కడలితీరంలో కవి మిత్రులతో కాసేపు

వి. ప్రతిమ

సముద్రం అనగానే సాహితీప్రియులకి
‘ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరు లెందరో’ అన్న దాశరథి గీతం నాలుకల మీద నర్తిస్తుంది.

అనంతమైన సంపదని, అగ్నిపర్వతాలనీ గర్భంలో దాచుకుని పైకి అలల రెక్కలతో ఉరకలేస్తూ… లోలోపలికి వెళ్ళినపుడు అత్యంత నిశ్శబ్దంగా, ఏమీ ఎరగని దానిలా ముదురు పచ్చగా కన్పించే సముద్రమంటే ఎవరికిష్టముండదు?… అందునా కవులకి సముద్రం ఒక అబ్సెషన్…

కడలితీరంలో కవి మిత్రులతో కాసేపు
మా నెల్లూరుజిల్లా రచయితల సంఘం (నెరసం) కవులందరినీ కడలితీరంలో కలుద్దాం రమ్మని పిలిచినపుడు అందరిలోనూ అదే యిష్టం, అదే ఉత్సాహం… పైగా ఒక నిబంధన… వచ్చేవాళ్ళంతా ఊరికే రావటానికి వీల్లేదు… సముద్రం మీద ఒక కవిత చదివి విన్పించాలి అని… యువకవులంతా మరింత ఉత్సాహపడిపోయారు… 29 జులై ఉదయం 8 గం||కి వంశీ నర్సింగు హోం (డా|| పెళ్ళకూరు జయప్రదగారి నర్సింగుహోం నెల్లూరు) నుండి బస్సు బయలుదేరుతుందని ఆహ్వానాలందాయి.

నాయుడుపేట నుండి ఆఘమేఘాల మీద నేను వంశీ నర్సింగు హోం చేరుకునే టప్పటికి బస్సూ, బస్సుతో పాటుగా కవులూ సాదరంగా స్వాగతం పలికారు. అంతా నాకోసమే ఎదురుచూస్తున్నారట…

మెట్లెక్కుతుండగా మా జిల్లాకవి ‘పెంచల నరసింహం’ ఎదురొచ్చారు…కనులు లేవని కలతపడకపోవడానికి కారణం ఆయన జ్ఞానచక్షువులు ఎప్పుడూ చుట్టూవున్న సమాజాన్ని లోతుగా పరిశీలించి ఆయన హృదయానికి అందిస్తూ వుంటాయి… మెదడుతో కలిసి ఆ హృదయం గొప్పగొప్ప కవితల్ని పండిస్తుంటుంది…ఆయనతో మొదటి పలకరింపు అయ్యాక కొండ్రెడ్డి వెంకటేశ్వర్రెడ్డి (కనిగిరి) కోనూరి రవికుమార్ (దాచేపల్లి), అద్దేపల్లి రామ్మోహన్రావు (హైదరాబాద్), పోతూరి అన్నపూర్ణ, ఖాదర్ షరీఫ్, లక్ష్మీసుహాసిని, రాజేశ్వరి, సుజనారాము, శైలజామిత్ర (హైదరాబాద్), పూజిత, డా|| జయప్రద, యిలా వరుసగా అందరితోనూ కరచాల నాలూ, పలకరింపులూ, నవ్వులతో ‘వంశీ నర్సింగు హోం’ హోరెత్తిపోయాక నెరసం సెక్రటరీ పెరుగు రామకృష్ణ తొందరపెట్టడంతో ఒక్కొక్కరమూ బస్సెక్కి కూర్చున్నాము…

సరిగ్గా 8.30కి మా బస్సు రామతీర్థం (పొన్నపూడి పెదపాళెం) బీచ్ వైపుగా నడక ప్రారంభించి మెల్లగా పరుగందుకుంది.. బస్సులో కవులతోపాటు కొంతమంది కవుల కుటుంబసభ్యులు కూడ వుండడంతో కొత్తకొత్త పరిచయాలు జరిగాయి…

