శీలా సుభద్రాదేవి
అంతకుముందు అక్కడక్కడ కొందరు మాత్రమే గొంతు ఎక్కుపెట్టినా చలించని స్థితిలో నుంచి ఎనభై దశకం తర్వాత సాహిత్యరంగాన్ని ఒక్క కుదుపుకుదిపి ఒక స్పష్టమైన రూపుదాల్చిన ఉద్యమాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది స్త్రీవాదం. దీనిపట్ల ఆకర్షితులై కావచ్చు, గుర్తింపుకోసం కావచ్చు, అప్పట్లో వర్ధమాన కవులు, కవయిత్రులే కాక ప్రసిద్ధులైనవాళ్ళు సైతం తమవంతు ప్రోత్సాహాన్ని ఉద్యమానికి అందిస్తూ కవిత్వం వెలువరించారు. కొంతమంది నిజాయితీగా తమ స్పందనల్ని, తమ మనసుల్ని, అణచివేతల్ని, మథనల్ని ఆవిష్కరిస్తూ, తమ హక్కుల్ని, తమ అస్థిత్వాన్నీ కోరుకొంటూ కవిత్వీకరించారు. అటువంటి వారిలో మందరపు హైమవతి ఒకరు.
ఈమె కవిత్వంలో అస్పష్టత ఉండదు. చెప్పదలచుకొన్నది పదునైన పదాలతో సూటిగా చెప్తారు.
ఇంటా బయటా అలసిపోతూ
”శరీరమే చేతులుగామారినా
హస్తద్వయమే కార్తవీర్యార్జుని సహస్ర బాహువులుగా
పరిణమించి పనిచేసినా-”
ద్విపాత్రాభినయం చేస్తున్నా రెండుచోట్లా గుర్తింపులేని చాకిరిని చక్కటి పదచిత్రాలతో తెలియజేశారు.
పెళ్ళయిన తర్వాత భర్త ఎటువంటివాడైనా ఎలాంటి పరిస్థితులున్నా
”సర్దుకుపో ఈ నాలుగు అక్షరాలే
స్త్రీని అగ్నికాహుతి చేసే సాధనాలు “ అంటూ చెప్పిన కవిత.
”సంప్రదాయాల సజీవ సమాధిలో
ఊపిరాడక గిలగిలకొట్టుకొంటూ
జీవితంనుంచి కాదు కదా
శరీరం నుంచైనా కించిత్తు కూడా
దూరమవడం నాచేతుల్లో లేనిపని”
ఆలోచన్లకు అభిరుచులకు అడ్డుకట్టవేసి తన శరీరంపై తనకే హక్కులేకపోవటాన్ని మరొక ప్రాచుర్యం పొందిన కవిత ”సర్ప పరిష్వంగం”లో చెప్పారు.
హిందూ వివాహవ్యవస్థలోని లోపాల్ని, సాంప్రదాయాల పేరిట స్త్రీని కట్టుబానిసగా మార్చేసిన వైనాల్నీ, స్త్రీకి అస్థిత్వం లేకుండా చేసిన ధర్మాల్నీ అక్షరీకరిస్తూ స్వతంత్రమైన ఆలోచన్లని చిదిమేసే విధానానికి ఆవేదన చెందుతారు.
ప్రపంచీకరణ ప్రభావం కులవృత్తుల మీద పడటంతో ఆయావృత్తులవాళ్ళు పోటీ తట్టుకోలేక కూటికి కూడాలేని పరిస్థితికి గురై ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని కుప్పకూలుతున్న సందర్భం యిది. అటువంటి స్వర్ణకారుల విషాదస్థితిని ఈమెకూడా కవితావస్తువుగా స్వీకరించారు.
