సుధా అరోరా, మూలం : హిందీ కథ
”ఏం? మూడు సార్లు బెల్లు వేస్తేకాని తలుపు తియ్యనని రూలేమైనా ఉందా నీకు? అంత కొంపలు మునిగే పనేం ఉంటుందని? మొగుడు చచ్చే చాకిరీ చేసి అలిసిపోయి ఆఫీసునించి వచ్చాక ఐదు నిమిషాలు తలుపు బైటే వెయిట్ చెయ్యలా….?
…..
”ఇది ఇల్లా? ఎక్కడ పడితే అక్కడ కుప్పగా బట్టల, పిల్లలు ఆడుకున్న బొమ్మల! అబ్బ ఈ ఇంట్లో ఏ వస్తువూ నీట్‌గా సర్ది ఉండదా?”
…..
”అబ్బ! ఈ పక్కమీద కూర్చుంటే చాలు, ఉచ్చ కంపు! ఇల్లంతా ఉచ్చబట్టలు ఆరేస్తే మరి కంపు కొట్టద? అప్పుడప్పుడ ఈ పరుపుని ఎండలో పడెయ్యచ్చు కదా? అయినా నీకు ఏడాది పొడుగునా జలుబే కదా! నీకు సువాసనకీ కంపుకీ తేడా ఏం తెలుస్తుంది?”
…..
”అది సరేగాని, నువ్వు రోజంతా ఈ పనిలోనే ఉంటావా? ఎప్పుడ పిల్లల కోడిలాగ వాళ్ళతోనే సరిపోతుంది నీకు. మా అమ్మ ఏడుగురు పిల్లల్ని పెంచింది, అయినా ఇల్లెప్పుడ అద్దంలా ఉంచేది. ఇద్దరు పిల్లలకే నువ్వు కొంపని ఇంత దరిద్రంగా చేసేశావేమిటి? ఏదో ఇంట్లో క్రికెట్ టీమ్‌ని పెంచుతున్నట్టు!”
…..
”మళ్ళీ అదే జూసా? నాకు దగ్గుగా ఉందని నీకు బాగా తెలుసు, అయినా ఐసులాగా ఉన్న ఈ జూసిచ్చావు తాగటానికి! కాస్త బుర్ర ఉపయెగించుపో, పోయి టీ పట్రా ! ఇదుగో, ఇకమీదట నేనింటికి రాగానే ఈ చల్లటి రసం తెచ్చి నా మొహాన పెట్టకు, తెలిసిందా? నాకు జబ్బు పడేంత తీరిక లేదు. ఆఫీసులో ఊపిరి కూడా సలపనంత పని…. కానీ నీతో ఇవన్నీ చెప్పటం వేస్టు! నీకు ఈ లోకమంతా నీలాగే స్లోమోషన్‌లో కదులుతున్నట్టు కనిపిస్తుంది!”
…..
”రోజంతా ఇంటి పక్షిలాగ ఇంట్లోనే ఎందుకుంటావు? కాస్త అప్పుడప్పుడ ఫ్రెష్ గాలిలో బైట తిరగకూడద? మంచి బట్టలు వేసుకోకూడద? నీకు పాపం తల దువ్వుకునే తీరిక కూడా లేనట్టుంది, పోనీ జుట్టు కత్తిరించేసుకో. కాస్త అవతారం కూడా చడదగ్గదిగా ఉంటుంది! ఇరుగు పొరుగు ఆడవాళ్ళలో చురుకైన వాళ్ళుంటారు, వాళ్ళతో స్నేహం చెయ్యి.”
…..
”నాన్నకి భోజనం పెట్టావా? ఆయనకి ఆలస్యంగా తింటే అరగదని ఎన్ని వందలసార్లు చెప్పాను నీకు? ఆయన భోంచేశాడా లేదా?…. నోరిప్పి మాట్లాడలేవా ఏం? నువ్వు చెప్పకపోతే నాకెలా అర్థం అవుతుంది?”
