జి. విజయలక్ష్మి
29.9.07 శనివారం సాయంత్రం 6 గం||కు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రముఖ సాహితీ విమర్శకులు చేరా ”భూస్వరాలు” కవితా సంకలనాన్ని ఆవిష్కరించగా, సభకి సాహితీ స్రవంతి కన్వీనర్ ఎ. సత్యభాస్కర్ అధ్యక్షత వహించారు.
సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్ తెలకపల్లి రవి కవితా సంకలనాన్ని సమీక్షించారు.
చేరా మాట్లాడుతూ ప్రజల అవసరాల్ని, సమస్యల్ని పట్టించుకునేదే సాహిత్యం అన్నారు. అవసరాలు అంటే భూమి. వామపక్షాల ఆధ్వర్యంలో భూపోరాటాలు జరుగుతున్నాయి. ప్రాణాలు పోయినా ఈ పోరాటాలు కొనసాగుతనే వున్నాయి. పుస్తకంలో కొన్ని వచన కవితలు, కొన్ని పాటలు వున్నాయి. భాష యసలో కన్పిస్తున్నది. కవితల్లో వున్న వైవిధ్యమే నన్ను ఆకర్షించింది. లబ్ధ ప్రతిష్టులైన కవులే కాకుండా ఎంతోమంది కొత్త కవులు కూడా భూస్వరాలులో కవితలు రాశారు. కొన్ని కవితలు పెద్దవిగా వున్నా అందర రాసిన విషయం బాగుందని చేరా అన్నారు.
తెలకపల్లి రవి మాట్లాడుతూ హైటెక్ సమాజంలో అన్ని సమస్యల పరిష్కారమైపోతున్నాయని ప్రభుత్వం చెప్తున్నదని, కానీ భూపోరాటాలు జరుగుతున్నాయి కనుక భూ సమస్యతో పాటు, అనేక సమస్యలు మిగిలే వున్నాయని ధృవపడుతున్నదని అన్నారు. ప్రభుత్వం ఇలాగే వుంటానని నిస్సిగ్గుగా చెప్తున్నదని, ప్రజలు కూడా ఇలాగే పోరాడతామని నిర్భయంగా చెప్తున్నారని రవి చెప్పారు. భూస్వరాలు కవితా సంకలన సభలు 15 జిల్లాల్లో జరగనున్నాయని రవి అన్నారు. కవిత్వంలో భూమి ప్రధానాంశంగా పురాణకాలం నుంచీ వున్నదని, ఆనాడు దుర్యోధనుడు సదిమొన వెపినంత స్థలం ఇవ్వననటం నుండి ఈ రోజు ముదిగొండ వరకూ భూమే మూలంగా వుందన్నారు. ఏడు నెలలనుండి ప్రజా సంఘాలు ఐక్యంగా భూపోరాటం చేస్తుండగా, ఇవాళ భూపోరాటానికి గుర్తింపొచ్చిందని, కథకులు, కవులు అనేక రకాలుగా దీనికి స్పందించి రాస్తున్నారని, భూపోరాటం ఇవాళ అనివార్య సామాజిక సమస్యగా ముందుకొచ్చిందన్నారు.
ముదిగొండ వీరుల్లారా
ఎర్రజెండా బిడ్డల్లారా
మదినిండా నిలిచారయ్యొ
గుండెల్లో ఒదిగినారయ్యొ – అంట సభాప్రారంభాన ముదిగొండ కాల్పుల్లో చనిపోయిన వారిని పేరుపేరునా స్మరిస్తూ గాయకులు పాటలు పాడారు. యుద్ధం బుట్టెర, యుద్ధం బుట్టెర పాటను రామచంద్ర పాడారు.
అరసం నాయకుడు ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో రెండే రెండు ధోరణులున్నాయని, ఒకటి అభ్యుదయం, రెండు విప్లవం అని, కెరటం లేచి పడిపోతుందని, ప్రవాహం సాగుతనే వుంటుందని, భూపోరాటం ప్రవాహం లాంటిదని అన్నారు.
2007 సంవత్సరం బాగా ముఖ్యమైనదని, తస్లీమాపై దాడి, మక్కామసీదులో బాంబుపేలుడు, ముదిగొండ కాల్పులు, గోకుల్‌ఛాట్, లుంబినీ పార్కుల్లో ప్రేలుళ్ళు, ఫ్లైఓవర్ కూలిపోవటం, మాజీ ముఖ్యమంత్రి మందుపాతర దాడి నుండి బయట పడటం – ఇలా ఒకదాన్నుంచి తేరుకోకముందే మరోటి జరుగుతున్నదని, ప్రగతిశీల శక్తులు, అభ్యుదయ శక్తులు ఐక్యంగా ఒకదాంతో మరోటి కలిసి పనిచేయల్సి వుందని అన్నారు. తెలకపల్లి రవి తన ప్రసంగంలో పుస్తకంలో కొన్ని కవితలను చదివి వినిపించారు.
– జానెడు పొట్ట బారెడు బట్ట మూరెడు నేల
వీటికోసం తరతరాలుగా మరణించడం మాకు కొత్తేమీ కాదు – నాగభషణం
– యాదుంచుకో ముదిగొండ అంతంకాదు
ముదిగొండతో మొదలయ్యింది –
– పుట్టబోయే కలలరాశికి జానెడు భూమినైనా
సాధిద్దామని తిరగబడ్డ పూర్ణగర్భిణీ
కాసబోసిన కత్తి రుద్రమ భావిభారత భూమిపర్వం – జ్వాలాముఖి
– ఈ నేలనంతా స్మశానంగా మార్చినా వ శవాలను గుట్టలుగా పేర్చినా
మేం కలలుకన్న ఈ భూమిలోనే వ అస్థికలు గుడిసెలై మొలుస్తాయి
ఈ నేలలో మా వాటా మాకు దక్కకపోతే ఇదే భూమిలో మీ తలలు సరిహద్దు రాళ్ళౌతాయి
మీ మొండాలు జండాలుగా నిలుస్తాయి – జి. విజయలక్ష్మి
– ఇమ్మనీ కాల్చారు ఇమ్మన్నా కాల్చారు
రెండుచోట్ల భూమిని ముందుకునెట్టి వాళ్ళ వెనక నక్కుతున్న తుపాకి – వి.ఆర్.
ఎ. సత్యభాస్కర్ వందన సమర్పణతో సభ ముగిసింది.