కవిత్వం ప్రశాంత సరస్సులో అలల మందహాసం. సాగరసంగమంలో కెరటాల వీర విహారం! వస్తురూప వైవిధ్యం, దృశ్యరూప సమ్మేళనం, హృద్యమైన వ్యక్తీకరణ, భావగాఢతకీ, భాషాసారళ్యానికీ కొనసాగిన ఆలోచనాధార కవిత్వం.
శబ్దార్థ సౌందర్యంలో ఆత్మప్రక్షాళన గావించే కవిత్వం కొందరికే సొంతం. కవిత్వానికి సంగీతం తోడైతే ఒక జలపాతం కింద స్నానం చేస్తున్నట్లుగా అనుభూతి. ఒక కొత్త కాంతిలో ఓలలాడిన జ్ఞాపకం. కవిత్వంలో సంగీతాన్ని మేళవించి, సంగీతంలో కవిత్వాన్ని లయించి, ఆకుపచ్చని మైదానంలో ఆహ్లాదంగా నడుస్తున్నట్లనిపిస్తుంది. విశ్లేషణకు వీలుకాని అనుభవైకవేద్యమైన అంతరాంతరాల్ని స్పృశించే శక్తి సంగీత, సాహిత్యాలకుంది.
ఈ నేపథ్యంలోంచి, ప్రవాహధారలోంచి మరువలేని, మరపురాని, మనోహర కవయిత్రి శ్రీమతి ఆదూరి సత్యవతీదేవిగారు. వీరి జన్మస్థానం గుంటూరు, వివాహానంతరం ‘విశాఖ’లో స్థిరపడ్డారు.
తనదైన శైలితో 13వ ఏటనే కలం పట్టిన భావుకురాలు. 250 పైగా లలిత, భక్తి, దేశభక్తి, బాలల గీతాలు రచించారు. ఆకాశవాణిలో స్వరార్చన గావించారు
బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గీతం, కవిత, కథ, వ్యాసం, రేడియో, నాటిక, సంగీతరూపకం, పుస్తక సమీక్ష, చిత్ర సమీక్ష, పీఠికలు వంటి విభిన్న ప్రక్రియల్లో రచనలు సాగించిన రచయిత్రి సత్యవతీదేవిగారు.
వెన్నెల్లో వేణుగానం (1988), రెక్కముడవని రాగం (1992), జలపాత గీతం (1997), వేయిరంగుల వెలుగురాగం (2006) మొదలైన కవితాసంపుటాలను రచించగా, ‘రెక్కముడవని రాగం’ సంపుటి ‘పంఖ్ న మోద్‌నేవాలా రాగ్’ పేరుతో హిందీలోకి అనువాదమైంది. దేవులపల్లి వారి భావకవితాశైలిని అందిపుచ్చుకున్న రచయిత్రిగా గుర్తింపు పొందారు.
కవిత్వాన్ని లోలోపలి ప్రాణలిపిగా, కన్నీటి పర్యాయపదంగా ధృవీకరించిన రచయిత్రి ఈమె. తనదైన అనంతాన్వేషణలో మహాప్రస్థానం చేరుకున్న స్వరవేణి ఆదూరి సత్యవతీదేవిగారు. సహచరుడు, రచయిత ఆదూరి వెంకటసీతారామమూర్తిగారు తన అంతరంగమూర్తిపై ‘అంతర గాంధారం’ పేరుతో సత్యవతీదేవి రచించిన ఆధ్యాత్మిక భక్తిగీతాలను సంపుటీకరించి వారికి నివాళిగా అర్పించిన అమృతమూర్తి. గతంలో ఆదూరి సత్యవతీదేవిగారు నాకు పరిచయస్థులు కావడం చేత, వారిమీద నాకున్న అమితగౌరవంచేత, వారి సాహిత్యంమీద ఓ విశ్లేషణ వ్యాసం రాయాలన్న ఆలోచన కల్గింది. అందుకు ప్రేరణగా నిల్చినవారు మూర్తిగారే. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెల్పుకుంటున్నాను.
