుంది. అది ఓ క్షుద్రవర్గాన్ని పోషిస్తుంది. మనిషి నెత్తురును మంచినీళ్ళుగా త్రాగే వర్గమది. పౌర సమాజం సామాజికంగా విప్లవించిన కాలాలలో యీ క్షుద్రవర్గాన్ని ‘పెట్టుబడి’ తన పదునైన ఆయుధంగా వినియోగించుకుంటుంది. అది దోపిడీ రాజ్యానికొక ప్రైవేటు సైన్యంగా మారుతుంది. ఒకానొక దశలో అలాంటి వ్యవస్థికృత ఉద్యోగాన్ని పెట్టుబడిదారి వర్గాలు యీ క్షుద్ర వర్గానికి కల్పిస్తాయి. అయితే అలాంటి ‘ఉద్యోగం’ దొరక్కముందు అది సమాజంలో చెదురు మదురుగా విసిరి వేయబడి వుంటుంది. అదొకవర్గంగా కాకుండా వ్యక్తులుగా, మూకలుగా, ముఠాలుగా వుంటుంది. అడవుల్లో కౄరమృగాల గుంపులున్నట్లుగానే; కార్పొరేట్ నగరాలలో యీ తరహా మూకలు కూడా తిరుగాడుతుంటాయి. అవి చిల్లర మల్లర క్షుద్రకార్యాలు సాగిస్తుంటాయి. అలాంటిదే ఢిల్లీ దుర్ఘటన!
ప్రపంచ చరిత్రలో 1789 ఫ్రెంచి విప్లవం ఓ అద్భుత పురోగమన ఘట్టం. అది ప్యూడలిజాన్ని ధ్వంసం చేసింది. అది నిర్మించుకున్న రాచరిక సామాజిక ఉపరి నిర్మాణాలను కూడా నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేసింది. చారిత్రికంగా అలాంటి ప్రగతిశీల పెట్టుబడి కూడా అనంతర కాలంలో అభివృద్ధి నిరోధ శక్తిగా తయారైనది. మొదటి నెపోలియన్ కాలంలోనే ‘పెట్టుబడి’ చేత క్షుద్రశక్తుల ఆవిర్భావం జరిగింది. మూడో నెపోలియన్ కాలానికే అది ఓ వర్గంగా వ్యవస్తీకృతమైనది. 1848 ఫ్రెంచి కార్మికవర్గ విప్లవాన్ని కారల్‌మార్క్స్ విశ్లేషించిన సందర్భంలో యీ క్షుద్రవర్గ ప్రస్తావన కూడా జరిగింది. ఇది సమాజ ప్రవాహంలో అడుగున పేరుకున్న మడ్డివంటిదన్నాడు. అలాంటి క్షుద్రవర్గం సామాజిక విప్లవాలకు గుదిబండగా మారుతుందని చారిత్రిక జోస్యం చెప్పాడు. నిజానికి ప్రపంచ చరిత్ర పటం మీద ఆనాటి ‘పెట్టుబడి’ విప్లవాత్మక పాత్రను పోషించింది. లెనిన్ సైద్ధాంతిక విశ్లేషణ ప్రకారం 1871 వరకూ ‘పాశ్చాత్య పెట్టుబడి’ ఫ్యూడల్ వ్యతిరేక పాత్రను పోషిస్తూనే వుండేది. అలాంటి ప్రగతిశీల చారిత్రిక పాత్రను పోషిస్తున్న కాలంలో కూడా యాభై ఏండ్లు తిరక్కముందే, ఆనాటి పెట్టుబడి ఒక క్షుద్రవర్గాన్ని సృష్టించుకున్నది. కానీ ప్రపంచీకరణ ద్వారా అత్యంత అభివృద్ధి నిరోధక సామ్రాజ్యవాద పెట్టుబడులు నేడు ఇండియాను ముంచెత్తు తున్నాయి. ఈ చారిత్రక నేపథ్యంలో ఇలాంటి చోట అత్యంత వేగంగా, గాఢంగా క్షుద్రవర్గ ఆవిర్భావానికి అవకాశాలుంటాయన్న వాస్తవాన్ని మరచిపోరాదు.
మన భారతీయ సామాజిక వ్యవస్థలో ‘ప్రపంచీకరణ’ కొన్ని వ్యవస్థాగత మార్పులను తీవ్రస్థాయిలో, శీఘ్ర స్థాయిలో తీసుకొస్తున్నది. ఇక్కడ వేగంగా చొరబడుతున్న, బలపడుతున్న విదేశీ పెట్టుబడులే యీ మార్పులకి కారణం. విదేశీ పెట్టుబడులు ఫిరంగి గుండ్ల కంటే బలమైనవి. వాటి ఎదుట మన స్వదేశీ సాంప్రదాయ సామాజిక ఉపరి నిర్మాణాలు కుప్ప కూలిపోతున్నాయి. ఇలా కూలిపోతున్న పాత సామాజిక సాంప్రదాయాలన్నీ ఉన్నతమైనవేమీ కాదు. అందులో ఎక్కువ భాగం రాచరిక, భూస్వామ్య భావజాల పునాదిపై నిర్మాణమైనవే! అవి కూలి నందుకు కన్నీళ్ళు కార్చనక్కరలేదు. కానీ కూలిన పాత సామాజిక కట్టడాల స్థానంలో అంతకంటే ఉన్నత, ఉత్తమ నిర్మాణాలు జరగకపోవడం ఓ రాజకీయ విషాదమే! వాటి స్థానంలో వెర్రితలల సామాజిక, సాంస్కృతిక నిర్మాణాలు పుట్టగొడుగుల వలె మొలకెత్తుతున్నాయి. ‘ప్రపంచీకరణ’ పశ్చిమ పవనాల బలంతో అవి ఏపుగా ఎదుగుతున్నాయి. మన జనారణ్యాలు మానవ మృగాల పెంపక కేంద్రాలుగా మారుతున్నాయి. అలా తీర్చిదిద్దేపనిని విదేశీ పెట్టుబడులు చేపడుతున్నాయి. ఈ నూతన విష సంస్కృతికే ‘నిర్భయ’ నేడు బలైపోయింది.
పైన పేర్కొన్న పెట్టుబడిదారీ సామాజిక ఉపరి నిర్మాణాలలో విష సంస్కృతి ఒకటి. ‘పెట్టుబడి’ తన అధిక లాభాల కోసం స్త్రీని ఒక వ్యాపార సాధనంగా వాడుకుంటుంది. కార్పోరేటు కంపెనీలు తయారు చేసే సరుకుల లేబుళ్ళ నుంచి పబ్లిసిటీ యాడ్స్ వరకూ స్త్రీలను వాడుకుంటాయి. ఇంకా పర్యాటక, వినోద రంగాలలో కూడా స్త్రీని ఒక వ్యాపార సరుకుగా వాడుకుంటాయి. అలాంటి వెర్రితలల సంస్కృతికి యువతరం త్వరగా ఆకర్షిమవుతుంది. అలా పెడదారి పట్టే యువతలో ఒక చిన్నభాగం ‘క్షుద్రవర్గం’గా కూడా పరిణామం చెందుతుంది. అది మొదట సమాజంలో చాలా తక్కువ సంఖ్యలోనే వుంటుంది. ‘పక్కదారి పట్టిన యువత’గా కూడా యీ ‘క్షుద్రవర్గ’ కార్యాలను సమర్థించదు. అలాంటి పరాకాష్ఠ దశకు చేరిన నైతిక భ్రష్ట చర్యలు సమాజాన్ని కుదిపి వేస్తుంటాయి. అలాంటి అరుదైన సమయాలలో అటు పాత కాలపు రాచరిక, భూస్వామ్య సాంస్కృతిక ఆరాధక శక్తులూ; ఇటు పెట్టుబడిదారీ సాంస్కృతిక వ్యామోహ శక్తులూ నిరసన వ్యక్తం చేస్తాయి. అవి సోషలిస్టు సాంస్కృతిక శక్తులు సాగించే నిరసనోద్యమానికి మద్దతిస్తాయి. ఈ నిర్ధిష్ట సామాజిక పరిణామ క్రమానికి ‘ఢిల్లీ గాంగ్ రేప్ సంఘటన’ ఒక నిదర్శనం!