”మార్కెట్లో ప్రవేశించిన కొత్త కొత్త యంత్రాలు
పనివాళ్ళ చేతివేళ్ళ కత్తెరలు కప్పను మింగే సర్పంలా
కాలం పరిణమించినవేళ ప్రపంచీకరణ నేపథ్యంలో
కులవృత్తుల కోటగోడలు కుప్పకూలుతున్న విషాదదృశ్యం”
మానవత్వాన్ని పరిహసించి ఎంతమంది మనసులనో కదిలించిన గుజరాత్ గాయం సలిపిన రక్తాక్షరాలు
‘నేరస్థులం’ -‘హింస నెత్తుటి పతాకాన్ని
నిర్ధాక్షిణ్యంగా ఎగరేసిన
ఆటవిక రాజ్యమిది”
‘అంతా ఐపోయాకా’ –
”ఒక్కొక్కరూ ఒంటరిగీతాలు
చెలియలి కట్టలేని దుఃఖసముద్రాలు
ఏ బీభత్సమైనా
శరీరాలే కదా క్షేత్రాలు” అంటూ దృశ్యాల్ని అక్షరచిత్రాలుగా చూపారు.
లింగనిర్ధారణ పరీక్షలో ఆడశిశువని తెలిసాక గర్భవిచ్ఛిత్తి చేసుకోవటాన్ని నిరసిస్తూ ”నిషిద్ధాక్షరి”లో ఊపిరిపోసుకుని పాప గొంతుని
”తలమాత్రమేలేని శిలావిగ్రహంలా
మిగిలిపోతానని బాధపడుతున్నావా అమ్మా”
అని పలికిస్తూ –
”ఆత్మలు అమ్ముడు పోతున్నపుడు
కన్నతల్లులే వృద్ధాశ్రమాల
వలస పక్షులౌతారు
ఆడపిల్లలే నిషిద్ధాక్షరాలౌతార”ంటారు.
వివిధ సమయాలలో, వివిధ సందర్భా లలో స్త్రీదాల్చే విశ్వరూపాల్ని ”లేడీస్ స్టాఫ్రూమ్”లో అనేకమంది స్త్రీలలో చూపుతారు. అన్ని రూపాల్ని ఒకే స్త్రీలో చూపుతూ ‘పండగరోజు’, ‘కవిగారి భార్య’లోనూ, ‘ద్విపాత్రాభినయం’లోనూ అష్టావధానాలు చేసే గృహలక్ష్మి విశ్వరూపాన్ని చూపుతారు. గృహలక్ష్మి పేరుతో దేవతని చేస్తూ స్త్రీస్వేచ్ఛని హరించటాన్ని ఇలా అంటారు.
”ఇంటిపనితో తీరికలేక
పంజరంలో పక్షుల్లా
బంధిఖానాలో మగ్గిపోయేది మేమే
ఔను స్త్రీలను గృహలక్ష్ములుగా పూజిస్తారిక్కడ”
అంటూ పదునుగా తేటతెల్లం చేస్తారు.
కార్పొరేటు పాఠశాలల్లో కోల్పోతున్న బాల్యాన్ని ‘రెక్కలు కత్తిరించిన బాల్యం’లో చూపుతారు.
‘మనసును గుర్తించలేని పాతకాలపు భావాలు ఈ జీవితం సిలబస్ మార్చలేమా’ అని ప్రశిస్తారు.
ప్రపంచీకరణ నేపధ్యంలో అందాల విపణిలో స్త్రీ అమ్మకపు సరుకై పోతోన్న సందర్భంలో కదిలింపచేసే కవితలు ‘సంతకాలు చేద్దాం! రండి’ ‘మనకేం మనం బాగానే ఉంటాం’, ‘మరో తాజ్మహల్’, ‘అమ్మాయిలు కావలెను’ ఈ పుస్తకం నిండా ఉన్నాయి.
విచ్ఛిన్నమౌతోన్న మానవ సంబంధాల్ని విప్పిచెప్పినా, అబద్ధాల ‘ప్రేమ కాటు’ని వివరించినా భిన్న సందర్భాలలో ఏ కవితని పలికించినా తన భావాన్ని వ్యక్తీకరించే పదాల్ని శక్తివంతంగా ప్రయోగిస్తూ స్పష్టంగా, పదునుగా పాఠకుడి అంతరంగాన్ని తాకే విధంగా చెప్పే నేర్పు మందరపు హైమవతిగారి కవిత్వంలో ఉంది.