కొండేపూడి నిర్మల
ఈ మధ్య ఒక ఇల్లాలు మొగుడ్ని తెగనరికి అతడి తలకాయ పోలీసుస్టేషనుకి సమర్పించి మరీ లొంగిపోయింది. అంతకంటే ముందు చాలా నెల్ల క్రితం మరో ఇల్లాలు భర్తను చంపి ఊరగాయ పెట్టిందని వార్త వచ్చింది.
కారణాలు ఎలాంటివైనా గానీ భారతదేశంలో భార్యలకు ఇంత నేరప్రవృత్తి ఎలా వచ్చిందాఅని నాకూ చాలా బాధనిపించింది. కొన్ని వార్తలు జుగుప్స కలిగిస్తాయి, కొన్ని ఆశ్చర్యాన్నీ, భయన్నీ కలిగిస్తాయి.
”మీ భార్యని చంపాలని మీకెప్పుడైనా అనిపించిందా?” అనే నినాదంతో మన ముందుకొచ్చిన ”మధ్యాహ్నం హత్య” దాని మీద జరిగిన చర్చ వల్ల మరింత మంది చూసారు. అది విడుదలయిన కొత్తలో ఆ సినిమాలో చపించిన పెద్దసైజు సటుకేసులు బాగా అమ్ముడుపోయయని హైదరాబాదు కోటీలో ఒక షాపు ఓనరు నాతో చెప్పాడు. అయిదున్నర అడుగుల మనిషిని ఒక పెట్టెలో ఎంత కళాత్మకంగా ఇరికించవచ్చో ఆ దర్శకుడు చెప్పేదాకా మనకి తెలీదుకదా!
ఆ చేత్తో మొగుడ్ని ఊరగాయ పెట్టినట్టుగా అదే దర్శకుడితో ఒక డాక్యుమెంటు తీయిస్తే ఎలా వుంటుంది?
డెబ్బై కేజీల శ్రీవారికి ఎంత ఆవపిండి, ఉప్పు సరిపోతుందో…? ఎన్నాళ్ళు ఊరబెట్టాలో, ఆవకాయ ఒక్కటే పెట్టాలా? మాగాయ, మెంతికాయ, తొక్కుడు పచ్చడి కూడా చేసి పడేస్తే ఒక పని అయిపోతుందంటారా? మా రోషిణి అడిగినట్టు అప్పటికప్పుడు త్రీమెంగోసు కారం దొరికిందో లేదో? చెక్కు తీసేందుకైనా పక్కింటావిడ రాదు కదా, ఒంటరిగానే శ్రమపడాలి… – అంట ఆలోచనలు పురికొల్పామనుకోండి… అప్పుడు నేరం పక్కకి పోయి కథనం, చిత్రీకరణ మనసుకి ”హత్తుకుంటాయి”.
వికారంగా వుంది కదూ… నాక్కూడా అలాగే వుంది మరి. పోయిన మనుషుల్ని పచ్చడి పెట్టడం నాగరికత కానప్పుడు, బతికినవాళ్ళని తినుబండారాలతో పోల్చడం సబబుగా వుందంటారా? బుగ్గలు యపిల్సు అని, పెదాలు దొండపళ్ళని, చేతివేళ్ళు బెండకాయలని, తొడలు అరటి బోదెలని, పాదాలు తమలపాకులని, కొప్పు కారప్పూస చుట్టలా వుందని పోల్చినప్పుడు భరించడం సౌకర్యంగా వుందంటారా?
నేరాన్ని చిత్రీకరించడంలోన/వక్రీకరించడంలోన మన దృక్పధం కనిపిస్తుంది. అత్యాచారాలు, హత్యలు స్త్రీలమీద జరిగినప్పుడు సినిమాలో చూపినంత ఆకర్షణీయంగాన, తమాషాగానూ సమాజంలోనూ తీసుకుంటారు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మధ్య జరిగిన వాకపల్లి, నందిగ్రామం అత్యాచార సంఘటనల్ని గురించి ఆన్లైన్లో ఒక మిత్రుడితో రాత సంభాషణ చేస్తున్నాను. అతగాడు పోలీసు, సరిహద్దు రక్షకులు, లారీడ్రైవర్లు లాంటి ఉద్యోగులు కుటుంబాలకి దరంగా పడుతున్న అగచాట్లను గురించి, నిలవరించుకోలేని కోరికల వల్ల తగ్గుతున్న పని సామర్ధ్యం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. చాలాసేపు నేనూ వాదిస్తూ వుండిపోయను. కోరిక పెద్దదా, జీవితం పెద్దదా? అయితే అందుకు మూల్యం ఎవరు చెల్లిస్తారు?
అమాయకమైన గ్రామీణ స్త్రీల మానవహక్కులకు మాటకు అర్ధంలేదా?
సుముఖంగా లేనప్పుడు కట్టుకున్న భర్త అయినా సరే బలవంతం చెయ్యరాదని, అది నేరం అవుతుందని కోర్టు ఇచ్చిన తీర్పు తమాషాయేనా?
సరే అయితే కోరిక అంత బలమయిన శక్తి ఇవ్వగల దినుసు అయినప్పుడు ఎటువంటి దారిలో అయినా అది తీరడం ప్రధానం అయినప్పుడు నర్సింగులాంటి కొన్ని ”పవిత్ర” వృత్తుల్లో వున్నవాళ్ళకు కన్యాత్వ పరీక్షలెందుకు? మన సమాజంలో ఇప్పటికీ ఇంకా జరుగుతున్న బాలికా వివాహాల వల్ల పెరుగుతున్న వితంతువుల సంఖ్య, వారి తీరని కోరికల మాటేమిటి? వాళ్ళంతా గుంపులుగా వెళ్ళి ఎవరిమీదయినా దండయత్రలు చేసిన సందర్భాలు మనకు తెలుసా?
ఈ దేశంలో భర్తలు తమ భార్యల్ని చేస్తున్న హత్యల్లో నటికి 30 శాతం అనువనం కారణంగా చేస్తున్నవేనని రిపోర్టులు చెబుతున్నాయి. మన సాంకేతిక పరిశోధనలన్నీ కూడా ఒక సగటు మగవాడి బలహీనతల్ని సమర్ధించడం కోసం ఏమైనా చేస్తాయి. దాని పేరే హైమనోప్లాస్టీ (కన్యాత్వపు పునర్నిర్మాణ చికిత్స). రు. 40,000 ఖర్చుపెట్టి ఇప్పుడు ఇవాళ ఇల్లాళ్ళందరు ఆపరేషను బల్లలెక్కచ్చు. సమానత్వ విషయంలో, 33 శాతం రిజర్వేషన్ల విషయంలో ఏమీ సహకరించని ప్రభుత్వం ఇవాళ కోట్లాది రపాయలతో పరిశోధనలు చేసి మనిషికొక కన్నెచెర అమర్చడానికి ముందుకొచ్చింది. ఇది సంతోషించాలో, విషాదపడాలో తెలియని పతాక సన్నివేశం.
హింస ఎవరు చేసినా, ఏరూపంలో చేసినా ఖండించవలసిన అవసరం నాగరికులందరూ గుర్తిస్తారు. నాగరికులమనుకున్నవారు గుర్తించకపోతే, తెలియజెప్పడంలోనూ తప్పులేదు. కానీ మధ్యలో ఉపమానాలపై విరుచుకు పడటమే వింతగా ఉంది. బుగ్గలు ఆపిల్ పండ్లలాగా ఉన్నాయనడం వాటిలో రంగును, నునుపును, మెరుపును అందంగా ఉన్న బుగ్గలకు ఆపాదించడమేగాని, కేవలం తినుబండారంతో పోల్చడమే అనుకోవడం, అదీ ఎంతో ఊహాశక్తిగల రచయిత్రి అనుకోవడం వింతగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక అమెరికన్ పబ్లిక్ రేడియో విలేకరి లావుగా ఉన్నవాళ్ళపై రిపోర్ట్ చేస్తూ, “ఏనుగులా నడుస్తున్నావనడం ఇండియాలో లావుగా ఉన్న స్త్రీలకు ఒక కాంప్లిమెంట్” అంటూ లావుగా ఉన్నవాళ్ళను అభినందించే సంస్కృతిని ఉదాహరించాడు. ఇది విన్న నా అమెరికన్ మిత్రుడు నిజమా అని అడిగితే ఆలోచలో పడ్డాను. “గజ గమన” అన్న వాడుకకు ఈ రిపోర్టర్ ఇచ్చిన విపరీతార్ధమని గ్రహించి, నా మిత్రుడికి వివరించాను, “ఏనుగు నడకలోని కోమలత్వాన్ని స్త్రీల నడకతో పోల్చడమేగాని, ఏనుగు ఆకారానికి పోలిక కాదని”. భాషల్లోని జాతీయాల్ని అర్ధం చేసుకోకుండా ప్రచారం చేసిన రిపోర్టర్ పై మండిపడుతూ రేడియో స్టేషనుకు ఘాటైన ఉత్తరమే వ్రాశాడు నా మిత్రుడు. భాష తెలియని వాళ్ళు విపరీతార్ధాలు చెప్పడంలో అలసత్వమో, సోమరితనమో ఊహించుకోవచ్చు. కానీ భాష తెలిసిన కవయిత్రి మృదువైన ఉపమానలపైన కాయగూరల పోలికలని విరుచుకు పడడం వింతగా ఉంది. ఉపమానాలు అర్ధం కాలేదనుకోవడానికి వీలులేదు. మరి ఉపమానాల అంతరార్ధాల్ని విస్మరించి కేవలం పైకి వినిపించే మాటలకే తీవ్రంగా స్పందించే అసహన స్థితికి స్త్రీవాద భావజాలం పరిమితమైపోతోందా?