ప్రియమైన వేములపల్లి సత్యవతి గార్కి,
నమస్తే! ఎలా ఉన్నారు? ఈ చలికాలంలో మీ శరీరం మీకు సహకరించదని తెల్సు. ‘ఆస్తమా’, మిమ్మల్ని ఎంతగా బాధిస్తుందో అర్థం చేసుకోగలను. ఐనా, మీ మనోబలం ముందు ఆత్మవిశ్వాసం ముందు దేహం తలవంచక తప్పదు సుమా! చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. చూడాలని ఉన్నా కాలం మనని కలపడం లేదు. జ్ఞాపకంలో మాత్రం (దానికి రైలు, బస్సు, కారు అఖ్ఖర్లేదు) వస్తూనే ఉంటారు.
చిన్నప్పటి నుంచీ మీరంటే అభిమానం గౌరవం నాకు. మా నాన్నగారి (రామిరెడ్డి) సహోద్యోగిగా పరిచయం మీతో. హిందీ టీచరైన మీరు, రచయిత్రిగా చేసే పలు రచనలు ఆసక్తిని నింపేవి. టి.యే.డి.యేల నిరాసక్త విషయాలే ఎక్కువగా దొర్లేవి ఆ కాలంలో అమ్మక్కూడా మీరంటే ఆప్యాయతే.
వెంపోగారితో మీ సహజీవనం, ఆదర్శం, హిందీభాషోద్యమంలో పాల్గొన్న స్పూర్తి ఇవన్నీ నాకు ఇష్టంగా ఉండేవి. కాటన్ చీరలో, అత్యంత నిరాడంబరంగా కనబడుతూ, మంగళ సూత్రాలు మొయ్యని మీ ధైర్యం నాకు నచ్చేది. రిటైర్ అయిన తర్వాత మీరు కొనసాగిస్తున్న రచనావ్యాసంగం ద్వారా అప్పుడప్పుడూ కల్సుకుంటున్నాం. ‘మాలాలా’ మీద మీరు రాసిన ఆర్టికల్ చాలా బాగుంది. ఎప్పటికప్పుడు జరుగుతున్న వర్తమాన విషయాల్లో మిమ్మల్ని కదిలించినవి, ఆలోచింపజేసినవి, ఆగ్రహపర్చినవీ అన్నీ అక్షర ముఖాన్ని తోడుక్కున్నాయి. ఇవన్నీ ఒక పుస్తకంగా వస్తే బాగుంటుదనిపిస్తోంది. ఏమంటారు?
కవిత్వం కొరకై ‘కలిసంగమం’ పేరుతో గత మూడేళ్ళుగా నడుస్తున్నది మీకు తెల్సిందె కదా! మొన్న 14న రోజంతా కవిత్వం ఉత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ‘సల్మా’ అనే తమిళ రచయిత్రి వచ్చింది. ఇంకొక కమలా దాసే ఆమె. మొదట్లో కవిత్వమే రాసినా తర్వాత ప్రోజ్ కూడా రాయడం మొదలుపెట్టింది. ”కళితిజీరీ చీబిరీశి ళీరిఖిదీరివీనీశి” అనే నవల రాసింది. దీన్ని మలయాళం, హిందీ, మరాఠీ, జర్మన్ భాషల్లోని అనువదించారు. ఇది విమెన్ సెక్సువాలిటీకి సంబంధించింది. చాలా కాంట్రావర్స్ అయింది. ఇప్పుడు ‘టాయిలెట్’ అనే నవల రాస్తోందట. 2015కి పూర్తవుతుంది. ఆమెని కలవడం చాలా బాగా అన్పిం చింది. ఈ నవల కూడా స్త్రీల అంశమే అంది. ముస్లిం స్త్రీలు చదువునూ, స్వేచ్ఛనూ పొందాలనే తపన కనబడింది. ఇస్లాం మతమెక్కడా ఆడవాళ్ళు చదువుకోవద్దని చెప్పలేదు. చదువు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ప్రశ్నించడం నేర్పుతుంది అంది. కమలాదాస్ జీవితంలానే రజతి, రొక్కయ్య, సల్మా అనే మూడు పేర్లతో సల్మా జీవితం కూడా కొనసాగుతోంది. స్త్రీగా తాను గురైన వివక్షను వివరించడమే కాక ఎదిరించడం ఆమె సహజలక్షణం. దేహమిచ్చిన తల్లిదండ్రులు పెట్టిన పేరు రజతి ఐతే, దేహాన్ని పంచుకున్న మెట్టింటి వారు పెట్టిన పేరు రొక్కయ్య. ఈ రెండు జీవితాలు రెండు పేర్లు ఆమె పడిన ఘర్షణకు గుర్తులే. రచన చేయడానికి వీల్లేదన్న నిర్భంధంలో నుంచి ఫీనిక్స్ పక్షిలాలేచి, తనకు తాను పెట్టుకున్నపేరు సల్మా. ఆమె నిజ జీవితం మీద తీసిన డాక్యుమెంటరీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె కవితలు ఏమన్నా మీరు అనువాదం చేయడానికి వీలవుతుందా? ఆరోగ్యం సహకరిస్తుందా? ఆలోచించండి. వీలయితేనే సుమా!
నిన్నటి పేపర్లొ చూశారా ఎంతదారుణమో! 5ఏళ్ళ పిల్లవాడ్ని సార్ కొట్టాడట. భుజం జారిపోవడమే కాక, చెయ్యి మొత్తం తీసేయాల్సి వచ్చిందట. ఎందుకింత క్రూరంగా మనుషులుంటున్నారు? టీచింగ్ పొజిషన్‌లో ఎంతో ఉన్నతంగా, ఉదాత్తంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా మారిపోయారేమిటి?
మొన్నామధ్యన ఒక స్కూలు టీచరు సెల్‌ఫోన్‌లో బూతు దృశ్యాలను ఆడపిల్లలకు చూపించడం, వాళ్ళనలా తయారవ్వమని హింసించడం మొ|| విషయాలు బయటకి వచ్చాక ఆ టీచర్ని అరెస్ట్ కూడా చేశారు. ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు సపోర్టు చేయడమే కాక, విడిపించారు. ఆ టీచర్ చెప్పిన సమాధానమేమంటే సెల్‌లో మాత్స్‌ని పిల్లలకు చూపించి, వాళ్ళ మేధస్సును పెంచడానికి ప్రయత్నిస్తున్నానని అబద్ధం చెప్పడం. ఇలా ఉన్నాయి రోజులు ఉండటానిక…
శిలాలోలిత..