ఎన్ని ‘ఉరులు’ ఆపగలవు – అనుదిన అత్యాచారాల్ని?

– నంబూరి పరిపూర్ణ

మన ఢిల్లీ రాజధానిలో అత్యంత కిరాతకంగా, హేయంగా జరిగిన లైంగిక హింస,జంటహత్యల దుర్ఘటన జరిగిన పది నెలల తరవాత దానికి కారకులైన నలుగురికీ కఠిన శిక్ష విధింపబడినందుకు – దేశ ప్రజలంతా తీవ్ర ఉద్వేగంతో, కసితో, ఉరి ఒక్కటే వాళ్లకు తగిన శిక్ష అని ఆక్రోశిస్తూ ఆనందించింది.

దేశమంతటా – అరగంట కొకటిగా జరుగుతున్న మానభంగాలు, హత్యలు బాలికల కిడ్నాపులు, సామూహిక అత్యాచా రాలు – సాధారణమవుతున్న నేటి పరిస్థితిలో, ఢిల్లీ దుండగులకు ఉరిపడడం వల్ల – కొంతమేరకైనా లైంగిక దాడులకు బ్రేకు పడవచ్చునన్న చిన్న ఆశ మహిళా జనాల్లో చోటు చేసుకునే అవకాశముంది.

నగరాల్లో, పట్టణాల్లోనేగాక, పల్లెల్లో, స్కూళ్లూ హాస్టళ్లలో, ఆఫీసుల్లో మానవ మృగాలు చొరబడి, లైంగిక దాడులు చేస్తున్నాయి. పసిబిడ్డల, బాలికలపైన చివరకు వివాహితులపైన అత్యాచారాలు జరిపి, అరెస్టుల పర్వాలూ, బెయిళ్లూ అవలీలగా దాటి బయటి కొచ్చి, రొమ్ముని విరుచుకు తిరుగుతున్న వేటగాళ్ళ సంగతి ఎవరికి ఏ ప్రజాప్రతినిధికి, అధికారికి పడుతోంది? సమాజ శాంతి భద్రతలు, ప్రజల ప్రాణరక్షణ తన ప్రాథమిక కర్తవ్యమని గుర్తించుతున్నదీ మన ప్రజాప్రభుత్వం ! అనేక శ్రమలు, త్యాగాలతో వచ్చిన స్వాతంత్య్రం- ప్రజల కోసం గాదు, అది దుండగులకు, దొంగలకు, మదమెక్కిన కామందులకు, దేశ ఒనరుల దోపిడీదార్లకు సుమా అని నేటి ప్రభుత్వ పాలన నిరూపిస్తోంది గదా!

అన్ని వర్గాల్లో కుటుంబాల్లో, యువజనుల్లో నైతికత, మానవతా విలువలు క్షీణిస్తుండడానికి – అంతర్గత, బాహ్యశక్తుల ప్రభావాలెంతటివి, వాటి నిర్మూలనకు ఎలాంటి చర్యలవసరం అన్న ఆలోచన, తగు కార్యాచరణ మన పాలక సారధుల్లో కనబడుతున్నాయా?

అసలు సంగతి – పాలకుల్లోనే ప్రజాప్రతినిధుల్లోనే – నైతిక నిష్ట, సక్రమ ధర్మాచరణ – రాను రాను అదృశ్యమవుతున్న దుస్థితి! ఇందుకు బదులుగా ఆర్ధిక నేరాల్లో, కుంభ కోణాల్లో – నేతలు నిష్ణాతులవు తుండడం! విచ్చల విడి శృంగార లైంగిక చర్యలకు తెగబడిన గవర్నర్లకు, మంత్రివర్యు లకు కొదవలేదు గదా మనకు వీరికి జత ఆధ్యాత్మిక గురువులు, బాబాలు, బాపూజీలు! భక్తి విశ్వాసాలతో ప్రజలు సమర్పించే కోట్లాది ధనమూ, భక్తి భావనతోనే చేరువయ్యే అమా యకపు అమ్మాయిలూ – ఈ గురువులకు – పెట్టని ధనాలవుతున్న మరో దుస్థితి!!

