– శారదా అశోకవర్ధన
”సుచిత్ర ఒచ్చినప్పుడల్లా, కూర్చున్నది పదినిముషాలో పదిహేను నిముషాలో అయినా, వాళ్లింట్లో ఇట్లా జరిగింది వీళ్లింట్లో ఇట్లా జరిగింది, మా బంధువుల ఇంట్లో ఒకసారి ఇలా అయిందీ, అంటూ ఏదో ఒక కొత్త వార్త చెప్పి ఇలా జరగడం కరెక్టా చెప్పండి, తప్పు కదూ” అంటుంది. అంతా విని, ఆ వార్తకి నా అభిప్రాయం చెప్పి పంపించడం నాకూ అలవాటయిపోయింది. లేటెస్టుగా ఒక వార్త మోసుకొచ్చి, ‘ఇది తప్పు కాదా చెప్పండి’ అంది. అదేమిటంటే, సుచిత్రవాళ్ల ఎదురింట్లో ఒకావిడ అద్దెకి దిగిందట. ఆమే, భర్తా, ఇద్దరు కూతుళ్లూ, ఒక కొడుకు. అందరూ పెద్దవాళ్లే. పెళ్లిళ్లయి వేరేవేరే ఊళ్లలో వున్నారు. ఆయనా ఆవిడా ఇద్దరే వుంటారు. అయితే, ఈ మధ్యన ఆవిడకి సుస్తీ చేసింది. వైరల్ ఫీవరట, వాంతులూ జ్వరమూను. బాగా నీరసంగా అయిపోయింది. అందుకని వెతగ్గావెతగ్గా ఒక వంటావిడ దొరికిందట. ఆవిడ చిక్కడపల్లి నుంచి సికింద్రాబాదుకి రావాలి. బస్సులో పడో వాళ్లబ్బాయి కాస్త వీలుచేసుకుని దింపితే స్కూటర్ మీదో వొచ్చి, పొద్దున్నకీ రాత్రికి వంటా రొట్టెలూ చేసి వెళుతోందట. అయితే ఆ ఇంటివిడ మెల్లగా లేచి, నవరాత్రులు కదా అని రోజుకో అవతారానికి పూజచేసి ఒక్కో నైవేద్యం చేయించుకుంటోంది. అయితే ఆవిడ వంటింట్లో వున్నంతసేపూ పూజ మొదలెట్టదట. ఈలోగా కరెంటుపోతే చీకట్లో చదవలేక, విసుక్కుంటూ, కస్సుమంటూ, ఏ మధ్యాహ్నానికో పూజ ముగిస్తోందట. ”అదేంటి ఆంటీ హాయిగా, ఆవిడ (వంటావిడ) వున్నప్పుడే పూజ చేసేసి నైవేద్యం పెట్టేస్తే సరిపోతుందిగా, అంటే, పూజచేస్తు చేస్తూ ఆవిడ బొట్టులేని మొహం ఎలా చూడాలి బాబూ! (ఆవిడ విధవరాలు, విడో అట) అందుకే ఆవిడ వంటింట్లో నుంచొచ్చేవరకూ పూజ మొదలెట్టడం లేదట.” ఇది చెప్పి అలా చెయ్యడం తప్పుకదా ఆంటీ అని అడిగింది. చాలా తప్పు. తను తినడానికి రెండుపూటలా చేసే వంటప్పుడు ఆమె మొహం చూస్తే ఏమీలేదు. కాఫీలూ, టీలూ పెట్టించుకు తాగడానికి ఆమె మొహం పనికొస్తుంది, చివరకి దేముడికి చేసే ప్రసాదానికి కూడా ఆమె మొహం పనికొస్తుంది; కానీ, ఈమె చేసే పూజప్పుడు మాత్రం ఆమె మొహం చూస్త ఆమె పూజ చెయ్యలేననడం, ఆమె సంకుచిత స్వభావానికి, అహంకారానికి తార్కాణం. ఆమె భర్తను చంపేసిన హంతకురాలు కాదు. అతను భావాలని కోరుకున్న దుర్మార్గురాలూ కాదు. విధివంచితురాలు. అతని ఆయువుతీరి అతను పోతే, ఆమెని వాడిపోయిన పువ్వో, ఎండిపోయిన కాయో, కుళ్లిపోయిన పండో, ఇంక పనికిరాదన్నట్టు, అలా క్రూరంగా చూడడం అమానుషం. తోడు పోగొట్టుకున్న నిస్సహాయురాలైన ఆడదానిగా ఆదరించాలి, అభిమానించాలి. అంతేకానీ, ఇదేం ప్రవర్తన?