దోమలను చంపడం కంటె దోమల పెంపక కేంద్రాల (రొచ్చుగుంటలు)ను తుద ముట్టించడం ముఖ్యమైనది. ఇంట్లో దూరిన, వంటి మీద వాలిన దోమల బారినుండి రక్షణకై శిక్షా వ్యవస్థను కట్టుదిట్టం చేసుకోవాల్సిందే. కానీ అది శాశ్వత సమగ్ర పరిష్కారం కాదు. ఇంటి చుట్టూ పరిసరాలలోని మురికి గుంటల నిర్మూలనే ప్రధాన కర్తవ్యం కావాలి. ఓ వైపు పార్లమెంటులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు స్వాగతం పలుకుతూనే, మరోవైపు వణుకుతున్న చలిలో విమానాశ్రయానికెళ్ళి ‘నిర్భయ’ భౌతికకాయానికి సోనియా, మన్మోహన్‌లు నివాళులర్పించారు. అటు విశృంఖల విదేశీ పెట్టుబడుల ద్వారా రొచ్చు సంస్కృతిని స్వాగతిస్తూనే; ఇటు అది తీర్చిదిద్దుతున్న కొన్ని మృగ శక్తులను వారు శిక్షించుతామంటున్నారు. రేపు సోనియా, మన్మోహన్‌ల చేతుల మీదుగా నేర శిక్షాస్మృతిని కఠినతరం చేయొచ్చు కూడా! కానీ పుట్టలను తవ్వి తీయనంత కాలం ఒక పామును చంపితే మరో పది పాములు పుట్టుకొస్తూనే వుంటాయన్న వాస్తవాన్ని మరిచిపోకూడదు. పాముల పుట్టలను పరిరక్షించే విశృంఖల ఆర్థిక వ్యవస్థ కొనసాగినంత కాలం పాలకవర్గాల ‘శిక్షా చర్యలు’ ఫలవంతం కాజాలవు. సమీప భవిష్యత్తులోనే ఓ ‘క్షుద్ర సామాజిక వర్గం’ యీ గడ్డ మీద సంఘటిత రూపం ధరించబోతున్నది. అట్టి ప్రమాదక సామాజిక పరిణామానికి ‘ఢిల్లీ దుర్ఘటన’ ఓ చిన్న ముందస్తు సంకేతం మాత్రమే.
‘నిర్భయ’ మరణం విషాదకరమైనదే. కానీ అది భారతీయ సమాజాన్ని ఒక కుదుపు కుదిపేసింది. సామాజిక, సాంస్కృతిక విషాదాల మీద ఓ దేశ వ్యాపిత నిరసన వెల్లువ నాంది పలికింది. గాన ఇది కన్నీరు కార్చే పరిణామం ఎంత మాత్రం కాదు. తలెత్తుకునే పరిస్థితులను పౌరసమాజానికి ‘నిర్భయ’ కల్పించింది. రాజ్యం మీద ఆధారపడకుండా ఒకరి కోసం కోటి గొంతుకలు గర్జించిన సానుకూల సామాజిక పరిణామమిది. తెల్లచొక్కా మేధోవర్గాలను ‘నిర్భయ’ కదిలించింది. సైబర్ యువతరాన్ని రగిలించింది. ‘మన ఇండియాలో మాత్రం సైబర్ యువత సామాజిక చైతన్యంతో రోడ్డెక్కదు’ అన్న ఓవైరాగ్య భావనను ‘నిర్భయ’ పటాపంచలు చేసింది. ఇక్కడ కూడా ‘మల్లెల విప్లవాల’ వంటి రాజకీయ పరిణామాలకి అవకాశం వుందని నిరూపించింది. అందుకే ఆమె మరణం ఓ వుద్యమ జననంగా మారింది. అది సజీవ సామాజిక ప్రవాహమే. అందులో ఆమె కూడా పునరుజ్జీవిస్తుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క విశృంఖల దుష్ఫలితాలు మొదట సాధారణంగా దాని ‘తోక’ దగ్గరే బద్దలవుతుంటాయి. దాని ‘తల’, ‘వెన్నెముక’ ‘గుండె’ వంటి ముఖ్య భాగాలను ఆయా పౌర సమాజాలు అసహ్యించుకోకముందే వాటి ‘తోక’, ‘వెంట్రుకలు’, ‘గోర్లు’ వంటి అల్పభాగాల మీదే అవి ధ్వజమెత్తుతాయి. వాటిలోనూ విద్యాధిక వర్గాలే యీ నిరసనలలో ముందుంటాయి. అవినీతి, అత్యాచారాలపై వుద్యమాలు యీ కోవలోకే వస్తాయి. నిజానికి వాటి జనక స్థానం పెట్టుబడి గర్భసంచే. అయితే తొలుత యీ గర్భసంచి మీద మౌలిక పోరాటాలు జరగవు. తన ‘తోక’ మీద చేసే పోరాటాలను బలపరుస్తున్నట్లు పౌర సమాజాల ఎదుట ‘పెట్టుబడి’ నటిస్తుంది కూడా! ‘పెట్టుబడి’ స్వయంగా కనిపెంచిన ‘క్షుద్రవర్గ’ చర్యల మీద నేటి యువతరం తిరగబడింది. ఈ ప్రజాస్వామిక వెల్లువకి ‘పెట్టుబడి’ కంటి తుడుపు మద్దతిస్తుంది. ఇలా తన ‘తోక’ పై చేసే ప్రజాస్వామిక పోరాటాన్ని తన ‘తల’ మీదికి దారి మళ్ళనివ్వకుండా ‘పెట్టుబడి’ మొదట తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ యీ ‘నియంత్రణ చర్యలు’ తీసుకోవడం దానికి ఎల్లకాలం సాధ్యం కాదు. ‘తోక’పై తలెత్తిన నిరసన వెల్లువను ‘తల’ వైపు నడిపించే పరిస్థితులు అనివార్యంగా వస్తాయి. అందుకు సైబర్ యువతరం నేడు అందించిన స్ఫూర్తిని పునాది వర్గాలైన కార్మిక, కర్షక వర్గాలు మున్ముందు విధిగా స్వీకరించాలి. తమ భావి వర్గ పోరాటానికి నేటి ప్రజాస్వామిక వుద్యమాలను వర్గ పోరాట శక్తులు సానరాయిని చేసుకోవాలి. ‘నిర్భయ’ మరణం అందుకు కలిసొచ్చిన రాజకీయ సందర్భమే. ‘అరబ్ మల్లెల విప్లవం’ కూడా స్వతహాగా ‘వర్గ పోరాటం’ కాదు. విప్లవోద్యమం కూడా కాదు. అదొక ప్రజాస్వామిక వుద్యమం మాత్రమే. అయితే, అది రేపటి వర్గ పోరాటాలకి ఒక సానరాయిగా వుపయోగపడి తీరుతుంది.