బస్సులో ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్న తర్వాత కవి గుండాల నరేంద్రబాబు అందరికీ చాక్లెట్లు పంచారు…అంతటితో వూరుకోకుండా ప్రతిమగారి పుట్టినరోజంటూ ప్రకటించారు… దాంతో బస్సంతా శుభాకాంక్షల పర్వం మొదలయింది…అందరికీ అది నిజం కాదనీ, సరదాకి అని తెలిశాక నవ్వులు పువ్వులయి విరగబూసి బస్సంతా నిండిపోయి దారికిరు వైపులా పరుచుకోసాగాయి.

ఆ పరిమళాల నాస్వాదిస్తూ ఎవరి సీట్లలో వాళ్ళు అనంతమైన కబుర్లలో మునిగి పోయారు….

బస్సు రెండు, మూడు ఊళ్ళు దాటాక… అప్పటిదాకా బస్సంతా కలియదిరుగుతూ అందరినీ పలకరిస్తూన్న ఖాదర్ షరీఫ్ వున్నట్లుండి ”రామయ్యా (పెరుగు రామకృష్ణ) మా అందరికీ కవళం యాడ పెట్టిస్తావునా? …” అనడంతో అంతా షరీఫ్ని సపోర్ట్ చేస్తూ పెద్దగా కేకలు వేశారు…అప్పటి కింకా ఎవరూ సద్దికూడు (బ్రేక్ ఫాస్ట్) తినకపోడంతో షరీఫ్ మాటలు ఆకలి కడుపులకి అంబలిలా తోచాయి.

”దిగగానే టిఫినుంటుంది” ముందు నుంచి అరిచాడు రామకృష్ణ.”అకో టిఫినుండాదంలే, అనోఁ టిఫినుండాదంట” అంటూ షరీఫ్ బస్సంతా తిరుగుతూ అందరికీ చెప్పడం చెప్పలేనంత నవ్వు తెప్పించింది…

హోరుమన్న కేకలతో ముందుకు సాగుతోన్న బస్సుని దారికిరువైపులా పల్లెజనం విస్తుపోయి, విరగబడి చూస్తున్నారు. బస్సులో వున్న నెరసం సభ్యుల పిల్లలు కొందరు వారికి టా..టాలు చెప్పసాగారు.

గతుకుల కుదుపులలో దాదాపు గంట న్నర ప్రయాణం, గంపల కొద్దీ కబుర్లతో… నవ్వుల చిరుజల్లులతో తడిసి ముద్దయి మా బస్సు రామతీర్థం గెస్ట్హవుస్ వద్దకి చేరుకుంది…

అక్కడినుండి సముద్రం దాదాపు కిలోమీటరు దూరముంది.

అక్కడ దిగి అందరమూ కాస్త రిఫ్రెషయి మెల్లగానూ, కొంత వడివడిగానూ సముద్రం వైపు నడవసాగాం…

అక్కడికెళ్ళేటప్పటికి మా జిల్లా రచయిత పోట్లూరి సుబ్రహ్మణ్యం గారు అక్కడ మాకోసం అన్ని ఏర్పాట్లూ చేసి ఆయన రాజ్యంలోకి మమ్మల్ని స్వాగతించారు…ఆయన రాజ్యం అని ఎందుకంటున్నానంటే పోట్లూరి సుబ్రహ్మణ్యం గారు అక్కడ (రామతీర్థం) ఎం.ఆర్.ఓ. అంటే యిప్పుడు తహశీల్దారుగా పనిచేస్తున్నారు… పోట్లూరి గారి సౌజన్యంతోనే మా యీ ‘కడలితీరంలో కవిసమ్మేళనం’ వ్యూహరచన జరిగింది…