సత్యవతీదేవిగారు 1992లో శీలా వీర్రాజుగారి ముఖచిత్రంతో ‘రెక్కముడవని రాగం’ పేరుతో కవితాసంపుటిని తెచ్చారు. జీవితాన్ని గాఢంగా ప్రేమించిన వ్యక్తిగా, కవిత్వాన్నీ అంతే గొప్పగా ప్రేమించిన కవయిత్రిగా ఈ కవిత్వం అనుభూతుల అన్వేషణ దిశగా సాగుతుంది. తన కవిత్వ రచనలో జీవశక్తిని నిక్షేపించిన అనుభవం వీరికి ఉందనిపించింది నాకు –
”ఆలోచన సముద్రమంత పొడవు చాచి వుంది / చూపు శతాబ్దం ముందుకురికి వుంది / గొంతులోని తరంగాలు తంబూరా / వెన్నుపూసల్ని కదిలిస్తూనే వుంది / మేధలో అగ్నికణం ఫెటిల్లున చిట్లుతూ / అంతర్లోకాన్ని వెలిగిస్తూనే వుంది / అయినా దారి తెలియటం లేదు / తీరం ఆనటం లేదు / వేకువ రెప్ప విప్పారనే లేదు / యుగాల నిద్ర కరగనే లేదు / బొట్లు బొట్లుగా రాలిన సిరాచుక్కలు / ఎడారి వర్షపాతమై ప్రవహిస్తున్నందుకు / నిప్పులపోతగానే వుంది / అయినా / రవంతైనా / విశ్రాంతి లేని ఈ పయనం / రేయి రెక్కల్ని తొడుక్కున్న ఒక అనాది గీతమై / అదే పనిగా పాడుతూనే వుంది /” (రెక్కముడవని రాగం-1992)
నిత్య వైరుధ్యాల బరువుతో, బ్రతుకు పరాయితనపు కొత్త పోకిళ్ళతో నలుగుతూ, బండబారిపోయే కళ, లోలోపలి దీపకాంతిని ఎగసనదోసి, ఖడ్గమందించేది కవితా ప్రపంచమే. ఎప్పుడూ ఒక నూతన భావోద్వేగం ఉక్కిరిబిక్కిరిగా తనలో లయమౌతుందనీ, తానెప్పుడూ వినని, చూడని, ఒక పక్షి పాట, ఒక పాదముద్ర తనకొక సూర్య నేత్రాన్ని బహూకరిస్తాయని ఒక ఆశ, ఒక విశ్వాసమే కవితాబంధువవుతుందని భావించే ఈ రచయిత్రి కవిత్వానికొక చిరునామాగా మిగిలింది –
”అక్షరం హృదయమైనపుడూ / హృదయమే పద్యంగా మారినపుడూ / కవిత్వం ప్రాణధారలందిస్తుంది / జీవితలాలసలన్నిటికన్నా / కవిత్వం శిఖరాగ్రమైనపుడు మాత్రమే / మనస్సు ఒక రాగ జలపాతంలో ఓలలాడుతూ / కాంతిమయంగా మారుతుంది / కవిత్వపు పడవ వేసుకొని / జీవిత పాధోదుల్ని ఈదుతున్నప్పుడు / విశాలమైన అరలూ తెరలూ లేని / విశ్వకుటీరం గోచరమౌతుంది /” (రెక్కముడవని రాగం-1992)
1997లో వచ్చిన ‘జలపాతగీతం’ ఆపాతమధురంగా ప్రవహించిన కవితాగానం. భాష, భావం, శిల్పం, అందమైన అభివ్యక్తులుగా అమరిపోయాయి. సత్యవతీదేవికి ప్రకృతే ఒక అనుభూతి. ప్రకృతే ఒక తాత్విక భూమిక. తన ఆనంద విషాదాలకి ప్రకృతే వేదికైంది. అచ్చమైన ప్రకృతి ప్రేమికురాలు ఈమె. మంచితనాన్ని, మనిషితనాన్ని ప్రకృతిలోంచే దర్శించి, పరవశించిపోయే భావుకురాలు. అనాది నాదసౌందర్యంలో ‘జలపాతగీతం’ కవితా సౌందర్యమై పరిమళించింది.