ఆమె మామూలుగా బొట్టుకాటుకా పెట్టుకుని తిరిగితే, ఇంకోరకం కథలు పుట్టిస్తారు. తీసేసి తిరుగుతూంటే ఇలా ప్రవర్తిస్తారు. ఇలాంటి వ్యక్తుల ఆలోచనలకు భయపడే, ఆమె బొట్టు తీసేసి, కుటుంబపోషణ కోసం, ఇలా కష్టపడి పనిచేసుకుంటూ బతుకుతూంటే, ఆమెని ఉత్సాహపరిచే మంచి మాటలతో పనులు చేయించుకుని, గౌరవంగా చూడాలి కానీ, పొగరుమోతులుగా, అహంకారులుగా, అవమానకరంగా మాట్లాడడం, మానవత్వం లేని మృగాల్లా ప్రయత్నించడమే అన్నాను. కరెక్ట్ ఆంటీ… నేనూ అదే అనుకున్నాను. ఆమె అలా అన్నప్పుడు నాకెంత బాధేసిందో! అలాంటివాళ్లు మన ఇంట్లో వుంటే, వాళ్ల గురించి, ఇలాగే మాట్లాడుకుంటామా? ఇలాగే ప్రవర్తిస్తామా వారి పట్ల? దురదృష్టవశాత్తూ ఆ పరిస్థితి తమకే సంభవిస్తే ఏం చేస్తారు? వాళ్లని చూసి నలుగురూ అలా ప్రవర్తిస్తే, ఎలా ఫీలవుతారూ ఆలోచించాలి కదా ఆంటీ అంది సుచిత్ర. నిజమే సుచీ! ఈ కాలంలోనూ ఆడవాళ్లు ఇంకా ఇలా మనిషితనాన్నీ, మానవత్వాన్నీ మరిచి ప్రవర్తిస్తున్నారంటే ఆశ్చర్యంగా వుంది. ఆడవాళ్లు అంతరిక్షంలో ప్రయాణిస్తూ, గొప్ప సైంటిస్టులుగా, సైకియాట్రిస్టులుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, అడ్మినిస్ట్రేటర్లుగా పేరుతెచ్చుకుంటూ రాజకీయాలలోనూ రాణిస్తూ దూసుకుపోతున్న తరుణంలో, మరోవైపు ఇంకా ఈ చీకటి కోణం ఇలాగే వుంది అంటే చాలా బాధాకరం! ఆడవాళ్లు ఇంకా మారాలి. వాళ్లకివాళ్లు శత్రువులుగా వుండడం మానుకోవాలి. అర్థంలేని మూఢాచారాలనూ, మూఢనమ్మకాలనూ మట్టుబెట్టాలి. వారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలేగానీ, చెయ్యలేని పనంటూ ఏదీ లేదు అన్నాను. నా మాటలకి ఎంతో సంతోషిస్తూ వెళ్లొస్తానని లేచింది సుచిత్ర! సుచీ ఈ మహిళాసంవత్సర దినోత్సవంలో, ఈ రకమైన మార్పులు కోరుకోవాలి. విధివంచితులని వెక్కిరించకూడదు. ఒకరికి ఒకరు మహిళలు అభిమానాలూ, ప్రేమలూ పంచుకోవాలి. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అన్నాను సుచిత్రతో. వెనక్కితిరిగి చూసి నా మాటలు వింటూ, ”అవునాంటీ అలా జరిగిననాడు మహిళలోని శక్తి మరింత పెరుగుతుంది” అంది.