-ఎన్.గీత (ఎం.ఆర్.ఓ చెన్నారావుపేట)
గ్రామాల్లో ‘ఆశ’ ప్రోగ్రాం వల్ల ఇప్పుడిప్పుడే హెచ్ఐవి గురించి తెలుస్తోంది. అది చాలా తీవ్రమైన వ్యాధి అని వారికి తెలియదు. గ్రామంలో చనిపోయిన వారందరూ తాగడం వల్ల, పోషకాహారం లేకపోవడం వల్ల చనిపోతున్నారని అనుకుంటారు. రక్త పరీక్షలు జరగడం లేదు. ఇప్పుడిప్పుడే అంగన్‌వాడీ వర్కర్లు గర్భిణీలకు హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు. గత ఆరునెలల్లో షుమారు 10 హెచ్ఐవి కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇలాంటి సందర్భంలో భర్తల్ని రక్తపరీక్ష చేయించుకోమంటే వారు ముందుకు రావడం లేదు. ఇద్దరు మాత్రమే చేయించుకున్నారు. ‘ఆశ’ ప్రచారం వుంది గాని, హెచ్ఐవి మీద సరైన సమాచారం లేదు. ‘ఏదో రోగమొస్తుందంట’ ఇలా భావిస్తుంటారు. సెక్స్ మీద మాట్లాడ్డం ఇంకా కష్టంగానే వుంది. పురుషుల్లో వివాహేతర సంబంధాలు చాలా సహజమనుకునే స్థాయిలోనే వున్నారు. నిశ్శబ్దాన్ని బద్దలుగొట్టాలనే కార్యక్రమం మొదలై చాలాకాలమే అయినా వీళ్ళు మాత్రం ఓపెన్- అప్ అవ్వడం లేదు.
గ్రామాల్లో హెచ్ఐవి మీద ప్రచారం ఇంకా ఎక్కువస్థాయిలో జరగాలి. బహిరంగ సభల్లో, సమావేశాల్లో, అంగన్‌వాడీ మీటింగుల్లో, వెలుగుసంఘాల మీటింగుల్లో దీనిగురించి చెప్పడం జరుగుతోంది. అయితే ఇవన్నీ స్త్రీల సమావేశాలే అవ్వడం వల్ల, సమాచారం స్త్రీలకు చేరనంతగా పురుషులకి చేరడం లేదు. ప్రతి గ్రామంలోను, ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపికచేసి, శిక్షణ నిచ్చి హెచ్ఐవి రిసోర్స్ పర్సన్స్ గా వాళ్ళని నియమించారు. కాని వాళ్ళు చెప్పేది మగవాళ్ళు వినడం లేదు.
నేను పనిచేస్తున్న ఈ మండలంలో చాలా తండాలున్నాయి. వాళ్ళని మనం చేరాలంటే, ఈ సమాచారం వాళ్ళకి చేరాలంటే, వాళ్ళల్లోంచి కొందరిని ఎంపికచేసి, వాళ్ళతోనే చెప్పించాలి. అది చాలా ఎఫెక్టివ్‌గా వుంటుంది. అంతేకాదు హెచ్ఐవి సమాచారం వారి కల్చరల్ ఏక్టివిటీలో భాగం కావాలి. ఈవిధంగా వాళ్ళని చైతన్యపరచవచ్చు.
అలాగే గ్రామసభల్లో ఈ అంశాన్ని తప్పనిసరిగా చర్చించేలా చెయ్యాలి. రచ్చబండ దగ్గర సమాచారం అందుబాటులో వుంచాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే – ప్రభుత్వం పథకాల లబ్దిదారులందరినీ తప్పనిసరిగా ఈ టెస్టు చేయించుకొనేలా నియమం పెట్టాలి. వారిమీద భారం మోపకుండా ప్రభుత్వమే ఈ పరీక్ష చెయ్యాలి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను ఈ పరీక్ష అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రచారం, అవగాహన రెండూ జరుగుతాయి. ప్రస్తుతం ప్రచారం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆ ప్రచార దిశని ఈవిధంగా మారిస్టే 90 శాతం ప్రజలకి అవగాహన కలుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టాలి. బాల్యవివాహాలు జరగడం వల్ల, భర్తలు వివిధ కారణాల వల్ల చనిపోవడం.
(ఇందులో ఎయిడ్స్ కూడా ఒక కారణం కావొచ్చు) జరుగుతోంది. బాధాకరమైన విషయమేమిటంటే ప్రతి గ్రామంలోను 25-35 ఏళ్ళ వయసులో వుండే విధవలు 1000.కి 100 వుంటున్నారు. వీళ్ళు చాలా వల్నరబుల్‌గా వున్నారు. ఈ అన్ని అంశాలని పరిగణనలోకి తీసుకుని ఎయిడ్స్ ప్రచార సరళి దిశని మార్చితే బావుంటుంది.