ఆకుపచ్చ లోయల్లో, ఆనందపు హేలల్లో ఉద్విగ్నంగా, ఉత్సాహంగా సాగిన రచయిత్రుల సాహితీ యాత్ర

కొండవీటి సత్యవతి

పాపికొండల ప్రయాణం తొలి ప్రణయంలా తీపిగుర్తుల్ని గుండెల్లో నింపడంతోను, ఆ గుర్తుల్ని అందమైన
అనుభవాలుగా మలిచి అందరితో పంచుకోవడంతోను మా రెండో ప్రయణానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.

ముప్ఫైమంది రచయిత్రులు ట్రిప్‌కి సై అన్నారు. ఆలస్యమెందుకని అందరికీ రిజర్వేషన్లు కూడా చేయించేసాం.

వెళుతున్నది నెల్లూరు ప్రాంతానికి కాబట్టి అక్కడి రచయిత్రులు మొత్తం బాధ్యత తీసుకుంటారని మొదట్లో నేను

భావించాను. కానీ ఒక్క ప్రతిమ తప్ప నెల్లూరు నుంచి ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్ళీ నేనే బాధ్యత

తీసుకోవలసి వచ్చింది. నిజానికి ఈసారి నేను ఎలాంటి బాధ్యతా తీసుకోకుండా హాయిగా ఎంజాయ్‌

చేద్దామనుకున్నాను. కానీ అలా కుదరలేదు. అలాగని అంతా నేనొక్కదానినే చేసేసానంటే అది

అబద్ధమౌతుంది. నాయుడుపేట నుంచి ప్రతిమ, తిరుపతి నుంచి విష్ణుప్రియ బోలెడంత చేసారు. మొత్తానికి

ముగ్గురం కలిసి ఈ ట్రిప్‌ని బ్రహ్మాండంగా ఆర్గనైజ్‌ చేసాం. అపురూపమైన ప్రదేశాలని సందర్శించగలిగాం.
22న చార్మినార్‌లో మా ప్రయాణం మొదలైంది. నాంపల్లి స్టేషన్‌ మా హడావుడితో

కళకళలాడింది. ఇరవై ఒక్కమంది హైదరాబాదు నుండి బయలుదేరితే వరంగల్‌లో నలుగురు విజయవాడలో

ఇద్దరు మాతో చేరారు. నాయుడుపేటలో మరో నలుగురు కలిసారు. భోగీలో సగం మేమే వుండడంతో

కంపార్ట్‌మెంటంతా గోలగోలగా వుంది. మా గోలకి తోడు అదే కంపార్ట్‌మెంటులో మిగతా సగం ఏదో ట్రయి నింగుకి

చెన్నై నుంచి వచ్చి తిరిగివెళ్తున్న తమిళ సోదరులు చేరడంతో వారి తమిళ గలగలలతో డబ్బాలో గులక రాళ్ళేసిన

శబ్దాలు కంపార్ట్‌ మెంటంతా నిండాయి.
మా గార్డెన్‌లో పూసిన సంపెంగలు అందరి చేతుల్లోకి చేరి తియ్యటి వాసన కంపార్ట్‌ మెంట్‌ అంతా కమ్ముకుంది.

నేను మా తోటలోంచి కోసుకెళ్ళిన కే.జి జంట జామకాయలు అందరినీ అబ్బుర పరిచాయి. కాస్సేపటి తరవాత

ఎంత పెద్ద గుమ్మడికాయైనా కత్త్తిపీీటకు లోకువన్నట్టు కేజి బరువున్న జామకాయ ఇరవై ముక్క లైంది.

అందరి పొట్టల్లోకి వెళ్ళి పోయింది.
ఖాజిపేటలో రజిత, నిర్మల, సమత, రమాదేవి మాతో చేరారు. అందరం కలిసి డిన్నర్‌ ముగించాక ఎడతెగని

కబుర్లు నడిచాయి. ఆ తర్వాత అందర పడకలు వేసారు. విజయవాడలో పి. సత్యవతి, అనూరాధ గార్లు

వచ్చేవరకు మెలుకువతో వుండి నేనూ ముసుగుతన్నేను.
మా రిజర్వేషన్లు నాయుడుపేట వరకు వున్నాయి. అయితే గూడూరుకు దగ్గర్లోనే తూపిలిపాలెం బీచ్‌ వుందని

తెలిసి, ప్రతిమ మాట్లాడిన బస్సును గూడూరు స్టేషన్‌లో వుంచమని చెప్పాను. మా రైలు ఆరుగంటలకి

గూడూరు చేరింది. సుహాసిని, తన మిత్రురాలితో కలిసి మమ్మల్ని స్టేషన్‌లో రిసీవ్‌ చేసుకుంది. అందరం కలిసి

బస్సులో బీచ్‌కి బయలుదేరాం. మధ్యలో కాఫీలు సేవించి, తిరుగు ప్రయాణంలో టిఫిన్లు ఆరగిస్తామని చెప్పి బీచ్‌

వైపు వెళ్ళిపోయాం. రైలు ఆలస్యమవడం వల్ల సూర్యోదయాన్ని సముద్రంలో కాకుండా రోడ్డు మీదే చూసాం. ఓ

గంటలో సముద్రం దగ్గరున్నాం. మా బస్సు ఆగిన దగ్గరికి సముద్రం కొంచెం దూరంగా వుంది. సునామీకి

సముద్రం అలా వెనక్కి వెళ్ళిపోయిందని అక్కడివాళ్ళు చెప్పారు. కెరటాలు రారమ్మని పిలుస్తున్నాయి.

అక్కడకు వెళ్ళాలంటేళ్ళలోతు నీళ్ళల్లో దిగాల్సి వచ్చింది. ఉత్సాహం వున్నవాళ్ళం నీళ్ళలో దిగేసి సముద్రం

వైపు వెళ్ళాం. మిగిలిన వాళ్ళు అక్కడున్న పడవెక్కి కూర్చుని జానకీబాలగారి పాటల్ని ఎంజాయ్‌ చేసారు.

కాసేపు కెరటాలతో ఆడి ఫోటోలకు ఫోజులిచ్చి తిరుగుప్రయణమైనాం. ఆ… అన్నట్టు మర్చిపోయాను, బీచ్‌లో

నాకు బోలెడన్ని పెద్దపెద్ద శంఖాలు దొరికాయి. అబ్బ నీకు అన్ని శంఖాలెలా దొరికాయి, మాకు ఒక్కటీ

దొరకలేదు అన్నవాళ్ళకి నా సవధానం ఒక్కటే. ”కళ్ళు నేలకతి కించండి. శంఖం కాదు ముత్యపుచిప్పలూ

దొరుకు తాయని”. తడిసిపోయిన బట్టలతో అందరం బస్సె క్కాం. ఈలోపు ప్రతిమ దగ్గరినుంచి ఫోను.

ఎక్కడు న్నారు. ఇంకా ఎంతసేపు అని. ఇదిగో వచ్చేస్తున్నాం అదిగో వచ్చేస్తున్నాం అంటూ స్వర్ణముఖి తీరం

గుండా ప్రయాణించి పదింటికి నాయుడుపేట చేరాం.
ప్రతిమ హృదయం లాగానే వాళ్ళిల్లు కూడా విశాలంగా వుంటుంది. వెళ్ళగానే వేడివేడి కాఫీ ఇచ్చింది. అక్కడ

చంద్రలత, నంద లూరు కథానిలయం నిర్వాహకులు రాజేంద్రప్రసాద్‌గారు, వారి సహచరి వనజాక్షి గారు మాకోసం

ఎదురు చూస్తు న్నారు. చంద్రలత తనకు ఆరోగ్యం బాగా లేదని, మాతో రాలేకపోతున్నానని చెప్పింది. అందర

స్నానాలు చేసి తయరవ్వడానికి వెళ్ళారు. ప్రతిమ వాళ్ళ ఇల్లు పెళ్ళివారిల్లు లాగా హడావుడిగా తయరైంది.