…..
”సరేగాని, ఆ పుస్తకం ఎక్కడ పెట్టావు? బల్లమీదా, కిందా, అన్ని చోట్లా వెతికాను. అలమార్లలో కూడా చూశాను. నువ్వు ఏ వస్తువూ తీసినచోట పెట్టలేవా? నిన్ను చదవమని చెప్పటం నాదే బుద్ధి తక్కువ! ఇక ఆ పుస్తకం ఈ జన్మలో దొరకదు. మీ ఆడవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది – పెళ్ళయి, పిల్లలు పుట్టగానే ఇక పుస్తకాలకి స్వస్తి చెప్పి, ఎంత సేపూ బియ్యం, పప్పు, ఉప్పు…. అంతే ఇక చదువూ సంధ్యా అటకెక్కాల్సిందే…”
…..
”ఏమిటీ భోజనం? రోజూ అదే పప్పు, వంకాయకూరా, బెండకాయ, లేకపోతే ఆలుగడ్డలు. ఆలుగడ్డలు వాడకుండా ఈ దేశంలో ఏ కూరైనా అసలు వండుతారా? ఆలూ-బఠాణీలూ, కాలీఫ్లవర్‌లో ఆలూ, మెంతికూరలో ఆలూ…. ప్రతి కూరలోన ఆలుగడ్డలు ఉండాల్సిందే…. చివరికి నీకు వంట చెయ్యటం కూడా రాదు. ఎలాగ ఇంకేపనీ చెయ్యవు, కనీసం వంటైనా చక్కగా చెయ్యొచ్చుగా?…. వెళ్ళు ఒక నెల మీ అమ్మ దగ్గరుండి ఆమె దగ్గర కొన్ని రెసిపీలు రాసుకుని రా… మీ అమ్మ ఎంత బాగా వండుతుంది! నీకేం నేర్పలేదా ఆవిడ? చైనీస్, కాంటినెంటల్…. ఇలాంటి రకరకాల వంటలు చేస్తే తినటానికి వెరైటీగా ఉంటుందిగా….”
…..
”ఆ పుస్తకం మర్చిపోకుండా వెతికి పెట్టు. దాన్ని నేను వెనక్కి ఇచ్చెయ్యలి. మళ్ళీ ‘మర్చిపోయను’ అనేవు! ఈ మధ్యన నీకు మతిమరుపు కూడా ఎక్కువయింది!”
…..
”పిల్లలిద్దరు నిద్ర పోయరుగా? ఇలా రా! అన్నిటికీ నీకు టైముంటుంది, నాతో గడపటానికి మాత్రం ఉండదు అన్నట్టు…. నాన్నకి మందు ఇచ్చేసి రా…. లేకపోతే పడుకున్నాక పిలుస్తారు.”
…..
”రా, ఇలా నా దగ్గర కూర్చో! అది సరేగాని, ఎంతో మందిని కాదని నిన్నే ఎందుకు పెళ్ళి చేసుకున్నానో చెప్పు చద్దాం! ఎందుకంటే నువ్వు చదువుకున్న అవ్మయివి. సంగీత విశారద పాసయవు. గజల్స్ అంటే నీకు చాలా ఇష్టం. మీ ఇంట్లో గోడలకి నువ్వు వేసిన అందమైన ప్రకృతి దృశ్యాల పెయింటింగ్సు ఉన్నాయి. మరిప్పుడు ఎందుకిలా తయరయవు? నీ కోసం నాలుగు పుస్తకాలు తెచ్చాను. ఒక్కటి కూడా నువ్వు కనీసం పేజీలు తిప్పయినా చడలేదు. ఇంట్లో ఇలాటి పెళ్లాలుంటే మగవాళ్ళు బైట చురుకైన ఆడవాళ్ళ వెంట పడతారు. అప్పుడు నీలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చుని ఏడవటం తప్ప చేసేదేమీ ఉండదు…. అంత జరిగినా వాళ్లు ఏడుస్తారే తప్ప తమని తాము మార్చుకోరు….”
