రోజూ యాంత్రికంగా ఇంట్లో పనులు చేసుకుంటూ పోయే స్త్రీల సమస్య లేమిటో, వాళ్ళ చాకిరీలో వున్న బాధలేమిటో, వాళ్ళకు నిస్పృహలెందుకు కలుగుతుందో ఎవరికీ అంతుపట్టదు. మనం చెప్పిన అనుభవాల్లో యాంత్రికమైన ఇంటిచాకిరీ, దాని పట్ల కలిగే విసుగు, అసహనం, దాన్నించి తప్పించుకోలేని అసహాయత స్పష్టంగా కనిపిస్తాయి. అయినా స్త్రీల ఇంటి ‘పని’ గా చూడలేక పోవడం ఎందుకు జరుగుతోంది?
శ్యామలమ్మ :
కొన్ని సార్లు తెల్లవారుఝామున 3 గంటలకే మెలుకువ వస్తుంది . కానీ లేవాలనిపించదు. ఎప్పుడూ వుండే వెధవ పనులేగా. 5 గంటల దాకా ఎట్లాగో వెళ్ళదీస్తాను. అయిదవుతూనే లేవక తప్పదు. లేచి ముఖం కడుక్కుని వంటింట్లో కెళ్ళాలి. రాత్రే వంటిల్లు శుభ్రం చేసుకొని పెట్టుకుంటాను. వంటిల్లు గట్టు చెత్తగా వుంటే లేవగానే పని చేసుకోవాలన్పించదు. స్టవ్ అంటించి, నీళ్ళు పడేస్తాను. ఈ లోగా పాలు వస్తే పోయించుకుని కాగ పెడ్తాను. వంటిల్లంతా చిమ్మి కాఫీలు కల్పుతాను. కాఫీ కల్పి కోడలికిచ్చి, నేనూ త్రాగుతాను. అప్పుడు భక్తిరంజని వింటూ కాఫీ తాగుతాను.
నీళ్ళ ఫిల్టరులో దిగిన నీళ్ళు కుండల్లో కడిగిపోసుకుని, మళ్ళీ ఫిల్టరు నింపాలి. అంట్లు బైట పడేయడం, కొడుకులకి కాఫీలు కలిపి ఇవ్వడం. ఆ తర్వాత దొడ్లోకి వెళ్ళి స్నానం చేసి, మళ్ళీ వంటింట్లోకి వెళ్తాను. పప్పు వేయించి, కుక్కర్లో పెడ్తాను. కోడలు కూరలు తరిగిస్తే తిరగ మోత వేస్తాను. ఓ ప్రక్క వంటవుతూంటే రెండో సారి కాఫీ ఇవ్వాలి. పని మనిషికి కాఫీ పొయ్యాలి. పాలు గోరు వెచ్చగయ్యేదాక చూసుకొని తోడు బెట్టాలి. గిన్నెలన్నీ సర్దుకుని, కొడుకు, కోడలు స్నానాలు చేసి వస్తే భోజనం వడ్డించాలి. కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు. తర్వాత పాపకి నీళ్ళు పోస్తాను. తర్వాత అన్నం తినిపించటం.
ఓ 10 నిమిషాలు పేపరు చదువాలన్పిస్తుంది. అదే టైమ్‌కి పక్కింటామె వస్తుంది. ఆమెతో ఆ మాట, ఈ మాట మాట్లాడుతూ పాపకు పౌడరద్ది, గౌను వేసి, తల దువ్వి, జడ వేస్తాను. అది ఆడుకుంటున్నా దాన్ని ఓ కంట కని పెడ్తూనే వుండాలి. పాపను చూసుకుంటూ అన్నం తింటాను. మళ్ళీ కంచం, గంటెలు అన్ని కడిగిపెట్టి, పాపకు సీసాలో పాలుపోసుకుని, మందు వేసుకుని వచ్చే వరకు పన్నెండు. పది నిముషాలు నడుం వాలుద్దామనుకున్నా ఎవరో ఒకరు రావటం నేను లేచి పోవడం మాములే. లేకపోతే పై వాకిట్లో పిల్లలు గొడవో, పైపుల బాగు చేసే వాళ్ళ రొదో, ఏదో ఒకటి వుంటుంది. అట్లా 2, 2.30 వరకు అయిపోతుంది. 2.30 కు పాప లేస్తుంది. దాన్ని దొడ్లోకి తీసుకు పోయి ఒంటేలు పోయించి రెండోసారి అన్నం తినిపిస్తాను. ఈ లోపల కూరగాయల వాడొచ్చి అరుస్తాడు. కూరలు కొని పెట్టి పాపకు స్నానం చేయించి, బట్టలేసి కూరలు కోసుకోవటం, చిక్కుడు కాయలుంటే వలుచకోవటం, పప్పులు బాగు చేసుకోవటం లేదా తిరగమోత గింజలు బాగుచేసుకోవటం లాంటి పనులేవో చేసుకుంటాను. అప్పటికి మంచి నీళ్ళు పంపు దగ్గర హడావుడి మొదలవుతుంది. నీళ్ళు మాకు సాయంత్రం పూట వస్తాయి. నీళ్ళు బయట పట్టాలి. వంటింట్లోకి రావు. దాదాపు 8 బిందెలు అవసరం. గంట పైగా పడుతుంది. అన్ని పోర్షన్ల వాళ్ళు పట్టుకోవాలి కదా! అందరికీ ఛాన్సుండాలాయె. నేను నీళ్ళ బిందెలు లోపలికి మోయలేను. దడ వస్తుంది. నేను కూడా అటూ ఇటూ తిరుగుతూ ఇటు లోపల వంటని అటు బయట నీళ్ళని చూసుకుం టాను. అన్నం, చారు తప్పని సరిగా వుండాలి సాయంత్రానికి. కూరలేని పూట కూర వండాలి. నాకు అన్నం అరగదు అందుకని విడిగా కొంచెం గోధుమ రవ్వ చేసుకుంటాను. ఇవన్నీ అయ్యేటప్పటికీ సాయంత్రం 7.30. అప్పుడు టి.వి.లో వార్త లొస్తే చూస్తూ నడుం వాల్చాలని పిస్తుంది. కొన్ని సార్లు నడుం వాలిస్తే నిద్ర పట్టేస్తుంది అలసటకి. పెద్దదాన్నయి పోయాను. మునపటి లాగా ఓపికెక్కడుంది? 8.30 కు లేచి మళ్ళా అన్నాలు. కంచాలు పెట్టడం, నీళ్ళు పెట్టడం, వడ్డించటం కొన్ని సార్లు వాళ్ళే పెడుతారు. కొన్నిసార్లు నేనే. తినేటప్పటికి దాదాపు 9.15 అవుతుంది. కంచాలన్ని తీసి వంటింట్లో పడేసి, గట్టు తుడుచుకొని పాలు కొద్దిగా వేడి చేసి తోడేసి, ఫిల్టరులో నీళ్ళు మళ్ళీ కుండల్లో పోసి ఇవతలకి రావాలి, పక్క వేసుకొని పడుకునేటప్పటికి 10 గంటల దగ్గరవుతుంది.
వసంత :
పొద్దున 5గంటలకు లేస్తాను. మొహం డుక్కుని వంటింట్లోకి వెళ్ళి ఊడ్చి ఒక పొయ్యిమీద పాలు, ఒక పొయ్యి మీద కాఫీకి నీళ్ళు పడేస్తాను. అవి మరుగుతూంటే బియ్యం ఏరి, బియ్యం కడిగి, పప్పు కుక్కర్లో పడేస్తాను. ఈ లోపల కాఫీ అయితే కాఫీ కలిపి కుక్కరు పొయ్యి మీద పెట్టి, ఆయనకి కాఫీ ఇచ్చి నేను తాగుతాను. 5.30 కి పిల్లల్ని లేపుతాను. ఓ పక్క పిల్లల్ని చదివించుకుంటూ వంట సాగిస్తాను. వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ, ఆన్సర్సు రాయిస్తూ కూరలు కోసుకుంటాను. కూరలు కోసి గోధమ పిండి తడుపుకుంటాను. తర్వాత కూర తాళింపు. కూరైన తరువాత చారు చేసి, పప్పు తిరగ మోత వేస్తాను. వంటవుతూనే రొట్టెలు చేయాలి. ఇవన్నీ ఓ ప్రక్క నడుస్తూ వుంటే పిల్లల చదువు ఇంకో ప్రక్క నడుస్తూ వుంటుంది. ఆ తర్వాత ఇల్లు చిమ్ముకోవాలి. ఫిల్టరు ఖాళీ చేసి, కుండల్లో పోసి నీళ్ళు బాటిల్స్‌లో నింపి ఫ్రిజ్‌లో పెడ్తాను. ఆ తర్వాత బైటి నుంచి మంచి నీళ్ళు లోపలికి మోయాలి. 9 బిందెల నీళ్ళకి 15 నిమిషాలు పడ్తుంది. బిందెలు రెండు రోజుల కొకసారి తోముతాను.
