నీ వెంత ఎత్తు ఎదిగావని కాదు
ఎంతమంది స్త్రీలను అణచివేసావని
నీవేమి సాధించావని కాదు
ఎంతమంది అడాళ్ళను శాసించావని
నీ కెంత జ్ఞానముందని కాదు
ఎంతమందిని నీ కాళ్ళవద్ద వుంచావని
మగసిరి అంటే మగువలపై పత్రాపమని
మతమంటే మగవాళ్ళ జేబులో డబ్బని
శాసనాలు చట్టాలు విధులు నిషేధాలు
మీ అరచేతిలో ఆటబొమ్మలని
అనాదినుంచి మీరు ఆ ఆటబొమ్మలని చూపి
ఈ పాణ్రమున్న బొమ్మల్ని ఆడిస్తున్నారని
నాకు బాగా తెలుసు –
కాని నిన్న నేడు లోకం మారిందేమోనని
నేను కొన్ని పశ్న్రలు మాతమ్రే అడుగుతానని
కొన్ని వాస్తవాలను మాతమ్రే చెబుతానని
నోరువిప్పలేని నా ఆడతనం….
కలాన్నయినా తెరచి కాగితం మీద పెడదామని
నా బాధనంతా నల్లటి అక్షరాల్లో నలుగురికీ చెబుదామంటే
నల్లతాచ్రులై నా అక్షరాలు మిమ్మల్ని కాటేసాయన్నారు
నిరాయుధనై కలాన్ని మాత్రమే కలిగున్న నన్ను
చేతిలోని ఆ ఆయుధాన్ని విరిచి పారేయమన్నారు
ఎందుకు మీ కంత భయం? నావద్ద ఏమైనా బాంబులున్నాయ?
అక్షరం ఎవడబ్బ సొత్తూ కాదు? అక్షరం అందరిదీను –
చేవ వున్న చేతిలో అది ఆయుధమౌతుందేమో!
చేవ చచ్చిన చేతిలో సిరా వట్టి నీరే!
నే నాశయ్రించింది కలాన్ని – అదే నా బలం
నే నాశయ్రించింది నిజాయితీని – అదే నా ఆయుధం
నే నాశయ్రించింది పీడిత స్త్రీ దైన్యాన్ని – అదే వాస్తవం
నా బలంతో నా ఆయుధం వాస్తవాన్ని వెల్లడిస్తోంది
నన్ను చంపినా నా ‘అక్షరం’ చావదు.
పైపెచ్చు ఒక్క అక్షరం కోటి అక్షరాలై
కోట్ల మెదళ్ళను తట్టి లేపుతుంది జాగృతివైపు నడవమంటుంది.
పిచ్చివాడా! ఇన్ని శతాబ్దులలో నీవు సంతరించుకొన్న నాగరికత
నాలో కొంచెం కనబడితే సహించలేకపోయవేఁ?
వీరంగం చేసి విధ్వంసాన్ని సృష్టించి, నీ విశాల దృక్పధాన్ని చాటుకొన్నావే?
కట్టు జుట్టు మాటమంతీ స్టైల్‌లో నీవు ఇరవై శతాబ్దంలో వున్నా
నన్ను మాత్రం పదమూడువందల ఏళ్ళ వెనక్కి విసిరేసావ్
అక్కడి నుండి నేనొక్కంగుళం ముందుకువచ్చినా నీవు సహించవ్.
సారీ! నేను ‘ఆలోచనాజీవి’ని – నా ఆలోచనే నన్ను పేర్రేపించేది.
నాలో ఆరాటం తపన దేన్నో ‘శోధి’ంచమంటున్నాయి.
పశ్న్రించమంటున్నాయి! పరుగెత్తమంటున్నాయి.
అణచివేతనుండి పజ్వ్రరిల్లిన అగ్ని నన్ను దహిస్తోంది –
చావునైనా ధిక్కరించమంటున్నది – చచ్చి బతకమంటున్నది.