‘అరబ్ మల్లెల విప్లవాని’కి కారణమైన ట్యునీస్ యువకుడి ఆత్మార్పణ డిసెంబరు (2010) లోనే జరిగింది. అది పాత సం||రం చివరలో పాత నియంతృత్వ ప్రభుత్వాలపై ఒక మహా వెల్లువకి దారితీసింది. ప్రభుత్వ పతనాలతో నూతన సం|| (2011) ఆగమనానికి వేదిక అయ్యింది. ఇండియాలో కూడా డిసెంబరులోనే (2012) ‘నిర్భయ’ మృగార్పణ జరిగింది. ఇక్కడ కూడా సైబర్ యువతరం వెల్లువెత్తింది. ఇది కొత్త సం||రంలో ఏ రూపం తీసుకుంటుందో వేచిచూడాలి. ఏ మేరకు ఫలితాలిచ్చినా, అది భావి భారత విప్లవోద్యమ నిర్మాణానికి, ఆ మేరకు ఒక పునాది రాయిగా వుపయోగపడుతోంది. విప్లవ, ప్రజాతంత్ర శక్తులు వుపయోగించుకోవాల్సిన రాజకీయ అవసరాన్ని ఈ వుద్యమం గుర్తు చేసింది. తన మరణం ద్వారా యిలాంటి రాజకీయ అవకాశాన్ని భావి విప్లవోద్యమానికి అందించిన ‘నిర్భయ’కి నివాళులర్పిద్దాం! (‘తిరుగుబాటు’ పత్రిక)
‘నిర్భయ గ్యాంగ్ రేప్’పై ఆకస్మిక ప్రజా వెల్లువకి కారణాలు – పాఠాలు
ఢిల్లీ వైద్య విద్యార్థిని ‘నిర్భయ’పై లైంగిక అ(హ)త్యాచార దుర్ఘటన ఒక దేశవ్యాపిత ప్రజావెల్లువకి దారితీసింది. అదొక విస్తృత ప్రజాస్వామిక వుద్యమంగా రూపొందింది. అదో సమరశీల వుద్యమంగా కూడా సాగింది. గజగజ వణికించే చలికాలాన్ని కూడా ఉడుకెత్తించే వేసవికాలంగా మార్చిన విస్మయకర రాజకీయ పరిణామమిది. ఇది రాజకీయంగా ఘనీభవించాయనుకుంటున్న కొన్ని రకాల ప్రజారాశులను రోడ్ల మీదికి తెచ్చింది. సామాజిక స్పృహకి దూరంగా వున్నారని భావించబడుతున్న మరికొన్ని ప్రజారాశులను కూడా రాజకీయ చైతన్యంతో కదం తొక్కించిన పరిణామమిది. ఈ ఒక్క ఢిల్లీ దుర్ఘటన దేశాన్ని ఇంత స్థాయిలో ఎందుకు కదిలించింది? ఈ వెల్లువకి దారితీసిన పరిస్థితులనూ, దీనినుంచి తీసుకోవాల్సిన గుణపాఠాలనూ మార్క్సిస్టు దృక్కోణం నుంచి విశ్లేషించాల్సి వుంది.
మనదేశంలో కూడా మొదటి సారి ‘అంతర్జాలం’ (ఇంటర్నెట్) ఈ ఉద్యమంలో ఓ కీలకపాత్ర పోషించిదనుటలో సందేహం లేదు. అయితే అది ‘కదిలించే రాజకీయ శక్తుల చేతిలో ‘సమీకరణ సాధనం’గా మారింది కాదు. ‘కదిలిన’ ప్రజారాశుల చేతుల్లో ఓ ‘సమన్వయ సాధనం’గా వుపయోగపడింది. అయితే దీన్ని ‘అంతర్జాలం’ ద్వారా ప్రజలు చైతన్యం పొందిన పరిణామంగా భావించరాదు. పైగా చైతన్యవంతులైన ప్రజల చేతుల్లో ‘అంతర్జాలం’ ఓ ప్రచార సాధనంగా మారింది. ప్రజల హృదయాలు రాజకీయంగా ‘రసాయనిక ప్రక్రియ’కి గురయ్యాయి. అంతర్జాలం ఓ ‘ఉత్ప్రేరక పాత్ర’ (బీబిశిబిజిరిరీశి జీళిజిలి) ని పోషించింది. అందుకే విశ్లేషించాల్సింది అంతర్జాలం పోషించిన ఉత్ప్రేరక పాత్రను గూర్చి కాదు. రసాయనిక చర్యకి గురైన ప్రజల హృదయాల లోతుల గూర్చే ప్రధానంగా విశ్లేషించాల్సి వుంది.
‘నిర్భయ’ మీద అ(హ)త్యాచారం 16.12.2012వ తేదీ రాత్రి జరిగింది. అది 17వ తేదీన తగినంత ప్రచారం జరగలేదు. 18వ తేదీన మాత్రమే పూర్తి వాస్తవాలతో వెలుగుజూసింది. 22వ తేదీన ఢిల్లీ ఓ వుద్యమ కేంద్రంగా మారింది. దుర్ఘటన వెలుగుజూసిన రోజు (18)కీ, ఢిల్లీ వెలువెత్తిన రోజు (22)కీ మధ్య కేవలం మూడురోజుల వ్యవధి వుంది. ఈ స్వల్ప వ్యవధిలోనే ఇంత వెల్లువ రావడం అనూహ్యమైనదే. అలాంటి ఈ వుద్యమంలో పాల్గొన్న ప్రజారాశులెవరన్న ముఖ్య ప్రశ్నలోకి తర్వాత వద్దాం. ముందుగా ఈ వుద్యమం నడిచిన తీరులోకి వద్దాం. దీని ‘తీరు’ లేదా ‘సరళి’ని పరిశీలిస్తే, స్థూలంగా దీనికి మూడు ధోరణులు (శిజీలిదీఖిరీ) వున్నాయని అర్థమవుతుంది. అవి (1) నిరవధికత (్పుళిదీశిరిదీతిరిశిగి) (2) సమరశీలత (ళీరిజిరిశిబిదీబీగి) (3) నిర్మాణాత్మకత (బీళిదీరీశిజీతిబీశిరిఖీరిశిగి). ఈ మూడు లక్షణాలతో కొనసాగిన వుద్యమంగా భావించడానికి గల కారణాలను ముందుగా పరిశీలిద్దాం.
మొదటిదైన ‘నిరవధికత’కి వద్దాం. డిసెంబరక 22న ‘అశేష ప్రజలు’ ఢిల్లీలో ‘విశేష రీతి’లో కదిలారు. ఆ ఒక్కరోజు నిరసనకై తమ ఉద్యోగ లేదా విద్యా లేదా వర్తక విధులకి సదరు ప్రజారాశులు మొక్కుబడిగా శెలవు పెట్టి పాల్గొన్నది కాదు. ఆ ఒక్కరోజు తమ జీతాలు లేదా వేతనాలు లేదా వర్తక లాభాలను వదులుకొని ‘నిరసన ప్రదర్శన’లో పాల్గొని ఆగిపోయింది కాదు. సదరు నిరసన వుద్యమం రోజుల తరబడి ప్రత్యక్ష భాగస్వామ్యతతో నిరంతరంగా కొనసాగింది. వీరు బోట్స్ క్లబ్ లేదా రాష్ట్రపతి భవన్ లేదా జంతర్ మంతర్ వద్ద ప్రతిరోజూ నిరసనలో పాల్గొన్నారు. కేవలం ‘భావోద్వేగత’, ‘భావోద్విగ్నత’, ‘భావోద్రిక్తత’ వంటి భావావేశాలకే ‘ప్రజల నిరసన’ పరిమితం కాలేదు. ప్రజల చైతన్యం యిలాంటి తాత్కాలిక భావోద్రేకాల పరిధులను అధిగమించింది. ఫలితంగానే ప్రజా వెల్లువలో యిలాంటి నిరంతర లేదా నిరవధిక కదలిక సాధ్యమయ్యింది. ఇది ఈ వుద్యమం ప్రదర్శించిన ఓ ప్రత్యేకతే!