పిల్లలకు పాలు ఇవ్వాలి. కాఫీ గ్లాసులు, పాల గిన్నెలు అన్నీ తోమాలి. తర్వాత మిషన్‌లో బట్టలు వేస్తాను. బట్టలు
ఉతకడం అయ్యేటప్పటికి 7.30. అప్పుడు స్నానం చేసి చీర కట్టుకుని, తల దువ్వుకుని, తయారవుతాను. 15నిమిషాలు దేవునికి ప్రదక్షిణలు చేస్తాను. పిల్లలే స్నానాలు చేస్తారు. కాని బట్టలు నేను తీసి పెట్టాలి. బెల్టులు, టైలు, బూట్లు, సాక్సు అన్నీ తయ్యారుగా పెట్టి ఇద్దరాడ పిల్లలకు జడలు వేసేసరికి ఎనిమిదింపావు. అప్పుడు పిల్లలకు అన్నాలు పెట్టి రొట్టెలు కట్టిస్తాను. నా టిఫిను కట్టుకుని, పాలు తోడేసి బయలు దేరేటప్పటికి నాకు తినడానికి టైం
ఉండదు. ఎనమిది నలభైకి మా ఆయన స్కూటర్ మీద దింపుతాడు.. తొమ్మిది నుంచి మూడున్నర వరకు స్కూలు. హైస్కూలు పిల్లలకి పాఠాలు చెప్పాలి. సాయంత్రం బస్సులో ఇంటికి వచ్చేసరికి నాలుగవుతుంది. కొంపకి చేరేటప్పటికి పిల్లలు వస్తారు. వాళ్ళకి బట్టలు మార్చి ఏదైనా టిఫిన్ చెయ్యాలి. మళ్ళీ పాలు కల్పి ఇచ్చి నా టీ చేసుకుని తాగి మళ్ళీ అన్ని గిన్నెలు, టిఫిన్ బాక్సులు తోముకుని, ఆరిన బట్టలు మడత వేసుకొని, ఇల్లంతా చిమ్ముకుని, మళ్ళీ పిల్లలకి హోంవర్కు చేయించడానికి కూర్చుంటాను. హోంవర్కు అయ్యేటప్పటికి ఆరున్నర. ఆరున్నరకి మళ్ళీ వంట మొదలు. అన్నం, కూర, పచ్చడి చేయాలి. పొద్దున చేసిన చారు అయిపోతే మళ్ళీ చారు చేయాలి.. ఇవన్నీ అయ్యేసరికి ఒక గంట పడ్తుంది. ఇంటిల్లి పాదికి పక్కబట్టలు శుభ్రంగా వేయాలి. పైగా బట్టలు నీట్‌గా వేయాలి. బట్టలు లేకున్నా అందరికీ సరిపోయేలా వేయాలి.
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరప కాయల కారం రుబ్బుకోవటం లేదా కొబ్బరి పొడి కొట్టు కోవటంలాంటివి చేసి పెట్టుకుని పడుకునేటప్పటకి పదవుతుంది.
అంజమ్మ :
పొద్దుగాల అయిదు అయిదున్నరకు లేస్తే బిస్తరి తీస్త. వాకిలి ఊడుస్త. ఒంటేలుకి పోయి మొహం కడుగుత. కాళ్ళు చేతులు కడుక్కుని పొయ్యి మీద కెల్లి ఊక్కొని నీళ్ళు జల్లి గ్యాస్ నూనె పోసి పొయ్యి ముట్టిస్త. చాయ్‌కి నీల్లు పెడత. ఇక చాయ్ అయ్యే వరకి పప్పు కడగాలె. పొయ్యి మీద సడెయ్యాలె. బియ్యం గాలియ్యాలె. గాలిచ్చి పప్పు దించినంక పొయ్యి మీద పెడత.
మా అమ్మ కాళ్ళు, చేయి పడిపోయి నాదగ్గరే వుండే. దవాఖానకు తీసుకుపోతే కొంచెం నయమైంది. అయినా పైకి లేవలే గంపెడు బైలు పోయేది. నేనే తీస్త. గంప పెడ్తం రోజు. నేనే తీసి పారపోయాలె.
చాయ అయినంక ముసలామెకి మొహం కడుక్కొనికి నీళ్ళిస్త. గంపలో కడుకున్నంక అవుతల పారపోయ్యాలె. గంప కడిగి ఆడ పెట్టాలె. అమ్మకి చాయ పోసుకురావాలె. డబల్‌రొట్టె పెట్టాలె. తిన్నంక గలాస కడిగి ఆడ బెట్టాలి. ఇక పిల్లలందరికి చాయలు పొయ్యాలె. ఆయన రెండు మూడు సార్లు తాగుతడు. బిడ్డ కప్పులు తోముతది, చాయలు అందరు తాగెటాలకి ఎనమిదిన్నర అయితది. ఇక పొయ్యి మీద నించి పప్పు, అన్నం దించగానే పిండి నాన బెట్టుకొని రొట్టెలు చెయ్యాలె. పప్పులకి చింత పులసు కడిగి పోసి పొయ్యి మీద కారం అల్లం వెల్లిగడ్డ ముద్ద, ఉల్లి గడ్డ, టమాటా ఏదుంటే అదే ఏసేది. ఇగ కూరెం లేదు. నీల్లు కొడుకులు తెచ్చేది. మంచినీళ్ళు రెండు డబ్బాలు మొగ పిల్లల్ని ఊరికే బతిమి లాడాలె. ఆయనకిష్టముంటే తెస్తడు. లేకుంటే రేపు తెస్త అనె. రేపు తెస్తనంటే ఎట్ల అసలె ఎండకాలం. తేకుంటే నీల్లు కొనాలె. ఒక తురకాయన తెస్తడు. అయిదు రూపాయలు డబ్బ. వారానికొకటి రెండు సార్లు తీసుకొంటాం పిల్లలు లేకుంటే ఆయన తెచ్చేది. కానిప్పుడు చేతకాకుంటయ్యిండు. ఆడపిల్లలు బట్టలకి, బాసన్లకి, స్నానాలకీ నీల్లు బాయికాడ్నించి తెస్తరు. బస్తిలనే వుంది. పన్నెండు బిందెలు తీసుకురావాలె. బట్టలు పిల్లలుతికేది. వాళ్ళు పెద్దగయ్యేవరకు నేను ఆయన చేసుకున్నాం.
వారానికొకసారి అమ్మకి స్నానం చెపిస్త, బట్టలేస్త. ఆమె బట్టలు పిండాలె. పిల్లలందరికి బుక్కెడు అన్నమెయ్యాలె. అమ్మకు తినిపించాలె. ఆమె దిన్న గిన్నె తియ్యమని పిల్లలకి చెబుతునా. నేను తినాలె. నేను పొద్దున చాయ తాగ. తొమ్మిది గంటలకు బుక్కెడు తిన్నంక చాయ తాగి, డబ్బాల అన్నం పెట్టుకుని వుప్పరి పనికిపోతే, ఇద్దరు చిన్న పిల్లల్ని నా ఎంట తొల్కపోవాలె, ఇంట్లో చూసెటందుకు ఎవరున్నరు? దినమంత పనిచేసి ఇంటికి పోయెటాలకు ఆరు గొడతది ఇగ మల్లి దీపాలు ముట్టించి వంట చేస్త. పొద్దుమీకి అన్నం ఊరగాయతింటం. ఎనిమిదింటికి అన్నం తిన్నంక బాసన్లన్ని ఒక తాన బెట్టి పొద్దుగాల తోముత. ఇల్లంత ఊకి అందరికి పక్కె లేస్త.