ప్రతిమ చెల్లెలు ప్రభావతి, నాయుడుపేట సర్పంచిగా వున్నారు. ఆవిడ ప్రతిమతో పాటు హడావుడి పడిపోత

భోజనాల ఏర్పాట్లు చూసారు. ప్రతిమ చెప్పిన కొండపల్లి చాంతాడంత వంటల లిస్ట్‌ను కట్‌ చేయించినందుకు

నన్ను మళ్ళీ ఒకసారి కోప్పడింది. అయినా చాలా రకాల వంటలు టేబుల్‌ నిండా సర్దింది. నాకిష్టమైన గారెలు,

నాటుకోడి ఇగురు కూడా వున్నాయి. మహదానందంగా వాటిని ఆరగించాన్నేను. మా గుంపులో ఎక్కువమంది

శాఖాహారులే వుండడం వల్ల నాకెవరూ పోటీకి రాలేదు మరి. (ఆహాహా)
ఒంటిగంటకి ప్రతిమతో సహా బస్సెక్కాం. స్వర్ణముఖి నదీతీరాన వాళ్ళ నాన్నగారు కట్టించిన గుడికి తీసుకెళ్ళాలనే

ప్రతిమ కోరిక తీరనేలేదు. పులికాట్‌ సరస్సులో పడవ ప్రయాణానికి చీకటి పడితే కష్టమని చెప్పడంతో అందరం

బస్కెక్కాం. వనజాక్షిగారు మాతో వచ్చారు. చంద్రలత, సుహాసిని నాయుడుపేటలోనే మాకు బైబై చెప్పారు.

ప్రతిమ వాళ్ళ అత్తగారికి, చెల్లెలుకి, పరివారానికి వీడ్కోలు చెప్పి మేము పులికాట్‌ వేపు

సాగిపోయాం.డ్రైవర్‌తప్పిదం వల్ల ఓ గంట ఆలస్యంగా సరస్తీతీరం చేరుకున్నాం. ప్రతిమ మాట్లాడిపెట్టిన రెండు

మర పడవలు మా కోసం సిద్ధంగా వున్నాయి. ఒక్కో పడవలో పదిహేను మందిమి సర్దుకున్నాక పడవలు

బయలుదేరాయి. మాతోపాటు పడవెక్కిన వ్యక్తి శివ (ప్రతిమకు తెలిసినాయన) మీరు ఆలస్యం చేసారు. గాలి

ఎక్కువైంది. పోటు పెరుగుతుంది అన్నాడు. కొంత దూరం వెళ్ళాక నిజంగానే గాలి ఎక్కువైంది. మేము గంట

ప్రయాణం చేసి ఒక ద్వీపంలోకి వెళ్ళాలి.మధ్యలోకి రాగానే విపరీతమైన గాలి.పెద్దపెద్ద అలలు పడవను ఢీకొట్ట

సాగాయి.నీళ్ళు ముత్యాల్లాగా చిమ్ముతూ పడవలో కూర్చున్న మమ్మల్ని తడపసాగాయి.గోదావరిలో తిరిగిన

నాకు భయమేయలేదు కానీ మాతో కూర్చున్న వ్యక్తి ‘అతిజాగ్రత్త’ మాకు తలనొప్పిగా తయా రైంది. అలలమీద

ఊగుతున్న పడవ ఊపు ఒక వైపు,అతని ఆలస్యం చేసారనే సాధింపు ఒకవైపు కొంత చికాకు కల్గించాయి.ఒక

స్టేజిలో పడవను వెనకి తిప్పేయ మని అరవాల్సి వచ్చింది.అయితే అదే పడవలో సరంగు దగ్గర కూర్చున్న

పెద్దాయన ఏమీ కాదని,భయపడవద్దని ధైర్యమివ్వ డంతో ఊగుతున్న పడవ ఉయ్యాలగా రినట్టయింది.పులికాట్‌

సరస్సునే ప్రళయ కావేరి అని కూడా అంటారట.కన్ను ఆనినంత మేరా ప్రళయకావేరి ఉగ్రరూపం ఎగిసిపడుతోంది.

పోనుపోను గాలి తగ్గింది.పడవ నీళ్ళను చీల్చుకుంటూ వెళుతోంది.మాలో ఉత్సాహం ఉరకలు సింది.పాటలందు

కున్నాం.డాన్సులు చేసాం.నీళ్ళతో ఆడాం.ఓ గంట ప్రయాణం తర్వాత ఓ ద్వీపం చేరాం.కాసేపు అక్కడ

గడిపితిరుగు ప్రయాణమైనాం.వేరే పడవలో వున్నవాళ్ళు కూడా నీటి ఉధృతి పడవని తాకినప్పుడల్లా

భయపడ్డారని,కొందరు ఎక్కువగా భయపడ్డారని తర్వాత తెలిసింది.కెరటాలు పడవని ఢీ కొట్టినప్పుడు పడవ

ఎగిసిపడడంతో నిజంగానే భయకంపితు లయ్యారు కొందరు. గాలి తగ్గడంతో తిరుగు ప్రయాణం సాఫీగా

సాగిపోయింది.సూర్యుడు అస్తమించే సమయానికి తీరానికి చేరాం. ఒకవైపు సూర్యాస్తమయం,మరోవైపు

చంద్రోదయం చూడగలిగాం అక్కడ.ప్రళయకావేరికి ప్రేమగా వీడ్కోలు చెప్పి బస్సులో ఎక్కాం అందరం.

ప్రళయకావేరిలో పడవ ప్రయాణపు అనుభవాలని పంచుకుంటూ మేము మామండూరు అడవివేపు సాగి

పోయాం.మధ్యలో ఓ టీ బంకు దగ్గర వేడివేడి టీ తాగి కుదుటపడ్డాక మా బస్సు చీకట్లను చీల్చుకుంటూ

మామండూరు అడవుల్లోకి ప్రయాణమైంది.తిరుపతి నుంచి సత్యప్రసాద్‌వాళ్ళు అప్పటికే అక్కడికి చేరి భోజనాల

ఏర్పాట్లు చేస్తున్నారని ఫోన్‌ వచ్చింది.పీలేరు కోర్టు నుండి వచ్చిన నాగేశ్వరరావు మధ్య మధ్య ఫోన్‌ చేస్తూ మాకు

దారి చెబుతున్నాడు. ఎనిమిది న్నరకి మా బస్సు మామండూర్‌ చేరింది.మెయిన్‌రోడ్డు దగ్గర నాగేశ్వరరావు మా

కోసం ఎదురు చూస్తున్నాడు.అతను దారి చూపిస్తుండగా సన్నటి రోడ్డు మీద దట్టమైన అడవిలోకి బస్సు

వెళ్ళసాగింది.బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళేసరికి దూరంగా, ఎత్తుగా, ఠీవిగా నిలబడిన ఫారెస్ట్‌ గెస్ట్‌హౌస్‌ ఆ అడవి

మధ్యలో, పున్నమి ముందురోజు కురుస్తున్న వెన్నెల్లో తడుస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తూ నిలబడి

వుంది.అందరం ఎగ్జయిట్‌ అయ్యాం. అతిథిగృహం సిబ్బంది మా కోసం రెండు రూమ్‌లు ఒక డార్మిటరీ

కేటాయించారు.ఇంకొక రూమ్‌ కూడా వుందని, కొంచెం దూరంగా వుందని చెప్పడంతో మాకిచ్చిన వాటిలోనే

సర్దుకుందా మనుకున్నాం.పెద్దవాళ్ళ నందరిని పైన వున్న రూమ్‌ల్లో వుండమని మిగిలిన వాళ్ళం కిందవున్న

డార్మిటరీలో సర్దుకున్నాం.ఓ పది మంచాలు వరసగా వేసి వున్నాయి.రెండేసి మంచాలు కలిపేసి ముగ్గురం పడు

కోవాలని అనుకున్నాం.చలి గడగడ లాడిస్తోంది. నాకు స్నానం చెయ్యకుండా పడుకుంటే నిద్రరాదు.సోలార్‌

హీటర్‌ వెనకవున్న రూమ్‌లో వుందని చెప్పారు గానీ నేను ఆ చలిలో చల్లటి నీళ్ళతో హాయిగా స్నానం చేసేసాను.