ఇక రెండవ అంశమైన ‘సమరశీలత’లోకి వద్దాం. తాజా ప్రజల కదలిక ‘సాంప్రదాయ కదలిక’గా సాగింది కాదు. సాధారణ నిరసనకే ప్రజలు పరిమితం కాలేదు. నినాదాలు, ప్లేకార్డులు, కటౌట్లు, బ్యానర్లు, ప్రదర్శనలతోనే వారు సరిపెట్టుకోలేదు. ఇందులో ‘ధిక్కారం’ ఒక ప్రధానాంశంగా మారింది. ‘ఆంక్షలు’, ‘నిషేదాజ్ఞలు’, ‘నిషిద్ధ ఉత్తర్వులు’ వంటి నిర్బంధ రూపాలను రాజ్యం ఎంచుకున్నది. ‘ఉల్లంఘనలు’, ‘అతిక్రమణలు’ వంటి ‘ధిక్కార’ పోరాట రూపాలను ప్రజలు ఎంచుకున్నారు. ఇది కూడా ఏదో కొద్ది మంది అగ్రగామి లేదా శీఘ్రగామి శక్తులు ఎంచుకున్నది కాదు. ఇది లక్షలాది ప్రజల ‘సమిష్టి భాగస్వామ్యత’తో సాగింది. అంతేకాకుండా ‘సమరశీలత’ అనే అంశం ‘అరాజకం’గా కూడా మారలేదు. ‘ధిక్కారం’ కూడా అదుపు తప్పలేదు. ‘దుస్సాహసిత’కి గురికాలేదు. అది ప్రజాతంత్రయుతమైన ‘సామ్యత’తో కూడిన ‘సమరశీలత’గా కొనసాగింది. ‘సామూహిక ఉన్మాదత’ లేదా ‘ఉన్మత్తత’ (ఖబిరీరీ నీలిరీశిలిజీరిబి ళిజీ ఓళిలీరిబి) కి వుద్యమం గురికాలేదు. ఈ విధంగా ‘సమరశీలత’ ఒక పాలపొంగువలె కాకుండా, నిరంతర ప్రక్రియగానే కొనసాగడం రెండో ప్రత్యేకత.
ఇక చివరి అంశమైన ‘నిర్మాణాత్మకత’లోకి వద్దాం. ఈ ప్రజా వెల్లువలో పాల్గొన్న ప్రజలు కేవలం తమ ఆగ్రహావేశాలను వీధుల్లో వ్యక్తీకరించడానికే పరిమితం కాలేదు. తమ గుండెల్లో గూడుకట్టుకున్న కోపాన్ని కక్కడంతో వారు ఆగిపోలేదు. (ఎ) వారు కొన్ని నిర్ధిష్ట డిమాండ్లను ప్రభుత్వం ఎదుట నిర్మాణాత్మకంగా పెట్టారు. (బి) వాటి సాధనకై తమ వుద్యమాన్ని దశలవారీగా నిలకడగా నడిపించడానికి సిద్ధమయ్యారు. (సి) అవసరమైన కీలక సమయంలో ప్రభుత్వంతో ‘సంప్రదింపుల ప్రక్రియ’కి స్వయంగా సిద్ధమయ్యారు. (డి) సంప్రదింపుల ప్రక్రియలో అవసరమైన మేరకి ‘పట్టువిడుపులు’ లేదా ‘వెసులుబాటు వైఖరి’ (ఓలిజినిరిలీరిజిరిశిగి) ని కూడా వుద్యమరాశులు ప్రదర్శించాయి. ఈ విధంగా వుద్యమకారులు అటు అసహనంతో ‘తెంపరితనం’ లేదా ‘పట్టింపు’ వైఖర్లకి వెళ్లలేదు. ఇటు ‘జారవిడుపు’ లేదా ‘మెతక’ ధోరణులకి కూడా గురి కాలేదు. సాపేక్షికంగా చూస్తే, హేతుబద్ధమైన ‘దౌత్య నిపుణత’ను ప్రదర్శించారని చెప్పవచ్చు. తద్వారా ప్రభుత్వాన్ని రాజకీయంగా యిరకాటంలో పెట్టి మెడలు వంచారు. ఈ తరహా అత్యాచారాల నివారణ, నియంత్రణల కోసం ఓ కొత్త చట్టాన్ని సాధించుకోవడం కూడా జరిగింది. ఈ మూడు ప్రత్యేకతలతో సాగిన సదరు వుద్యమానికి వర్తమాన పరిస్థితుల్లో చాలా రాజకీయ ప్రాధాన్యత వుంది.
ఈ కొత్త చట్టంతోనే అత్యాచారాల నివారణ గానీ, నియంత్రణ గానీ జరగవన్నది నిజమే. మౌలికంగా సామాజిక, రాజకీయ భౌతిక పరిస్థితులు మారకుండా, కేవలం నేరస్థులను భౌతికంగా శిక్షించే చట్టాల ద్వారా యీ తరహా నేరాలను అరికట్టడం సాధ్యం కాదు. అయితే తాజా ప్రజా వెల్లువ సాధించిన ఫలితాన్ని యీ తేలిక భావనతో కొట్టి పారవేయకూడదు. ఈ తరహా అత్యాచారాల నివారణ లేదా నియంత్రణలకై చట్టాన్ని ఫలానా విధంగా సవరించితే ఫలితాలుంటాయని దోపిడీ సామాజిక వ్యవస్థలోని సామాన్య ప్రజలు తొలుత భావిస్తారు. అలాంటి భావనలు లేదా భ్రమలు ప్రజలలో తొలగాలంటే, యిలాంటి మధ్యంతర దశలను తప్పనిసరిగా దాటాల్సి వుంటుంది. తద్వారా ఉన్నత రాజకీయ చైతన్యాన్ని ప్రజలు పొందగలరు. సామాజిక విప్లవాలకి ముందు ప్రతి ‘వర్గ సమాజం’లో కూడా యిలాంటి అనేక దశలను దాటడం ఓ అనివార్య రాజకీయ పరిణామమే. అలాంటి ఓ దశను తాజా వుద్యమం పరిపూర్తి చేసింది. అందుకే ముమ్మాటికీ ఇదో రాజకీయ విజయమే.
ప్రతిపాదిత కొత్త చట్టం రేపు పార్లమెంటు ద్వారా చట్టంగా మారుతుందా? ఒకవేళ చట్టగా మారితే, అప్పటికల్లా అందులో ఎన్ని లొసుగులు చేరతాయి? అది మున్ముందు ఒకవేళ పార్లమెంటు ఆమోదించినప్పటికినీ, ఆ తర్వాత ఆచరణలో అమలు జరుగుతుందా? అమలు జరిగిన మేరకు కూడా సామాజిక ఫలితాలనిస్తుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు రాజకీయవర్గాలలో తలెత్తుతున్నాయి. తలెత్తడం సహజం కూడా! అయితే ఈ ప్రశ్నలు ప్రభుత్వ నిజరూపాన్ని రాజకీయంగా బహిర్గతపరిచే లక్ష్యంతో సంధించాల్సినవి. అంతేతప్ప, సదరు ప్రజా వుద్యమాన్ని అవహేళన చేసేవిగా మారకూడదు.
ప్రజాతంత్ర చైతన్యాన్ని ప్రదర్శించడం ద్వారా సదరు ప్రతిపాదిత కొత్త చట్టాన్ని కూడా కొంత మేరకు అమలు చేయించుకునే అవకాశం బాధిత ప్రజలకు లభిస్తుంది. తక్షణమే కొన్ని పరిమిత ప్రయోజనాలు పొందే వీలు లభిస్తుంది. అది తాత్కాలిక ‘ఉపశమనం’ లేదా ‘ఊరట’ను బాధితులకి కలిగిస్తుంది. తద్వారా మున్ముందు మరిన్ని ఫలితాలను పొందాలన్న నిర్మాణాత్మక ఆకాంక్షను అది బాధిత ప్రజలలో కలిగిస్తుంది. అది వారిని మరింత ముందుకు నడిపించే చోదక ప్రేరేపక శక్తిగా పనిచేస్తుంది.
