జూపాక సుభద్ర
నెలరోజుల్నించి జ్వరం యిసంపురు గోలె పట్టుకొని యిడుస్తలేదు. వస్తాదుల సోంటి మందులోల్లను గూడ మసిజేసి పారేస్తంది. రెట్టించిన బలంతో జ్వరం తన పని తాను చక్క బెట్టుకుంట నన్ను యిడ్చి మంచాన బడేసింది. నా పనుల్ని పడావు బెట్టింది. యీ మొండి జ్వరాన్ని జయించనీకి ‘నిమ్స్’ అనే బీమార్ల రణనిలయానికి బోయి షరీకైన.
షరీకైన పొద్దునుంచి ఒక్క వర్కర్ కనబల్లే… రూములల్ల నర్సులు డాక్టర్లే అటిటు తిరుగుతుండ్రు. ొరూములు, బాత్రూములు కంపు కంపు గున్నయి. ఏమైంది ఎందుకో తెలువదు. మా పరేషాండ్ల మేమున్నము. నిమ్స్ గిట్లనే వుంటదేమొ అనుకున్నం.
తెల్లారి పొద్దుగాల్నే ఒక వర్కరు సీపురు పట్టుకొనొచ్చింది వూడ్చేదానికి. మా పక్క బెడ్డామె ‘ ఏంది ఈశ్వరమ్మా నిన్న రాలేదేంది లీవు బెట్టినవా… అన్నది.(మా పక్క బెడ్డామె మా కంటే పది రోజుల సీనియరు. ఆమె కందరి పేర్లు తెలుసు) మా మొకాలకు లీవులుగూడనామ్మ.. పర్మనెంటునే లేకపాయే. నిన్నంత (17.10.08) మాకుయిస్తనన్నయి, ఒప్పందం కుదురుకున్నయి అడిగెదానికి డైరెక్టరు కాడికి మా కాంట్రాక్టరు వర్కర్ల మంతా బొయినం. పోతే…మా డెరెక్టరు ఎనుక ముందు జూడకుంట పోలిసోల్లును బిలిసి ఆందర్ని ఎట్ల బడితట్లనే కొట్టించిం డమ్మా.. అయ్యె ఆడోల్లని గూడ ొసూడకుంట సీరెలు సింపి రైకలు గుంజి ఆగం ఆగం జేసిండ్రు పోలీసోల్లు సావ. మా అసోంటి ఆడోల్లు వాల్లకు లేరా.. మా గోస దాకదా గింత అన్యాయమా అమ్మ అనుకుంట చాతి మీద, కాళ్ళ మీద వెన్నుల కమిలి పోయిన దెబ్బల్ని సూపిచ్చింది. ఆ ొమాటలిని నేంగూడ లేసికూసున్న. గీన్ని దెబ్బల వడి మల్లా పనిలకొచ్చి పంజేస్తున్న ఆ వర్కర్ ఈశ్వరమ్మ కష్టమేందోనని, గామె కష్టంల కా జెర మెంత దాని బిషాదెంత అని లేసి కూసున్న.
పక్క బెడ్డామె ఆమె దగ్గరున్న మనిషి అయ్యె ఎందుగొట్టిండ్రు గంతగనం, అని నారాజై అడిగిండ్రు సానుభూతిగ. ఆ ఈశ్వరమ్మ కండ్లకు నీళ్ళు దెచ్చుకొని ‘యీ దావుకాండ్ల ఇరువై మూడేండ్ల కాంచి పంజేత్తన్న. 450 రూపాల జీతానికి జేరిన. యిప్పటిగూడ పర్మనెంటు జేత్తలేరు. జీతాలు పెంచుతలేరు. గిన్నే౦డ్ల కాన్నుంచి జెయ్యంగ గిప్పుడు రూ 3900 యిస్తండ్రు. అండ్లకెల్లి కాంట్రాక్టరుకు, ఏందో పి.ఎఫ్ కని రూ 500 తీసుకుని 3400 మాసేత్తికిస్తండ్రు. 3400లల్ల మేమెట్ల బతకలా. జెర మీరే సెప్పుండ్రి. యిండ్లనే యిల్లు కిరాయి గట్టుకోవాలె. బియ్యం , వుప్పులు, పప్పులు, కూరగాయాలు కర్సులన్ని మెల్లదీస్తమా! గీ పైసల్లల గీ పెరిగిన దరలల్ల ఏంగొంటం ఏందింటం, పిల్లల నెట్ల సాదుకుంటం సమాలిచ్చుకుంటం. యీ దావుకాండ్ల ఒక్కరంగాదు యిద్దరంగాదు 800 మంది కాంట్రాక్టు వర్కర్లమున్నము. గింత పెద్ద నిమ్స్ దావుకాండ్ల గీ కొద్ది మంది తోనే కొద్ది జీతాలిచ్చి పనెల్ల దీస్కుంటది మేనేజిమెంటు ఏం జేత్తుము. పనేందమ్మా.. ఎంత పనైనా జేత్తంగాని పనికి దగ్గ పైసలియ్యలెగద య్యికనే పాయె. అడిగితే పోలీసోల్లతోని మమ్ముల పొల్లు పొల్లు కొట్టిచ్చె.