”అనాది నాద సౌందర్యం / యుగాలనాటి సంగీతం / యౌవనాల మోహనవేగం / జలజల పారు గీతం / జలపాత రాగ గీతం / ఉత్తుంగ తరంగ యానం / ఉన్మేష యోగమార్గం / శిలాంతరంగ సౌహార్ద్రం / విశాలనీటికుసుమం / జలపాతరాగం /” (జలపాతగీతం – 1997)
ఈ కాసిన్ని అక్షరాలే నా స్వప్నశకలాలు అంటూ ప్రకృతిలోని పచ్చదనం నుంచి కవిత్వం నేర్చుకుంది ఈమె. దుఃఖాన్ని ఆస్వాదించ నేర్చుకోలేనివాడు సుఖాన్ని కూడా సరిగా ఆస్వాదించలేడని వీరి సందేశం. దుఃఖం, తత్వచింతనా కలిపి కలబోసిన కవిత్వమే ‘జలపాత గీతం’గా ఆవిష్కరించారు వీరు. సృష్టినీ, మనిషినీ సౌందర్యమయంగా చూస్తూ, మాయమవుతున్న మనిషికోసం విలపిస్తున్న హృదయనాదం ఈ జలపాతగీతం –
”మనసు పియోనోపై / యౌవనగీతాలు లిఖించి / భావాల జలధరాలపై / కాలాన్ని రివ్వురివ్వున గిరికీలు కొట్టించి / తిరిగి యిటు జారి / అదే నాదంపై / పరహితానికో తన ఉనికికో / పాటుపడే తపననే / పంక్తులు, పంక్తులుగా ఎగదోస్తాయి / జీవనదానం చేసి పునర్జన్మ నివ్వటం / బ్రతుకులోని భాగాన్ని / ఎప్పటికీ కొత్తగా మెరిపించటం / ఈ అక్షరాలకి తెలుసు /” (జలపాతగీతం)
2006లో వెలువడిన సత్యవతీదేవిగారి ”వేయిరంగుల వెలుగురాగం”లో విస్తరించినదంతా వెన్నెలే. ఉష్ణకిరణాల చైతన్యమే. ఇందులో వీరి కవిత్వ దర్శనం నాదోపాసనకూ, భావగంభీరతకూ ఆలవాలమై నిలిచింది. శిల్పసౌందర్యం, అద్వైత వేదాంత మధురగానం వీరి కవిత్వం. ఒక గొప్ప భావుకురాలు ఇందులో అక్షరమై పరిమళించింది. అచ్చమైన కవిత్వానికి నుడికారంగా వెలిగింది. కవితాపథంలో వెన్నెల దీపంగా, వెన్నెల కొలనులో విచ్చుకున్న తెల్లని కలువలా దర్శనమిచ్చింది. కవిత్వాన్ని జీవితంగా, జీవితమే కవిత్వంగా మలుచుకున్న ప్రేమమూర్తిగా దర్శనమిస్తుంది. అనుభూతుల అన్వేషణలో అలసిపోని కవితాబాటసారి ఈమె. జీవితం వేయి ఆలోచనల అవిశ్రాంత ప్రయాణమనీ, నిరంతర అధిగమనమనీ, ఆశయానికీ, గమ్యానికీ మధ్య ఘర్షణ అనివార్యమనీ వీరి కవిత్వం చెబుతుంది –
”కవిత్వాన్ని చదువుతూంటే / ఏళ్ళతరబడి గుండెకడ్డంపడి / మాటను నమిలి మింగేసిన / దుర్భర బాధాదృశ్యమేదో / అద్దంలో చూసుకుంటున్నట్లుండాలి / వందల సంవత్సరాల అనాగరిక పాత గాథల్లోకి / మనల్ని విసిరేసిన అనుభవం అవగతమవ్వాలి / కవిత్వంలోకి ప్రయాణిస్తూంటే / ఆకారంలేని చైతన్యశక్తిని పట్టుకొని / వేలవేల దారుల్లోకి మళ్లి / స్వర్గరసాయనంలా మరిగి / అరుగుతూన్న గంధపుచెక్క పరిమళాన్ని ఆఘ్రాణించి / ఎదుగుతున్న ఆలోచనాసారంగా వ్యాప్తి చెందుతున్నట్లనిపించాలి /” (వేయిరంగుల వెలుగురాగం – 2006)
ఎప్పుడంటే అప్పుడు కవిత్వం రాదు. ఎంతో మెత్తగా సుందర సంగీతవాద్యాలు శృతిచేసి, కమ్మని విందులుగా దారంతా పరిచినా, రమ్మని వేడుకున్నా, తొందరగా పదం కదిలిరాదు. దయాంతరంగము ఉప్పొంగి గంగధారై ఉరకదు. గుండె తడవాలి. చల్లని మానవతాస్పర్శ ఏదో నిలువెల్లా తాకాలి. భావం ఎక్కుపెట్టిన విల్లంబులా పదునుతేరి మెరవాలి. రణానికైనా, సర్వజనహితానికైనా పనికి రావాలి. సాఫల్యం చెందాలి అని మనస్ఫూర్తిగా నమ్మిన కవయిత్రి వీరు – ”ఎన్నో ఒంటరి రాత్రులను పీల్చుకొని / నీటి తడికి జలదరించి / అంకురమై వుబికినట్లు / శ్వాసకీ, ఆలోచనకీ మధ్య తీవ ఏదో అడ్డుపడి / అణంగిలగిల్లాడి / మనసు సమస్త ప్రకృతిలోకి జరజర ప్రాకి / ఒక భావ సారూప్యానికి వొదిగి / మౌనరసధ్యానచేతనలోంచి / పచ్చని ఎర్ర చిగురుపాదాల సమూహాలు / వడివడిగా వచ్చి సుడి చుడితేగాని / గుప్పెడు భావాన్ని ఒక్క ముక్కలోకి శిల్పీకరించే / యాతనానుభవం పొందితేగాని / ఎప్పుడంటే అప్పుడు కవిత్వం రాదు /” (వేయిరంగుల వెలుగురాగం)
ఆదూరి సత్యవతీదేవిగారి అర్థాంతర నిష్క్రమణం తర్వాత వారి జీవిత భాగస్వామిగా రచయిత, కథకులు ఆదూరి వెంకట సీతారామమూర్తిగారు తమ శ్రీమతిపట్ల రెండు అపూర్వమైన పుస్తకాలను వెలువరించి, ఒక గొప్ప చారిత్రక బాధ్యతను నిర్వర్తించారు. వారు పడిన వేదనకూ, కృషికీ ఈ పుస్తకాలు దర్పణాలుగా నిలిచాయి.