ఇంకెవ్వరూ ఆ సాహసం చెయ్యలేదు.
బయట పండువెన్నెల కాస్తోంది.అడవిలో వెన్నెల అంత అందంగా వుంటుందని నేనెపుడూ

అనుకోలేదు.అన్నం తిన్నాక అడవిలోకి నడుద్దామను కున్నాం.తిరుపతి నుంచి వచ్చిన సత్యప్రసాద్‌ భోజనం

రెడీగా వుందని, వేడిగా భోంచెయ్యండని పిలువనంపాడు.అతను వంటసామగ్రితో సహా అన్నీ తెచ్చుకుని

మాకోసం వండించాడు.బోలెడన్ని కబుర్లు చెబుతూ వేడివేడి, రుచికరమైన భోజనం పెట్టాడు.ఆ చలిలో అతను

వడ్డించిన భోజనం మహా ఆనందంగా ఆరగించాం.చాలామంది అప్పటికే బాగా అలిసిపోయారు.రాత్రి ప్రయాణం

పగలంతా తిరగడంతో చాలా మంది బాగా అలిసిపోయారు.నాకయితే ఏ అలసటాలేదు.ఫ్రెష్‌గా, ఉద్విగ్నంగా

వుంది.అడవిలోకి నడుద్దాం అంటూ విష్ణు కూడా తొందర చేసింది. కాళ్ళకు బూట్లు బిగించుకుని బయటపడ్డాం.

అడివంతా నిశ్శబ్దంగా వుంది.ఏవో కొన్ని పక్షుల, జంతువుల అరుపులు వుండుండి

వినబడుతున్నాయి.మల్లెపువ్వంత తెల్లటి వెన్నెల విరగకాస్తోంది. కరెంటు వెలుతురు లేకపోవడంతో అంత

వెన్నెల్లోనూ నక్షత్రాలు స్పష్టంగా కన్పడుతున్నాయి. అందరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ,పాటలు

పాడుకుంటూ అడవిలో నడవసాగాం.చలి గడగడలాడిస్తున్నప్పటికీ వెన్నెల్ని అలా ఒంటరిగా అడవిలో వదలలేక

మామీద కురిపించుకుంటూ, తన్మయులమౌతూ, మత్తెక్కిపోతూ అలా చాలాసేపు నడిచాం.ఇంతమంది

ఆడవాళ్ళు అడవిలో ఎలా తిరుగుతారు అనుకున్నాడో ఏమో నాగేశ్వరరావు మాతో కొంతదూరం వచ్చాడు.మేం

వద్దని అతన్ని పంపేసాం.పులులొస్తాయ,సింహా లొస్తాయ,ఎలుగుబంట్లు వస్తాయా అని వాదులాడు కుంటూ

గొంతెత్తి వెన్నెల పాటల్ని పాడు కుంటూ మహా ఆనందంగా నడిచాం.
కళ్ళమీద కునుకు ఆవహించడంతో అయిష్టం గానే వెన్నెలకి వీడ్కోలు చెప్పి రూముల్లోకి వెళ్ళి పోయాం.మళ్ళీ

కబుర్లు.ఎప్పటికో నిద్రపోయాం.
ఉదయం నాలుగ్గంటలకే హడావుడి మొదలైంది.రాత్రి వెన్నెల్ని మిస్‌ అయిన వాళ్ళు పొద్దున్నే లేచి బయటకు

వెళ్ళి పోయారు.వేకువ వెలుతురులో గెస్ట్‌హౌస్‌ చుటూ అలుముకుని వున్న అడవి దర్శనమిచ్చింది.దగ్గర్లోనే ఒక

వాగు వుందని అక్కడికి వెళదామని విష్ణు అనౌన్స్‌ చేసింది.కాఫీ తాగి వాగువైపు బయలుదేరాం.అంతకు ముందే

అడవిలో సూర్యోదయం చూసి కేరింతలు కొట్టారందరూ.మంచుతో కప్పబడిన ఆ అడవిలో నడవడం ఓ

అద్భుతానుభవం.మధ్యలో పాటలు,నృత్యాలు.మేము వెళ్తున్న వాగుపేరు పెద్దవాగు.ఆ పెద్దవాగును చేరాలంటే

మధ్యలో మూడు పిల్లవాగులు దాటాలి.చెట్లను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్న కాలువలు చూస్తుంటే నాకు

సుందర్‌బన్స్‌ అడవులు గుర్తొచ్చాయి.ఉత్సాహం,ఉల్లాసం వూపేస్తుండగా, నడవలేనివాళ్ళకి చేయందిస్తూ,

మూడు పిల్లవాగుల్ని దాటి పెద్దవాగు చేరాం.వావ్‌! నున్నగా వున్న గులకరాళ్ళ మీద ఉరవడిగా ప్రవహిస్తోంది

పెద్దవాగు. అందరం ఒక్కసారిగా వాగులోకి దూకేసాం.పెద్దవాగులో మేమంతా చిన్నపిల్లలమైపోయాం.నేనైతే

వాగుని వాటేసుకుని నానా విన్యాసాలూ చేసాను. ఒకళ్ళమీద ఒకళ్ళం నీళ్ళు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ

నీళ్ళల్లో బోర్లాపడుతూ, వెల్లికిలాపడుతూ అందరం నీటితుంపర్లలా తుళ్ళిపోయాం.ఆ అడవికి ఆ రోజు మేమే

మహారాణులం.ఆ చుట్టుప్రక్కల మాకు దారి చూపించి వెళ్ళిన గెస్ట్‌హౌస్‌ వర్కర్‌ అక్బర్‌ తప్ప మరేవరు కూడా

లేదక్కడ.మా తుళ్ళింతల్లో ఆ రోజు అడవి పులకించిపోయింది మా మనసుల్లోని మాలిన్యాలను పెద్దవాగు కడిగి

పారేసింది.నీళ్ళతో కలగలిసిన స్వచ్ఛమైన స్నేహాభిమానం అందరిలోను ఎగిసిపడింది.అల్లరిలో అందరం ఒకరితో

ఒకరం పోటీపడ్డాం.వయస్సుతో సంబంధం లేకుండా అందరం హాయిగా రిలాక్సయిన సందర్భమది.పెద్దవాగు

బిగికౌగిలిని విడిపించుకోవడం ఎంత కష్టమైందో! వదలలేక వదలలేక వెనుతిరిగి చూస్తూ, దిగులుపడుతూ

గెస్ట్‌హౌస్‌ వేపు అడుగులేసాం.ఆ చల్లటి ఉదయంవేళ తడిబట్టలతో తడబాటు లేకుండా నడుచుకుంటూ గెస్ట్‌హౌస్‌కు

రాగానే ప్రసాద్‌ వేడివేడి ఇడ్లీలు, గారెలతో అల్పాహారం అందించాడు.
త్వరత్వరగా తయరైపోయి, గ్రూప్‌ ఫోటోలకు ఫోజులిస్తూ, అక్కడి బిల్లులన్నీ చెల్లించేసి బస్సులో

పడ్డాం.మధురాను భావాన్ని అందించిన మామండూరు అటవీ అతిథిగృహానికి, అక్కడి సిబ్బందికి వీడ్కోలు చెప్పి

తలకోన వేపు సాగిపోయాం.మామండూరు నుంచి తలకోన సుమారు రెండు గంటల ప్రయాణం. తిరుపతి

మీదుగా వెళ్ళాలి. ఈ లోపున విష్ణు ఓ సమాచారం చేరవేసింది.విష్ణు సహచరుడు ఉమామహేశ్వరరావు

ఆంధ్రజ్యోతి తిరు పతి ఎడిషన్‌కి
ఇన్‌చార్జిగా వున్నాడు. కొంతమంది రచయిత్రులు ఇంటర్వ్యూలు తీసుకోవాలను కుంటున్నాడని చెబుతూ వాళ్ళ

పేర్లు చెప్పి,తిరుపతిలో వాళ్ళ ఫోటోగ్రాఫర్‌ వచ్చి ఫోటోలు తీస్తాడని ఉమ ఇంటర్వ్యూలు తీసుకుంటాడని