ఈ బాపతు మేకవన్నె తోడేళ్ళు మార్గదర్శకులవుతున్నప్పుడు – యువజనం వారిననుసరించడం, అనుకరించడం ఒక సహజ ప్రక్రియ. అవినీతి, అక్రమ సంబంధాలు, దోపీడీల ఆర్జన – ఈ నాటి జీవనశైలిగా మారడానికి పాలక, అధికార వర్గాల తోడ్పాటు అత్యధికంగా వుంటుంది.

సమాజంలోని అన్ని రంగాల్లో చక చకా జరిగిపోతున్న అభివృద్ధి ఏమిటీ అంటే అది వ్యాపార సంస్కృతి అభివృద్దే. వస్తువులకు, ఉత్పత్తులకు ప్రచార సారధులవుతున్న స్త్రీలు – తామే మొదటగా అమ్మకపు వస్తువులవుతున్నారు. అడ్వర్టయి జర్లూ, బ్రాండ్‌ అంబాసిడర్లూ అంగీకరిం చాల్సిన ప్రాధమిక షరతు – శరీరాల్ని సాధ్యమైనంత అధికంగా ప్రదర్శించడానికి యిష్టపడడం. ఏ వస్తువు గురించయినా – అవి సబ్బులు, బాడీలో షన్సు, పేస్టులు, మందులు, లిక్కర్లు, బైకులు కార్లు, చివరకు చాక్లెట్లు – వీటి ఘనతను – ఓ ప్రియుడితో, మిత్రుడితో సెక్సీగా ఒయ్యారాలు పోతూ జనానికి తెలియజేస్తుండాలి. అదే సమయం లో తమ పేలికబ్రాల వక్షాలూ, బొడ్డులూ నూలుపోగులేని తొడలూ – చూపరులకు కనువిందుచేసేలా ప్రదర్శించాలి!

ఇలా – మన వ్యాపార వినిమయ రంగంలో తమ నగ్న విన్యాసాలతో దూసుకు పోతున్న మోడల్సును – టీ.వీ. ఛానళ్లు, పత్రికలు, మేగజైన్లు, రేడియోలు, ధియేటర్లు, హోర్డింగులు – తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు అద్భుతంగా ప్రోత్సహిస్తున్నాయి. మోడలింగును వృత్తిగా చేపట్టేందుకు ఆధునిక యువతులు ముందుకు రావడం ఒకసాహసమే. ఐతే ఒంటి ఒంపుల ప్రదర్శన, మగాళ్లను కవ్వించి, రెచ్చగొట్టే వగలాడి కదలికలు, చూపులు – వారు పొందుతున్న శిక్షణ గౌరవప్రదమూ, వాంఛనీయమూ అనుకునేలా వుంటోందా?

స్త్రీని గౌరవించడం మా సుసాంప్రదాయం అని చెప్పుకునే మన వ్యాపార పారిశ్రామిక వర్గాలు – స్త్రీల వ్యక్తిత్వ గౌరవాలను ఫణంగా పెట్టి, తమ సరుకుల్నీ, వస్తువుల్నీ అధికంగా అమ్ముకోజూడడాన్ని ఎలాంటి నైతిక ధర్మమనుకోవలి!