ఈ తరహా కొత్త చట్టాలు లేదా సంస్కరణల వల్ల మరో రాజకీయ ఫలితం కూడా ఏర్పడుతుంది. అవి బాధిత ప్రజలలో ప్రేరేపించిన ‘ఆశలు’ లేదా ‘ఆకాంక్షల’తో పోల్చితే, వాస్తవాచరణలో వారికి వుపయోగపడేది చాలా తక్కువగా వుంటుంది. ఇవి ప్రజలలో మొదట బారెడు ఆశలను పెంచుతాయి. కానీ ఆచరణలో బాధిత ప్రజలకి జానెడు మాత్రమే వుపయోగపడతాయి. ఈ ‘జానెడు’ వుపయోగం కోసం కూడా ‘మూరెడు పోరాటాల’ను ప్రజలు చేపట్టాల్సి వుంటుంది. ఈ కారణంగా ప్రజల ఆకాంక్షలు అనివార్యంగా వారిని నిరంతరం వుద్యమ కార్యాచరణ వైపుకి పురికొల్పుతాయి. ఒకసారి యిలాంటి ఒక కొత్త చట్టాన్ని వుద్యమం ద్వారా సాధించుకున్న ప్రజలకి, ఆ తర్వాత దాని అమలు కోసం కూడా ‘వుద్యమ పంథా’ అనివార్యమవుతుంది. వాస్తవానికి యీ తరహా కొత్త చట్టాన్ని సాధించిన రోజు యిక తమకి రోడ్ల మీదికి వచ్చి వుద్యమించాల్సిన అవసరం వుండదని సామాన్య ప్రజలు వూపిరి పీల్చుకుంటారు. కానీ ఆచరణలో బాధిత ప్రజలను నిరంతర వుద్యమ కార్యాచరణకు పురికొల్పడానికి యిలాంటి కొత్త చట్టాలు ఆచరణలో పదునైన ఆయుధాలుగా రూపొందుతాయి.
ప్రజల చైతన్యం, వుద్యమ భాగస్వామ్యతల వల్ల యీ తరహా కొత్త చట్టాలు కొన్ని తాత్కాలిక ఫలితాలను అందించే మాట నిజమే. అయితే ‘వర్గ దోపిడీ వ్యవస్థ’కి పరిమితులుంటాయి. నేరస్తులను సమగ్రంగా శిక్షించే పనికి ‘నేర సామాజిక వ్యవస్థ’ పూనుకోవడం జరగదు. వర్గ దోపిడీ వ్యవస్థ తన క్షుద్ర దోపిడీ విధానాల ద్వారా ఒక వ్యవస్థీకృతమైన ‘నేర తరగతి’ని సమాజంలో సృష్టిస్తుంది. అట్టి ‘నేర తరగతి’ వల్ల ప్రజలు బలౌతారు. వాటిమీద బాధిత ప్రజలు ప్రతిఘటించిన సందర్భాలలో నేరస్తులను వ్యక్తులుగా శిక్షించడానికి యీ తరహా కొత్త చట్టం ఒక మేరకి పూనుకుంటుంది. అది నేరస్తులను ‘ఒక తరగతి’గా, ‘సంఘటిత సమూహం’గా రూపొందిస్తుంది. కానీ ‘వ్యక్తులు’గా శిక్షిస్తుంది. ‘నేరస్తుల ఉత్పత్తి’ సమిష్టిగా కొనసాగుతుంది. ‘నేరస్తుల నిర్మూలన’ మాత్రం వ్యక్తిగతంగా సాగుతుంది. అటు ‘నేర తరగతి’ని విధానపరంగా సృష్టించడానికీ, ఇటు నేరస్తులను వ్యక్తిగతంగా శిక్షించడానికీ మధ్య ‘వర్గ దోపిడీ వ్యవస్థ’ ఒక అంతస్సంఘర్షణకి గురవుతుంది. అందుకే ‘నేర తరగతి’ నుంచి రక్షణ పొందాలనుకునే బాధిత ప్రజల పెను ఆకాంక్షలను దీర్ఘకాలంలో ‘వర్గ దోపిడీ సామాజిక వ్యవస్థ’ నెరవేర్చలేదు. అప్పుడు అది అనివార్యంగా ప్రజల ఆకాంక్షలపై దాడికి దిగుతుంది. అది తన ‘ప్రజాస్వామిక ముసుగు’ను ఒకరోజు స్వయంగా తానే చించుకోక తప్పదు. అలాంటి సమయంలో బాధిత ప్రజల చైతన్యంలో మౌలిక మార్పు సంభవిస్తుంది. ‘ప్రజాతంత్ర చైతన్యం’ స్థానాన్ని ‘వర్గ చైతన్యం’ ఆక్రమిస్తుంది. పార్లమెంటరీ పోరాట రూపాలకు బదులు పార్లమెంటేతర రూపాలు చోటుచేసుకుంటాయి. అలాంటి రోజు మనకి బహుదూరంలోనే వుండొచ్చు. కానీ ఆ దిశ వైపు సాగే రాజకీయ ప్రస్థానంలో తాజా నూతన చట్ట సాధన ఓ ముందడుగే!
దురదృష్టవశాత్తు దేశంలో నేడు విప్లవ శక్తులు, సంస్థలు భౌతికంగా చాలా బలహీనంగా వున్నాయి. ఉన్నంత మేరకి కూడా తాజా ప్రజాతంత్ర వెల్లువలో సకాలంలో తగినంత స్థాయిలో రాజకీయ పాత్రను పోషించలేకపోయాయి. భౌతికంగా వాటి రాజకీయ పునాది బలంగా లేకపోవడమొక్కటే యీ వైఫల్యానికి కారణం కాదు. అదో ప్రధాన కారణమే తప్ప ఏకైక కారణం మాత్రం కాదు. ఈ తరహా దుర్ఘటనల పట్ల యీ తరహా విద్యాధిక, ఉద్యోగ వర్గాల ప్రజలు యింత స్థాయిలో పోటెత్తుతారన్న ‘ముందస్తు రాజకీయ అంచనా’ లేకపోవడం కూడా ఒక ముఖ్యకారణమే. అంచనా లేకపోవడానికి అవగాహన లేకపోవడమే కారణం. ఈ ‘ముందస్తు అవగాహన’ వుండి వుంటే, వాటిలో వారు దూకడానికి 24 గంటల వ్యవధి కూడా వుండనక్కరలేదు. ఇందుకు కారణం, తాజా ప్రజాస్వామిక వుద్యమంలో పాల్గొన్న ప్రజలలో దాగిన పోరాట శక్తి, శీలతలపట్ల వారికి తగినంత విశ్వాసం లేకపోవడమే.
మొన్న ఢిల్లీలో వెల్లువెత్తిన ప్రజలు శారీరక శ్రమ వృత్తులకి చెందిన శ్రమజీవులు కాదు. సాధారణ వలస కార్మికులు కాదు. చేతి వృత్తులు, చిల్లర వర్తక వర్గాల ప్రజలు కూడా కాదు. ఈ తరగతులకి చెందినవారెవరూ ప్రజావెల్లువలో పెద్దగా పాల్గొనలేదు. అయితే యిందులో ‘ప్రధాన శక్తి’గా పాల్గొన్నదెవరు? ఈ ప్రశ్నకి దిగ్భ్రాంతికరమైన సమాధానం లభిస్తుంది. అది విప్లవ శక్తులను కూడా విస్మయానికి గురిచేస్తుంది.