కూరగాయలు, బియ్యం రేషన్ దుకానం నుంచి ఏమన్న తెచ్చేదుంటె నేనే పోత, మగ పిల్లలకి చెప్తె సరిగ చూడరు, సరిగ లేరు. పైసల లెక్క కూడా చెప్పరు. అన్నింటికి నేనే పోవాలి. నా కొడుక్కి కుక్క కరిసి సూదులకి దవాఖానకు తీస్కబొమ్మని పెద్దాయన కడిగితె, ఆయన తీస్కపొనేలేదు. ఇగ నేనే పోయిన. ఏం చెయలె బిడ్డ, నాకాలూర్కె నొప్పయితది. వాస్తది. వాల్లు కూడా చేస్తరు కాని అట్లనె.
పద్మ: రోజూ ఉదయం లేవాలి. కోడి కూయంగానే లేస్తుంది మా ఆత్త. ఆమెతో పాటే నేనూ లేవాలి. నేను ఇంకా ముందు లేవాలని అనుకుంటారు. కాని ఓ పక్క నాభర్త ఇప్పడే ఎందుకు లేస్తావు అని అనేవాడు. కాని వాళ్ళ మొహాలు కోపంతో పెట్టుకుంటారు. నన్ను పలుకరియ్యరు అని లేసేదాన్ని. అట్ల రోజూ పొద్దునే లేచి వాకిట్లో ఊడ్చి, సాన్పు చల్లేదాన్ని, సాన్పు చల్లే ముందు ఊడ్చి, ఊడ్చి చేతులు గుంజేవి. ఇంటికి నాలుగు వైపులా వాకిలి వుంది. అన్ని వాకిళ్ళు
ఊడ్వాలి, చెత్త గంపలో ఎత్తి, దూరంగా ఇంటెనక పారపోసే దాన్ని. తర్వాత బావిలోంచి నీళ్ళు చేదే దాన్ని ఆ బావిలో నీళ్ళు చాలా లోతుకు వుండేవి. పైగా బొక్కెన చాలా బరువు. చేతులనిండా పొక్కులు వచ్చేవి. బక్కెట్లతో, బిందెలతో నీళ్ళు మోసి సాన్పు చల్లుతుంట. ఆ సాన్పు చల్లితే ఎక్కడా సందుపోకుండా చల్లాలి. పైగా నా బట్టల మీద పడకూడదు. సాన్పు చల్లే బకెట్లు, బిందెలు కడిగి తోమి బోర్లియ్యాలి. తరువాత 4 వాకిళ్ళలో ముగ్గులు వెయ్యాలి. ముగ్గులు వేసి అన్ని గదులూ ఊడ్వాలి. చాలా పెద్ద ఇల్లు, అన్ని ఊడ్చినాక గడపలు మొత్తం కడగాలి. ఇంటికి మొత్తం 10, 12 గడపలు, పసుపులు పెట్టి, గడపలు కడిగి ముగ్గులు వేసేదాన్ని, వాకిట్లో అరుగుల చుట్టూ అలికి ముగ్గులు వెయ్యాలి, అలుకుడు రాక, పెచ్చులు, పెచ్చులు మట్టి లేచేది.
తర్వాత బర్రె దగ్గర పెంట తీసేదాన్ని, ఇవన్నీ చేయడాన్కి పనివాళ్ళుంటే మాన్పించింది మా అత్త – పెంట తీసి, అక్కడంతా ఊడ్చి పిడకలు చేసేదాన్ని – తర్వాత ఇంట్లోకి పాయ్యి క్రిందికి కట్టెలు యిరుసుక రావాలి – బావి దగ్గర్నుంచి బండ్ల మీద చెట్లు కొట్టుకొచ్చి, ఇంటెనక వేస్తే, వాట్ని చిన్న చిన్నగా యిరిసి, మంచిగ కట్టగట్టి పొయ్యి దగ్గర పెట్టాలి. పొయ్యి మీద అలికి ముగ్గులు పెట్టాలి. బూడిద ఎత్తాలి. అప్పుడు అత్త పొయ్యి ముట్టించి చాయ పెట్టేది. పాలు కాగ బెట్టడాన్కి పిడ్కల కుచ్చెలకెళ్ళి పిడ్కలు దెచ్చి దాలిలోపేర్చి పెట్టాలి. ఆ దాలి నాకు పేర్వరాకుంటే తిట్టేది.
తర్వాత తొట్టి నిండా నీళ్ళు నింపాలి. కనీసం 60 బిందెల నీళ్ళు పట్టేవి. ఆ నీళ్ళు నేనే చేదాలి.నేనే నింపాలి. అప్పటికీ ఇంట్లో అందరూ లేవనే లేవరు. గచ్చు కడగాలి, అందరు మొహం కడుక్కున్నక తెమడ, పాకుడు, గలీజు అంతా నేను కడుగు తుంటి, మూత్రాలు కూడా అదే గచ్చుల రాత్రి పొస్తే ఆ కంపు వాసన వస్తుంటే కడిగేదాన్ని – ఎంత కక్కు వచ్చినట్టయినా, ఆ పని నేనే చేయను అని చెప్పలేక పోతుంటి మస్తు భయమై తుండె. తర్వాత మోరీలు సాఫ్ చేస్తుంట – మోరీలు కడగడం కూడా నాకు ఇష్టం లేకున్నా చేస్తుంట. తర్వాత మంచి నీళ్ళకు ఊరి బయటకు పోతుంట – ఊరవుతల వున్న బాయి నుంచి పొద్దుట ఎండలో నీళ్ళు దెస్తుంటే నాకు కండ్లు తిరిగేవి – పైగా అందరి ముందు ఊర్ల నుంచి రోడ్డు మీద బిందె పట్టుకుని పోతుంటే సిగ్గుతో చచ్ఛిపోయేదాన్ని – నా కేం ఖర్మ పట్టింది. ఈ బిందె పట్టుకొని పోవడాన్కి! నామీద నాకే అసహ్యం వేసేది. పైగా అందరి ముందు ఆ బాయి దగ్గర కూర్చొని బిందె తోమాలి.. నేను బిందె తోమితే ఎప్పుడూ బిందె తెల్లగ అయేది కాదు. దాని కోసం ఇంటికి రాగానే అవమానించి తిట్టేది.
అప్పుడు మా అత్తకు చేట్ల బియ్యంపోసి ఏరి పెట్టాలి. కూరగాయలు కడిగికోయాలి. ఉల్లిగడ్డలు, పచ్చి మిరుపకాయలు, కరివేపాకు, కొత్తమీర అన్నీ ఏరి కోసి పెట్టాలి. కొబ్బరి, గసాలు, అల్లం, ఎల్లిగడ్డ నూరి పెట్టాలి. పైగా వాళ్ళు కారం పొడివేసే
వాళ్ళు కాదు. ఎండు మిరపకాయలు మెత్తగా నూరాలి. గింజలు ఎప్పటికీ. దంగేవికావు. మెత్తగా కాటుకలాగా నూరమనే వాళ్ళు. పైగా కొబ్బరి నీళ్ళు లేకుండా మెత్తగాపొడి కొట్టాలి. ఆ కొబ్బరి బాగలేక సాగుతుండేది. దాన్ని దంచి దంచి నా చేతులు పడిపోయేవి. దుఃఖం, బాధ, ఏడ్పుతో మింగలేక చావలేక పడుంటే దాన్ని, పైగా ఆ రోకలి ఒక బరువు. ఇవన్నీ తయ్యారు పెడ్తే మా అత్తగారు వంట చేసేది. రొట్టెలు 20, 30నేనే చేసేదాన్ని పని వాళ్ళకి ఇవ్వాలిగా. ఇంతపని చేసినా నాకు సరిగ్గా తిండి పెట్టే వాళ్ళు కాదు. ఇవన్నీ చేసేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయ్యేది.
ఇక మధ్యాహ్నం కూడా ఏదో ఒక పని చేసేదాన్ని, మొక్క జొన్న కంకులు కొట్టడం, ఏరడం, ఎండ బెట్టడం, చినిగిన పాత బట్టలు కుట్టడం, కట్టెలు ఏరడం, పిడకలు చేయడం లాంటిపనులు ఏదో ఒకటి నాకు చెప్పి అందరూ పడుకునే వారు. కొన్ని సార్లు నాతో పాటు చేసేవారు.
సాయంకాలం కాగానే మళ్ళీ నీళ్ళు, వాకిలి ఊడవడం, నీళ్ళు చల్లి ముగ్గు వేయడం, సాయంత్రం వంటకి అన్నీ తయ్యారు చేయాలి. ఒక్కోసారి సాయంత్రం రొట్టెలు నేనే చేసేదాన్ని. వంట మాత్రం నేను చేసేదాన్ని కాదు. బైట పని మాత్రం మొత్తం నేను దీపాలు తూడ్చి గ్యాస్‌నూనె పోసి పెట్టేదాన్ని. దీపాలు ముట్టిచ్చేవరకు అందరూ బయట తిరిగి వచ్చేవాళ్ళు. నేను ఒక్క దాన్నే పెద్ద ఇంట్లో వుండేదాన్ని. ప్రతీసారి అందరికీ అన్నం పెట్టడం. వడ్డన చేయడం నేనే. పైగా అవన్ని తీసేదాన్ని పళ్ళెంలో ఎంత గలీజుగ తిని పెట్టినా దాన్ని నేనే తీసేదాన్ని. అవన్ని కడగాలి రోజూ బండెడు బాసండ్లు నేనే తోమాలి, కడగాలి – ఎక్కడెక్కడనో వున్నయీ అన్నీ తీసుకొచ్చి కడగాలి – ఎవ్వరూ అన్నీ ఒక దగ్గర పెట్టరు, కనీసం ఆ గిన్నెల్ల నీళ్ళు కూడా పోయరు. అన్నీ ఎండిపోతై, మళ్ళీ నేనేనీళ్ళు పోసి నానబెట్టాలి ఎంత మంచిగ తోమిన బాగా లేదని ఒక వంక పెట్టేవాళ్ళే.
బర్రెపాలు పిండమంటేనాకు ఒక్క చుక్క కూడా పిండడాన్కి రాలేదు. పాలురాకుంటే అదిమాత్రం మా అత్తనేచేసేది.
మధ్యాహ్నం మా ఆడబిడ్డలవి అందరివి బట్టలు నేనే ఉత్కాలి. వాళ్ళపిల్లలు దొడ్డికి పోయిన చడ్డీలు, గూట్లల్ల పెడ్తే, ఆ దొడ్డికి చెడ్డీలు ఎండిపోయి, వాసన కొడ్తూ వుండేవి. ఆ చెడ్డీలో పైకానా తీసేసి నేనే పిండేదాన్ని బాత్ రూమ్ కడగాలి. మా ఆత్తకి వీపు రుద్దాలి. మామయ్య ధోతి, బుషర్టు పిండాలి. చాకలామె వున్నా కానీ బట్టలు క్రొత్తవి మామయ్యవి, నా మొగడివి నేనే వుతకాలి. మా అత్త మైల బట్టలు కూడా నేను వుత్కాలి. బండ చాకిరీ చేయించుకొని సరిగా తిండి కూడా పెట్టే వాళ్ళు కాదు.పైగా నానా మాటలు అనే వాళ్ళు.
రాత్రి పక్క బట్టలు అందరికి నేనే వెయ్యాలి. పైగా అందరికీ వచ్చేలా సర్ది వెయ్యాలి. అందరికి మంచినీళ్ళు తాగడానికి పెట్టాలి. దీపాలు చిన్నగా చేయాలి, అప్పటికి కాని నాకు పడకోవడానికి వీలు కాదు – నా రూమ్‌లోకి వెళ్ళే ముందు గొళ్ళెం చప్పుడు కాకుండా ఎవరూ లేంది చూసి వెళ్ళే దాన్ని. ఓ ప్రక్క సిగ్గు, భయం మళ్ళీ అందరి బట్టలు పొద్దున తీయడం కూడా నాపనే.
మొదటి అనుభవం చెప్పిన వ్యక్తికి 64 సంవత్సరాల వయస్సుంటుంది. అయిదుగురు పిల్లలు. ప్రస్తుతం ఇద్దరు కొడుకులు, కోడలు, మూడేళ్ళ మనుమరాలుతో కలిసి వుంటుంది. రక్తపోటు, గుండె బలహీనత ఆమె ఆరోగ్యానికి పెద్ద సమస్యలు. డాక్టరు ఆమెను ఇంటి పని సాధ్యమైనంత వరకు తగ్గించుకోమని, ఆమె గుండెకు మంచిది కాదని సలహా చెప్పిన ఇంటి చాకిరీని తప్పించుకోలేని పరిస్థితి ఆమెది, కొడుకు కోడలు ఇద్దరు సంపాదిస్తే కాని ఇల్లు గడవదు.
రెండవ అనుభవం చెప్పిన వ్యక్తి వయస్సు 33 సంవత్సరాలు. ముగ్గురు పిల్లలు, మధ్య తరగతి కుటుంబం. ఇంట్లో ఎంత చాకిరీ చేసుకోవల్సి వచ్చినా బయట ఉద్యోగానికి వెళ్తె కొంచెం మనశ్శాంతిగా వుంటుంది. లేకపోతే పిచ్చెక్కి పోతుందని ఆమె ఫీలింగ్.
మూడవ అనుభవం ఒక బస్తీలో వుంటూ ఉప్పరి పని చేసుకొనే స్త్రీది. వయస్సు 50 సంవత్సరాలు ఎనిమిది మంది పిల్లలు భర్త ప్యూన్‌గా పని చేస్తాడు. తల్లికి పక్షవాతం వచ్చి కాళ్ళూ చేతులూ పడిపోయి మంచంలో వుంటే ఆమె బాధ్యత అంతా నెత్తి నేసుకొని, ఇంటి చాకిరీతో పాటు, కుటుంబంతో పాటు, ఉప్పరి పని చూసుకుంటూ నాలుగు ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తుంది.
నాలుగవ అనుభవం 14వ ఏట వివాహమై పట్నం నుండి పల్లెటూరికి వచ్చి 15, 17 సంవత్సరాలకే ఇద్దరు పిల్లల్ని కని ఇంట్లో భర్త, అత్తమామల వేధింపులు పడలేక గొడ్డు చాకిరీ చేయలేక, ఇల్లొదిలి పిల్లలతో పారిపోయి నానా కష్టాలు పడి, కోర్టు ద్వారా విడాకులు పొంది ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్న స్త్రీ అనుభవం.
పైన చెప్పిన అనుభవాలు రకరకాల స్త్రీలవి. అందులో మధ్యతరగతి స్త్రీలున్నారు. బస్తీలో ఉప్పరి పని చేసుకునే స్త్రీ వుంది. పట్టణ వాతావరణంలో పెరిగి గ్రామాల్లో భూస్వాముల ఇంట్లో పడ్డ స్త్రీ అనుభవం వుంది. ఈ నలుగురిలో ఇద్దరు ఇండ్లల్లో పనులు చేసుకునే వారయితే ఇద్దరు బయట పనులకెళ్ళే వాళ్ళున్నారు. అయితే ఇంటి పనికి సంబంధించినంత వరకు అందరికీ ఒకే రకం బాధ్యతలు. వాళ్ళంతామొదట గృహిణులు, స్త్రీలు అవివాహితులైనా, వితంతువు లైనా, భర్తలున్నా, లేకపోయినా ఇంటి చాకిరీ చేసి తీరాల్సిందే. ఆ తర్వాతే ఏదైనా, నిజానికి అచ్చంగా ఇంట్లో కూర్చుని ఇంటి పనులు చక్క బెట్టుకొనే స్త్రీ లెందరు? 20 శాతం కూడా
ఉండరేమో! 80 శాతం బయట ఆఫీసుల్లో ఉద్యోగాలు, పొలాలల్లో ఫ్యాక్టరీలలో పనులు చేసుకొనే వాళ్ళే.
