ఎండిపోయి అట్టలుగట్టి
వేలాడుతున్న చింపిరిజుట్టు
బతుకులోని దయనీయత
ముఖంపై చారలుగా కారిన వైనం
దయతలిచి ఎవరో ఇచ్చిన
పొడవాటి కోటులో
దుర్బలంగా ఇమిడిపోయిన శుష్కదేహం
ప్రపంచంతో నిమిత్తం లేనట్టు
అటూ ఇటూ తిరుగుతూ
ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టు
కాళ్ళతో భూమిని తంతూ
వెర్రిగా వెకిలిగా నవ్వుతూ
అంతదాకా పిచ్చిది మాత్రమే… ఆమె
ఏ నిశిమాటు నీడల కింద
బలిసిన ఏ తోడేలు విరుచుకుపడిందో
ఎవడి వికృత కామపైత్యం ప్రకోపించిందో
మెడకి వేళ్ళాడే మురికి చీరె ఉయ్యాలలో
మూన్నాళ్ళ పసిగుడ్డుతో పిచ్చి తల్లిగా మారింది
అఘాయిత్యం పాలై పిచ్చిదయిందో
పిచ్చిదైనందువల్ల అన్యాయమైపోయిందో
చెప్పగలిగేదెవరు?
కళ్ళు కనిపించని, బుద్ధి పనిచెయ్యని
కక్కుర్తి కుక్కలకు
కాపలాగా నిలిచేది ఎవరు??