చెప్పింది.తిరుపతికి రాగానే కొంతమంది ఇంటర్వ్యూలు తీసుకున్నారు.ఉమకి థాంక్స్‌ చెప్పి మా ప్రయాణం

కొనసాగించాం.తిరుపతి దాటి కొన్ని గ్రామాలు దాటాక బస్సు అడవిలో ప్రవేశించి ఘాట్‌రోడ్డు ఎక్కసాగింది.చుట్టూ

కొండలు, లోయలు, కొండలమీద జలపాతాలు, మళ్ళీ గ్రామాలు,చెరుకుతోటలు.నాకో చిలిపి ఆలోచనొచ్చి బస్సు

ఆపమన్నాను.బస్సు ఆగగానే చెరుకుతోటల్లోకి చొరబడి చెరుకుగడలు లాగుతుంటే డ్రైవరు, కండక్టర్‌ కూడా

దిగొచ్చారు.నేను చెరుకుగడలు దొంగతనం చేస్తున్న దృశ్యాన్ని ఫోటోలు తీసామని విరిజ తర్వాత

చెప్పింది.ముగ్గురం కలిసి బోలెడన్ని చెరుకుగడల్ని విరుచుకొచ్చి బస్సులో పడేసాం.తర్వాతేం చేసామో

రాయక్కర్లేదనుకుంటా.దొంగతనం చేసిన చెరుకుముక్కలు మహాతీపిగా వున్నాయి.మొదటిసారి చెరుకుముక్కలు

తింటున్నామని ప్రకటించిన వాళ్ళని నేను వింతగా చూసాను.నేను చెరుకుల్ని బస్‌రాడ్‌కేసి కొట్టి వొలుచుకు

తింటుంటే, నా పక్కనే కూర్చున్న ప్రతిమ ఆశ్చర్యపోయి, ‘నీకు భలే అయిడియా లొస్తాయబ్బా’ అంది. నా

చుట్టూ వున్న వాటిని ఉపయెగించడం,ఆ క్షణంలో జీవించడం, ప్రస్తుతాన్ని ప్రేమించడం నాకు వెన్నతో అబ్బిన

విద్య.చెరుకు ముక్కల్ని పిప్పి చేస్తుండగానే తలకోన వచ్చేసింది.టూరిజమ్‌లో పనిచేస్తున్న జయచంద్ర మాకు

స్వాగతం చెప్పాడు.మేము బుక్‌ చేసిన గెస్ట్‌హౌస్‌ మాకు కేటాయించి లంచ్‌ కూడా సిద్ధంగా వుందని

చెప్పాడు.ఆరు రూమ్స్‌లో అందరం సర్దుకున్నాం.కొందరికి అలా సర్దుకోవడం యిబ్బందిగా అన్పించినా

తప్పలేదు. ఫ్రెష్‌ అయ్యి కూర్చునేసరికి భోజనం వచ్చింది.ఆ అడవిలో రాజేశ్వరి అనే ఆమె చిన్న హోటల్‌

నడుపుతూ టూరిస్ట్‌లకు భోజనం పెడుతోంది.మాకు కూడా ఆవిడే వండిపెట్టింది. కట్టెలపొయ్యి మీద చేసిన

వేడివేడి రుచికరమైన భోజనం, ఆవిడే అడవిలోకి వెళ్ళి కట్టెలు కూడా తెచ్చుకుంటుందట. చాలా హుషారుగా

వుంది. మంచి భోజనం పెట్టింది. భోజనమయ్యాక జలపాతం చూసి రండి అన్నాడు జయచంద్ర.ఎంత

దూరముంటుంది అంటే ఒక కిలోమీటరుంటుంది అన్నాడు. అందరం ఉత్సాహంగా బయలుదేరాం. ఎందుకైనా

మంచిదని పెద్దవాళ్ళని ఆటోలో పంపించేసి మేము నడక మొదలుపెట్టాం. నడుస్తున్నాం. నడుస్తున్నాం.

జలపాతం ఆనవాలు కూడా కానరాలేదు.కొంతదూరం నడిచేసరికి భార్గవీ రావు వాళ్ళు కూడా అక్కడే

వున్నారు.మాకోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.అక్కడినుండి మా కష్టాలు మొదలయ్యాయి.కొండలు

గుట్టలెక్కుతూ ఆయాసపడటం ఒకవేపు ఇంకోవేపు భయంకరమైన కోతుల దాడులు.ఇలా వుంటుందని

తెలియదు.మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేదు. పెద్దవాళ్ళు చాలా ఇబ్బందిపడ్డారు.ఎంత నడిచినా జలపాతం

సవ్వడి తప్ప కంటికి కానరాదు.ఓ కర్ర తీసుకుని కోతులతో యుద్ధం చేస్తూ నేను ముందుకెళ్ళిపోయను.దూరంగ

ఆకాశంలోంచి దూకుతున్న జలపాతం దర్శనమిచ్చింది.గుండె లయ తప్పింది.ఎట్టకేలకు కంటబడింది కదా అని

ఉత్సాహం ఉరకలేస్తుంటే గబగబా నడవబోయి రెండుసార్లు ఆ కొండల మీద పడబోయి తప్పించుకుని అతికష్టం

మీద జలపాతాన్ని వాటేసుకోగలిగాను.ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.కాలుజర్రున జారుతోంది.కింద

పడ్డామంటే తల రెండు చెక్కలవుతుంది.భయంకరంగా పాచిపట్టి వుంది.కాలు జారిందంటే లోయలో పడిపోతాం

అంత ప్రమాదకరంగా వుందక్కడ. నేను అక్కడినుండి బయటపడి అక్కడికి రావద్దని మిగిలినవాళ్ళకి కేకేసి

చెప్పాను. కొంతమంది జలపాతం సమీపానికి కూడా రాలేదింకా. ఐదు గంటలలోపు అడవిలోంచి

బయటపడాలని గేటు దగ్గర చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది. టైమ్‌ చూస్తే నాలుగున్నర. చాలా టెన్షన్‌తో నేను

తిరిగివస్తుంటే ఆ కొండలెక్కడానికి ప్రయత్నిస్తూ ప్రతిమ ఇంకా కొంతమంది కన్పించారు. అక్కడంతా చాలా

ప్రమాదకరంగా వుందని ఇలా హడావుడిగా వెళ్ళలేమని, మనకంత టైమ్‌ లేదని చెప్పగానే అందరూ

తిరుగుముఖం పట్టారు. జలపాతాన్ని చూడ్డం తప్ప ముట్టుకోలేక పోయినవాళ్ళు సమీపానికి వెళ్ళలేకపోయిన

వాళ్ళు చాలా డిసప్పాయింట్‌ అయ్యారు. ఇంత శ్రమపడి నడిచి జలపాతస్నానం చెయ్యలేకపోయామే అని

చాలామంది బాధపడ్డారు. జలపాత స్నానం చెయ్యగలిగిన నేను వాళ్ళని రావద్దని ఆపి తప్పు చేసానా అని చాలా

మథనపడ్డాను కానీ అక్కడి రిస్క్‌ని కళ్ళారా చూసాను కాబట్టే చెప్పగలిగాను. అంతేకాదు చీకటిపడితే ఆ అడవిని

ఎలా దాటాలా అనే ఆందోళన. వెనక్కి తిరిగి నడవాల్సిన దరం నన్ను కలవరపెట్టింది. అప్పటికే రెండుసార్లు పడి

కాలికి దెబ్బలు కూడా తగిలించుకున్నాను.
ముందుకెళ్ళిపోయిన నాకు వెనక జరిగిన ఓ సంఘటన గురించి తిరిగొచ్చాకే తెలిసింది. పంతం సుజాత

హేండ్‌బేగ్ను కోతులెత్తికెళ్ళిపోయాయని, బేగ్ జిప్‌ తీసివుండడం వల్ల వస్తువుల్ని విరజిమ్ము కుంటూ కోతులు

పారిపోయాయని, అక్కడున్న ఓ వ్యక్తి అమాంతం లోయలోకి దూకి కొన్ని వస్తువుల్ని, సెల్‌ఫోన్‌ తెచ్చిచ్చాడని

చెప్పారు. మేము వచ్చేసరికి అతను, మా బస్సు కండక్టరు రెండోసారి లోయలోకి దిగారని చెబుతూ వాళ్ళకోసం

ఎదురుచూస్తున్నారు. లోయలోకి దిగిన వ్యక్తి భార్య లావణ్య తడిబట్టలతో చలికి గడగడలాడుతూ, ఆందోళనగా

లోయలోకి చూస్తోంది. పైకి రమ్మని మేము గట్టిగా పిలవసాగాం. ఎంతసేపు పిలిచినా వాళ్ళు రావడం లేదు.

