ఎ. రవి, 8వ తరగతి
ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చేపల వ్యాపారం చేసేవాడు. చేపల చెరువుకు వెళ్ళి చేపలను పట్టుకొచ్చేవాడు. చేపలను అమ్మితే వచ్చిన డబ్బులను ఇంటి అవసరాలకు ఉపయోగించేవాడు. రామయ్య ఒకరోజు చేపలకోసం చెరువు వెళ్ళాడు. వల వేశాడు. చెరువులో ఉన్న చేపలు వలను చూసి ఒక దగ్గర చేరాయి. ముసలి చేప, చిన్న చేప, నడిపి చేప ఇవి పెద్ద చేపలు. అవి ఆ వలను చూసి ఇలా మాట్లాడుకుంటాయి.
ముసలి చేప : మనవాళ్ళందరు రోజుకొకరు మాయమవుతున్నారు.
నడిపి చేప : అవును. ఇప్పుడు కూడ మనల్ని పట్టుకోవడానికి వల వేశాడు చూడండి!
చిన్న చేప : ఇలా అయితే మనం బతకడం చాలా కష్టం. నేను వెళ్ళి అతని సంగతి ఏమిటో చూస్తాను అని చెప్పింది.
రామయ్య దగ్గరకి చిన్న చేప వెళ్ళింది. అప్పుడు రామయ్య చేప దొరికిందని సంతోషించాడు. చిన్న చేప భయపడుతూ నువ్వు అసలు మనిషివేనా! మనిషివైతే ఇలా చేయవు. ఎందుకు? మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావూ? మేము స్వేచ్ఛగా జీవించడం నీకు ఇష్టం లేదా? మేము మా కుటుంబం నుంచి విడిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా…? నీ కుటుంబం నుంచి విడిపో… అప్పుడు ఆ బాధ నీకూ తెలుస్తుంది అని ఆ చిట్టి చేప పలికింది.
ఆ మాటలు విన్న రామయ్య నిజమే, వాటి జీవితాలతో నేను ఎందుకు ఆడుకోవాలి? వాటికి కూడా స్వేచ్ఛగా జీవించాలని ఉంటుంది కదా! ఎప్పుడూ నాకోసం వేరేవాళ్ళ స్వేచ్ఛని, జీవితాన్ని నాశనం చేయకూడదు అని అనుకున్నాడు.
చిట్టి చేపను చెరువులోకి వదిలేశాడు.
అప్పటినుంచి రామయ్య చేపలు పట్టడం మానేశాడు. వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. వ్యవసాయం చేసుకుంటూ హాయిగా, స్వేచ్ఛగా ఉన్నాడు.
నీతి : చూశారా మిత్రులారా! ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. అందుకనే పెద్దలు అంటారు ”కలిసి ఉంటే కలదు సుఖం”.