ఎంతోకాలంగా కవిత్వం వ్రాస్తూ అనేక పుస్తకాలను ప్రచురించి తెలుగు కవితా జగత్తులో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్న అనిశెట్టి రజిత కథలు కూడా వ్రాయడం అభినందించదగిన విషయం…
రజితకు సాహిత్యమూ, జీవితమూ వేరు వేరు కావు…
రజిత సామాజిక కార్యకర్త.. చాలాకాలంగా తన చుట్టూ వున్న సమాజంలోని లోటుపాట్లన్నింటినీ పరిశీలిస్తూ వచ్చిన రజిత.. మట్టిభాషలో.. ఎంతో సహజంగా తనదైన భాషలో కవిత్వం వ్రాసిన రజిత తొలి కథా సంపుటి ‘మట్టిబంధం’.
ఇటీవలే ఆవిష్కరించబడిన ఈ సంపుటిలో మొత్తం పదమూడు కథలున్నాయి. ఏవేవీ కూడా కథలు కావు. జీవితాలు… ఏవీ కూడా పాత్రలు కావు… రక్తమాంసాలున్నటువంటి మనుషులు….
ఫిక్షనయితే అందమైన స్వరూపముంటుంది.
నిజజీవితాలకు ప్రత్యేకమైన చట్రాన్నీ, రూపాన్నీ ఆశిస్తే ఎలా? అందుకే కథకి సంబంధించిన వ్యాకరణ సూత్రాలనేమాత్రం పట్టించుకోకుండా ఈ పాత్రలు ఎగుడుదిగుడు దారుల నుండి… బహుముఖాల నుండీ నడుచుకుంటూ నేరుగా మన ముందుకొచ్చేస్తాయి.
అంతమాత్రం చేత ఎగుడుదిగుడుగా మాట్లాడ్తాయనుకుంటే మనం పొరపడ్డట్టే…
“అతడి అంతరంగం పూడిక తీసిన బావిలో ఊరుతోన్న ఊటలా దుఃఖంతో నిండుతున్నది.” ఎంత గొప్ప వ్యక్తీకరణో చూడండి అంటే వారి దుఃఖాలూ, సంతోషాలూ, ఉపమానాలూ కూడా మట్టితోనే పెనవేసుకుని వుంటాయన్న మాట…
హరిత విప్లవం మూలంగా వ్యవసాయమంతా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమైపోయి.. చిన్న చిన్న రైతులంతా వ్యవసాయ కూలీలుగా మారిపోవడం… తమ భూముల్ని తెగనమ్ముకోక తప్పని పరిస్థితుల్లోకి జారిపోయి పొట్టచేత పట్టుకుని వలసలు పోవడం సర్వసాధారణమైపోయింది యిటీవలి కాలంలో.
ఈ నేపథ్యంలో వలసలు కథా సాహిత్యంలోకి కూడా ప్రవహించాయి.
ఆ క్రమంలో ఈ సంపుటిలో ఉన్న వలస కథ కొంత ప్రత్యేకమైనది… దొరలు పల్లెల్నుండి పట్నాలకు డబ్బుమదుపు పెట్టడంకోసం వలసవెళ్ళడానికీ… ఉన్నచోట కట్టెలమ్మలేక తప్పనిసరిగా నిమ్నవర్గాలు వలస వెళ్ళడానికీ నడుమ తేడాని కూడా ఎత్తి చూపుతుందీ కథ…
ఈ కథలో ఒక తల్లి కొడుక్కిలా ధైర్యం చెప్తుంది. నిజానికి ఆమెకీ గుబులు గుబులుగానే వున్నది… అయినా ధైర్యంగానే ‘‘మనం మన మట్టిలకెల్లి ఏర్లు పెరుక్కుని ఊరితోటి ఉన్న బత్కు సంబంధాన్ని తెంపుకుని వచ్చినం… ఇక గీ ఊర్లే మన ఏర్లను దించుకోవాలే… తీగలు సాగాలే… మొలకలోలిగ మొలిచి కొమ్మలు పెట్టాలే… తప్పదు బిడ్డా… మనం బతుక్కుంట మన పిలగాళ్ళను సాదుకోవాలే… ఆల్లను సదివించి పెద్దోల్లను జెయ్యాలే… మన తీర్గ మట్టీ, బురదా పూసుకునే బతుకులు ఆల్లకొద్దు… కుదురుకునే దాకనే ఈ అగులు బుగలు’’ అంటూ కొడుక్కి ధైర్యాన్నిస్తుంది… బతుకు పట్ల ఆశను కల్పిస్తుంది అమ్మ…
ఇటువంటి పాత్రలే… ఇట్టాంటి మనుషులే ఈ కథల నిండా వున్నారు.
