సూర్యుడు మండుతున్నాడు
రోడ్లతారు కరిగి
కార్లటైర్లు కదలడంలేదు
శరీరం తడిచి తడిచి ఆరిపోతుంది
బడుల్లో పిల్లలకు తలలువేడెక్కి
అక్షరాలు ఎక్కడం లేదు
రాజులు రంగప్పలు
ఎ.సి. గదుల్లో వుండి
వీడియో బోధలు చేస్తున్నారు
బ్రాహ్మణోత్తములు
నీళ్లకు పూజలు తర్పణలు చేస్తున్నారు.
పుష్కరాల పేరులతో
పాలకులు ప్రజలను
బ్రాహ్మణాధీనం చేస్తున్నారు
నీరు ఓ ప్రకృతి అని తెలియకే
ఇంకా యాచకవృత్తిలో వున్నారు.
నీరు కూడా ఒక్కోసారి మనుష్యులను వధిస్తుంది
అవును!
మిత్రులు, హితులు
గుండెదివ్వెలను వెలిగిస్తారు
ఆకళ్ళల్లోని వెలుగుల్లో
అనేక భావస్రవంతులు పొంగుతాయి
మనుష్యులు హింసకు
వ్యతిరేకంగా ఒంటరులౌతున్నారు
తోడులో వున్న జీవన సౌందర్యం
మృగ్యం అవుతుందా!
మనిషి రెండుగా చీలి
ఘర్షిత మౌతుందా!
శరీర సౌందర్యమూ
హృదయనైర్మల్యమూ
సంఘర్షితమవుతున్నాయికదా!
అవును! జీవితం ఒక యుద్ధమే
తనకు తాను
తనలో తాను
అనంత సంభాషణ,
జీవితం వేదాంతం కాదు
జీవితం అంటే నిర్వేదం కాదు
జీవితం ఒక అనుభవం
ఒక ఆచరణ
ఒక సూర్యోదయం
సూర్యుడు ఉదయించగానే
ఎన్నో పూలు వికసిస్తాయి
అనంత పరిమళం గుభాళిస్తుంది.
ఒక్క పిలుపు, పలకరింపు
ఎందుకు హృదయాన్ని కుదిపేస్తుంది
వీరితో మాట్లాడవచ్చు
వీరితో మాట్లాడ కూడదని
ఈ నిబంధనలు ఎవరు పెట్టారు
ఎప్పుడొచ్చాయి.
సంభాషణ ఒక తత్త్వశాస్త్రం కాదా!
ఒక గతితర్కం కాదా!
భావోజ్వలనం కాదా!
మైత్రీబంధం కాదా!
మనిషికి, మనిషికున్న
సంబంధాలు పెట్లిపోతే
మానవ విలువలు నశించవా!
సముద్రం పొంగుతుంది
అలలు, అలలుగా అనేక భావోజ్వలనాలు
ప్రతి నదిలోను సంగీతం వినిపిస్తుంది
అంతరాల్లో దాగిన
సుడులు మనతో మాట్లాడుతున్నాయి
ఆ నది గుండెల్లో వెలుగులు దాగున్నాయి
వెన్నెలనదీ అంతరాంతరాల్లో సేద తీరుతోంది
నదులను పూజిస్తున్నారు
ఆత్మీయం చేసుకోలేక పోతున్నారు
విశాఖ పట్టణం సముద్రం ఒడ్డున
ఒక నల్లరాయి శతాబ్దంగా తడుస్తుంది
దానికి చలనం లేదు.
అయినా అది ఒక చారిత్రక గుర్తే సుమా
విశాఖ పట్టణం మీదికి విమానం దిగే కొద్ది
సముద్రం ఆలింగనం చేసుకొన్నట్లు
ఆకాస్త ప్రయాణంలోనే
మేఘాలు, అలలు మాట్లాడుతోంటే ఓ ఆహ్లాదం
ఆ సముద్రం చాలా మందిని తీసుకెళ్ళింది
చాలామందిని సృజించింది కూడా
జీవితంలో వెలుగు వెన్నెల చీకటీ
అన్నీ సమతుల్యమే!
అన్నీ రోజూ మాట్లాడుకొంటాయి
జీవన బంధాల్లో
సముజ్వలింపబడే గుణం ముఖ్యం
ఆ కొవ్వొత్తిని ముట్టించినా
వెలగడం లేదు
దానివత్తి వర్షానికి తడిసింది
నిజమే! కొన్నివత్తులు అసలు వెలగవు
కొన్ని అసలు ఆరిపోవు
వారు వీధిదీపాలను ఇష్టపడుతున్నారు
ఇళ్ళకంటే గుళ్ళసంఖ్య పెరుగుతోంది
అనుభూతికంటే ఆరాధన పెరుగుతోంది
ప్రకృతి అర్థంకానప్పుడు
తమకు తాము ఎలా అర్థం అవుతారు?
నీటితో అనంతవానలు పుష్పిస్తాయి
ప్రేమతో అనేక హృదయాలు పల్లవిస్తాయి
జ్ఞానం కంటే మూఢం పెరుగుతోంది
మనుషులు మందలు, గుంపులవుతున్నారు
గొర్రెలు, గేదెలూ నీటిలో మునుగుతున్నాయి
వాటికి పుష్కరం అని తెలియదు
నదీ ప్రవాహానికి కాలం కొలతలు వున్నాయా
బుద్ధుడు నీటి యుద్ధాన్ని నివారించాడు
జ్ఞాన సంపన్నుడయ్యాడు
ముందు మనషిని గుర్తించండి!
ఆత్మీయత! మైత్రీ బంధం
నశించనివి సుమా!
పాలకులకు ఓటమి బోధకునికి విజయం!
చరిత్ర చెబుతున్న పాఠం