మసిపూసి మారేడు కాయ:
ఇల్లంటే కుటుంబం. ఇల్లు అంటే పని కాదు. ఇంగ్లీషులో ‘ఫామిలీమాన్’ అంటే కుటుంబంలో మగవాడు అని అర్థం. ‘ఫామిలీ ఉమన్’ అనే మాట లేదు, ఎందుకంటే ఫామిలీ అంటే ఆడది అని అర్ధం ‘మా ఫామిలీ’ అని భార్యల్ని ఫాషన్‌గా పరిచయం చేసుకోవటం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఫామిలీ అంటే స్త్రీ. ఆ స్త్రీకి కలిగే సంతానం కూడా ఫామిలీలో భాగం. అంతెందుకు, ఒక హోటల్‌లో అడుగు పెట్టామనుకోండి ప్రతివాళ్ళు మనవి ‘ఫామిలీ సెక్షన్’లోకి నెట్టటానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. (సాధారణంగా ఫామిలీ సెక్షన్లు బయటి టేబుల్స్‌కంటే చీకటిగా ఇరుగ్గాకంపు కొడుతూ జిడ్డొడుతూ వుంటాయి. అయినా మనం చచ్చినట్టు అక్కడే వెళ్ళి కూచోవాలి) ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ‘ఫామిలీ’కి అర్థం ‘స్త్రీ’ అని చెప్పేందుకే. ఆడవాళ్ళు పిల్లల్ని కంటారు, పెంచుతారు, ఇంటిని నిర్వహించు కుంటారు. ఇంటిని స్వర్గసీమగా మారుస్తారు అంటూ ఇంట్లోచేసే బండ చాకిరీకి అందమైన నిర్వచనాన్ని తయారు చేసి పెట్టింది సమాజం. ఇళ్ళల్లో స్త్రీలు చేసే పనులు పని కింద లెక్క కాదు కనుక. అచ్చంగా ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళను ”హౌస్‌వైఫ్’ లంటాం. ”హౌస్ వర్కర్” అనం.
ఇంటి చాకిరీ పట్ల మనకున్న విసుగును వ్యక్తం చేసే అవకాశమే వుండదు. ”నువ్వెంత అదృష్టవంతురాలివి, నీకు నువ్వే బాస్, అయిదయ్యే లోపల ఫైల్స్ కంప్లీట్ చెయ్యాలనే బాధ లేదు, నీపనితో పోటీ పడే వాళ్ళెవరూ లేరు, వేధించే కొలీగ్స్ వుండరు. నీకు సంతోషం లేదంటావ్, ఈ ప్రపంచంలో సంతోషం ఎవరికుంది? మగ వాళ్ళకు మాత్రం వుందా! వాళ్ళ కెన్ని సమస్యలు లేవు అసలు, వాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళ కున్న సుఖం మగవాళ్ళకెక్కడుంది. వర్క్ సరిగా చేయకపోయినా కళ్ళనీళ్ళుపెట్టుకుంటుందనే భయంతో బాస్ కూడా నోరెత్తడు” అనే కామెంట్స్ మనం సాధారణంగా వింటూంటాం. కానీ బాస్ అవసరం లేకుండానే అజమాయిషీ చేసే వాళ్ళెవరూ అక్కర లేకుండానే మన పనిని మనం యాంత్రికంగా చేసుకు పోయేందుకు అలవాటు పడతాం. ఇవాళ పని చేసుకోవడానికి బద్దకిస్తే మళ్ళీ రేపెవరు చేస్తారు. చచ్చినట్లు మనం చేసుకోవలసిందేగా! అంజమ్మ అనుభవంలో చెప్పిన విషయం ‘మంచి నీళ్ళు రేపు తెస్తనంటె ఎట్లా!’ అన్నది గుర్తొస్తుంది. ఇంటి పని ఎప్పటి కప్పుడు అవాలసిందే కాని వాయిదా వేయటానికి వీలులేదు. అందులో సెలవులు లేవు. ఆదివారాలు, సెలవు లొస్తే మనకు పనులెక్కువ రిటైర్‌మెంట్ వయసంటూ వుండదు. పెన్షన్ మాటే హాస్యాస్పదంగా వుంటుంది. ఇక పోతే మన పనిలో మనకున్న స్వేచ్ఛ సంగతి. అది ఎంత మందికి? ఇంట్లో ప్రతి పని మన భర్తలకు నచ్చేలాగ వుండాలి… ‘అమ్మో! ఆకూర అలాగే చేయకపోతే మా ఆయన వూరుకోడుబాబు’ అనే మాట తరచు వింటుంటాం. అట్లాగే కొంతమంది ఇళ్ళల్లో ఒక్కొళ్ళకు ఒక్కొక్క రకం వండాలి. వంకాయ కూర కొడుక్కి నచ్చదు. కాకరకాయ మా వారికి నచ్చదు అని రెండు మూడు రకాలు చేయటం మామూలే. అదే స్త్రీకి స్వేచ్చ వుంటే నేను చేసింది తింటే తినండి లేకపోతే మానెయ్యండి నేను రకరకాలు చేసి పెట్టలేను అని అనగలుగుతుందేమో!
రోజూ యాంత్రికంగా ఇంట్లో పనులు చేసుకుంటూపోయే స్త్రీల సమస్య లేమిటో, వాళ్ల చాకిరీలో వున్న బాధ లేమిటో, వాళ్ళకు నిస్పృహ లెందుకు కలుగుతాయో ఎవరికీ అంతు పట్టదు. పైన మనం చెప్పిన అనుభవాల్లో యాంత్రికమైన ఇంటి చాకిరీ, దాని పట్ల కలిగే విసుగు, అసహనం, దాన్నించి తప్పించుకోలేని అసహాయత స్పష్టంగా కనిపిస్తాయి. అయినా స్త్రీల ఇంటి పనిని పనిగా చూడలేక పోవడం ఎందుకు జరుగుతుంది?
ఒక స్త్రీ తన రోజువారి జీవితంగురించి మాట్లాడిందను కుందాం. ఆధునిక గృహిణిగా, భార్యగా, తల్లిగా, పిల్లల ఆలనా, పాలనా చూసే వ్యక్తిగా గృహోపకరణాల ఎడ్వర్టయిజ్‌మెంట్‌లను జీర్ణించుకునే వినియోగదారుగా, వంటగత్తెగా, డ్రైవరుగా (కారుంటే), ఇంటిని తీర్చిదిద్దే డిజైనరుగా, పాడైన వస్తువులు రిపేర్ చేసుకునే మెకానిక్‌గా, పిల్లలకు చదువు చెప్పే టీచరుగా, గిన్నెలు తోముకొని, బట్టలుతుక్కునే (వాషింగ్ మెషీన్ వున్నా) పని మనిషిగా బజారు నుండి సరుకులు తెచ్చుకొనే నౌకరుగా, శతావధానం చేస్తూ, ఆమె రోజువారీ జీవితం ముక్కలు ముక్కలుగా నడుస్తుంటుంది. ఒక్కొక్క పనిమీద మళ్ళీ 15 నిముషాలు కన్నా ఎక్కువ పెట్టినట్టు కనిపించదు. ఆమెకు పుస్తకాలు, చివరకు పేపరు చదువుకునే తీరికుండదు. అసలైనా ఓపిక ఎక్కడా? మహా అయితే ఏవో చెత్త పత్రికలు కాసేపు తిరగేయొచ్చు, చదవ గలిగే తీరికెప్పుడైనా దొరికితే ఏకాగ్రత ఎక్కడకుదురుతుంది.? పాలవాడి బెల్లు, పని మనిషి కేక వినడానికి అలవాటు పడ్డ శరీరం వంటింట్లో పాలు మరుగుతున్న శబ్దాన్ని కూడా గ్రహించ గలిగే శరీరం, మెదడు అటువైపే పని చేస్తాయి. కాని చదువుతున్న పుస్తకం మీదధ్యాస ఎక్కడ నిలుస్తుంది? బయట పనులు చేసే స్త్రీలకూ అదే పరిస్థితి, ఆఫీసు వర్కేదైనా ఇంట్లో చేెసుకుందామని అనుకుంటే అది సాధ్యపడదు. ఆదే మగవాళ్ళు ఇళ్ళ దగ్గర పనిచేస్తే వాళ్ళకు డిస్టెర్బెన్స్ లేకుండా, పిల్లలు గొడవ చేయకుండా, పెద్దవాళ్ళు గుసగుసగా మాట్లాడుతూ జాగ్రత్త పడతారు. మనం పనిచేసుకుంటే ఇంట్లో వాళ్ళే కాకుండా పని మనిషి, చాకలి దగ్గరనుంచి అందరూ మననే వేధిస్తారు. భర్త ఇంట్లో వున్నా, లేచి సంగతి కనుక్కుందామనుకోడు. తన పేపరులో నుంచి తల ఎత్తకుండానే ‘ఎవరో వచ్చారు చూడవే’ అని చికాకు పడటం మన కలవాటే.