పాశ్చాత్య దేశాల అభివృద్ధికి ఆకర్షితులైన, పాశ్చాత్య తరహా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను మనస్ఫూర్తిగా కాంక్షించే విద్యాధిక, అధికాదాయ వుద్యోగ వర్గాల ప్రజలే ఈ వుద్యమంలో ‘ప్రధానశక్తి’గా నిలిచారు. నిజానికి ‘నిర్భయ’ విద్యార్థిని మాత్రమే. కానీ యీ వుద్యమ వెల్లువలో ‘ప్రధానశక్తి’గా విద్యార్థి లోకం లేదు. అది ద్వితీయస్థానంలో వుంది. సాపేక్షికంగా మెరుగైన జీవనం సాగిస్తున్న వర్తమాన హైటెక్ వర్గాల ప్రజలే అధిక సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చారు. పశ్చిమదేశాల తరహాలో ‘జనవరి ఫస్టు’ న్యూఇయర్ సందడి నుంచి ఫిబ్రవరి 14 ‘వాలంటైన్స్ డే’ వరకూ జల్సాగా ఎంజాయ్ చేస్తున్న ఆధునిక యువతరమే ఈ తాజా వెల్లువలో పాల్గొన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లూ, బీపీఓ ఉన్నతోద్యోగులూ, ఎంఎన్‌సీ కంపెనీలకి చెందిన అధికాదాయ వర్గాల ప్రజలూ ఈ వుద్యమంలో ప్రధాన పాత్రను పోషించారు. స్వంత ప్లాట్లు గల, స్థిరనివాసులూ, నాలుగు చక్రాల వాహన స్వంతదారులూ, వినోదప్రియులూ, విలాస జీవనపరులూ, జీన్ వస్త్రధారులూ, ఆధునిక వాలెంటైన్స్ ప్రేమజీవులూ ఈ తాజా వుద్యమంలో నిబద్ధత, నిమగ్నతలతో పాల్గొన్నారు. ఇది నిజానికి దేశంలోని విప్లవ శక్తులను నివ్వెరపరిచే పరిణామమే. ఎందుకంటే, యిలాంటి ఆధునిక హైటెక్ వర్గాల ప్రజలు సమీప భవిష్యత్తులో యీ తరహా సామాజిక చైతన్యాన్ని ప్రదర్శిస్తారన్న అంచనా వారికి లేకపోవడమే. కానీ ఒకే ఒక్క తాజా ప్రజాతంత్ర వెల్లువ యిలాంటి భావనలు లేదా అపోహలను పటాపంచలు చేసింది.
‘ఉదార పెట్టుబడి’ స్త్రీలకి ‘స్వేచ్ఛా, స్వాతంత్య్రాల’ను కల్పిస్తుంది. ‘విశృంఖల పెట్టుబడి’ మరో దారిలో అట్టి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కబళిస్తుంది. ‘ఉదార పెట్టుబడి’ వంటింటి ఫ్యూడల్, రాచరిక బానిస సంస్కృతి నుంచి స్త్రీలని రోడ్ల మీదికి ‘విశృంఖల పెట్టుబడి’ స్త్రీలకు రోడ్ల మీద రక్షణ లేకుండా చేస్తుంది. అలాంటి అంతర్వైరుధ్యం ‘పెట్టుబడి’కి వుంటుంది. పెట్టుబడి యొక్క ఈ అంతర వైరుధ్యం వల్లనే నేటి ప్రజావెల్లువ తలెత్తింది. దీన్ని మార్కిస్టు దృక్కోణం నుంచి విశ్లేషించాల్సిన రాజకీయ సందర్భమిది.
పెట్టుబడిదారీ శక్తులు తమ ఉత్పత్తుల తయారీకీ, తమ వ్యాపారవృత్తుల నిర్వహణకీ, తమ అధికలాభాల సంపాదనకీ స్త్రీలని ‘ఇంటి నుంచి వీధి’లోకి తెస్తాయి. ప్రపంచీకరణ విధానాలు యీ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో స్త్రీల శ్రమను మరింత కారుచౌకగా కొల్లగొట్టేందుకు విదేశీ బహుళజాతి సంస్థలు పూనుకున్నాయి. ఫలితంగా నేడు లక్షలాది మహిళలు దేశంలో ఆధునిక ఉత్పాదక లేదా సేవా రంగాలలో ప్రవేశించారు. ఇల్లు దాటిన లేదా ఊరు వదిలిన యిలాంటి స్త్రీలు నగరాలు, పట్టణాలకు చేరారు. గ్రామీణ భారతంలో గతంలో అనుభవించిన ఫ్యూడల్ సాంస్కృతిక బానిస బంధనాల నుంచి స్త్రీజాతి ఒక మేరకి బయటపడింది. అయితే నూతనంగా నగరాలలో మరో కొత్త రకం సాంస్కృతిక దాడికి బలవుతున్నది.
ఆధునిక పెట్టుబడిదారీ వర్గానికి చెందిన మరికొన్ని శ్రేణుల విశృంఖల సంస్కృతిని పెంపొందించే క్షుద్ర వ్యాపారాలను సాగిస్తున్నాయి. స్త్రీలని వ్యాపార సరుకుగా వాడుకునే ఆధునిక క్షుద్ర వాణిజ్య సమూహాలు రూపొందాయి. అది ప్రపంచీకరణవల్ల వెర్రితలలు వేస్తున్నది. నేడు బాహాటంగా పబ్బులు, క్లబ్బుల నిర్వహణకి కూడా దిగజారాయి. ఒకవైపు పెట్టుబడిదారీవర్గాలు తమ అధిక లాభాల కోసం స్త్రీలను వివిధ వుద్యోగ, వ్యాపార వృత్తులలోకి తెచ్చాయి. తద్వారా సోకాల్డ్ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కల్పించాయి. మరోవైపు క్షుద్ర వ్యాపార, వాణిజ్యాలను కూడా అవి ప్రోత్సహించాయి. తద్వారా పౌరసమాజంలో ఒక క్షీణవర్గాన్ని కూడా అవి సృష్టించాయి. ఒకవైపు స్త్రీలను నగరాలకి తరలించింది. మరోవైపు సోకాల్డ్ నాగరిక ప్రాంతాలను క్షుద్ర నేర ముఠాలకి నిలయాలుగా కూడా మార్చివేసింది. ఇది ‘పెట్టుబడి’ యొక్క అంతరవైరుధ్యాల ఫలితమే. అది తన అంతర వైరుధ్యాన్ని మొత్తం సమాజం మీద రుద్దుతుంది. యావత్తు పౌరసమాజాన్ని ఒక సామాజిక సంక్షోభానికి గురిచేస్తుంది. అది పౌర అభద్రతకి కారణమవుతుంది. ఈ అస్థిర, అభద్రతలలో నుంచి రూపొందిందే తాజా ప్రజాతంత్ర వెల్లువ.
పెట్టుబడిదారీ వర్గాలు తమ అధిక లాభాల కోసం గ్రామీణ ఫ్యూడల్ బానిసత్వపు సంకెళ్ళ నుంచి స్త్రీలను ‘ఆధునిక నాగరిక’ చట్రంలోకి తేగలిగాయి. అలా ఆధునిక ఆదాయ వృత్తులలో ప్రవేశించిన స్త్రీలు తమ కొత్త పనిస్థలాలలో అభద్రతకి గురవుతారు. పనికివెళ్ళే మార్గాలలో కూడా రక్షణ సమస్యను ఎదుర్కొంటారు. కావున అనివార్యంగా తమ రక్షణ కోసం వుద్యమిస్తారు. అంతేతప్ప, తిరిగి ఫ్యూడల్ సంస్కృతిని ప్రత్యామ్నాయ రక్షణ కవచంగా ఎంచుకోరు. అనేకమంది స్వామీజీలు, బాబాలు ఢిల్లీ దుర్ఘటన తర్వాత చేసిన వ్యాఖ్యలేమిటో తెల్సిందే. విశ్వహిందూ పరిషత్ అధినేత మోహన్ భగవత్ నుంచి మన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వరకూ చేసిన వ్యాఖ్యలు కూడా తెల్సినవే. ఖాఫ్ పంచాయతీల నుంచి మాయావతి, మమతా బెనర్జీ, రాష్ట్రపతి సుపుత్రుల వరకూ చేస్తున్న రకరకాల వ్యాఖ్యానాలు కూడా తెల్సినవే. వీరందరూ స్త్రీలు ధరించే ఆధునిక దుస్తులు, చేస్తున్న ఉద్యోగాలు, ఆకాంక్షిస్తున్న స్వేచ్ఛలనే అత్యాచారాలకి ప్రధాన కారణాలుగా నిందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, సారాంశంలో సతీసక్కుబాయిలను ఆదర్శంగా భావించే ‘మనుసంస్కృతి’ని కీర్తిస్తున్న వ్యాఖ్యలివి. ఆధునిక స్త్రీ ఆర్థిక స్వావలంబన మరియు సమానత్వాలకై ఆరాటపడుతున్నది. ఇది ప్రగతిశీల సామాజిక పరిణామమే. ఈ సామాజిక రథచక్రాలను సత్యహరిశ్చంద్రుడి కాలానికి నడిపించాలనుకుంటున్న పచ్చి ఫ్యూడల్ తిరోగమనవాద రాజకీయాలను తాజా ప్రజావెల్లువ తోసిపుచ్చింది. సామాజికంగా ఇదో ముందడుగే!
‘నిర్భయ’ తండ్రి ఢిల్లీ విమానాశ్రయంలో బరువులు మోసే ఓ హమాలీ కార్మికుడే. ఆమెపై అ(హ)త్యాచారం చేసిన కామోన్మాదులు కూడా కార్మికులే. అందులో డ్రైవర్లూ, కండక్టర్లూ వున్నారు. ఇటు ‘నిర్భయ’ కుటుంబీకులూ, అటు మృగాళ్ళ కుటుంబాలూ యు.పి., బీహారుల నుంచి పొట్ట చేతపట్టుకొని ఢిల్లీకి వలసవచ్చిన నిరుపేద గ్రామీణులే! వీరి మూలాలు గ్రామీణ పేదరికంలోనే వున్నాయి. ఉభయులూ గ్రామీణ ఫ్యూడల్ సామాజిక, ఆర్థిక, రాజకీయ బాధిత నేపథ్యం గలిగినవాళ్ళే. వీరందరినీ ‘పెట్టుబడి’ (అది పారిశ్రామిక పెట్టుబడైనా కావచ్చు, ద్రవ్య పెట్టుబడైనా కావచ్చు, వర్తక పెట్టుబడైనా కావచ్చు) తన అవసరం కోసం నగరానికి తెచ్చింది. అది ‘నిర్భయ’కి సాపేక్షికంగా స్వేచ్ఛనూ, వ్యక్తిత్వాన్నీ, స్వతంత్ర ఆలోచనాశక్తినీ ఓ మేరకి కల్పించింది. ఇది తమ పూర్వీకుల పల్లెల్లో స్త్రీలు అనుభవించలేనిదే! మరోవైపు వీటిని సాకుగా తీసుకొని, ఆమెను కాటువేసే క్షుద్రశక్తులను కూడా ‘పెట్టుబడి’ సృష్టించింది. ఈ శక్తులను కూడా ‘నిర్భయ’ వంటి వలన కూలీ కుటుంబాలలోని మగవాళ్ళ నుంచే ‘పెట్టుబడి’ ఉత్పత్తి చేసింది. ‘పెట్టుబడి’ తన అంతర వైరుధ్యానికి అనుగుణ్యంగా మన పౌర సమాజంలోనే పరస్పర విరుద్ధమైన రెండో ప్రజాసముదాయాలను సృష్టించడం గమనార్హం!
నిజానికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లూ, బి.పి.వో. ఉద్యోగులూ నేడు తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఆయా కంపెనీల నిరంకుశ నియమ, నిబంధనల కింద తమ ఉద్యోగ వృత్తులలో తీవ్ర మానసిక వత్తిళ్ళకి గురౌతున్నారు. ఇంటికి కంప్యూటర్లు యిచ్చి, రోజుకు 12 గంటలు లేదా అంతకంటె మించిన చాకిరీని సాఫ్టువేరు కంపెనీలు చేయిస్తున్నాయి. ఆర్థికంగా నెలకి యాభై వేల రూ||లు సంపాదిస్తున్నటికినీ, నేడు సాఫ్టువేర్ ఇంజనీర్లు ‘మేధో బానిసలే’! వాస్తవానికి శారీరక శ్రమ చేసే బ్లూకాలర్ కార్మికవర్గం కంటె, అనేక రెట్లు శ్రమ దోపిడీకి యీ హైటెక్ వైట్ కాలర్ ఉద్యోగులు గురౌతున్నారు. తమ పూర్వీకుల కంటె అధికాదాయం సంపాదిస్తున్నామన్న వీరి మానసిక సంతృప్తి భావనలను కొత్త పని పరిస్థితులు పటాపంచలు చేస్తున్నాయి. అయితే తమ శ్రమ దోపిడీ మీద చేయాల్సిన పోరాటానికి తగిన స్వీయాత్మక నిర్మాణ పరిస్థితులు యింకా పరిపక్వం కాలేదు. ఈ లోపుగా రోడ్ల మీద కూడా వారికి మరో అభద్రత ఎదురైనది. నగరాలు, పట్టణాలలో వీరి తక్షణ ప్రధాన డిమాండ్లు ‘రక్షణ’, ‘భద్రత’లయ్యాయి. ఇవి వారిని కృంగతీస్తున్నాయి.
రాత్రి విధులకి హాజరై, తిరిగి ఇళ్ళకు చేరాల్సిన హైటెక్ మహిళా ఉద్యోగులకి నేడు నగరాలలో రక్షణ లేకుండా పోయింది. ఇది అవివాహిత స్త్రీ ఉద్యోగులకి మరింత అధికంగా ఎదురౌతున్న సమస్య. అంతేకాకుండా యీ కోవకి చెందిన ఉద్యోగ దంపతుల జంటలు కూడా నగరాలలో స్వేచ్ఛగా సంచరించలేని అభద్రతా పరిస్థితి నెలకొన్నది. దీనికి తోడు ప్రేమ, స్నేహాల ప్రాతిపదికగా నగరాలలో వినోదించాలనుకునే ఆధునిక యువతీ యువకులకి కూడా భద్రత కొరవడింది. వీరు అనుభవించజూస్తున్న స్వేచ్ఛకి కూడా క్షుద్రశక్తుల నుంచి భంగం ఏర్పడుతున్నది. (అందుకే ‘ఫెమినిస్టు’ పరిధులు కూడా దాటి తాజా వుద్యమంలో ఆధునిక స్త్రీ, పురుషులు సమానంగా పాల్గొన్నారు) తమ పని ప్రదేశాలలో ఏర్పడిన మానసిక వత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందే స్వేచ్ఛను కూడా వీరికి నేటి నగర సంస్కృతి అనుమతించడం లేదు. తమకి భద్రత, రక్షణలకై వుద్యమించాల్సిన భౌతిక పరిస్థితి వారిముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ‘నిర్భయ’పై మృగరాయుళ్ళ అ(హ)త్యాచార సంఘటన జరిగింది. అవి నేడు దేశంలో ప్రతిరోజూ జరిగే దుర్ఘటనే కావచ్చు. కానీ ఏదో ఒక సంఘటన, ఏదో ఒకరోజు దావానలాన్ని సృష్టించే ‘నిప్పురవ్వ’గా మారుతుంది. ‘నిర్భయ’పై అత్యాచార సంఘటన అత్యంత పాశవికమైనది. అందుకే అది ‘నిప్పురవ్వ’ పాత్రను పోషించింది. అభద్రతకి గురైన ఆధునిక యువతరం ఆకురాలిన కాలంలోని ఎండిన ఆడవిగా మారింది. ‘నిర్భయ’ దుర్ఘటన ఓ నిప్పురవ్వగా మారింది. అందుకే అది దావానలాన్ని సృష్టించింది.