‘‘మట్టిబంధాలు పట్టేంత నాగరీకులమా… మనం వట్టి నగరీకులమే’’ నంటుంది సమత…
ఇటువంటి వ్యంగ్య పదబంధాలతో కూడిన సంభాషణలు ఈ కథలలో అక్కడక్కడా కన్పించి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
నిజానికి స్త్రీలు తమ అలంకరణలన్నీ అవసరసమయంలో, ఆపద సమయంలో ఆయుధాలుగా వాడుకోవడానికి మాత్రమే… ఆ రాత్రి అంత పెద్ద గండం గడిచిందంటే కేవలం ఆ గాజు ముక్కలతోటే… గాజులంటే చీదర పుట్టిందిక. ‘గాజులు’ కథలోని ప్రధాన పాత్రకి…
ఈ మొత్తం కథల్లో స్త్రీలకి నమ్మకాన్నీ, ధైర్యాన్నీ యిచ్చి తొవ్వని చూపించిన ‘రాజవ్వ’ చెప్పుకోదగినది….
ఈ కథలు మన చుట్టూ ఉన్న సమాజంలోని అనేక చీకటి కోణాలని తడుముతాయి…
‘‘బాల్యం యిక్కడ నిజమేనా? బాలలందరూ ఒకటేనా?’’ అని నిలబెట్టి ప్రశ్నిస్తాయి….
యాపచెట్టుని నరకాలన్న ఆలోచనకే గుక్కపట్టి రోధిస్తాయి.
‘‘పిల్లగాండ్లన్నా, ముసలాళన్నా చాల పావురం… అవ్వల, తాతల ముద్దు మురిపాలతోటే కదా మనం మంచి చెడ్డలు, ప్రేమలు, ఆపేక్షలు తెలుసుకుంటాం, నేర్చుకుంటాం… గాల్లు లేనిదే మనం ఏడినుండొచ్చినం’’ అంటూ పాఠకులను ఎక్కెక్కిపడి కుట్టుబట్టి ఏడ్పిస్తాయి…
నాది,నీది అనేది లేకుండా నడి వయసుదాకా యింటికీ, ఇంట్ల మనుషులకీ నానా సేవా చేసిన స్త్రీలని… హఠాత్తుగా నాణ్యతలేదంటూ బయటికి గెంటడానికి ప్రయత్నించే మనుషులూ… ఆ మనుషుల ఆదరణకోసం అంగలారుస్తూ బ్యూటీపార్లర్ల నాశ్రయిద్దామని ప్రయత్నించే ఆడవాళ్ళూ… జాలితో మన గుండెల నిండా నిండిపోతారు…
అంతేనా?… వానంటే ఎరుగని పధ్నాలుగేళ్ళ పిల్లల్ని, నీటిజాడలేని పల్లెల్నీ మన ముందు నిలబెట్టి మనం సిగ్గుతో తల దించుకునేలా చేస్తాయీ కథలు…
మొత్తంమీద ఈ కథలు మనచుట్టూ యిప్పుడున్న సమాజంలోని వివిధ పరిస్థితులను మన కళ్ళముందు పరచడమే కాకుండా మనిషికి తోటి వాళ్ళమీద… ముఖ్యంగా పిల్లలమీద, ముసలాళ్ళమీద, మూగప్రాణుల మీద వుండాల్సిన ప్రేమని నొక్కి చెపుతాయి.
ఉత్తర తెలంగాణా ప్రాంతంలోని ఒక జీవిత పార్శ్వాన్ని తెలుసుకోవడంకోసం తప్పక చదవాల్సిన కథలివి…