పోట్లూరిగారు స్వయంగా మా అందరికీ టిఫిన్లందించడం ఆయన నిరాడంబరతకి చిహ్నం…

టిఫిన్ల సందడి పూర్తయ్యాక మా కార్యక్రమం మొదలవాలి…కవులంతా సముద్రం వద్దకి పారిపోకుండా షామియానా కిందికి చేరడానికి ‘నెరసం’ అధ్యక్షులు, కార్యదర్శి చాల కష్టపడాల్సి వచ్చింది… మైకు గొంతు చించుకుని అందరినీ కుర్చీల్లో కూలబడేటట్టు చేసింది…అందరం కళ్ళు సముద్రానికి, చెవులు వేదికకి అప్పగించి మౌనంగా కూర్చుండిపోయాం…

నెరసం అధ్యక్షులు ఈదూరు సుధాకర్ గారిని సభకి అధ్యక్షత వహించాల్సిందిగా కార్యదర్శి వేదిక మీదికి ఆహ్వానించారు…అటు పిమ్మట వచ్చిన అతిథులు ఒక్కొక్కరినీ వేదికమీదికి సాదరంగా ఆహ్వానించారు.

వై. శ్రీరాములు (కవి, అనంతపురం), ముంజేతికి కంకణం అఖ్ఖర్లేని కవి అద్దేపల్లి రామ్మోహన్రావు గారు, హైదరాబాద్ నుండొచ్చిన కవయిత్రి శైలజామిత్ర, సి.టి.ఓ. మెహబూబ్ గారు, కొండ్రెడ్డి వెంకటేశ్వర్రెడ్డి ఆవేల్టి మా అతిథులు…

అతిథులతో పాటుగా మా నెరసం గౌరవాధ్యక్షురాలు డా. పెళ్ళకూరు జయప్రద కూడ వేదిక నలంకరించారు.

ఇటీవల మరణించిన నెల్లూరుకవి గుంటూరు శేషేంద్రశర్మగారి స్మృతికి రెండు నిముషాలు మౌనం పాటించాక సభ మొదలయింది…
అధ్యక్షుడి తొలిపలుకులు తర్వాత అనంతపురం నుండొచ్చిన కవి వై. శ్రీరాములుగారు కొత్తగా వ్రాసిన పుస్తకం ‘రాయలసీమలో వాన-తెలంగాణ’ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది…అద్దేపల్లి రామ్మోహన్రావుగారు పుస్తకాన్ని ఆవిష్కరించగా తొలిప్రతిని జయప్రదగారు అందుకున్నారు. కొండ్రెడ్డి వెంకటేశ్వర్రెడ్డిగారు పుస్తకాన్ని సమీక్షించారు…

‘రాయలసీమలో వాన-తెలంగాణా’ అన్నపేరు పెట్టడంలోనే ఆ పుస్తకంలోని పదార్థం అర్థమయిపోతుందంటూ మొదలుపెట్టి…ఆ పుస్తకాన్ని చాల లోతుగా విశ్లేషిస్తూ మాట్లాడారు…

నేటి దేశ, రాష్ట్ర రాజకీయాలను ఆసాంతమూ అవగాహన చేసుకుని వాటి ఆంతర్యాన్ని ఔపోసన పట్టిన ఆవేశమే ఈ దీర్ఘకవిత అన్నారు… ఈ దీర్ఘకవితలో తెలంగాణాని ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ ప్రజల ప్రమేయాన్ని పక్కనబెట్టి రాజకీయం రంగులు మార్చడం, వారి అస్థిత్వాల కోసం ఉద్యమాలు మార్చడం……అమాయక ప్రజల్ని బలిచేయడం…స్వప్రయోజనాలు చేకూరగానే ఎవరికీ తెలీకుండా లొంగిపోవడం…

ఢిల్లీనుండి గల్లీ రాజకీయాలవరకూ ఒక మూసలో యిమడడం చూస్తూంటే సీసాల మూతుల్లో మార్పేగానీ ద్రవంలో మార్పేమీ వుండదు…
మనుషులు విడిపోయినంత తేలిగ్గా జ్ఞాపకాల నుండి విడిపోలేరు కాబట్టి యిది రాజకీయ పాచికగా ఈ ఉద్యమాన్ని వాడుకుంటున్నట్లుగా కవి భావించాడు…