అందరిలో ఆందోళన పెరిగింది. లావణ్య ముఖం చూస్తే పాపమన్పించింది. ముందువెనకా చూసుకోకుండా

లోయలోకి దూకిన ఆ అపరిచిత వ్యక్తి పట్ల గౌరవం పొంగుకొచ్చింది. మేం అరవగా అరవగా వాళ్ళిద్దరూ కొంత

డబ్బు చేతపట్టుకుని పైకి వచ్చారు. అతన్ని చూస్తే ఆశ్చర్యమేసింది. కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, తడి

నిక్కరుతో అలాగే దూకేసాడు. అందరం అతనికి థాంక్స్‌ చెప్పాం. ఫోటోలు తీసుకున్నాం. మీ గురించి

భూమికలో రాస్తామని వాగ్దానం చేసాం. మానవత్వాన్ని వెదజల్లిన అతనిపట్ల అందరికీ ఎంతో గౌరవం కలిగింది.
తిరుగు ప్రయాణంలో బాగా అలిసిపోయి చీకటి పడకముందే గెస్ట్‌హౌస్‌కి తిరిగొచ్చాం. అందరికీ ఆకలి. దాహంతో

నోరు పిడచకట్టుకుపోయింది. రాజేశ్వరి వేడివేడి వడలు, టీ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంది.

అంత అందమైన ప్రాంతాన్ని ఏ మాత్రం అభివృద్ధి చెయ్యకుండా అనాధలా వదిలేసిన అధికారుల మీద పీకలోతు

కోపమొచ్చింది. ఖచ్చితంగా ఎంత దూరముంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా రౌడీల్లా

ప్రవర్తించిన కోతిమూక నించి ఎలా రక్షణ పొందాలి లాంటి సమాచారమేదీ లేకుండా, కనీసం మంచినీళ్ళు కూడా

దొరక్కుండా అన్యాయమన్పించింది. అంత ఎత్తునుంచి దూకుతున్న జలపాతం కింద ఆ పాచి ఏమిటో, దానిని

ప్రక్షాళనం చేసే ప్రయత్నాలు ఎందుకు చెయ్యరో వాళ్ళకే తెలియలి. జలపాతం దగ్గరగా వెళ్ళడానికి ఆ రాళ్ళ

దారిని కొంచెం బాగు చెయ్యొచ్చు. జర్రున జారుతున్న పాకుడును తొలగించే చర్యలు తీసుకోవచ్చు. ఈ

మాటని జయచంద్రకి చెప్పాం. తలకోన జలపాతం ఊరించి ఊరించి చాలామందికి అందకుండానే

మిగిలిపోయింది. గెస్ట్‌హౌస్‌ నుంచి జలపాతానికి వెళ్ళేదారినంతా కంచెతో మూసేస్తే కోతుల బెడద తప్పుతుంది.

అలాగే జల పాతం దగ్గరగా వెళ్ళడానికి చిన్న చిన్న వంతెనలు కడితే ఎంతో ఉపయెగంగా వుంటుంది. అంత

ఎత్తు నుంచి దూకుతున్న అద్భుత జలపాతం కింద స్నానం చెయ్యలని ఎవరికుండదు? కోతులతో వేగలేక,

తీసుకెళ్ళిన బ్యాగుల్ని కాపాడుకోలేక విసిగి పోవడంతోనే సరిపోతే దట్టమైన అడవిలో, ఎత్తైన కొండల మీంచి

దూకుతున్న జలపాతాన్ని గుండెల్లోకి ఒంపుకోవడం ఎలా?
సరే అలిసిపోయి గెస్ట్‌హౌస్‌కి వచ్చేక, వేడివేడి మసాలా వడలు పొగలు కక్కే టీ తాగాక కొంచెం స్థిమిత

పడ్డారందరూ. జానకీ బాలగారు పాటలందు కున్నారు. అందరం ఆవిడ చుట్టూ చేరాం. క్రమంగా చీకటి

అలుముకుంటోంది. చలి విపరీతంగా పెరిగింది. అడివంతా నిశ్శబ్దంగా వుంది.
అందరూ రూమ్‌ల్లో చేరి పోయరు.ఎనిమిదిన్నర కి రాజేశ్వరి భోజనం పంపించింది. బయట చలిగా వుండటంతో

లోపలే భోజనాలు ముగించి అందరం ఒక రూమ్‌లో చేరాం.పంతం సుజాత ముంగిట్లో మువ్వలశబ్ధం నవల

ఆవిష్కరించాలి.హిందీ అనువాద సంకలనాల గురించి, భూమిక గురించి చర్చించాలి. మొదట సుజాత నవల

ఆవిష్కరణ జరిగింది.రచయిత్రుల కథల్ని, కవితల్ని ఒంటిచేత్తో హిందీలోకి అనువాదం చేసిన శాంతసుందరిపట్ల

గౌరవసూచకంగా పుస్తకావిష్కరణను ఆవిడ చేత చేయించాం.సుజాత మాట్లాడుతూ ఇంతమంది గొప్ప

రచయిత్రుల మధ్య తన నవల ఆవిష్కరించబడటం తనకెంతో ఆనందంగా వుందని, ఈ నవల అమ్మకాల వల్ల

వచ్చే డబ్బంతా భూమికకు చెందాలని తాను కోరుకుంటున్నాని అందరి చప్పట్ల మధ్య ప్రకటించారు.
అప్పటికప్పుడు చాలామంది నవలను కొని ఆ డబ్బును ‘భూమిక’కు విరాళంగా ఇచ్చేసారు. భూమికలాంటి

పత్రికను కాపాడుకోవటానికి ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చెయ్యలని, అందుకు నాంది పలికిన సుజాత

అభినందనీయురాలని అన్నారంతా. ఆ తర్వాత సత్యవతి మాట్లాడుతూ హిందీ అనువాద సంకలనం ఈ ట్రిప్‌లో

ఎందుకు ఆవిష్కరించబడలేదో కారణం చెబుతూ ఢిల్లీలోని అతిపెద్ద పబ్లిషింగు హౌస్‌ రాజ్‌కమల్‌ వాళ్ళు మన

స్క్రిప్ట్‌ని అడిగారని, వారు ప్రచురిస్తే డిస్ట్రిబ్యషన్‌ సులువౌతుందని, దేశమంతా మన పుస్తకం వెళుతుందని,

అయితే మనం కొంతకాలం వేచి వుండాల్సి వస్తుందని చెప్పింది. ఆ తర్వాత ఆంగ్ల, తమిళ అనువాదాల గురించి

చర్చ జరిగింది. ఆంగ్ల అనువాదాల బాధ్యత పి. సత్యవతి స్వీకరించారు. శ్రీపాద స్వాతి ఇప్పటికే కొన్ని

అనువాదాలు చేసారని ఇంకా ఎవరినైనా అనువాదకులను సంప్రదించాలని అందర తీర్మానించారు.
సీరియస్‌గా చర్చ జరుగుతున్నపుడే నేను, విష్ణు బయటకెళ్ళొచ్చి చాలా నిరాశ పడ్డాం. మా నిరాశకు కారణం

వుంది. ఆ రోజు పౌర్ణమి. బయట తిరగాలంటే చాలా చలిగా వుంది. క్యాంప్‌ ఫైర్‌ వెలిగించి అందరిని ఆశ్చర్య

