ఆడిస్తే ఆడాను ఆటబొమ్మలా
నేర్పించిన మాటల్నే పలికాను చిలుకలా
తినిపించిందే తిన్నాను భద్రంగా ఉన్నాను
నా మంచిని కోరే నన్ను కన్నవాళ్ళూ
నా వాళ్ళే కదా…
ఎలా నడవాలో ఎంతవరకూ నడవాలో
నా నడక లక్ష్యం పరిధి ఎంతో
వాళ్ళ సూచనలే శాసనాలయ్యాయి
నా ఎదుగుదలంతా వాళ్ళ కనుసన్నల్లోనే…
నా కుటుంబం నా చుట్టూ
నిఘా పెట్టిన కంచెలాంటిది
నియంత్రణలన్నీ రక్షణనిచ్చే
ముళ్ళ తీగలై అల్లుకునేవి…
గడప లోపల కంచె లోపల
ఎక్కడైనా పరిమితమైన నడకతో
కాలుగాలిన పిల్లిలా రెక్కలురాని పక్షిలా
నేనొక ఆడపిల్లను కదా…
ఉండి ఉండీ నా సహనం
త్యాగాల పట్టికగా మారిపోతుంటుంది
నా మనసు వికలమై
దేహం గాయాల నమూనా అవుతుంది…
అప్పుడింక నేను సహించలేని
నా సహనాన్ని చీల్చుకుంటూ
ఒక రక్త నదీ ప్రవాహంలా
ఎగజిమ్ముతూ ప్రవహిస్తాను…
ఆ నేను కాదు నేనిప్పుడు
నా బతుకు నిండా కలల నిండా
భయాలు కమ్ముకున్న నేను కాదు
దృష్టి పొరల్లేని చూపునిప్పుడు…
ఇప్పుడు నా జీవితాన్ని నా
చేతుల్లోకి తీసుకొని
ఎక్కడికైనా నన్ను నేను
నడిపించుకునే అసహన జీవిని…
నిరసనా ధిక్కారం నిండా
నిబిడీకృతమైన మనిషిని
నడుస్తూ నడుస్తూ ఉంటాను
నేను నడకకే పర్యాయపదమవుతాను…
నా అంతట నేను నడుస్తూ
ప్రవాహ వేగంతో వ్యాపిస్తాను
ధీమాగా ధాటిగా ధీరగా
ఉరకలెత్తుతూ స్వేచ్ఛాస్వాదనలో…
చీకట్లోంచి వెలుగులోకి
వెలుగులోంచి చీకట్లోకి
బతకడం నుండి జీవించడంలోకి
అడుగులేస్తాను నడిచి వస్తాను…
నా అంతట నేనుగా నడుస్తుండాలి
నా ప్రయాణం సత్యాన్వేషణలా సాగాలి
నడుస్తాను! నడుస్తాను! ఇక
నడుస్తూనే ఉంటాను…
నా నడక నా ఇష్టమే
నా నడకను ఆపొద్దు అంతే!
(డా|| మాయా కృష్టారావు
‘WALK’ ప్రదర్శన చూసి)