కత్తి అంచుమీద
కాలం రక్తమోడుతుంటే
వాళ్లు
కారుణ్యానికి నిర్వచనమయ్యారు..
మనిషిని చంపటం..
ముఖ్యంగా
మెతుక్కోసం
శిలువల్ని మోసిన మనుష్యుల్ని చంపటం
ఆశయాల్ని
జెండాలుగ ఎగరేసిన మనుష్యుల్ని చంపటం.
ఒక క్రీడ అయినచోట
వాళ్లు
బతికించడమెట్లాగో నేర్పినారు-
సహనానికి సరిహద్దులు చెరిపేసినారు-
ముక్కలయ్యిందని, మూర్ఛపోయిందని
దేహపు వీణను విసిరెయ్యలేదు-
సవరించిన జ్ఞాపకంగా
కళ్లలో దాచుకున్నారు-
నాల్గు దశాబ్దాలుగా
మృత్యువును గేటు బయటే నిలబెట్టి
ఆమెకు ప్రేమనద్ది
స్నానం చేయించి, ఆహారమందించి
పాటలుపాడి, కథలు చెప్పి
వాళ్ళు బతికించింది..
ఓ మనిషిని గాదు-
ఓ ఆశయాన్ని-
ఓ నిబద్ధతను-
ఓ విశ్వజనీన మానవత్వాన్ని..
కన్నపేగు సైతం
కాలనాగై కాటేస్తున్నచోట
వాళ్ళు
మానవ సంబంధాలమీద
కాంతిరేఖల్ని విసిరారు..
ప్రేమజెండాలనెగరేశారు..
తల్లులారా.. చూడండి
స్త్రీల శరీరాల మీద
చరిత్రల్ని లిఖిస్తోన్న నాగరీక లోకం..
సిగ్గిల్లి.. మీముందు ప్రణమిల్లుతోంది..
(అత్యాచారానికి గురై.. హాస్పిటల్ బెడ్‌కే పరిమితమైన అరుణాశాన్‌బాగ్‌కు 42 సం||లుగా సేవలు జేసిన నర్సులకు స్పందించి)