పరచాలని మా ఇద్దరి ప్లాన్‌. తొమ్మిదైనా కట్టెలు తెస్తానన్న ఆటో డ్రైవర్‌ అయిపులేడు. మేమిద్దరం లోపలికి

బయటకి కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్నాం.కానీ ఆటో మనిషి రాలేదు. (ఈ ఆటోలోనే భార్గవీరావు, అత్తలూరి

విజయలక్ష్మి, రేణుక అయోల తిరుమలకి వెళ్ళాలని బయలుదేరి వెళ్ళారు. వాళ్ళను బస్టాప్‌లో దింపేసి తిరిగి

వచ్చేటపుడు అడవిలోంచి కట్టెలు తెస్తానని చెప్పి వెళ్ళిన మనిషి ఉదయనికి గానీ కనబడలేదు. ఉదయం

అడిగితే చెప్పాడు మేడమ్‌ వాళ్ళకి బస్సు దొరకలేదు. తిరుపతి దాకా ఆటోలోనే తీసుకెళ్ళిపోయాను అని. అదీ

సంగతి.) నేను విష్ణు అడివంతా తిరిగినా ఓ ఎండుకట్టెముక్కని సంపాదించలేకపోయం. వాచ్‌మెన్‌ని

పిలుచుకొచ్చి అక్కడేదో కంపలాంటిది వుంటే అది వెలిగించే ప్రయత్నం చేసాం. అతను ప్లాస్టిక్‌ గ్లాసుతీసి

వెల్గించబోయడు. గ్లాసు బుస్సున కాలిపోయింది కాని కంప అంటుకోనేలేదు. మంచు కురుస్తోంది. అతిచల్లగా

వుంది. ఇంక మంట వెయ్యలేం అనుకుని విషాదంగా లోపలికొచ్చేసాం. ఈ మాట చెప్పగానే అయ్యె! కోతుల్ని

తోలిన కట్టెల్ని తెచ్చినా సరిపోను కదా అన్నారంతా. కాసేపు వెన్నెల్లో తిరిగి గడగడలాడుతూ లోపలికొచ్చేశాం.

అలా తలకోనలో నీళ్ళెంత నిరాశ కల్గించాయె నిప్పుకూడా అంతే విషాదం మిగిల్చింది. ఎవరి రూమ్‌ల్లో వాళ్ళు

చేరి దుప్పట్లలో దూరి నిద్రకుపక్రమించారందరూ.మర్నాడు ఉదయం తయారైపోయి, బిల్లులు చెల్లించేసి అల్పాహారం కోసం రాజేశ్వరి హోటల్‌ మీద దాడిచేసాం. ఆరుబయట, చలిలో, కణకణ మండుతున్న కట్టెలపొయ్యి మీద రాజేశ్వరి, ఆమె కూతురు వేడివేడిగా ఇడ్లీలు, దోశెలు అందిస్తుంటే, ఆ చలిలో పొయ్యి వెచ్చదనాన్ని అనుభవిస్తూ హాయిగా ఆరగించాం. రాజేశ్వరి చురుకైన చేతుల కదలికలు చూడముచ్చటగా వున్నాయి. ఆ చేతుల కదలికల్లోంచి పుట్టుకొస్తున్న దోశలు, ఇడ్లీలు ఎంతో రుచిగా వున్నాయి. కట్టెలపొయ్యి కమురు వాసన ఎంత కమ్మగా వుందో! వేడివేడిగా కావలసినవి లాగించేసి, మళ్ళీ ఓ కప్పు కాఫీ కడుపులో పోసి అందరం బస్సెక్కేం. అక్కడికి అతిదగ్గరలోనే వున్న అటవీ అతిథిగృహం వేపు మా బస్సు బయలుదేరింది. అక్కడ ఓ అద్భుతం మా కోసం ఎదురుచస్తోందని చాలామందికి తెలియదు. ఆకాశాన్నంటుతున్న మహావృక్షాలని కలుపుతూ ఓ అరకిలోమీటర్‌ మేర అల్లిన వంతెన. మార్వలెస్‌, మహాద్భుతం. దానికి తరుల మీద నడక అని పేరు పెట్టారక్కడ. అందరం ఎంత ఉత్తేజితులమయ్యామంటే ఆహా! ఓహో! వండర్‌ఫుల్‌, అద్భుతం లాంటి పదాలనక్కడ వెదజల్లుకుంటూ తరుణీమణులందరం తరులమీద నడక మొదలుపెట్టాం. నాకయితే కాళ్ళు నేలమీద నిలవడం లేదు. నృత్యం రాకపోయినా నా కాళ్ళు నర్తిస్తూనే వున్నాయి. మా శరీరాల విన్యాసాలకి వంతెన అటూ ఇటూ ఊగుతూ మా ఉత్సాహంలో తనూ భాగమైంది. ఎగురుకుంటూ, పాడుకుంటూ వంతెన దాటేసాం. అక్కడ పెద్దపెద్ద తమ్మకాయలు తీగలకి వేలాడుతూ కంటబడ్డాయి. ఎండిన తమ్మకాయ గింజలు పేపర్‌ వెయిట్లంత పెద్దగా వుంటాయి. ఇంతకు ముందు వాటిని చూసి వుండడం వల్ల నేను పొదల్లోకి దూరిపోయి దొసిళ్ళనిండా గింజలేరు కొచ్చాను. శంఖాలనేరినపుడు అందరూ ఏమన్నారో మళ్ళీ అదే ప్రశ్న ఇక్కడ కూడా వేసారు. మాకు ఒక్క గింజ కూడా దొరకలేదు. నీకెలా దొరికాయంటే నా సమాధానం మళ్ళీ అదే. భూమిక నాగమణికి పెద్ద తమ్మకాయ దొరికింది. దాన్ని అతికష్టం మీద విరిచి మాతో తెచ్చుకున్నాం. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి పాక్కుంటూపోతున్న తీగలు వివిధాకృతుల్లో కనువిందు చేసాయి. అలాంటి తీగె ఒకటి ఉయ్యలలాగా వేలాడుతుంటే పిల్లల్లాగా పోటీపడి మరీ ఫోటోలు తీయించుకున్నాం. తరుల మీద నడక కల్గించిన ఉల్లాసాన్ని మనసులో నింపుకుని మళ్ళీ బస్సులో చేరి తిరుపతి వైపు ప్రయాణమయ్యాం. కొంతదూరం వచ్చేసరికి రోడ్లపక్క రేగుచెట్లు రారమ్మని పిలవసాగాయి. నాకు చంబల్‌ లోయలో రేగుపళ్ళ కోసం ఎ.పి. ఎక్స్‌ప్రెస్‌ దిగేసిన సంఘటన గుర్తొచ్చి గమ్మత్తైన హాయి నిండింది. అంతే బస్సాగింది. రేగుచెట్ల మీద పడ్డాం గానీ కాయలింకా తయారవ్వలేదు. సరే ఎలాగూ దిగాం కదా! కాసేపు అడవిలో నడుద్దామనుకుని, బస్సుని వెనకరమ్మని నడక మొదలెట్టాం. మధ్యలో చిన్నవాగులాంటిది కన్పిస్తే విష్ణు నేను ఆ వాగులోకి దిగి కాసేపు నీళ్ళతో ఆడాం. ఆ తర్వాత ఎర్రటి ఎండలో నడుస్తూ వెళ్ళి కళ్యాణి డాం చూసాం. కొంతమంది మేము రామని బస్సులోనే ఉండిపోయారు. పచ్చటిచెట్లు, కొండల మధ్య కళ్యాణి డాం వుంది. ఆ తర్వాత చంద్రగిరికోట, మ్యూజియమ్‌ చూసాం. లంచ్‌టైమ్‌ అవుతుండగా కోటనించి బయలుదేరాం.
తిరుపతిలో అదే సమయంలో సాహిత్య బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో, మమ్మల్ని అందరిని ఆహ్వానించడంతో తిన్నగా మహతికి వెళ్ళిపోయాం. అక్కడ మృణాళిని కలిసింది. భోజనాల దగ్గర ఎవరో రచన (సమత కూతురు)ను అవమానకరంగా మాట్లాడాడని, చిన్న

