అమ్మ ఓడిపోయింది- జ్వలిత

”టీచర్‌ వాడు చచ్చిపోయాడు” ఆనందంగా చెప్పింది సంతోషి.
”వారం రోజులు బడికి రాలేదు ఎందుకు అంటే.. ఎవరో చచ్చిపోయారంటవేం” మందలించింది టీచర్‌. ”అవును టీచర్‌, నేను పుట్టినందుకు మా అమ్మను కొట్టి… అమ్మను వదిలేస్తాననినన్ను, అక్కను చంపుతానన్నవాడు. తాత వాడి
కాళ్ళు పట్టుకొని బతిమిలాడితే అక్కను మాత్రమే సాదడానికి ఒప్పుకున్నవాడు… ఇన్నేళ్ళు నాకు అమ్మను దూరం చేసినవాడు చచ్చాడు టీచర్‌” ఉద్వేగంగా చెప్పింది సంతోషి.
జలధి టీచర్‌ ఆ పసిదాని పరిస్థితి కొంత అర్ధం చేసుకుంది.
”సరె సరె, నువ్వెందుకు ఎళ్ళావ్‌ వాడు చస్తె, వాడంటె నీకసహ్యం కదా” టీచర్‌ అడిగింది.
”అదే టీచర్‌ వాడు చస్తె చూడ్డానికి కూడా రానన్నదట మా అక్క. అంతగా హింసపెట్టాడు అక్కను వాడు. ఏదో స్నేహగృహం అని బాధిత మహిళల కోసం పనిచేస్తుందట అక్కడ తలదాచుకుంటున్నది. మా తాత పట్టుపట్టీ తీసుకుపోయ్యాడు. నేనే తలకొరివి పెట్టి వచ్చా వాడికి” గాలి పీల్చుకుంది ఆ అమ్మాయి. పిల్ల వెంటే తోడుగా వచ్చి బయటె నిల్చున్న నరసయ్య ఆ మాటలన్ని వింటున్నడు. మరి మీ అమ్మ మీతో వచ్చిందా? అడగింది టీచర్‌.
”రాలేదు. ఐదు సంవత్సరాలు కాంట్రాక్టుకు మా అమ్మను పనిమనిషిగా కుదిర్చి డబ్బులు తీసుకున్నాడు వాడు. ఇంకా రెండేళ్ళ వరకు రాలేదు” బాధగా చెప్పింది సంతోషి.
”బాధ పడకు సంతోషి. నేను నిన్ను చదవిస్త మా ఇంటికి రామ్మా,” ధైర్యం చెప్పింది.
”లేదు టీచర్‌ మా తాతకు ఎవరున్నరు నేను తప్ప. నాకు ఏ అవసరం వచ్చినా మీ దగ్గరికె వస్తాను” అమ్మ మనసున్న సంతోషి అన్నది. ”నీకు మీ తాతమీద మీ అమ్మ మీద కోపం లేదా..” అడిగింది జలది. తాత సగటు తండ్రె కదా తన బిడ్డ కాపురం సక్క చేసిండు. మా అమ్మమ్మ పిసరంత ధైర్యం నన్ను కాపాడింది. అమ్మకు ధైర్యం చెప్పె వాళ్ళు లేరు చదువు లేదు. భర్తకు ఎదురు చెప్పలేక నరకం చూసింది. టీచర్‌ మీ వంటి వారు ఇచ్చే చైతన్యం నా లాంటి వాళ్ళను కీచక సమాజం నుండి కాపాడి… ఆత్మ విశ్వాసాన్నిచ్చి అమ్మను తాతను క్షమించె దయాగుణం నేర్పింది. సంతోషి మాటలు వింటున్న నరసయ్య గతంలోకి జారుకున్నాడు.
అమ్మా… అమ్మా… అమ్మా..
అంట ఏడుస్తాంది… పసిది.
అమ్మ నేనేం సేయనే అంట ఏడుస్తాంది. పసిదాని తల్లి..
అయ్యో… తల్లి ఏమి సెప్పనే బిడ్డల్లారా అంట ఏడస్తాంది అరవై ఏళ్ళ ముసలమ్మ.
కొన్ని వందల సార్లు మనసులో అదె అనుకుంట ఏడిసిన్రు.
రాత్రంత ఏడస్తనే ఉన్నరు ముగ్గురు.ఎవ్వరు నిద్రపోలేదు. వాకిట్ల పండుకున్న మల్లయ్య కోడికూతకు లేసి ఇంట్లకు వచ్చిండు.
సంటిది జరంతో అమ్మా అమ్మా అని ఏడవడం సూసిండు. మిగిలిన ఇద్దరు కండ్లు తుడుసుకున్నారు మల్లయ్యను సూసి.
ఏడుసుకుంట కూసుంటె ఏమయతది? పసిదాన్ని మీ అమ్మకిచ్చి పెద్దదాన్ని లేపి బయలెల్లు బిడ్డా! పట్నం బండి ఏల్లయ్యింది. అన్నాడు నరసయ్య.
తల్లి బిడ్డలు ఉలికి పడ్డరు. అనుకున్నంత అయ్యింది…, తమ ప్రమేయం లేకుండానే తమ జీవితాల నిర్ణయం జరిగింది.
ఒక నిర్ణయం జరిగిపోయింది. తల్లీబిడ్డల జీవితాలను శాసిస్తూ…
అల్లుడి షరతుకు నరసయ్య ఆమోద ముద్ర వేసిండు.
ఏదన్న పని సేసుకుంట నేను మీ దగ్గరె ఉండి నా యిద్దరు పిల్లల్ని సాదుకుంట, నాయినకు సెప్పమ్మా…
బలహీన గొంతుకతో అడిగింది సంటిదాని తల్లి.
నరసయ్య వైపు నిస్సహాయంగా భయంతోచూసింది ముసలమ్మ.
ఏందది సెప్పేది, ఏం పని చేస్తావు, ఎట్ల సాత్తవ్‌ ఇద్దరాడ పోర్లను. మొగన్ని వదలి ఒంటరిగా బతుకుతవా లోకం ఊకుంటదా… పెద్దదాన్ని తీస్కరమ్మనె గదా నీ పెనిమిటి చెప్పిండు. చంటి దాన్ని ఏ అనాధ ఆశ్రంలన్న ఏస్తంలే మేము. నువ్‌ బయలెల్లు అన్నాడు నరసయ్య.
ఎర్రకోడి పెట్టనుకోసి కూరొండు.. కంచెకున్న సొరకాయపులుసు పెట్టు అన్నంత సులువుగా… నాయినా.. అన్నది దీనంగ సంటి పిల్ల తల్లి. ఏందె మాలావ్‌ ఇదయతన్నవ్‌… నీ మొగడు మంచోడు సంటిదాన్నొదలిపెట్టి వస్తె నీతో కాపురం చేస్తాన్నడు.
పెద్దపిల్లను సాత్తన్నడు. లేక పోతే ఇద్దర్ని తిస్క పొయ్యి మీ అత్తతో కలిసి మీ యారాలు బిడ్డల సంపినట్టు సంపితే ఏమి చేస్తవ్‌ అన్నడు నరసయ్య. బ్రహ్మాస్త్రం ఉపయోగించబడింది పిచ్చుక మీద. సంటిదాని తల్లి నోరెత్త లేదు. నరసయ్య పెద్దపొల్లను తల్లిని బొంబయి తీస్కపొయ్యి అల్లునికి ఒప్పజెప్పి వచ్చి గాలి పీల్చుకున్నడు.
సంటిది పదినెలల పిల్ల. పుట్టినప్పట్నించి గొడవలె ఆడపిల్ల పుట్టిందని.
పసిపిల్లను ఏ గుడి కాడొ బస్‌ స్టాండ్లనో వదిలేసి వస్తన్నడు నరసయ్య. ముసల్ది ఒప్పుకోలె పిల్లను తీస్కొని బాయిల పడతా అన్నది.
వచ్చే పించను నీకు నాకె సాలదు. ఈ ముసలితనంల సంటిదాన్ని ఎట్ల సాత్తవె ముసలి ముండ అని తిట్టిండు.
చాతకాన్నాడు చూద్దాం. మొండికేసింది ముసల్ది…
తాతా తాతా నువు యింటికిపో బడయినంక వస్త అన్నం తిని మందులేసుకో అన్న పసిదాని మాటలతో గతం నుండి బయట పడ్డడు నరసయ్య. ఇంటి దారి పట్టిండు. ముసల్ది ఈ మధ్యనే కాలం చేసింది కిడ్నీలు పాడయి.
పసిదానికి పదిహేనేళ్ళు పదో తరగతి చదువుతోంది. పేరు సంతోషి. మా ఇంట్లో ఉండమ్మా నేను చదివిస్త అన్న టీచర్‌తో మా తాతకు ఎవరున్నరు?నేను మీ దగ్గరికొస్తె… అవసరమున్నపుడు మీ దగ్గరికే వస్త టీచర్‌ అన్న సంతోషి మాటలకు నరసయ్యకు దుఃఖం తన్ను కొచ్చింది. ఈ అమృతపుఅంకురాన్ని మురికి కాలువల కలుపుదామనుకున్నాడు. ముసల్ది చచ్చి ఏడుందో ఈ అమ్మ చెట్టును కాచింది. అదే తనకు నీడనిచ్నేందుకు నిలబడింది అనుకుంట
కళ్ళు తుడుచుకున్నడు నరసయ్య.
”ఆడపిల్లలను చెట్లను కాపాడుదాం, ప్రకృతిని రక్షిద్ధాం” నినాదాలిచ్చుకుంట రోడ్డు దాటుతోంది బడిపిల్లల గుంపు.

Share
This entry was posted in గల్పికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.