ఆమె చచ్చిపోయింది
కాలం మనిగుడ్డపై ఊడిగ సంతకం చేస్తూ
కన్నీటి భిక్షను కడకొంగున ముడేసుకుని
సూర్యాస్తమయాలు ఇంకిన వంటింటి కిటికీలోంచి
అదృశ్య అలలా పొగ దేహానికి కుంపటి అంటించి
ఉట్టిమీద పుచ్చిన కళేబరంలా ఆమె బోలుదేహం
దుఃఖకళికలు స్రవించింది!
యుగయుగాలుగా తన పేరేమిటంటున్న ప్రతిబింబాన్ని
చిల్లుల చేదలతో బిందెల మాటున మూతులు కుట్టేస్తున్న
గిలకల బావి వెక్కిరింతలకు
నవ్వుకుంటున్న కూడలి అవిటి విగ్రహాల ఎత్తిపొడుపులకు
జవాబివ్వలేని నిస్సహాయతలో..
ఆమె రెక్కలు రాలిన పూవులా
సంజె చుక్కల్లో కలినిపోయింది.