…..
”నీ బట్టలు కూడా బేబీ ఫుడ్ వాసనా, నూనె, మసాలాల వాసనా వేస్తున్నాయి….. నిద్రపోయేముందు స్నానం చెయ్యి… నీకూ హాయిగా ఉంటుంది…. మరి….”
”అరె, నేను పిచ్చివాడిలా వాగుతనే ఉన్నాను, నువ్వు నిద్రపోయవా? ఇంకా పదిన్నరే కదా అయింది, అప్పుడే నిద్రా? ఇంటి పనితోనే అంతగా అలిసి పోతావా? ఇక ఎందుకూ పనికి రావా?…”.
రెండు
”నీ అలవాట్లు ఈ జన్మలో బాగుపడవు. మన పెళ్లయి పదిహేనేళ్లయింది. ఈ పదిహేనేళ్లలో ఇంత చిన్న విషయం కూడా నేర్చుకోవటం నీ వల్ల కాలేదు! మొగుడు అలిసిపోయి ఇంటికొస్తే, బెల్లు వెయ్యగానే తలుపు తియ్యలనే జ్ఞానం లేదు నీకు. ఎన్ని సార్లు చెప్పినా నీ మట్టి బుర్రకి ఎక్కదు! అసలు నువ్వు ఆ మూల గదిలో ఎందుకుంటావు? నేను ఎప్పుడొస్తానో తెలుసుకదా? మరి ఇక్కడే, తలుపు దగ్గరున్న సోఫాలో కూర్చోవచ్చు కదా?”
…..
”ఇదీ ఒక ఇల్లేనా? బల్లమీద ఆష్ ట్రే ఉండదు, బాత్రూంలో టవలుండదు… ఎక్కడ చసినా పుస్తకాలు… బల్లమీదా, అలమారలో, మంచం మీదా, కార్పెట్ మీదా, వంటింట్లో, బాత్రూంలో…. ఇకనించీ పుస్తకాలే తింటూ, పుస్తకాలే కప్పుకుంటూ ఉండమనా నీ ఉద్దేశం?”
…..
”టీ తాగే వేళా ఇది? దేనికైనా వేళాపాళా ఉండక్కర్లా? భోజనం వడ్డించు. అసలే ఉక్కతో నానా అవస్థగాన ఉంది. వస్తనే వేడిగా టీ ఇస్తావు! కాస్త చల్లటి నిమ్మరసం ఇవ్వచ్చు కదా!”
…..
”సరేగాని, ఇల్లంతా ఇన్ని వార్తాపత్రికలు పడున్నాయేమిటి? ఊళ్లో ఉండే అన్ని పత్రికల నువ్వు చదవాలా? అన్నిట్లోన వార్తలు అవే కదా? నీకు చదువు పిచ్చి పట్టింది! ఇంటి విషయం అసలు పట్టించుకోటం వనేశావు…. పిల్లలేమవుతున్నారో పట్టించుకోవు….
…..
”ఏమిటీ భోజనం? రోజూ సూపులు తాగి తాగి బోరు కొడుతోంది. బేక్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్ తినలేక చస్తున్నాను! ఇంట్లో రోజూ హొటళ్లలో లాగ ఈ తిండేమిటి? మరీ అంత ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వండాలా? అప్పుడప్పుడు మామూలు వంటలు కూడా చేస్తుండు – పప్పు, అన్నం, కూరల…. ఇంటి భోజనం ఇంటి భోజనంలాగ ఉండాలి! అయినా ఈ రోజుల్లో ఫారిన్ వంటకాల వెజు మరీ ఎక్కువయింది మీ ఆడాళ్లకి! ఇండియన్ మసాలాల అవీ గిట్టకుండా పోతున్నాయి.”
…..