ఇంత సర్వ చాకిరీ చేసినా మళ్ళీ చూపించటానికేమీ కనిపించదు. ఇంట్లోనే వుండే స్త్రీల పరిస్థితి మరీ ఆన్యాయం, ఈ చాకిరీలో పెరుగుదల, అభివృద్ధి, పురోగమనం లాంటి అవసరాలకు చోటు లేదు. కడిగినవే కడిగి, తుడిచినవే తుడిచి, ఉతుకినవే ఉతుకుతూ మనం పిచ్చి వాళ్ల మయిపోవాలే తప్ప మన మెదడు బాగు పడేది లేదు. అందుకే చాలా మందికి ఇంటిని అతి శుభ్రంగా వుంచటం, చేసిన పనినే మళ్ళీ చేయటం ఒక పిచ్చితనం లాగా తయారవుతుంది. సమాజంలో ఏరకమైన పాత్ర వహించలేని గృహిణి ఇంట్లో ఈ పనిని అంతగా పెంచుకుంటుంది కూడా. ఏపనీ లేకుండా శూన్యంలో బతకటం మానవ ప్రకృతికి విరుద్ధం. అందుకే గృహిణి తన రోజునంతా పనితో నింపుకోవాలి లేకపోతే ఆమె జీవితానికి అర్ధం లేకుండా పోతుంది. ప్రపంచంలో అన్ని రకాల పనులలోకి తక్కువ హోదా వున్నది ఇంటి చాకరీ ”నా ఒంట్లో, మెదడులో వున్న శక్తినంతా పిల్లల్ని చూడటంలో ఖర్చుపెట్టాను. పసి పిల్లలుగా వున్నప్పుటి నుంచి పెద్దవాళ్ళయ్యేదాకా 24 గంటలు వాళ్ళ గురించి ఆరాటమే. ఇప్పుడు అందరూ పెద్ద వాళ్ళయి వెళ్ళిపోయారు. నా జీవితం మొత్తంలో నేను చేసిన పనంతా తుడిచి పెట్టుకు పోయినట్లయింది” అంటూ మానసికంగా కుంగిపోయే స్త్రీలు చాలా మంది.
అందుకే బయట పనిచేసే స్త్రీలకు ఇంటి పనే ప్రపంచం కానక్కర లేదు. వాళ్ళు ఇంటి పనికి కేటాయించే సమయం బయట వున్న బాధ్యతల్ని బట్టి కూడా వుంటుంది. ఇంట్లో ఎంతపని వున్నా ఎట్లాగో అట్లా ముగించుకుని బయటపడి ఆఫీసుల కెళితే ఊపిరి పీల్చుకోవచ్చని అనుకునే ఆడవాళ్ళు చాలా మంది.
ఇంట్లో మనం చేసే శ్రమ ఎవరికీ కనిపించకూడదు. రోజంతా ఎట్లా వున్నా భర్త ఇంటికి వచ్చేటప్పటికి చక్కగా తయారయి మోహం మీద చిరునవ్వు పులుముకుని ఏ పనీ చెయ్యనట్టు కనిపించాలి. రోజంతా ఏమి చేశావు అని భర్త ఆశ్చర్యపోతే చూపించటానికి ఏమి అగుపించదు కూడా. అందుకే స్త్రీ ఇంట్లో చాకిరిని పనిగా కాకుండా, ‘ప్రేమ’గా చూసేటట్లు సమాజం మనసు తయారు చేసింది, సమాజం దృష్టిలో స్త్రీకి సంబంధించి నంత వరకు పని ‘ప్రేమ’ ఒకే అంశానికి రెండర్ధాలు. ”నువ్వింట్లో పని చెయ్యకపోతే నీకు భర్త మీద పిల్లల మీద అపేక్ష లేనట్లే” అంటే ఆపేక్ష చూపించుకోవాలంటే చాకిరీ చెయ్యాలి. మగవాడట్లా ఆపేక్ష చూపించుకోవాలంటే ఇంట్లో పని చెయ్యాల్సిన అవసరం లేదు. అందుకే ‘ఇంటికి దీపం ఇల్లాలే’, ‘గృహమే కదా స్వర్గసీమ’ అనే సామెతల దగ్గర్నుంచి ‘ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం – చక్కని సంతానం’ ‘ఆ రవ తనము ఏ చోట నుండు అరుగు లలికే వారి అరచేత నుండు’ అనే సినిమా పాటల వరకు ప్రచారం చేసే సామాజిక సిద్దాంతాలు స్త్రీల చాకిరీని మసి పూసి మారేడు కాయ చేస్తాయంటే ఆశ్చర్యం లేదు.
మరి ఈ చాకిరీని స్త్రీలే ఎందుకు చేయాల్సి వస్తోంది? మొదటి నుంచి ఇంటి బాధ్యత, కుటుంబం, పిల్లల సంరక్షణ, సెక్సువాలిటీలన్నీ ప్రైవేటు ప్రపంచానికి సంబంధించినవి. స్త్రీలు ఈ ప్రపంచానికి పరిమితమై వున్నారు రాజకీయాలు, ఉత్పత్తి, యుద్ధాలు, విప్లవాలు అన్ని పబ్లిక్ ప్రపంచానికి చెందినవి. ప్రధానంగా మగవాళ్ళ ఆధిపత్యంలో వుంటాయి. అయితే మగవాళ్ళకు ప్రైవేటు ప్రపంచంలోకి కూడా స్వేచ్ఛగా ప్రవేశించే అధికారం, దాన్ని కంట్రోలు చేసే అధికారం వుంటాయి. ప్రైవేటు ప్రపంచం వాళ్ళకు అనుకూలంగా నిర్వహించ బడుతుంది. దాన్ని నిర్వహించే బాధ్యత స్త్రీ మీదే వుంటుంది. ఒక వేళ ఏ స్త్రీ అయినా తన ప్రైవేటు ప్రపంచం వదిలి పబ్లిక్ ప్రపంచంలో కెళ్ళే ప్రయత్నం చేసినా ఆమె బాధ్యత మొదట ప్రైవేటు ప్రపంచానికే.
అబ్బే! నేనుత్త గృహిణిని:
నిజానికి స్త్రీలు తమ భర్తలు తమతో సమానంగా ఇంటి బాధ్యతను, పిల్లల బాధ్యతను పంచుకోవాలని కోరుకోవటమే అరుదు, సమాజ విలువలు, పురుషాధిక్య విలువలు స్త్రీలు తమ ‘శ్రమని’ తామే గుర్తించకపోగా దాన్ని తక్కువగా అంచనా వేసే స్థితికి దిగజార్చాయి. బయట ఉద్యోగాలు చేయకుండా ఇళ్ళలో పనులు చేసుకునే స్త్రీలను మీరేం చేస్తున్నారనో, మీ వృత్తి ఏమిటనో అడగాల్సొస్తే వాళ్ళ సమాధానం అబ్బే నేనేం చేయనండి! నేను ఇంట్లోనే వుంటాను అని.
ఇంట్లో, వంటింట్లో ఎంత చాకిరీ చేసినా మన హోదా ఆత్మ విశ్వాసం, ఏమీ పెరగవు – మన పట్ల మన పని పట్ల మనకే గౌరవం వుండదు. మన పని పట్ట మనకే అసంతృప్తి. మనలో చాలమందిమి కొత్త రుచుల కోసం, వండే పద్ధతుల కోసం, సులువుగా పనులు చేసుకునే చిట్కాలకోసం నిరంతరం వెతుకుతూనే వుంటాం.