‘నిర్భయ’ ఆ రాత్రి మృగాళ్ళ కామవాంఛలకి సహకరించి వుంటే, ఆమె గాయపడకుండా క్షేమంగా వుండేదని ఓ సైకియాట్రిస్టు టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం! అదే జరిగివుంటే యీ దుర్ఘటన కూడా వెలుగుచూడని వేలాది లైంగిక అత్యాచారాల జాబితాలో ఒకటిగా చేరివుండేది. నిజానికి మనస్సు చంపుకొని లైంగిక అత్యాచారాలకు అయిష్టంగా అంగీకరించాల్సిన పరిస్థితులు నేడు సమాజంలో వున్నాయి. ఇది అనాగరికమైనది. ఈ అనాగరిక పరిస్థితిని ‘నిర్భయ’ చీల్చిచెండాడింది. తన మానసిక ఆకాంక్షకి అనుగుణ్యంగా ఆమె తన శరీరాన్ని నిలబెట్టింది. ప్రాచీన హిందూ సనాతనధర్మం ప్రకారం సతీ అనసూయ, సక్కుబాయి, సావిత్రిల వలె ‘స్వంత మనుసులు’ లేని బానిస స్త్రీగా ఆమె వ్యవహరించలేదు. ఆధునిక పెట్టుబడిదారీ నీతి ప్రకారం అంగడి సరుకుగా ఆమె మారలేదు. తన వ్యక్తిత్వాన్నీ, స్వయంప్రత్తినీ ఆనాటి కాళరాత్రిలో సైతం కాపాడుకున్నది. తన మనస్సు అసహ్యంగా భావించిన ‘చర్య’కు తన శరీరాన్ని బలికానివ్వకూడదని నిశ్చయించుకున్నది. అందుకై గంటలతరబడి తీవ్రంగా పెనుగులాడింది. తమ లైంగిక మృగతృష్ణకి సహకరించనందునే ఆరుగురు కామాంధులు క్రౌర్యాన్ని ఆశ్రయించారనేది వాస్తవమే. అయినా ఆరుగురు మగరాయుళ్ళ కౄరత్వం ఎదుట తన శరీరాన్ని నిర్మలమైనదిగా కాపాడుకోగలిగిన ‘నిర్భయ’ మానసిక ఆకాంక్ష, సంకల్పాలు అత్యంత బలమైనవి. అవే నేడు కోట్లాది ప్రజలను మేల్కొలిపాయి. రోడ్డుమీదికి తెచ్చాయి. ప్రభుత్వాన్ని మెడలు వంచాయి. అందుకే ఆ రాత్రి ‘నిర్భయ’ ప్రదర్శించిన మానసిక సంకల్పానికి జనం జేజేలు పలకాలి.
ఢిల్లీ పరిసరాలలో నేడు లక్షలాది కార్మికవర్గం శ్రమదోపిడీపై పోరాడుతున్నది. గురుగావ్, మానేసర్ వంటి పారిశ్రామిక ప్రాంతాలలో విదేశీ బహుళజాతి సంస్థలకి చెందిన ఆటోమొబైల్, తదితర పరిశ్రమల కార్మికవర్గం వుద్యమిస్తున్నది. తమ ఉద్యోగభద్రత, ఉపాధి రక్షణ, జీవన పరిస్థితుల మెరుగుదల, పనిభారం తగ్గింపులకై సమరశీల పోరాటాలు సాగిస్తున్నది. సేవారంగాలకి చెందిన సాఫ్ట్‌వేర్, బి.పి.వో. కంపెనీల అధికాదాయ తెల్లచొక్కా ఉద్యోగులు కూడా మున్ముందు శ్రమదోపిడీపై పోరాడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. పెట్టుబడిదారులపై ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సిన పరిస్థితులు ముందుకొస్తున్నాయి. దీనికి ముందు వారు తమ భద్రతకై పెట్టుబడిదారీవర్గం మీద పరోక్ష పోరాటానికి దిగారు. పెట్టుబడిదారీ వర్గం సృష్టిస్తున్న క్షుద్ర సంస్కృతిపై సాగించిన తాజా పోరాట మిది. ఇది సారాంశంలో ‘పెట్టుబడి’ పైన ఎక్కుపెట్టిందే.
ప్రపంచీకరణ విధానాలు ‘పెట్టుబడి’ని నానాటికీ మరింత అభివృద్ధి నిరోధకశక్తిగా మారుస్తున్నాయి. ‘పెట్టుబడి’ గీసుకున్న నైతిక గీతలను, అదే స్వయంగా చెరిపివేసుకుంటున్నది. ‘పెట్టుబడిదారీ విధానం పెరుగుదలే, దాని పతనానికి హామీ’ అని లెనిన్ సూత్రీకరించాడు. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ తనను పాతిపెట్టే ఆయుధాలను తానే సృష్టించి స్వయంగా కార్మికవర్గానికి అందిస్తుందని’ కారల్‌మార్క్స్ సూత్రీకరించాడు. ఈ సైద్ధాంతిక వెలుగులోనే తాజా ప్రజా వెల్లువను అర్థం చేసుకోవాల్సి వుంది.
కార్లు, ప్లాట్లు కొనుక్కొని సాపేక్షికంగా మెరుగైన జీవనం సాగిస్తున్న ఆధునిక అధికాదాయ వేతన జీవులు కూడా విప్లవోద్యమానికి మిత్రులే. వారు నేడు విలాస జీవితాలు సాగించినంత మాత్రాన, అది నిలకడ గలిగిందేమీ కాదు. ఆర్థిక సంక్షోభ క్రమంలో బడుగు, బక్కజీవులతో పోల్చితే, ఎక్కువ స్థాయిలో చితికిపోయేది వీరే. ఈ తరహా సేవారంగాల ఉద్యోగులని నిర్లక్ష్యం చేయడం తగదు. పబ్బులు, క్లబ్బులకి వెళ్ళేవారిపట్ల గుడ్డి వ్యతిరేకతను పెంచుకోవడం కూడా తగదు. జల్సా జీవితం సాగిస్తున్నారంటూ వెగటు భావనను ఏర్పరచుకోవడం సరైనది కాదు. ఈ పాశ్చాత్య నాగరికతా వ్యామోహపరులే నేడు వారాల తరబడి చలిని లెక్కచేయకుండా వుద్యమించిన నూతన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి ఆధునిక అధికాదాయ వర్గాలే అరబ్ మల్లెల విప్లవాన్ని సృష్టించిన అనుభవాన్ని మరిచిపోరాదు. వీరే యూరప్, అమెరికాలలో ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ వుద్యమాలను నిర్మించిన సత్యాన్ని కూడా విస్మరించరాదు.
దుర్భర ఆర్థిక పరిస్థితులు అనుభవిస్తున్న కాంట్రాక్టు, క్యాజువల్, అవుట్‌సోర్సింగ్ కార్మికవర్గాన్ని సంఘటితం చేయడం సరైనదే. కానీ విప్లవ కమ్యూనిస్టులు తమ ట్రేడ్ యూనియన్ కృషిని అక్కడికే పరిమితం చేయరాదు. సాఫ్ట్‌వేర్, బిపిఓ వంటి ఆధునిక నూతన సేవారంగాల అధికాదాయ ఉద్యోగులలోకి కూడా తమ ‘నిర్మాణ కృషి’ని విస్తరించాల్సి వుంది. గ్రామాలు, పల్లెప్రజలను సంఘటితం చేసే కర్తవ్యం ప్రధానమైనదే. అదే సమయంలో నగరాలు, పట్టణాల ప్రజలను నిర్లక్ష్యం చేయరాదు. ‘పెట్టుబడి’పై నిర్ణయాత్మక దాడికి వాటిమీద కూడా కేంద్రీకరించాల్సి వుంది. ఆధునిక నాగరీకులూ, పాశ్చాత్య వ్యామోహపరులూ, విలాసజీవులూ విప్లవానికి అస్పృశ్యులు కాదు. వారిని కూడా తనలో యిముడ్చుకోవాల్సిన బాధ్యత ‘విప్లవం’ మీద వుంది. తాజా వుద్యమం నుంచి విప్లవశక్తులు తీసుకోవాల్సిన రాజకీయ గుణపాఠమిదే! ఇలాంటి విలువైన గుణపాఠాన్ని తీసుకోవడానికి ఒక చారిత్రక దశలో విప్లవ శక్తులకి సహకరించిన ‘నిర్భయ’కి మరోసారి నివాళులర్పిద్దాం. ఆమె ‘నిర్భీతి’కి జేజేలు పలుకుదాం!