– జీతాలు పెంచుమని, పర్మనెంటు జెయ్యిమని, యూనిపారాలియ్యమని కొట్లాడంగ కొట్లాడంగ పోయినేడు వో జీవో దెచ్చి (250) జీతం బెంచి డియ్యే వూడబీకిండ్రు. గిదేంది సారూ అని లేబర్ ఆఫీసు ముందట లొల్లి జేదత్తె మేనేజ్‌మెంటు మేం బెట్టినయన్ని ఒప్పుకున్నరు. కాని ఒప్పుకున్నయి యడాదైనా యిస్తలేదు. నిన్న బొయి అడిగితే కొట్టిచ్చిండ్రు. అమ్మా..మేము పుక్కడీకి అడుగుతున్నమా పుట్టెడు కష్టం జేస్తం. ముక్కులు సెవులు పలిగిపాయే రోతెత్తి పోస్తం. రకరకాల, బీమారోల్ల పుండ్లు, గడ్డలు, గాయాలు,నెత్తురు, సీము, ఏరిగింది కక్కింది సాపుజేస్తం గీ పనులు మా అసోంటి మాదిగోల్లు, మేతరోల్లు దప్ప వేరే టోల్లు సేత్తరా! ఆ గలీజుకు, వాసనకు బువ్వే నోట్లెకు బోదు. పేషంట్ల కాడి రడమెత్తి పోసేటోల్లం. దావుకానను మల్లె పూవోలె వుంచేటోల్లం. అవన్ని జేస్తుంటే బట్టలన్ని పాడైతయి. ఒక్క రొండు జతలు యాడాదికో మారిస్తే ఏంబోతది. పేషెంట్ల కాన్నుంచి లక్షల పైస వసూలు జేత్తరుగాని ొమా కష్టానికియ్యరు.
దావుకాండ్ల నిన్న వొక్క పూట లేకుంటేనే దావుకానంత పెంటకుప్పయి గబ్బు లేసింది. మేనేజిమెంటు కింద మీదయింది. ఒప్పుకొని సంతుకం జేసిన డియ్యే, బకాయిలు, పర్మనెంటు, రెండు జతలు గియ్యేవి మాట్లాడ్తలేదు గాని ఎక్వ తక్వ నక్రాలు జేస్తే బైట్నించి మనుషుల్ని బెట్టి పంజేయించుకుంటమని మేనేజిమెంటు బెదిరిచ్చి పోలీసుల్ని బిలిసి కొట్టిచ్చింది. వున్నొక్క మెతుకు మన్ను పాల్తెతదని. నోట్లె మట్టి పడ్తదని పొరగాండ్లు ఆకలికి సచ్చి పోతరని బయపడి మల్లా పనిల జేరినమ్మా.. కూలిగాల్లు, దమ్మిడికి కొరగానోల్లను కుంటుండ్రు. మా కష్టానికచ్చేటియి యిచ్చేదాక లొల్లి వెడ్తనే వుంటం యిడ్చి పెట్టం.’ అని సీపురు గట్టిగ కట్టుకుంటా ఎల్లి పొయింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags