మూడు తరాల సీమ కథకుల పుస్తకాల ఆవిష్కరణ : అంతరాష్ట్ర సాహితీ వేత్తల సమావేశం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కూడలిగా ప్రసిద్ది చెందిన చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాల తెలుగు రచయితల మేలుకలయికగా మూడు తరాల సీమ కథకుల పుస్తకాల ఆవిష్కరణ నవంబర్16 ఆదివారం కన్నుల పండుగగా జరిగింది.ఒకే వేదికపై మొత్తం ఐదు పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి.
ఈ పుస్తకాల పండుగలో చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మందిక్రిష్టాపురం గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీ వేెత్త కుప్పం రెడ్డెమ్మ అవార్డు గ్రహీత సి.వేణు- నవ్విన ధాన్యరాశి కథా సంపుటిని నాయుని సుధాకరమూర్తి ఆవిష్కరించారు. జొన్న విత్తుల శ్రీరాంచంద్రమూర్తి పుస్తక పరిచయాన్ని చేశారు. కథకుడు నవలాకారుడు రామాయణ బాగవత గ్రంధాల రచయిత నాయుని కృష్ణమూర్తి -”ఏం లేదు” కథా సంపూటిని కవనశర్మ ఆవిష్కరిం చారు. కరణం సుబ్రమణ్యం పిళ్లై పుస్తక సమీక్ష చేశారు.పలమనేరు బాలాజి- ”చిగురించే మనుషులు” కథా సంపూటిని ఎన్.వేణు గోపాల్ ఆవిష్కరించారు. సింగమనేని నారాయణ పుస్తక పరిచయం చేశారు.
ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాలకుచెందిన ప్రముఖ సాహితీ వేత్తలు పత్రికా సంపాదకులు, విమర్శకులు, విశ్లేష కులు కథా రచయితలు, అనువాదకులు, ప్రచురణకర్తలు, పాఠకులు పెద్ద సంఖ్యలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం మధ్యాహ్నం 2గంటల నుండి రాత్రి 8గంటల వరకు ”కథతో కొంత సమయం” చర్చా కార్యక్రమం స్నేహపూరితమైన వాతావరణంలో నిరాటంకంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో చర్చించిన అంశాలు 1) కథ ఎందుకోసం? 2)కథా భాషపై నియంత్రణ అవసరం లేదా? 3) పత్రికలు కథా స్వరూపాన్ని నిర్దేశిస్తున్నాయా? 4)కథా రచయితలు వాదాలతో వర్గాలుగా విడిపోవడం సబబేనా? 5) విపులమైన కథా విమర్శ ఎందుకు లేదు? 6) కొన్ని సంస్థలు ప్రచురిస్తున్న వార్షిక కథా సంకలనాలు ‘ఈ ఏటి మేటి కథలు’ అని పేర్కోనడం సమంజసమేనా? తమకు నచ్చిన కథలు అనటం భావ్యం కాదా! భవిష్యత్తరాల వారికి తప్పుడు సంకేతాలు అందివ్వడం న్యాయం కాదు గదా. 7) దేశీయమైన ఇతర భాషల్లో సమకాలీనంగా వెలువడే కథల్లో ఎన్నదగినవాటిని అనువదించి తెలుగు రచయితలకు అందజేసే ప్రయత్నం ఏదైనా చేయగలమా? 8) ప్రపంచ భాష ఇంగ్లీష్‌లోకి ప్రతి మూడు నెలలకో,ఆరు నెలలకో ఒక మారు కొన్ని తెలుగు కథల్ని అనువదించి ప్రచురించే ప్రయత్నం ఎందుకు చెయ్యకూడదు? 9) కేవలం రచయితల కలాలను కదిలించడానికి ఎమైనా ప్రయత్నం చేయగలమా? 10) రాయడం ఆపిన మానేసిన రచయితల కలాలను కదిలించడానికి ప్రయత్నం చేయగలమా? 11) రచయితలు స్వయంగా ప్రచురించుకొంటే వాటిని అమ్ముకునే మార్గాలు ఏవి? గ్రంధాలయాల సంఖ్యను పెంచడం ఎలా ప్రభుత్వాన్ని ఒప్పించగలమా? 12) నూతన రచయితలకు మార్గదర్శకాలు అవసరం లేదా?
ఈ పన్నెండు అంశాలపై చర్చించి తీర్మానాలను ప్రతిపాదించడం జరిగింది.ఈ మొత్తం కార్యక్రమం బెంగుళూర్ స్వచ్ఛత సంస్థ నిర్వాహకులు సి.భానుమూర్తి గారి స్వచ్ఛంద సహాకారంతో దిగ్విజయంగా కొనసాగింది.