2009లో ‘ఆదూరి సత్యవతీదేవి ఆత్మపరాగం’ పేరుతో సత్యవతీదేవిగారి కవిత్వ పరిశీలన, అంతరంగ అవలోకన సమీక్షణగా ఒక వ్యాససంకలనాన్ని తెచ్చారు. ఇందులో డా|| పోరంకి దక్షిణామూర్తి, గంటేడ గౌరునాయుడు, డా|| చిత్తరంజన్, పాపినేని, అద్దేపల్లి, చే.రా, సౌభాగ్య, విహారి, శీలా వీర్రాజు, ఆవంత్స సోమసుందర్, నిఖిలేశ్వర్, చలసాని ప్రసాద్, మునిపల్లె రాజు, త్రిపుర, కె.రామమోహన్‌రాయ్ వంటి సుప్రసిద్ధ సాహితీవేత్తలు సత్యవతీదేవిగారి బహుముఖ ప్రజ్ఞను తమ వ్యాసాల్లో చక్కగా విశ్లేషించారు. అందులో ‘మూర్తి’గారు సత్యవతీదేవిగారిని గురించి ఎంతో ఆర్ద్రంగా, హృదయం ద్రవించేలా రాశారు –
”ఆ వసంతం మళ్లీ రాదు / ఆమె యిప్పుడు లేదు / ఆ కవికోకిల ఇంట వసంతమూ లేదు / నిశ్శబ్దమూ, అంధకారమూ ఘనీభవించి తోరణాల్లా వేలాడుతున్నాయి / ఇంటిముంగిట మామిడిచెట్టు / ఆకుల్ని మాత్రమే రాలుస్తూ నిలబడి ఉంది / చెట్లమీది కోయిలకు ఏ పాట పాడాలో తెలియక / మౌనంగా దిగులుగా దిక్కులు చూస్తోంది /” (ఆదూరి వెంకట సీతారామమూర్తి)
అంతేకాదు, ఆ వేణుగానం తరలిపోయింది అన్నారు. ఆ కవితను చదువుతూంటే మన హృదయాలు బరువెక్కి తడితడిగా చెమర్చుతాయి –
”ప్రకృతినీ పరమాత్మనీ / నీలాకాశాన్నీ, నీలిమేఘశ్యామునీ ఆరాధిస్తూ / ఆ ప్రకృతిలోకే నడిచివెళ్ళిన ఆమె / ఈ అష్టమి దినాన / తొలిసంధ్యలో విరిసే ఏ పారిజాతంగానో / వెండిమబ్బుగానో, వెన్నెలదీపంగానో / ఆ సామవేదప్రియుని పాదాల చెంత నిలిచి / పాదపూజ గావిస్తూనే వుండాలి / ఆ వేణుగానాన్ని ఆస్వాదిస్తూనే వుండాలి /” (ఆదూరి వెంకటసీతారామమూర్తి)
ఆదూరి సత్యవతీదేవి, వెంకటసీతారామమూర్తిగారి ఆదర్శ సాహితీ దాంపత్యం మరువలేనిది.
సత్యవతీదేవిగారి సాహిత్యం భావి రచయితలకు స్ఫూర్తిదా యకం, చదువరులకు జ్ఞానామృతం. వారి గీతాలు చందనశీతల పవనాలు. ఒక మధుర కవయిత్రి మానసమథనంలో ఉదయించిన అమృతధార వారి సాహిత్యం. వారి పవిత్ర స్మృతికిదే నా నివాళి!!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags