నాకప్పుడే పెళ్ళేంటి…?! – పి. ప్రశాంతి

ట్రింగ్‌ ట్రింగ్‌ మన్న రిక్షాబెల్‌ చప్పుడుతో పిల్లలొచ్చి నట్టున్నారనుకుంటూ చేస్తున్న పని పక్కనపెట్టి లేవబోయింది అన్నపూర్ణ.

”అమ్మా… అమ్మా…” అంటూ స్కూల్‌ రిక్షా దిగి హడావిడిగా ఇంట్లోకొస్తున్న అక్కచెల్లెళ్ళిద్దరివైపు ఆశ్చర్యంగా చూసింది. సాధారణంగా తరగని కబుర్లలో మునిగితేలుతూ, ఐదారు కుటుంబాలు కాపురముండే ఆ కాంపౌండ్‌ ముందు రిక్షా దిగి కనబడిన వారందరినీ పలకరించు కుంటూ, కాసేపటికిగాని ఇంట్లోకిరారు. అలాంటిది ఇవాళ వీళ్ళిద్దరూ ఏంటిలా అనుకుంటూ ”ఏమైందిరా…?” అంది అన్నపూర్ణ.

”అరుణకి పెళ్ళంటమ్మా” ఇద్దరూ ఒకేసారి అన్నారు. ”తొమ్మిదో తరగతి కూడా పూర్తి కాలేదు…ఒక్కతే కూతురు… పెద్దమనిషై సంవత్సరం అయ్యిందో లేదో…” అసహనంగా అంటున్న అక్క మాటలు పూర్తవకుండానే ”ఇద్దరన్నలున్నారు… చూసుకోలేరా… ఏం తక్కువని…” అంటూ జత కలిపింది చెల్లి.

”తింటానికి లేనోళ్ళు కాదు, చిన్నదో పెద్దదో సొంతిల్లు కూడా ఉంది. పైగా వాళ్ళ మెస్‌ కూడా ఇప్పుడు బాగా నడుస్తోందని, దానిపైనున్న అప్పు దాదాపు తీరిపోయిందని అన్నారు ఆంటీ. అంతలో ఏం తొందరొచ్చిందని… కనీసం పదోతరగతన్నా పూర్తవ్వందే…  రేపు ఏ అవసరమొచ్చినా ఎలా నిలబడగల్గుతుంది…” ప్రవాహంలా మాట్లాడేస్తున్న పెద్ద కూతుర్నే చూస్తూ మాట్లాడలేనట్లు కూర్చుండిపోయింది అన్నపూర్ణ. తన పక్కకొచ్చి కూర్చున్న చిన్న కూతురి భుజాలచుట్టూ చెయ్యేసి పెద్దకూతుర్ని కూడా రమ్మన్నట్టు చెయ్యిచాపింది.

పదోతరగతి చదువుతున్న శాంతి, తొమ్మిదో తరగతి చదువుతున్న వీణ అంటే తనకు ప్రాణం. వాళ్ళిద్దరూ చదువుతోపాటు, ఆటపాటల్లోనూ, సంస్కృతం, హిందీ నేర్చుకోడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనటం వంటివాటిలో చురుగ్గా వుంటారు. వాళ్ళ వయసు వారితోనేకాక, అందరితో కలివిడిగా ఉంటారు కాబట్టి ఎంతో మంది స్నేహితులున్నారు. బైట వాళ్ళిద్దరూ చూసినవి, చేసినవి, విన్నవీ అన్నీ తీసుకొచ్చి అమ్మకి చెప్తుంటారు. అదే తనకి పెద్ద ఎడ్యుకేషన్‌.

చదువంటే ప్రాణంపెట్టే అన్నపూర్ణకి యస్సెస్స్‌యల్సీ పూర్తవకుండానే పెళ్ళైపోయింది. సంక్రాంతి సెలవుల తర్వాత వరండాలో కూర్చుని నోట్స్‌ రాసుకుంటుండగా వచ్చిన ఒక పెద్దమనిషి, ముత్యాలు పేర్చినట్టున్న తన చేతిరాతని, పొందిగ్గా ఉన్న తనని చూసి ఈమే నా కోడలని నిర్ణయించేసుకోవడంతో తన చదువుకి ఎసరొచ్చింది. మరో పదిరోజుల్లో ఫైనల్‌ పరీక్షలున్నాయనగా పెళ్ళైపోయింది. నలుగురక్క చెల్లెళ్ళలో పెద్దదైన అన్నపూర్ణ తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తల్లిదండ్రుల మాటకి తలొంచి పధ్నాలుగేళ్ళకే పెళ్ళి చేసేసుకుంది. పరీక్షలయ్యే వరకు ఆగమన్నా మంచి ముహూర్తం అని పెళ్ళి చేసేశారు. ఉక్రోషంతోనూ, సిగ్గుతోనూ ఇక బడికెళ్ళలేదు, పరీక్షలూ రాయలేదు. అప్పట్నుండి మనసు లోపలి పొరల్లో పేరుకుపోయిన చదువుకోవాలన్న కోరికని, తన కూతుళ్ళిద్దరూ బాగా చదువుకోడానికి కావలసినవి సమకూర్చుడం ద్వారా తీర్చుకుంటోంది. అంతేకాదు, వాళ్ళ ప్రోత్సాహంతో ఓపెన్‌ డిగ్రీకి కూడా కట్టింది. కాని సంసార సముద్రంలోని ఆటుపోట్లతో చదువుపై దృష్టి పెట్టడం కష్టమౌతోంది. తన పరిస్థితంతా గుర్తొచ్చి ”మీరు మాత్రం బాగా చదువుకోవాలి. లోకాన్నీ చదవాలి.