ఇక నేటి సాహిత్య ప్రక్రియల ప్రస్థానం ఏ వైపుకు సాగుతోంది. రెండు దశాబ్దాల ముందు – నార, పక్ష, మాస పత్రిక లు గానీ, ప్రచురణ సంస్థలు వెలయించే కథలూ నవలలు గానీ – వినోదంతోపాటు మంచి విజ్ఞానాన్ని అందిం చేవి. ఆలోచింప జేసి అభ్యుదయ భావాలను పాదుకొల్పు తుండేవి. నేటి మేగజైన్ల సాహిత్యం అశ్లీలతకు అధికంగా చోటు బేడుతోంది. అద్భుత, భయంకర సీరియల్సు, తప్పనిసరి క్రైమ్‌ స్టోరీలు, పేజీపేజీన – అర్ధ నగ్న సినీ నటీమణుల తాలూకు చచ్చు కబుర్లు- తోటకూర జోకులు, ప్రేమ చిట్కాలు – వార పత్రికల స్థాయిని దించితేనేం, డిమాండును పెంచుతున్నాయి. వయసూ, మనసూ పెరగని యువతకు. యితర మత్తు మందు లకు, ఈ వక్ర, అశ్లీల సాహిత్యమూ తోడవు తూ, వాళ్లను కాముకులుగా, అసాంఘిక శక్తులుగా మారేట్టు చేస్తున్నమాట నిజం.

పత్రికలూ ప్రచురణ సంస్థలూ పాటించవలసిన ప్రాధమిక నియమ నిబంధనలనూ, సామాజిక విలువలనూ క్రోడీకరించి – వాటిని పాటించని పత్రికలను నిషేధానికి గురిచేయగల అధికార చట్టాలను ప్రభుత్వం సత్వరమే చేయడం అసవరం.

ప్రతి దినం టి.వీ చానల్సు, థియేట ర్లూ – ప్రదర్శిస్తున విదేశీ సినిమాలు దాదాపుగా – అత్యంత అశ్లీలత, భయంకర హింసాత్మక సన్నివేశాలతో నిండి వుంటు న్నాయి. వీటిని అనుకరణలుగా స్వదేశీ సినిమాలూ తమ శక్త్యానుసారం పచ్చిబూతు శృంగారాన్నీ, ఆ మరుక్షణం – హీరో తన నెదిరించే విలన్నో, మరొకణ్ణో అతిమొరటు గా, కృరంగా తన్ని పడెయ్యటాన్నే – హీరో యిజంగా చిత్రిస్తూ యువతరానికి కైపెక్కించి – హింసను ప్రేమించే లాగ ప్రోత్సహిస్తు న్నాయి. నాయకీ నాయకుల అడ్డగోలు ప్రేమ లు, అసభ్యడ్యాన్సులు తప్ప – సమాజమూ, కుటుంబాలు ఎదుర్కొం టున్న సమస్యలను వాస్తవికంగా చిత్రించి, విశ్లేషించే చిత్రం నూటికొక్కటడయినా నిర్మింపబడ్డం లేదు. ప్రతి ఒక్కటి ప్రేమ పేరుతో కాముకత్వారన్ని ప్రచారం చేస్తూ, యువతను పెడదారి పట్టిస్తూ – డబ్బు చేసుకుంటున్న చిత్రాలే!

వినోదపు పన్నుల రూపంలో, ఎన్నిక లప్పుడు భారీ విరాళాల రూపంలో పాలక వ్యవస్థకు – డబ్బు అందుతున్నంత వరకు – ఎంతటి అసభ్యతనైనా, అసాంఘిక సన్నివేశాలనైనా నిర్మాతలు తమ చిత్రాల్లో నింపుకుని ప్రదర్శించవచ్చు.

ఇప్పుడు – విద్యార్ధినీ విద్యార్ధులను పెడత్రోవలు పట్టించి, ఉన్మాదులుగా, కౄరులుగా హంతకులుగా మార్చుతున్నవి – యింతవరకూ చెప్పుకున్న అంశాలేగాదు – ప్రభుత్వం. అత్యంత శ్రద్ధాసక్తులతో, దీక్షతో అమలు చేస్తున్న మద్య విదానం’. ఆనాటి పరాయి ప్రభువుల పాలనలో సైతం తాగుడల వాటుకు లొంగని – యువజనం, విద్యార్ధి లోకం – యిప్పుడు మన స్వతంత్ర ప్రజా ప్రభుత్వపు కరుణాకటాక్షాల వల్ల – నిఖార్స యిన తాగుబోతు గుంపులుగా మారుతోంది. తాగిన మైకంలో అమ్మాయిల వెంట పడడం, కిడ్నాపులు చేయ్యడం, అత్యాచారం తరవాత హత్యలు చెయ్యడం – పాలకులు మద్యమం దిస్తూ వీరిని నడిపిస్తున్న ప్రగతి బాట!