గొడవ అయ్యిందని ఆ తర్వాత మాకు తెలిసింది. మేము అక్కడ కలిసిన మిత్రులతో మాట్లాడుతుండగా ఈ గొడవ జరిగింది. మేమంతా అన్నాలు తిన్నామన్పించి సమావేశస్థలానికి వెళ్ళాం. వేదిక మీద అధ్యక్షస్థానంలో మృణాళిని వుండగా ప్రసంగిస్తున్న వ్యక్తి స్త్రీలను అవమానపరిచే మాటలు చాలా మాట్లాడాడు. ఆ వివరాల్లోకి నేను వెళ్ళదలచుకోలేదు కాని నాకు చాలా కోపమొచ్చి ‘షేమ్‌షేమ్‌’ అని అరిచాను. మృణాళిని అతని ప్రసంగంలోని అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఖండిస్తుందేమోనని చూసాం కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో ఇంక సమావేశంలో కూర్చోలేక అందరం బయటకు వచ్చేసాం. మా రైలుకు టైమవుతుండడం కూడా మరో కారణం.
మూడు రోజులు మాతోనే వున్న బస్సుడ్రైవర్‌ కుమార్‌, కండక్టర్‌ మోహన్‌లకి కృతజ్ఞతలు చెప్పి టిప్‌లిచ్చి, స్టేషన్‌లోకొచ్చి పడ్డాం. ప్రతిమ అదే బస్సులో వాళ్ళూరు బయలుదేరింది. చాలామందిమి వున్నందుకు రైలెక్కినపుడు సామానులతో కొంత గందరగోళం జరిగింది. మా వెంకట్‌ స్ఠేసన్‌కొచ్చాడు. (అతనే మామండూరులో భోజన ఏర్పాట్ల కోసం, ప్రసాద్‌ని పంపించింది). మొత్తానికి మహాటెన్షన్‌ మధ్య బోగీలోకి ఎక్కి సర్దుకున్నాక రైలు బయలు దేరింది. మేమలా కూర్చున్నామో లేదో రచన, సమతని ఎవడో ఏదో అన్నాడని అక్కడ గొడవౌతోందని ఎవరో వచ్చి చెప్పగానే అందరం అటు పరుగెత్తాం. రచన, సమత వేరే డోర్‌ నుండి రైలెక్కుతున్నప్పుడు ఎవడో వాళ్ళిద్దరిని తిట్టుకుంటూ ఎక్కుతూ అసభ్య పదజాలంతో తిట్టాడట. సమతని చేత్తో తోసేసాడట. రచన ఉగ్రురాలైపోయి వాడి చొక్కా పుచ్చుకుని ఈడ్చుకెళ్ళి సీటుమీద కుదేసి బాగా తగిలించిందట.మా అమ్మ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పమని వాడిని చితక్కొట్టేసరికి వాడు సారీ చెప్పాడు. ఈ గొడవయ్యక వాడు తలకి మంకీకాప్‌ తగిలించి మావేపు చూడ్డానిక్కూడా గడగడలాడాడు. ఈ సందర్భంగా రచన చూపిన తెగువ, ఆత్మవిశ్వాసం స్ఫర్తిదాయక మన్పించాయి. ఆడపిల్లంటే ఇలా వుండాలి. ఎవడైనా ఏదైనా కూస్తే కుంగిపోవడం కాక ఇలా ఎదురుతిరిగితే ఎంతటివాడైనా తోకముడవకుండా వుంటాడా అన్పించింది. హేట్సాఫ్‌ టూ ద గ్రేట్‌ రచనా! శభాష్‌ రచనా!
మధ్యాహ్నం మహతిలో తిన్నతిండి వల్ల ఎవరికీ డిన్నర్‌ తినే మూడ్‌ లేకుండా పోయింది. ఓ అమ్మాయి రంగుల రంగుల పూసలదండలు అమ్మకానికి తెస్తే, అందరం వాటిని చూస్తూ గిఫ్ట్‌లుగా ఇవ్వడానికి బావుంటాయిని కొంటుంటే ఎవరో వచ్చి భార్గవీరావుకి బాగోలేదని వాంతి చేసుకుంటున్నారని చెప్పగానే నేను అటు పరుగెత్తాను. ఆవిడ సింక్‌లో వాంతి చేసుకుంటూ కనబడ్డారు. ఆవిడ కూర్చున్న చోట అందరూ పడుకున్నట్టున్నారు. ఎవరో ఒకాయన ఆవిడ తలపట్టుకుని వున్నారు. నేను వెంటనే ఆయనకి థాంక్స్‌ చెప్పి భార్గవిని పట్టుకుని నిలబడ్డాను. మధ్యాహ్నం తిన్న అన్నం అరిగిలేనట్టుంది. ఆవిడకి సహాయం చేసి, చీర మార్చి వేరే సీటుమీద కూర్చోబెట్టాను. జరిగిందానికి ఆవిడ చాలా సిగ్గుపడి పోయరు. లేచివద్దామని ప్రయత్నించాను. ఆగలేదు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అరే ఫర్వాలేదండి. మనలో మనకేంటి మాకు బాగోపోతే మీరు చెయ్యరా అని ఆవిడను సముదాయించి పడుకోబెట్టేం. టాబ్లెట్‌ వేసుకుని ఆవిడ పడుకున్నారు. కంపార్ట్‌మెంట్‌ను ఎలా శుభ్రం చెయ్యలా అని పరిపరి విధాలా ఆలోచించాను. ఏదైనా బట్టగాని, చిన్న చీపురుగాని దొరికితే బావుండని వెతికాను గాని రైల్లో అవన్నీ ఎక్కడ దొరుకుతాయి. భార్గవి గారి చీరంతా ఎలాగ వాంతయ్యింది. దానినే ఉపయెగిస్తే సరనుకుని దాంతో శుభ్రం చెయ్యసాగాను. ఎవరో పేపర్లు తెచ్చిచ్చారు. వాటన్నింటిని ఉపయెగించి ఆ ప్రాంతమంతా శుభ్రం చేసేసాను. పియర్స్‌ సబ్బుని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళు చల్లేసి వాసన లేకుండా చెయ్యగలిగాను. నా చీరంతా పాడయింది. రెల్వే బాత్‌రమ్‌లో స్నానం చేసి అందరూ అటుఇటు తిరుగుతుండగానే చీర మార్చుకున్నాను. ఇదంతా రాయడం వెనక నా ఉద్దేశ్యం ఒక్కటే. ఇలాంటి ఎమర్జెన్సీలు ఎదురైనపుడు ఎలా ప్రవర్తించొచ్చో చెప్పడానికే. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను సగర్వంగా ప్రకటించదలిచాను. ఈ సంఘటన నామీద నాకు గొప్ప గౌరవాన్ని పెంపొందింపచేసింది. మాటల్లో చెప్పడం కాక చేతల్లో, సమయస్ఫూర్తితో మెలగడం ఎలాగో నేను గొప్ప పాఠం నేర్చుకున్నాను. నా ఆత్మగౌరవం ఆకాశమంత ఎత్తుకి ఎదగడానికి దోహదం చేసిన ఈ సంఘటనని అందుకే మీతో పంచుకోవాలనుకున్నాను. ఒక గ్రూప్‌గా మనం ప్రయాణం చేస్తున్నపుడు మనలో ఎవరికి ఏం జరిగినా, ఏ అవాంతరం వచ్చి పడినా వాళ్ళని గుండెకు హత్తుకోవడం మన కనీస బాధ్యతగా భావించి తీరాలి. మనలోని కొన్ని ప్రత్యేక కోణాలు బయటపడటానికి ఇలాంటి ప్రత్యేక సంఘటనలు దోహదం చేస్తాయి. నేను ఇలాంటి పనిచెయ్యగలనని ఇంతకు ముందు అనుకుని వుండను. కాని నేను ఏమైనా చెయ్యగలను అనే ఎరుకను, స్పృహను ఈ సంఘటన కల్గించింది. నన్ను నేను మనఃపూర్తిగా అభినందించుకున్న సందర్భమది.
ఆ తర్వాత కొంతసేపు పాటల కార్యక్రమం నడిచింది. నిదరొచ్చేవరకు పాటలు పాడి, ఆ తర్వాత అందర నిద్రకుపక్రమించారు. ఏడింటికి సికింద్రాబాద్‌ చేరుతుందని టి.సి చెప్పిన మాటలు అబద్ధ్దమని తేలుస్తూ ఐదున్నరకే రైలు సికింద్రాబాద్‌ వచ్చేసింది. హడావుడిగా దిగేసి ఎవరి ఇళ్ళకు వాళ్ళం ప్రయాణమైపోయం. మూడు రోజుల పాటు ఎన్నో అనుభవాలను మూటగట్టుకుని చలికి ఒణుకుతూ నేనూ మా ఇంటికి బయలుదేరాను.
ఆటోలో కూర్చుని ప్రయాణం చేస్తున్నపుడు ఈ ట్రిప్‌ని ఆర్గనైజ్‌ చేయడంలో నెలరోజులుగా ఎంత శ్రమపడిందీ ఒకటొకటే గుర్తొచ్చాయి. ప్రతిమతో జరిగిన సంభాషణలూ, అంతకు ముందు నేను నాయుడు వెళ్ళి రావడం, అన్నీ సక్రమంగా జరగడం కోసం పడిన ఆదుర్దా, మేము రైలు దిగేటప్పటికి బస్సును సిద్ధంగా ఉంచడం కోసం ప్రతిమ ఎంత కష్టపడిందీ నాకు తెలుసు. మేమంతమందిమీ వాళ్ళింటికి వెళ్ళినపుడు మాకు స్నానాల ఏర్పాట్లు, భోజనాల వడ్డింపుల్లో తనెంత హైరానా పడివుంటుందో నాకు తెలుసు. పులికాట్‌ దగ్గర పడవలు మాట్లాడ్డం దగ్గర నుంచి తన శ్రమ ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. ఇంకా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కల్గిందేమోనని చింతపడడం నాకు తెలుసు. అలాగే విష్ణు. మామండూర్‌, తలకోన గెస్ట్‌హౌస్‌లు బుక్‌చేయడంలో తను తీసుకున్న శ్రద్ధ నాకు తెలుసు. తలకోనలో తను చేసిన భోజన ఏర్పాట్లు అద్భుతం. జయచంద్ర ద్వారా తనీ ఏర్పాటు చేసింది. ఇక మామండూర్లో మా మరిది వెంకట్‌ ప్రసాద్‌ని మాట్లాడి పెట్టాడు. లేకపోతే ఆ అడవిలో అన్నం దొరకడం చాలా కష్టం. తరుల మీద నడక సన్నివేశరూపకర్త కూడా విష్ణునే. తూపిలిపాలెం బీచ్‌ దగ్గర అల్పాహారం ఏర్పాటుచేసింది సుహాసిని. ఇక భూమిక పిల్లలు అందరికి తలలో నాల్కల్లా సేవ చేసారు. చాలా శ్రమపడ్డారు.నాగమణి, భువనవిరజ, సుమలత సహకారం లేకపోతే ఈ ట్రిప్‌ ఇంత సక్సెస్‌ కాదు.
భూమిక రెండోసారి ఆర్గనైజ్‌ చేసిన ట్రిప్‌ కూడా సూపర్‌ సక్సెస్‌ అవ్వడంలో ముఖ్యపాత్రలు పోషించినవాళ్ళు ప్రతిమ, విష్ణు. మా భూమిక టీమ్‌. అలాగే ట్రిప్‌కి రాకపోయినా తెర వెనక ప్రసన్న కృషి వీళ్ళందరి సహకారాన్ని చవగ్గా కొట్టేసి మిలటరీ డిసిప్లిన్‌తో స్వర్ణముఖి నుండి తలకోన వరకు రచయిత్రుల కేంప్‌ని మర్చిపోలేని మధురానుభావంగా మలిచాను నేను అంతే….

