మరాఠీ మూలం : హీరా బన్సోడే
తెలుగు : డా. దేవరాజు మహారాజు
నేను సూర్యోదయాల్ని తీసుకుని,
అంధకార ప్రదేశాల్లోకి ప్రవేశిస్తున్నాను.
దారిలోని ప్రతి మలుపులో
అవమానభారంతో తలలొంచుకుని
సూర్యాస్తమయాలు నిలబడి ఉన్నాయి.
వాటి శరణార్థి ఆశలు
శతాబ్దాలకు ముందే నిష్క్రమించాయి
వాటి జీవన ఆనందోత్సవాలు
ఎప్పుడో బహిష్కరించబడ్డాయి
మిత్రులారా!
మీ కళ్ళలోని ఎడారుల్ని తుడిచెయ్యండి
మీ ముఖం మీది భయంకర అంధకారాల్ని కడిగేయండి
నేను మీకోసమే కొత్త ఆశల గర్భిణీ మొగ్గల్ని తెచ్చాను
అంధకారాల్ని ప్రజ్వలింపజేసే
కొత్తదివ్వెల హారాల్ని తెచ్చాను
యుగయుగాల నాటి మీ శాపాల్ని
నా తుపాను అడుగులతో తొక్కేశాను
మీ ఊపిరులకు స్వేచ్ఛ నివ్వడానికి
అల్లకల్లోలం చేసేశాను
ఓ రాజహంసలారా!
తేజోభరితమైన మీ స్వరపాల్ని గుర్తించు కోండి
పరాక్రమంతో సాధించుకున్న
మీ విజయల్ని చాటండి.
నా ప్రియమైన మిత్రులారా!
నేను మీ కోసమే
సూర్యోదయల్ని తెచ్చాను
మీరు వెలుగులు నింపుకోవడానికి!
మీరే వెలుగై పొంగడానికి!!