ఆ తర్వాత పెళ్ళి. ఈలోపు ఏది ఎదురైనా మీకు నేనున్నా” అంటూ ఇద్దర్నీ దగ్గరికి తీసుకుంది.

సంక్రాంతి సెలవులకి అమ్మమ్మగారింటికెళ్ళి అందరితో సరదాగా వారం రోజులు గడిపొచ్చిన సంతోషం ఇంకా నిండుగా ఉంది పిల్లలిద్దరికీ. కానీ రాగానే అరుణ పెళ్ళి విషయం ఇద్దర్నీ డిస్టర్బ్‌ చేసింది. అరుణ, వీణ క్లాస్‌మేట్స్‌ అయినా అరుణ వాళ్ళన్న శ్రీను శాంతి క్లాస్‌మేట్‌ కావటం, ఐదోతరగతి నుండి కలిసి చదువుకోడంతో అందరికీ మంచి స్నేహం. ఆదివారం వస్తే చాలు సైకిళ్ళు అద్దెకి తెచ్చుకుని తిరుగుతూనే ఉంటారు. ఆకలేసిన టైమ్‌కి ఎవరింటిదగ్గరుంటే అక్కడే భోజనం. ఆడుకుంటూ, మధ్యలో చందమామ, బాలమిత్ర పుస్తకా ల్లో కథలు చదవి చర్చించుకుంటుంటారు. బాగా చదివి మంచి ఉద్యోగాలు చేయాలని కూడా అనుకున్నారు. అలాంటిది, అమాంతంగా వచ్చి పడిన అరుణ పెళ్ళివార్త అక్కచెల్లెళ్ళని బాగా డిస్టర్బ్‌ చేసింది. అరుణ స్కూల్‌కి రాకపోవడంతో వివరాలు తెలీలేదు. అందుకే అమ్మతో చెప్పి గబగబా స్కూల్‌ డ్రస్‌ మార్చుకుని, ముఖం కడుక్కుని అరుణ ఇంటికి బైలుదేరారు. దారిపొడుగూతా వాళ్ళిద్దరి మధ్య ఇదే చర్చ. ”ఏం జరిగుంటుంది? అర్థాంతరంగా అరుణకి పెళ్ళెందుకు పెట్టుకున్నారు?” దారిలో అరుణ పెద్దన్న రవి కనిపిస్తే ”నీ పెళ్ళెప్పుడు? పెద్దోడివి నీ పెళ్ళవకుండా అరుణకి అప్పుడే పెళ్ళేంట”ని అడిగిన శాంతితో ”నాకప్పుడే పెళ్ళేంటి! నేనింకా చదువుకోవాలి…లాయర్నవ్వాలి” అని పౌరుషంగా అనేసి వెళ్ళిపోయాడు.

ఇంటిబైట గేటు దగ్గరే అరుణ ఎదురొచ్చింది. శాంతి, వీణని చూసి అరుణ ముఖం విచ్చుకుంది. అంతలోనే ముడుచుకు పోయింది. గబగబా వాళ్ళ దగ్గరకొచ్చి శాంతిభుజంమ్మీద వాలిపోయి నిశ్శబ్దంగా ఏడుస్తుంటే ఇద్దరూ కలిసి అరుణని ఓదార్చారు. ఏమైందని అడిగేలోపే ”నాన్నకి గుండెపోటొచ్చింది, బతుకుతారనుకోలేదు” అన్న అరుణ మాట వాళ్ళ చెవుల్లో బాంబులా పేలింది.

ఆంటీకి, అంకుల్‌కి ఏదో ఒకరకంగా నచ్చజెప్పి అరుణ పెళ్ళిని ఆపడమో, వాయిదా వెయ్యటమో చేయించాలనుకుంటూ వచ్చిన అక్కచెల్లెళ్ళిద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంతలోనే బైటికొచ్చిన అరుణ వాళ్ళమ్మ వీళ్ళని చూసి ‘అమ్మా… వచ్చారా… ఎంత ఘోరం జరిగుండేదో తల్చుకుంటేనే కాళ్ళూచేతులాడట్లేదు. ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం. మీరన్నా అరుణకి నచ్చచెప్పం డమ్మా. వాళ్ళ నాన్నగారు బాగున్నపుడే తన పెళ్ళి చేసేస్తే మాకు మనశ్శాంతి. తనేమో చదువుకోవాలంటోంది. మంచి సంబంధం. మంచివాళ్ళు కాబట్టి పెళ్ళైయ్యాక కూడా అరుణ చదువుకోవచ్చని, చదువుకున్న కోడలైతే మాకూ మంచిదే అన్నారు. మీరైనా నచ్చజెప్పం డమ్మా’ అంటున్న ఆవిడకి ఏం సమాధానం చెప్పాలో పాలుపోలేదు శాంతి, వీణలకి.

ఆ ముగ్గురి మనసుల్లో ఒకటే ఆలోచన. ఆడపిల్లల చదువుకి ఎన్ని అడ్డంకులు! తరాలు మారుతున్నా పరిస్థితుల్లో మార్పులేదు. ఇంట్లో ఏ ఒడిదుడుకులొచ్చినా అమ్మాయి పెళ్ళితో ముడిపెడ్తారే? ఆర్థిక పరిస్థితైనా, ఇంట్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితైనా… అమ్మాయి పెళ్ళితో గట్టెక్కిపోతారా? పెళ్ళైయ్యాకా చదువుకోవచ్చంటారు, మరి ఇంటి పని వదిలేసి బడికో, కాలేజీకో ఫ్రీగా వెళ్ళనిస్తారా? చదువయ్యేదాకా పిల్లలొద్దంటే ఆగుతారా…? ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంది ఆ ముగ్గురిలోనూ.

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.