ఈ దీర్ఘకవితకి కవి తానే ముందుమాట వ్రాసుకోవడం ఒక ప్రత్యేకత అని అన్నారు కొండ్రెడ్డి…

వై. శ్రీరాములు గారు ఆ పుస్తకాన్ని శైలజామిత్రకి అంకితం చేశారట…అందుకు ప్రతిగా శైలజామిత్రగారు వై. శ్రీరాములుగారిని శాలువాతో సత్కరించారు. ఆ సన్మాన కార్యక్రమం అయ్యాక కవి అద్దేపల్లిగారు ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో సముద్రపు నేపధ్యం’ అన్న అంశం మీద సుదీర్ఘమైన ఉపన్యాసం చేశారు.

సృష్టి మొత్తం మీద రెండే రెండు ప్రతీకలున్నాయి.

ఒకటి సూర్యుడు, రెండు సముద్రం…

సూర్యుడు నిశ్చలనమూర్తి అయితే సముద్రం నిత్య సంచలన చైతన్య స్ఫూర్తి… అన్నారు.

సముద్రం నాకాదర్శం
లేచి పడినందుకు కాదు…
పడినా లేచినందుకు’ అన్న ఆచార్య భావన కవితని గుర్తుచేశారు.

కాళ్ళు తడవకుండా కడలిదాట వచ్చునేమొ కానీ
కళ్ళు తుడవకుండా జీవితాన్ని దాటలేము అన్న ‘వసీరా’ నీ… యింకా అడివి బాపిరాజునీ… విశ్వనాథ కిన్నెరసానినీ… దాశరథి గీతాన్నీ కూడ విశ్లేషిస్తూ మాట్లాడారు.

ఆధునిక సాహిత్యంలో సముద్రం మీద మూడేమూడు దీర్ఘకవితలొచ్చాయి…ఒకటి గుంటూరు శేషేంద్రశర్మ వ్రాసింది…రెండు వరవరరావు వ్రాసింది…మూడు అద్దేపల్లి వ్రాసింది…

శేషేంద్రశర్మ సముద్రాన్ని అనేక అంశాల్లో స్వేచ్ఛాభావనని ప్రధానంగా… విశ్వసంకేతంగా తీసుకుంటే వరవరరావు విప్లవానికి ప్రతీకగా సముద్రాన్ని తీసుకున్నారు…అద్దేపల్లి నిత్యయవ్వనం, చైతన్యంకి ప్రతీకగా సముద్రాన్ని ఎంచుకున్నారు…

”ఇంతేనటే సముద్రం ఎంతో అనుకుంటి
మనకీ సూర్యుడికీ మధ్యనున్నదేనా?” అన్నాడట ఒక భావకవి…

మొత్తంమీద ప్రపంచసాహిత్యంలో సముద్రాన్ని ప్రతీకగా వాడుకోని కవి అంటూ ఎవరూ లేరు… సముద్రం శాశ్వత ప్రతీక…

అసలు మనిషే సముద్రమంతటి వాడు…లోపలి చైతన్యాన్ని ఎంత బయటికి తీస్తే అంత విస్తృతమవుతాడు…అంటూ లోతుగా చాలా విపులంగా అనేక ఉదాహరణలిస్తూ మాట్లాడారు అద్దేపల్లి…

కవులంతా యిలా సముద్రతీరంలో కలిసి కవిసమ్మేళనం అందునా యింత మిక్కిలి సంఖ్యలో హాజరుకావడం సంభ్రమాశ్చర్యాలను కల్గిస్తోంది అని కూడా అన్నారు… అంతే కాకుండా ఎక్కువసంఖ్యలో కవులున్నటు వంటి ప్రదేశాల్లో నెల్లూరు జిల్లా కూడ ఒకటి అంటూ కితాబునిచ్చారు.

ఆ తరువాత అంతా ఆతృతగా ఎదురుచూస్తూన్న కవి సమ్మేళనం ప్రారంభ మైంది… దాదాపు పాతికమంది కవులు… వై. శైలజ, రాజేశ్వరి, పెరుగు సుజనారాము, వై. రాఘవయ్య, ఊరుబిండి వెంకట సుబ్రమణ్య శాస్త్రి, దయాకర్రెడ్డి, కొండ్రెడ్డి, పి. సునీత, ఎస్. గోపాల్, కోదండ రామయ్య, మోపూరు పెంచిల నరసింహం, గుండాల నరేంద్రబాబు, కె.వి. రమణ, యద్దల లలిత, జూలూరు కృష్ణవేణి, పి. అన్నపూర్ణ, అనూరాధా రామకృష్ణ, పాతూరి అన్నపూర్ణ, లక్ష్మీసుహాసిని వంటి కవులు తమతమ కవితలను చదివి విన్పించారు…
మొదటి అయిదు కవితలను డా||జయప్రదగారు, రెండో అయిదు కవిత లను ప్రతిమ.వి సమీక్షించాక భోజనసమయం కావడంతో అందరికీ ఆత్మీయమైన భోజనాలు వడ్డించబడ్డాయి…

మళ్ళీ కబుర్లూ, నవ్వులూతో కలిపి భోజనకార్యక్రమం పూర్తయ్యాక మూడో విడత కవిసమ్మేళనం ప్రారంభమైంది…ఈసారి కొందరు కవుల కవితలకు కొండ్రెడ్డి, ఆ తర్వాత వై. శ్రీరాములు, పెరుగు రామకృష్ణ సమీక్షకులుగా వ్యవహరించారు.

నెల్లూరు జిల్లా యువకవుల్ని, వారు తీసుకున్న ప్రతిభావంతమైన ప్రతీకల్ని అతిథులు మెచ్చుకుంటూ అభినందించడం విశేషం…
షరీఫ్, కోసూరి రవికుమార్, పి. సునీల్, ఎస్. గోపాల్, పాతూరి అన్నపూర్ణవంటి వారి కవితల గురించి మళ్ళీమళ్ళీ మాట్లాడుకోడం కన్పించింది…

ఇప్పటిదాకా కేవలం కథకుడిగానే దర్శనమిచ్చిన పోట్లూరి ఈ సాగరతీరంలో కవిగా అవతారమెత్తి మంచి కవితను వ్రాసి చదివి విన్పించడం విశేషం…

లక్ష్మీసుహాసిని, శైలజామిత్ర, సుజనారాము, యద్దల లలిత వంటి వారితో ప్రెస్వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడించడం… అవన్నీ మర్నాటి లోకల్ పేపర్లలో రావడం అందరినీ ఆనందింపజేసింది…

కవిసమ్మేళనం, అతిథుల సన్మాన కార్యక్రమం…అధ్యక్షుడి మలిపలుకులు పూర్తయ్యీకాకముందే పగ్గం విప్పిన లేగ దూడల్లా అంతా సముద్రంకేసి పరిగెత్తారు… అప్పటికి సూర్యుడు పడమటి ఆకాశం మీదికి ఒరిగి నాలుగు ఘడియలయింది…

గురుపూర్ణిమ (పౌర్ణమి) కావడంతో సముద్రం బాగా పోటుమీదుంది… అలలు చాలా ఎత్తున ఎగిసిపడుతున్నాయి…అయినా సరే ఎవరూ వెనక్కి రావడానికిష్టపడడం లేదు…పైగా ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా మత్స్యకారులు పడవలనిండా చేపలు పట్టుకొస్తున్నారు… వాటిని గంపలతో ఆడవాళ్ళు మోసుకెళ్ళి ఒడ్డున ఆరబోస్తున్నారు…నిజంగా అదొక సుందరదృశ్యం.

