పువ్వు నుంచి పరిమళాన్ని
వేరు చెయ్యగలరా ఎవ్వరైనా..?
పువ్వు గొప్పదో పరిమళం గొప్పదో
తేల్చి చెప్పగలరా ఎవ్వరైనా…?
అవని పురుటి నొప్పులనుభవిస్తేనే
మొలక మొలుస్తుంది.
మట్టి గొప్పదో, విత్తనం గొప్పదో
తేల్చి చెప్పగలరా ఎవ్వరైనా…?
ఒక్కచెట్టు కాయలు
పరిమాణమేదైనా రుచి ఒక్కటే
అయినపుడు, ఒక్క తల్లి బిడ్డలు
వేరు వేరు మనస్తత్వాలు ఎలా సాధ్యం?
కాయకు తొడిమకు మధ్య
రహస్యాలు లేనట్లే
పువ్వుకి తావికి మధ్య
అనుబంధం ఉండే తీరుతుంది.
మనిషికి మనిషికి మధ్య
మానవత్వపు వారధి నిలిచినపుడు మాత్రమే
ఆ సమాజం
సమానత్వం వైపు అడుగులు వేస్తుంది.