రోజూలాగే ఆ రోజు హెల్ప్‌లైన్ ఫోన్ రింగ్ అయింది. ఒకాయన తాను ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల పల్లె నుంచి ఫోన్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన బిడ్డపై అత్యాచారం జరిగిందని చెప్పాడు. దసరా సెలవులకు క్రిష్ణా జిల్లాలోని ఒక హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన తన 14సంవత్సరాల కూతురు ఇంట్లో ఫ్యాన్ లేకపోవడంతో పక్కింటికెళ్ళి పడుకునేది. వాళ్ళ 33 సంవత్సరాల కొడుకు తన కూతురుని సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్ళి అఘాయిత్యం చేశాడు అని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారా! అని అడిగితే లేదన్నాడు. రెండ్రోజుల నుండి ఎందుకు ఫిర్యాదు చేయకుండా ఆగారు అని ప్రశ్నిస్తే ”తాము ఎరుకల కులానికి చెందిన పేదవాళ్ళమనీ వలసవచ్చి రోజూ కూలిపని చేసుకు బ్రతికేవారమనీ అత్యాచారం చేసిన వ్యక్తి తాలూకా వాళ్ళు బిసిలు ఇంకా పలుకుబడి, బలగం బాగా వున్నవాళ్ళనీ వాళ్ళు ఇప్పటికి మూడు పెద్ద మనుషుల పంచాయితీలు పెట్టి తన కూతురుదే తప్పు అని తేల్చారని వాపోయాడు.
మీ అమ్మాయి కార్యక్టర్ మంచిది కాదు ఆ అమ్మాయికి ఇష్టమై అతనితో పోయిందని అంచేత కేసు గీసు ఏమీ పెట్టవద్దనీ బెదిరించారన్నాడు. పైగా పాతికవేల రూపాయలు తనచేత ఈ పంచాయితీల కోసం ఖర్చు పెట్టించార న్నాడు. అంతే కాదు ఇంకో నిర్ఘాంతపోయే విషయం కూడా చెప్పాడు. ఏమిటంటే ఈ సంఘటన జరిగిన రోజునుండి తన కూతుర్ని వాళ్ళింట్లోనే నిర్బంధించి వుంచారనీ తమతో మాట్లాడనీయట్లేదనీ పంచాయితిలో ఆ అమ్మాయి చేత ”నేను ఆ అత్యాచారం చేసిన వాడిని ప్రేమిస్తున్నాను. అతను నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు. ఇకపై నా జీవితంలో నువ్వేమీ జోక్యం చేసుకోవద్దు నీకేమీ సంబంధం లేదు” అని తండ్రి ముఖంపై చెప్పించారు. ఆయనకు ఏం చెయ్యాలో తోచలేదు. పోలీసుల దగ్గరకు పోయే ధైర్యం లేదు. ఇంతమంది పలుకుబడి, బలగం గల వాళ్ళ ముందు తనకు న్యాయం జరుగుతుందనే ఆశ లేదు.
ఆ వూర్లోనే ఎవరో తెలిసిన వాళ్ళు టివి ద్వారా భూమిక ఆడవాళ్ళకు, ఆడపిల్లలకు సమస్యల్లో సహాయం చేస్తారని విని వుండటంతో మన ఫోన్ నెంబర్ ఆయనకిచ్చారు. ఇదీ సంగతి, ఏం చెయ్యమంటారు మేడం! మీ సలహా కోసం ఫోన్ చేశాం అన్నాడు. అంతా విన్నాక అతని నిస్సహాయతకూ, వాళ్ళ అమ్మాయికి జరిగిన అన్యాయానికీ నా మనసంతా విచలితమై దిగులుగా అనిపించింది. క్షణంలో తేరుకుని అతనికి ధైర్యం చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు ఇవ్వమనీ, ఒకవేళ వాళ్లు చెప్తున్నట్లుగా 14సం||ల అమ్మాయి నా ఇష్టంతోనే అతనితో సంబంధం పెట్టుకున్నా నన్నా అది చట్ట ప్రకారం చెల్లదు. నేరం రుజువైతే అతనికి తప్పక శిక్షపడుతుందని చెప్పాము. ఏమాత్రం భయపడకుండా నాకు చెప్పిన విధంగా విషయం అంతా పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పమనీ వారు ఒక వేళ కంప్లైంట్ తీసుకోకుంటే మేము కలగజేసుకుంటాము. నువ్వేమీ భయపడొద్దు మాకు ఎప్పటికప్పుడు ఏం అవసరమొచ్చినా ఫోన్ చెయ్యమని చెప్పాము. అతను వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు కేసు రిజిష్టర్ చేసి ఆ అమ్మాయిని గవర్న మెంట్ హస్పిటల్‌కి తరలించటం, నేరస్థుడ్ని అదుపులోకి తీసుకోవడం జరిగాయని మా ఫాలోఅప్‌లో తెల్సింది. మేం అతనికి ధైర్యం చెప్పటంతో పాటు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకూ, స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళకు సమాచారాన్ని అందించి బాధితుల సపోర్టు ఇవ్వమని చెప్పాము. వారు వెంటనే కదిలారు. మరుసటి రోజు ఆ తండ్రి మాకు ఫోన్ చేసి, వున్న ఇంట్లోంచి మమ్మల్ని ఖాళీ చేయించమని ఇంటి యజమానిపై సదరు పెద్దమనుషులు ఒత్తిడి తెస్తున్నారనీ తమని ఆ వూళ్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి వాపోయాడు. ధైర్యంగా వారిని ఎదుర్కొమ్మనీ, భయపడ వద్దనీ బెదిరింపులు ఎక్కువైతే మళ్ళీ పోలీసులకు రిపోర్టు చెయ్యమని చెప్పాం. మరునాడు ఎస్.పి గారు ఆ ఊరికి విచారణకి వెళ్ళారని తెల్సింది.
మాకు ఈ రోజు ఒక మంచి పని చేసామనే తృప్తి కలిగింది.