ఈ వ్యసనానికి అతిగా బానిసనలైన కొడుకులు – డబ్బుల కోసం ఒంటి మీది నగల కోసం – తండ్రుల్ని, తల్లుల్నీ నరికి చంపుతున్న ఘటనలు – యిప్పుడు మామూ లు సంగతులువుతున్నాయి. గొప్పింటి ఆడపిల్లలు, విద్యార్ధినులు కూడా పబ్బుల్లో, కాఫీ క్లబ్బులో తాగి – మగాళ్లతో తందనా లాడ్డం – ఒక శ్టాటస్‌ సింబల్‌ చూపుతున్నారు.

ఇన్ని రకాల దుష్ట విధానాలు, దుష్ట శక్తుల దుష్ఫ్రభావానికి లోనవుతున్న నేటి యువకులు – అతి కౄర సామూహిక అత్యాచారాలకు, తదనంతర హత్యలకు, కంటి కగువదిన పసిపిల్లను, ముసలి స్త్రీని సయితం సెక్సు సింబలుగా పరిగణించి చెరిచి వేయడానికి పాల్పడకుండా ఎలా వుండగలరు?

నిర్భయ అత్యాచార దారుణానికి పాల్పడిన వారిలో నలుగురికి ఉరిశిక్ష పడిందని పత్రికలు ప్రకటించిన రోజునే – దేశంలో అనేకచోట్ల అత్యాచారాలు జరిగిపోయాయి. ఒంటరి గానే కాదు – ఒంటరిగా దపంతులెదురైనా – భర్తను కొట్టి కట్టివేసో, చంపో, బ్రతికితే అతని కళ్ల ముందో – భార్యల్ని చెరిచి వేస్తున్న ఘటనలూ జరిగిపోతున్నాయి. ‘నిర్భయ’ కేసులో ఉరిశిక్ష విధించిన ప్రభుత్వం – తామర తంపరగా జరుగుతున్న ఎన్ని దుర్ఘటనల తాలువీకు వ్యక్తులకు ఉరి శిక్షలు వేయ్యగలదు?

‘గనుల దోపిడులు, వనరుల అన్యాక్రాంతులు, భూపందేరాల ద్వారా కోట్ల కోట్ల రాబడులు, దగ్గరబడుతున్న జనరల్‌ ఎన్నికల్లో అక్రమ తాయిలాలిచ్చి, తిరిగి అధికారం చేజిక్కించుకునే మార్గాలు – వీటన్నిటిలో మునిగి తేలుతున్న పాలకులకు కనువిప్పు కలిగించి – నేడు విస్తరించివున్న విషవలయాన్ని శక్తివంతంగా ఛేదించి సంఘ జీవనంలో, సకల యువజనంలో, ప్రజా బాహుళ్యంలో వాంతి సుస్థిరతలను ఉత్తమ జీవన విలువలను పొదుగాల్సి, పునరుద్ధరించే బాధ్యత – ప్రజలమీద – మేధావి వర్గాల మీద ప్రదానంగా వుంది.

అరగంట కొక్కసారిగా – అత్యాచారా లకు, హత్యలకూ బలి అవుతున్న ఆడప్రాణుల రక్షణకు నడుంబిగించి – అమోఘ పొరాటాలు సాగించవలసిన బాధ్యత, కర్తవ్యం – అసంఖ్యాక మహిళా సంస్థల, శక్తులమీదనే వుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.