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

7 Responses to ఆకుపచ్చ లోయల్లో, ఆనందపు హేలల్లో ఉద్విగ్నంగా, ఉత్సాహంగా సాగిన రచయిత్రుల సాహితీ యాత్ర

  1. కొన్నిఫొటొలు మాకూ చూపెడితె బాగుండెది కదా.

  2. Rakesh says:

    “తమిళ సోదరులు చేరడంతో వారి తమిళ గలగలలతో డబ్బాలో గులక రాళ్ళేసిన
    శబ్దాలు కంపార్ట్‌ మెంటంతా నిండాయి”

    మన భాషపైన మనకెంత ప్రేమ ఉన్నా “మరొక దక్షిణదేశపు భాష” ను గురించి ఇట్ల రాసుడు కరెక్టేనా?

  3. Rakesh says:

    చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు రాశారు.
    ఈ నాటి కాలంలో event management అన్నది ఒక organised profession గా మారి, దానిలో ఎలా రాణించాలో తెలియజేస్తూ శిక్షణా సంస్థలు సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. (Mega functions, expositions, trade-fairs and even grand marriges too..)

    ఎంతటి శిక్షణ పొందినవారైనా తాము చేసున్న పనిలో (ముఖ్యంగా ఇటువంటి organising skills విషయాల్లో) అంకితభావం కలిగి ఉంటే ఇంకా బాగా చేయగలరనీ, తద్వారా కలిగే మానసిక సంతృప్తి, అప్పటి వరకూ పడ్డ శ్రమనూ, హైరానాను మరిపించగలదనీ నిరూపించారు – మీరు… మీ team!!
    Hats – off!!!

  4. John Hyde says:

    సుందర దృశ్యంలా అనిపించింది.
    సాహితీయాత్ర అన్నారు కాని సాహిత్యవిషయాల ప్రస్తావన కంటే అనుభూతభూను, సమయంతో జతకలిపి వ్యాసం నడిపించారనిపించింది.
    పేర్లు తప్ప ముఖాలు తెలియని వారిని చూడటనికి, మేము చూడని దృశ్యాలను చూడటం కోసం ఫోటోలు జతచేసివుంటే బాగుండేదనిపించింది.

    ఏమైనా బృందానికి అభినందనలు

    జాన్ హైడ్ కనుమూరి

  5. జాన్ హైడ్ కనుమూరి గారూ
    ధన్యవాదాలు.మీరు మా ట్రిప్ ఫోటో లు చూడాలనుకుంటే దయచేసి నా బ్లాగు దర్శించండి.
    డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.మాగోదావరి.బ్లాగ్ స్పాట్.కామ్ లో ఫోటో లున్నాయి చూడండి.భూమిక వెబ్ సైట్ లో ఫోటో లు పెట్టడమ్ నాకు చేత కావడమ్ లేదు.ఎవరైనా సహాయమ్ చేయండి.
    సత్యవతి కొండవీటి

  6. రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:

    మీ యాత్రా విశేషాలు చదువుతుంటే నా చిన్నప్పడు మాఅమ్మావాళ్ళు వెళ్ళిన విహారయత్ర ఒకటి గుర్తొచ్చింది.కాకపోతే వాళ్ళు రచయిత్రులూ కాదు,కనీసం పాఠకులూ కాదు.కొన్ని నెలల పాటు విన్నా ఆ కబుర్లు విసుగుపుట్టలేదు. నది మాస పత్రికతో పాటు ఇంకెక్కడో కూడా మీ నెల్లూరు ప్రాంత పర్యటనా వివరాలు చదివాను.మీ బృందసభ్యులచేత వారివారి దృక్కోణాలనుంచి ఆ యాత్రవిశేషాలతో భూమిక ప్రత్యేక సంచిక తెచ్చేందుకు వీలుందేమో పరిశీలించగలరు.అలాగే భూమిక డైరీ వైజాగులో ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?
    అభివాదాలతో
    రాజేంద్ర కుమార్ దేవరపల్లి
    http://visakhateeraana.blogspot.com/
    http://charchaavedika.blogspot.com/
    http://pichukalu.blogspot.com/

  7. sujatha says:

    chakla manchi anubhuti niccindi
    sujatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.