స్త్రీలు ఇళ్ళొదిలి బయట ఉద్యోగాలు చేస్తున్నా మళ్ళీ ఆఫీసుల్లో అందరికీ తల్లులుగా తయారవుతారు. అక్కడ వాళ్ళకు కాఫీ లందించి టీ లేర్పాటు చేసి భోజనాలు సర్ది మంచి అనిపించుకోవాలనే తపన మనలో ఎక్కువ, నేను పదేళ్ళ క్రితం పనిచేసిన ఆఫీసులో ఒకసారి క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు సమ్మె చేశారు. అక్కడ మెస్ ఒకటుండేది. అందులో వెయిటర్లుగా పనిచేసే వాళ్ళంతా కూడా సమ్మెలో వున్నారు. ఫ్యాకల్టీ మెంబర్స్‌కు అక్కడ కోర్సుల కోసం వచ్చే ఐ.ఏ.ఎస్ ఆఫీసర్స్‌కు వంట రెడీ అయింది. కాని వడ్డించే వాళ్ళు లేరు. అక్కడ యాజమాన్యం లేడీస్ స్టాఫ్ నంతా వడ్డన చేయటానికి ఆహ్వానించారు. మా వాళ్ళంతా రెడీ అయిపోయారు. నాకొకటేచికాకు. ‘వాళ్ళు వడ్డించుకోలేరా మనం ఎందుకు వెళ్ళాలి’ అని అసలు మనం ముందు క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయిస్ సమ్మెను సమర్థించేది పోయి వడ్డనలకు దిగటమేమిటి, అసహ్యంగా అని నేనంటే వాళ్ళకు అర్ధం కాలేదు.
ధరల పెరుగుదల స్త్రీల పనికి అదనపు భారం:
సాధారణంగా మనలో ఆర్ధిక స్తోమత లేని వాళ్ళం, ముఖ్యంగా మనలో పేద స్త్రీలు అత్యవసర వస్తువులు కొనటానికి రోజు కూలీ డబ్బులను రోజు వారీగా ఖర్చు పెడుతుంటాం. ఈ విధంగా కొనటం డబ్బు రూపంలో మనకు నష్టాన్ని కలుగ జేయటమే కాక మన సమయం చాలా వృధా అవుతుంది. దుకాణాలలో గంటల తరబడి నిలబడి సరకులు కొనాలి. రోజంతా శ్రమ చేసి దుకాణాలలో నూనె, ఉప్పు, పప్పులు కొనుక్కొచ్చి గంటల తరబడి కట్టెల పొయ్యి మీద ఊపిరాడ కుండా వండాల్సిన బాధ్యత నెత్తినున్న వాళ్ళు పేద స్త్రీలు. ఇక ధరలు పెరుగుతే స్త్రీల అగచాట్లు చెప్పనక్కర లేదు. రేషన్ దుకాణాలలో ఎడతెగని క్యూలు, కిరోసిన్ కోసం చక్కెర, బియ్యం కోసం కాళ్ళీడ్చుకుపోయేలా పడిగాపులు కాయటం. మన శక్తిని హరించి వేస్తుంది. అన్నిటికంటే వస్తువు లెక్కడ చౌక అని నిరంతరం వెతుకుతూనే వుంటాం.
వ్యాసం మొదట్లో ప్రస్తావించినట్లు స్త్రీని మొదట తల్లిగా, భార్యగా, గృహిణిగా గుర్తిస్తాం. కనుక ఆ స్త్రీలు చేసే పనికి కూడా అంతే విలువ వుంటుంది. సమాజంలో మొదట స్త్రీకి విలువ లేకుండా పోయిన తరువాత ఆమె పనికి కూడా విలువ లేకుండా పోయింది. అయితే ఈ ‘విలువ లేని’ పని మనం చేయడం మానేస్తే ఏం జరుగుతుందో ఒక్క క్షణం ఊహించుకోవాలి! మొత్తం ప్రపంచం తలక్రిందులై పోతుంది. మనం ఈ పని చేయకుండా వుంటే మగవాళ్ళు శారీరక అవసరాలు తీర్చడానికి, వాళ్ళకి అలసిపోయి వస్తే మనశ్శాంతి కలిగే వాతావరణాన్ని సృష్టించి మానసికమైన ఆసరా, సహకారాన్ని అందించడానికి ఎవరూ వుండరు. మనం చేసే పనంతా ఎవరి సుఖం కోసం, దానితో ఎవరికి లాభం, అని ఆలోచిస్తే సమాధానం చెప్పకుండానే బోధపడుతుంది.
ఇంటి చాకిరి – శ్రమ – విలువ:
ఇంటి చాకిరంతా స్త్రీల బాధ్యతే అనే సామాజిక స్పృహవున్నంతవరకూ స్త్రీలకూ విముక్తి లేదు. అందుకే స్త్రీల పనిని ”శ్రమగా” అందరూ గుర్తించేట్టు చెయ్యాల్సిన బాధ్యత మన మీద వుంది. ఇంటిపనిని కుటుంబానికి, సమాజానికి అత్యవసరమైనదిగా మనం గుర్తించాలి. ఒక కుటుంబం కోసం స్త్రీ వెట్టి చాకిరీ చెయ్యకుండా అచ్చంగా యజమాని ఇచ్చే జీతంతో మగవాడు ఇంటిని నడపడం అసాధ్యం. మనది వెట్టి చాకిరీ, మనం ఇంట్లో చేసే ప్రతీ పనికి విలువ కట్టడం ప్రారంభిస్తే సంపాదిస్తున్న మగవాడి జీతం మించిపోతుంది. ఉదాహరణకి పంటకు ఒక మనిషిని రేషన్ సరుకులు, కూరగాయలు తేవడానికి, బిల్లులు కట్టడానికి నౌకరుని, చెట్లకి నీళ్ళు పోయటానికి మాలిని పెట్టామనుకోండి. వీళ్ళందరిని పోషించడానికి మగవాళ్ళకు శక్తి చాలదు. భార్య వెట్టి చాకిరీకి విలువ కట్టడం ప్రారంభిస్తే దాన్ని ఎవరు భరించాలి? ప్రభుత్వమా, భర్త పనిచేసే ఫ్యాక్టరీ, ఆఫీసు యాజమానులా? ఒక ఉద్యోగిగా, ఒక కార్మికుడుగా మగవాడి శ్రమని’ వినియోగించుకోవటానికి ప్రభుత్వానికైనా, పెట్టుబడి దారుడికైనా కుటుంబం మొత్తాన్ని భరించాల్సిన అవసరం వుంటుంది. అట్లా ప్రారంభమయిందే కుటుంబ వేతనం. కుటుంబ వేతనాని కర్ధం కార్మికుడి కవసరమైన కుటుంబ వాతావరణాన్ని సృష్టించే భార్య పిల్ల్లల్ని పోషించటానికే కాని భార్య శ్రమకి విలువ కట్టడం కాదు. అందుకే భార్య ఇంట్లో చేసే పని ఆర్ధిక విధానానికి లాభాలు సమకూర్చేదిగా వుంటుంది. స్త్రీల శ్రమ విలువ కట్టడం ప్రారంభిస్తే పెట్టుబడి దారులకు, ప్రభుత్వానికి, భూస్వాములకు లాభాలనేవి మిగల కుండాపోతాయని అర్ధం చేసుకోవటం కష్టం కాదు.
మధ్యతరగతి స్త్రీలు కూడా సంపాదిస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితులు ఈనాడు వున్నాయి. అందుకే మధ్య తరగతి కుటుంబాల్లో కూడా బయట ఉద్యోగాలు చేయని స్త్రీలు అరుదు. ఈ మారుతున్న పరిస్థితులలో విలువలు కూడా మారాలని స్త్రీలు కోరటం న్యాయం. కాని ఉద్యోగం చేసే ఏ స్త్రీ అయినా ఇంటిపని బాధ్యతలో మగ
వాళ్ళు పాలు పంచుకోవాలని డిమాండు చేయటాన్ని తల బిరుసుతనంగా, అహంభావంగా చూస్తారే తప్ప అది వాళ్ళ హక్కుగా గుర్తించరు.
సహకరించే భర్తలు:
చాలా రోజుల క్రితం ఒక పుస్తకంలో ‘ఇంటి చాకిరీ రాజకీయాలు’ అనే వ్యాసం చదవటం గుర్తుంది. అందులో కలిసి బతకాలని నిర్ణయించుకున్న ఒక స్త్రీ పురుషులిద్దరూ కొన్ని బాధ్యతలను పంచుకోవాలని ఒప్పందం చేసుకుంటారు. వెచ్చాలు కొనటం, అవి ఇంటికి మోసుకు రావటం, డబ్బాలలో సర్దటం, వంట చేయటం, గిన్నెలు కడగటం బట్టలుతకడం (మెషీన్ లోనే) వాటిని ఇస్త్రీ పెట్టటం, ఇల్లు దుమ్ము దులపటం, వారంపదిరోజుల కొకసారి ఇళ్ళు కడిగి శుభ్రం చేయటం లాంటి పనులన్నీ జాబితా రాసుకుంటారు. మొదట్లో భర్త ఈ పనులను కష్టపడి ఎలాగో లాగ చేయటానికి కృషి చేస్తాడనే చెప్పాలి. కానీ, చాలా త్వరలో ఆయనలో మార్పొచ్చేస్తుంది. ఈ పనులు తను చేయాల్సి వచ్చినప్పుడల్లా కూర్చొని ఆలోచిస్తూ, పనుల గురించి ఆలోచనల్లోనే అలిసి పోతుండేవాడు. ఇంటి చాకిరీని తప్పించుకోవటానికి సవాలక్ష సాకుల్ని వెతుక్కుంటూండే వాడు. ఎంగిలి కంచాలు గిన్నెలు, చీపుర్లు, అలుగ్గుడ్డలు, కంపుకొట్టే చెత్త డబ్బా ఇవే ఆయన కలల్లోకి కూడా వచ్చేవి. ”ఇంటి పనా! ఆ! అదెంత సేపు మీ ఆడవాళ్ళకు సమర్ధత లేక దాన్ని పెద్దపనిగా చూస్తారు. కానీ చిటిక లోపల చేయచ్చు”అనే మగాళ్ళకు పనిని వంతులు వేసుకు చూడమనండి తెలుస్తుంది. ఆ భర్త చేసే వాదనలు చూడండి ఎలా వుంటాయో?
”నాకు ఇంటిపని చేయడానికి అభ్యంతరమే లేదు. కాని నేనది చేయటంలో ఎక్స్‌పర్ట్‌ని కాను. మనిద్దరం కూడా ఏ పనులు బాగా చేయగలుగుతామో అవే చేయటం వుత్తమం.” దీనికి అర్ధం నేను గిన్నెలు తోమటం, బట్టలుతకటం కంటే కాలిన బల్బులు మార్చటం, ఫ్యూజుమార్చటం, స్క్రూడ్రైవరుతో వదులైననట్లు బిగించటం, లాంటివి సులభంగా చేయగలుగుతాను. (ఈ పనులు రోజూ చేసే అవసరమేముంది?) ఇంకొక అర్ధం వెధవ చెత్త పనులన్నీ నువ్వు చేసుకో ”నాకు పని ఎగ్గొట్టాలనే కోరిక లేదు. కాని ఎట్లా చేయాలో నువ్వే చెప్పాలి”.
2వ అర్ధం. నేను ఊరికే ప్రశ్నలడుగుతాను నిన్ను వేధిస్తాను. నువ్వు చెప్పాలి. నాకు గుర్తుండదు కనుక చేసిన ప్రతిసారీ నువ్వు చెప్పాలి. నాకు గుర్తుండదు కనుక చేసిన ప్రతిసారీ నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అంతేకాదు నేను చేయలేక ఛస్తుంటే నువ్వింట్లో కూర్చొని పుస్తకం ఎట్లా చదువుతావు? ఈయనతో వేగేకంటే నా పనులు నేనే చేసుకోవటం ఉత్తమం అని నువ్వనేదాకా నిన్ను వేధించగలను.
‘నా పని పద్ధతి వేరు. నీది వేరే నేను నువ్వు చేసినట్లెందుకు చేయాలి” 3వ అర్ధం. నువ్వు బెడ్ షీటు వేసినప్పుడల్లా చక్కగా వేస్తావు అదే నేను చేస్తే ముడుతలుగా వేస్తాను. నువ్వు విసుక్కుని విసుక్కుని చివరికి వేసుకోవటం మొదలు పెడతావు. నేను వంట చేస్తే రోజూ అదే కూర అదే పద్దతిలో చేస్తాను. నీకు వెరైటీ కావాలను కుంటే చేసుకో, ఇల్లు శుభ్రంగా లేదంటావే, నాకేం అభ్యంతరం లేదు ఇంతకన్నా శుభ్రం కావాలంటే నువ్వే చేసుకో” అని ఇంకో అర్థం.
‘నాకు ఇంటి పని అంటే అయిష్టాలేం లేవు.కాని నన్ను చేయమంటే నా కిష్టం వచ్చినపుడు చేస్తాను. గిన్నెలన్ని మూలకి పెట్టు రెండు రోజుల కొకసారికడిగితే సరి. బట్టలు వారానికొకసారి
ఉతుక్కుంటే ఏం పోయింది. మంచి నీళ్ళు రేపు పట్టుకుంటే కొంప మునిగిపోతుందా? నీకెక్కువసార్లు చేసుకోవాలని జిలగా వుంటే చేసుకో”
భార్యలకి ఇంట్లో పనుల్లో సహాయం చేస్తామని గొప్పలు చేప్పే మగాళ్ళ ధోరణి ఇది. ఇవన్నీ పడలేక ఆడాళ్ళు వాళ్ళే చేసుకుంటే ”ఆడవాళ్ళకి ఇంటిపనులు చేయాలంటే ఆపేక్ష” అని సూత్రీకరణ చేస్తారు.
ఇంటి చాకిరీ గురించి మనం గుర్తించుకోవాల్సిన విషయాలు:
– మొట్టమొదట ‘ఇంటి చాకిరీ’ అంటే స్త్రీల బాధ్యతేనన్న సామాజిక దృక్పథాన్ని నిర్మూలించాలి.
– ఇంటి పనిని సభ్యులందరూ పంచుకోవాలి. లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్కరుగా (వంతుల వారీగా) చేసుకోవాలి. అప్పుడే వ్యక్తుల మధ్య సంబంధాలలో సమానత్వం అనే అంశానికి అవకాశం వుంటుంది. ఎవర్నీ ‘ఈ పనులు చేయండి’ అని మనం అడిగే అవసరం రాకూడదు.
– ఇంటి పని అందరికీ అవసరమయినది. కాబట్టి అందరి బాధ్యతగా వుండాలి. యాంత్రికమైనది, సృజనాత్మకం కానిది కనుక ఒకేవ్యక్తి ఎల్లకాలం అదే పని చేస్తూ బతకాలని ఆంక్ష విధించటం వాళ్ళని మానసికంగా హింసించటంగా పరిగణించాలి.
– మగవాళ్ళు పనిని సరిగా చేయలేక పోయినా మనం చేసినంత పర్‌ఫెక్ట్‌గా వాళ్ళది లేకపోయినా అసహనంతో మనమేచేసుకోకుండా ఓపిక పట్టడం నేర్చుకోవాలి. మనం బయట ఉద్యోగాలు, ఇంట్లో పనులు రెండూ నిర్వహించుకొనే సమర్ధత కలవాళ్ళం. మగవాళ్ళు ఇంటి పనిని నిర్వహించ లేని వాళ్ళు అది వాళ్ళ చేతకానితనంగా మనం గుర్తించాలి.
– ఇంటి చాకిరీ సాధ్యమైనంత తగ్గించుకోవాలి. అంటే అర్థం. మెరుగైన ప్రెషర్ కుక్కర్లు, నున్నటి గ్యాస్‌స్టౌలు, రెండు నిముషాలలో తయారయ్యే నూడుల్స్, దోసెమిక్స్, ఇడ్లీమిక్స్‌ల వంటి ఎడ్వర్టయిజ్‌మెంట్ల గోతుల్లో పడమనికాదు. నిజానికి వాటి వెనుక వంట, బట్టలుతకటం, ఇల్లూడవటం లాంటి పనులు స్త్రీలు ఇంకా చక్కగా చురుగ్గా ఎలా చేయగలరో చూపించే ప్రయత్నం తప్ప, ఆసలీపనులు స్త్రీల బాధ్యతే ఎందుకు కావాలో ప్రశ్నించే అంశం మీద వుండదు. (చివరకి వ్యాక్యూమ్ క్లీనర్లు, ఎక్వాగార్డులు అమ్మేది కూడా మగవాళ్ళే)
– స్త్రీల పనిని ఆర్ధిక వ్యవస్థకు లాభాలు చేకూర్చే వృత్తిగా అంచనా వేసిన నాడే మన పనికి, మనకు కూడా విలువ పెరుగుతంది.
(భూమిక ఏప్రిల్-జూన్, 1993 సంచిక నుండి)