”ఏమిటిది? నీ షూజ్ రిపేర్ చేయించలేదా? కరెంటు బిల్లు కూడా కట్టలేదు? నువ్వసలు ఇంట్లో ఉంటే కదా? ఈ మధ్య నీకు తిరుగుడెక్కువయింది. స్కూల్లో పని చేస్తున్నావుగా, అది చాలదా? ఇంకా సాంఘిక సేవా, అదీ ఇదీ అంటూ ఇల్లు పట్టకుండా తిరగటం దేనికట? ఆ దిక్కుమాలిన సంస్థకి ఎందుకు వెళ్లటం? అక్కడుండే ఆడవాళ్లందర హిపోక్రిట్సే. అక్కడ నీకేం ఒరుగుతుంది? పోనీ డబ్బు సంపాదనో, ఇంకేదైనా లాభమో ఉందా అంటే అదీ లేదు. అక్కడికి వెళ్ళి రావటానికి నీకే ఛార్జీలవుతాయి. అదొక దండగ!”
…..
”ఇదుగో, చడు నీ ముద్దుల కొడుకు రిపోర్ట్ కార్డ్! ఫెయిలవక ఏం చేస్తాడు? తల్లికి కొడుకుని చసుకునేందుకు తీరికే లేదాయె! నేను ఆఫీసునించి అలిసిపోయి వచ్చి పిల్లలకి లెక్కలు చెపుతానని మాత్రం అనుకోకు. ఎం.ఏ.లో గోల్డ్‌మెడలిస్ట్‌వి, ఆ మాత్రం నీ పిల్లలకి చదువు చెప్పుకోలేవా? నీకీ కొత్త లెక్కలు రాకపోతే ట్యటర్ని పెట్టు. నువ్వు కూడా ఇప్పుడు సంపాదిస్తున్నావుగా! నీ డబ్బంతా ఆ సాంఘిక సేవకే ధారపోసే బదులు నీ పిల్లల్ని చక్కగా చదివించుకోటానికి ఉపయెగించవచ్చుగా? ఇద్దరు రోజంతా ఎమ్‌టీవీ చూస్తూ కూర్చుంటారు.”
…..
”ఏమిటి, జుట్టు మరీ ఇంత పొట్టిగా కత్తిరించుకున్నావు? నాకు చెప్పకుండానే? నన్ను అడిగి ఉండచ్చుగా? ఇలా కత్తిరించుకుంటే చాలా అందంగా ఉన్నాననుకుంటున్నావా? యూ లుక్ హారిబుల్! నీకు నప్పుతుందో లేదో ఆలోచించుకోవక్కర్లే? ఫాషన్ అనుకుంటున్నావు బాగుంది… పదేళ్ళు పెద్దదానిలా కనిపిస్తున్నావు, తెలుసా?”
…..
”నిద్రపోవటం లేదా ఏమిటి? అర్థరాత్రి పన్నెండవుతోంది. పెద్ద చదువుల సరస్వతివి! నీకు నిద్ర రాకపోతే ఇంకో గదిలోకి పోయి చదువుకో. దయచేసి ఈ గదిలో లైటార్పుతారా తమరు? నాకు నిద్రొస్తోంది.”
…..
”ఇంక ఆ పుస్తకాన్ని వదిలిపెడతావా? నిజంగానే నాకు కోపం వచ్చిందంటే ఈ గదిలో ఉన్న పుస్తకాలన్నిటినీ కిటికీలోంచి బైటికి గిరవాటేస్తాను. అప్పుడు చూస్తా ఎలా చదువుతావో….”
…..
”అరే, ఏమిటి నీ ఉద్దేశం? వీడేదో వెర్రివెధవలా వాగుతంటాడులే, మనం వినక్కర్లేదు అనుకుంటున్నావా? అంత దీక్షగా ఏం చదువుతున్నావో. వెంటనే చదవకపోతే నీ జన్మ వ్యర్థమైపోతుందా? అయినా ఎన్ని పుస్తకాలు చదివినా నీ తెలివిలో ఏ వర్పు రాదు…. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది… నువ్వీ జన్మలో వరవు!”