కొన్ని పూలవనాలు కాసిన్ని తేనె చుక్కలు
– కుప్పిలి పద్మ
నిజమే సుమా… అప్పుడప్పుడు మనం కూడా కొన్ని సహజమైన విషయాలని. అసహజంగా, అసహజ విషయాలని సహజంగా చూడటానికి అలవాటు పడిపోతాం. కొన్నిసార్లు మన ఆలోచనలని కిందామీదా చేసే విషయాలు విన్నా మనం వో స్థితప్రజ్ఞత ప్రదర్శించటానికి ముచ్చట పడుతుంటాం. వొక్కోసారి యీ స్థితప్రజ్ఞ మన ఆలోచనలని ప్రశ్నించే లక్షణాన్ని కఠినంగా మనలోనే అణిచివేస్తుంది. వొక్కొసారి మనలో మనం వాపోవటానికో, గాసిప్‌లా మాటాడుకునే సరదానో కూడా వదులుకోవాలనే నియమంలోకి జారిపోతుంటాం.
మనలో చాలా మందికి గుర్తుండి వుంటుంది. మనందరి శరీరచ్ఛాయ వొక్కలానే వుండాలని అదీ తెల్లని నిగారింపుగా వుండాలని అలా వుండకపోతే మొగుడు దొరకటం కష్టమనో లేదా తెల్లగా వుంటే మొగుడు తేలిగ్గా దొరుకుతాడనో యిలా శరీరచ్ఛాయని నిర్వచించే నిర్ధారించే క్రీముల ప్రకటలని మనం చూసేవాళ్లం. అప్పుడు మనం యిలా యెలా శరీరచ్ఛాయకి పెళ్లవ్వటానికి సంబంధంయేంటని ప్రశ్నించేవాళ్లం. అసలు అందరు అమ్మాయిలు వొకే రంగుతో యెలా వుంటారని నిలదీసేవాళ్లం. యేం మగవాళ్ల శరీరవర్ణం యెలావున్నా పెళ్లికి అభ్యంతరం కాదుకాని మారంగే అభ్యంతరమాని పోట్లాడేవాళ్లం.
తరువాత తరువాత మన జీవితాల్లో పెళ్లితోపాటు ఉద్యోగం, వృత్తి, ప్రవృత్తులు ముఖ్యమైనవిగా రూపాంతరం చెందాక మనం తెల్లగా వుంటే మనకి సునాయాసంగా ఆ ఉద్యోగాలు వచ్చేస్తాయి. లేదా మనం అనుకొన్న విజయకేతనాలు యెగరవేయ టానికి మన శరీరచ్ఛాయ చాలాచాలా ముఖ్యమని ప్రకటనలు రావటం. మనం అన్నాం. అరే.. మా తెలివితేటలకి మాలోక నైపుణ్యాలకి విలువలేదాని, శరీరచ్ఛాయ ముఖ్యమాని….
అలాంటి సమయంలోనే మొగవాళ్లకి బోల్డన్ని ఫెయిన్‌నెస్ క్రీమ్స్ వచ్చేసాయి. వాళ్లకి రకరకాల కాన్స్‌ప్ట్‌తో ప్రకటనలు వచ్చేసాయి. మనకి చాలా చాలా క్రీమ్స్ వచ్చేసాయి. కాస్మోటిక్ ఇండస్ట్రీ దినదినమూ ప్రవర్ధమాన మవుతునే వుంది. యిప్పుడు చాలా వాటిల్లానే మనకి యీ శరీరఛ్చాయకి సంబందించిన విషయం మనకిప్పుడు పెద్దవిషయం కాకుండా పోయింది. యెందుకంటే ప్రశ్నించడానికి వీలులేనంతగా అవి పెరిగిపోయాయి. అలా మనం మన శరీరాలకి సంబంధించిన వాణిజ్యంలో వుండే అసమానతని, అవమానలని, లోపపూరి తమైన ఆలోచనలని ప్రశ్నించటం లేదు. అసలు అవి యెందుకలా వుండకూడదో కూడా మనం మాటాడుకోవటం మానేసాం. వొక కారణం మనం యేం చేయలేం. యెందుకంటే ఆ వెల్లువలో కొట్టుకుపోతూ అలానే శరీఛ్చాయని తెచ్చుకోవాలన్నదే తలంపు. యిదో భ్రాంతి అన్న అనుమానం కూడా పెద్దగా లేదు. కాలం పట్టింపులని సడలించేస్తుంటుంది. మనకో స్థితప్రజ్ఞతని యిస్తుంది.
అసలు యిప్పుడు యిదంతా యెందుకు గుర్తువచ్చిందంటే యీ మధ్య కొన్ని ప్రకటనలు చూస్తుంటే అలవాటుగా యధాలాపం అవి కళ్ల ముందు నుంచి తేలిపోతునేవున్నాయి. యేముందిలే మనకి వద్దనుకున్నవి కావాలనుకునేవారుంటారు.. ప్రోడక్ట్స్ అమ్ముకోడానికి వంద రకాల ఆలోచనలు, యెవరి వ్యాపారం వారిది అనిపించటం వో స్ధిరాభిప్రాయం. తామరాకు మీద నీటిబొట్టులాగా ఆలోచనలని యెలా వుంచుకోవాలో చెప్పే మోడ్రన్ సైకాలజీ పెద్దలున్నారు కదా… వింటుండటం వల్లో లేదా చూడటం వల్లో తెలీదు. మొత్తానికి చాలా చికాకు పెట్టే విషయాలకీ నిగ్రహంగా వుండగలిగే సామర్ధ్యం వచ్చిందనుకొంటాను చాలామందికి.
ఆలా వుండల్సిన మనసు పదేపదే ఆ ప్రకటని గుర్తు చేస్తుంది. ఆ ప్రకటన యేంటంటే మీ పాపాయి తెల్లగా వుండాలంటే మీ పాపాయి చర్మం మెరవాలంటే మా ప్రోడక్ట్ వాడండనే ప్రకటన. ఆశ్చర్యం…. బాధ…. యెత్తుకొని ముద్దాడే పాపాయిది కానీ బాబుది కానీ మనలని పరవశింపచేసింది ఆ పసిస్పర్శ. కానీ యెట్టిపరిస్థితుల్లో ఆ శరీరచ్ఛాయ కానేకాదు. అసలు బుజ్జిపిల్లలని చూసినప్పుడు మన మనసుని వూయలలూపేది ఆ చిన్నారుల అమాయక లోకం. ఆ పసితనపు ప్రవాహం మనలని పసితనపు తీరంలో పరుగులు తీయిస్తుంది. శరీరవర్ణం కానేకాదు.
యేడు రంగుల హరివిల్లు యేక వర్ణంలో అదీ తెల్లగా వుంటే మనకంత మురిపంగా కనిపిస్తుందా… అనేక పచ్చదనాలతో వనమంతా పర్చుకోపోతే యెత బోర్… ఆకాశం వొకే రంగులో వుంటే యెంత విసుగ్గా వుంటుంది….. కడలి రంగులు అనేకంగా లేకపోతే మనకి అంత ఆకర్షణీయంగా అనిపిస్తుందా. అందరం వొకే రంగు అదీ తెల్ల రంగులో వుండాలనే యీ ఆ ప్రకటిత నిబంధన యేంటో … పసిపిల్లలనీ వదలకుండా…
తుప్పో… నాచో పట్టిన స్థిత ప్రజ్ఞత నిర్భంధం నుంచి విముక్తులం కావాలి…. లేకపోతే యీ పసితనాన్ని యింకెన్ని విషయాలు తమ పరిధిలోకి లాగేసుకుంటాయో…