పోట్లూరి అదే అన్నారు…’మామూలుగా అయితే యిన్ని చేపలు దొరకవు. ఇవ్వాళ మనకోసమే అన్నట్లుగా యింతమంది జాలర్లు ఒడ్డున వున్నారు…పడవలు పడవలుగా చేపలు పట్టుకొస్తున్నారు’ అని… సముద్రం పోటు మీదుంది, పైగా లోతెక్కువుంది కాబట్టి బోటు షికారు కుదర దన్నారు… అప్పటికే కవిత్వపు వేడితోనూ, సముద్రపుగాలితోనూ వాడిపోయివున్న అందరి ముఖాలూ మరింతగా మాడి పోయాయి.

వెంటనే పోట్లూరి సుబ్రమణ్యం గారు మమ్మల్నందరినీ మరో అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న బకింగుహ్యామ్ కెనాల్కి తీసికెళ్ళి మూడు బోట్లలో విహరింపజేశారు… నది సముద్రంలో కలిసేచోటుదాకా ‘లాహిరి లాహిరి లాహిరి’లో అంటూ కవిత్వపు కబుర్లతోపాటు స్నేహసుమాంజలులు విరబూయిస్తూ…కేకలు, అరుపులతో నదిని, సముద్రాన్నీ కూడ హోరెత్తించాము…నిజంగా అదో గొప్ప అనుభవం.

మా పడవ విహారం పూర్తయ్యేప్పటికి కనుచీకటి పడుతోంది. పడమటి దిక్కున సూర్యుడు మెలిమెల్లి కాంతులొదులుతూ కాషాయరంగులో నదిలోకి క్రుంకడం కన్పించింది…ఎత్తుగా ఎదిగిన తుంగచెట్ల చాటునుండి సూర్యుడలా క్రమంగా సింకవడం…సరిగ్గా ఎదుటి ఆకాశంలో చంద్రుడు మెలిమెల్లిగా పైకి రావడం యివి రెండూ ఒకేసారి చూడగల్గడం ఆ రోజంతట ప్రయాణంలో మరో గొప్ప అనుభూతి.
ఒక్కోసారి కన్యాకుమారికి వెళ్ళినపుడు కూడ యీ సూర్యాస్తమయాన్ని, చంద్రో దయాన్ని ఒక్కసారిగా చూడ్డం సాధ్యం కాకపోవచ్చు.

అస్తమిస్తోన్న సూర్యుడ్ని అలా నా ఒక వాక్యం చెప్పండి ప్రతిమా’ అన్నాడు ఖాదర్ షరీఫ్…

‘ఉదయాలెన్నడూ నాతో కలిసి గడపనేలేదు
కనీసం ఈ అస్తమయంలోనన్నా నువ్వు నాకు తోడుంటే ఎంత బావుండేది’ అన్నాన్నేను.
‘వావ్’ అంటూ అంతా ఒకటే గొడవ గొడవ.

అరుపులూ, కేకలతో అందరం ఆనందపు క్షణాలని మోసుకుంటూ అందరమూ బస్సుకేసి నడిచాము…

ఏడింటికి బస్సు నడక మొదలుపెట్టింది.

అందరం మాట్లాడుకుంటున్నామే గానీ లోలోపల ఏదో ఆవిరయిపోతున్న ఫీలింగు… ఆనందపు క్షణాలన్నీ మాయమై పోతోన్న భారమైన భావన…

ఇంతలో ‘రామతీర్థం’ శివాలయం వద్ద ఆగింది బస్సు. పురాతనమైన, విశాలమైన ఆ ఆలయ సందర్శనం మరో విశేషం ఆ ఆలయం వరకూ వుండేదట సముద్రం యిదివరకు. ఆ రోజుల్లో సముద్రంలో కొట్టుకువచ్చిన ఒక పెద్ద (అత్యంత పెద్దది) గంట ఆలయంలో శివుడి ఎదురుగా అమర్చివున్నారు…ఒకసారి దాన్ని మోగిస్తే ఆ మోత తాలూకూ శబ్దం చాలాసేపటి దాకా వలయాలు వలయాలుగా ఆ ప్రాంగణంలో గింగురుమంటూనే వుంటుంది.

అక్కడినుండి పోట్లూరి సుబ్రమణ్యం గారితోనూ, ఆయన అనుచరులతోనూ వీడ్కోలు తీసుకుని నెల్లూరు వైపుగా మా తిరుగు ప్రయాణం మొదలయింది…

బస్సులో మళ్ళీ కలకలం… అందరూ ఒకరితో ఒకరు వీడ్కోలు దూరవాణి నెంబర్లూ, చిరునామాలూ, పరస్పర కరచాలనాలూ హడావిడిలో వున్నారు.

అదేమిటో మేమెదురు చూడకుండానే నెల్లూరు వచ్చేసింది.

మళ్ళీ అందరం కలిసే రోజు కోసం ఎదురుచూస్తూ, ఆనందపు క్షణాలను మూట కట్టుకుని టాటాలు, బైబైలూ చెప్పుకుంటూ ఎక్కడివాళ్ళక్కడ దిగి వారివారి యింటిదోవ పట్టారు… వీడ్కోలు సమయంలోని చిరునవ్వులు రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు.

సముద్రం కంటే గొప్పది
వి. ప్రతిమ

పురాతనమైన జ్ఞాపకాలని తవ్వుకుంటూ
కోల్పోయిన మనిషితనాన్ని వెతుక్కుంటూ
పారదర్శకమైన మనుషుల కోసం
అప్పుడప్పుడూ సముద్రతీరానికెళ్తాను.
ప్రేమించిన అనేక దుఃఖసమయాలని పోగుచేసి గూళ్ళు కడతాను.
పాణ్రతోరణమై సమూహాలని తన
గుమ్మానికి కట్టేసుకున్న సముదం
కాళ్ళు కడిగి నాతో కరచాలనమే చేస్తుంది.
కడుపులో బడబానలాన్ని దాచుకుని పైకి
అలల రెక్కలతో ఉరకలేస్తూ,
హృదయాన్ని మొగ్గలుమొగ్గలుగా విరబూయమంటూ
జీవితరహస్యాల్ని విప్పుతుంటుందుదధి…
అనుకుంటాంగానీ
సైకత తీరాలకేసి తలలు బద్దలుకొట్టుకుని కొట్టుకుని
ఎంతకని ఎక్కిళ్ళను దిగమింగగలదు పాపం
అందుకే అవసరమైతే
ఉత్పాత ఉద్యమమై భూపప్రంచాన్ని వొణికంచనూ గలదు
శాంతి కపోతాన్ని కెరటపు రెక్కల్లో పొదువుకుని
తీరాన తిరుగాడే పజ్రలకు పంచనూ గలదు,
సముదం యింకా చాలా చెప్తుంది నాకు
యుద్ధభూమిలో ఉన్నపుడు ఉద్యమం తప్పనిసరి…
నేటి చరితంతా పోరాటాలే కదా మరి.
ఏళ్ళ తరబడి కల్లోల సముద్రాల్ని కడుపులో దాచుకున్న
నాకంటే నువ్వు ఏమంత గొప్పదానివని సవాలు విసురుతాన్నేను.
బొట్లుబొట్లుగా రాలుతోన్న నా ప్రశ్నల వర్షాన్ని తట్టుకోలేక
నాలోలోపలికి ఐక్యమైపోతుంది సముదం
మరణమొకటి మొగసాల నిల్చుందని
జీవించడం మానగలమా?
సునామీ వస్తుందని…సునామీ వస్తుందని
సముద్రాన్ని ప్రేచకుండా వుండగలమా?

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.