అమాయకంగా కడుపాకలి
తీర్చాలని ఆరాటపడే
అమ్మకేం తెలుసు?
నీకు వయసొచ్చిందని
నీ ఆకలికర్ధం మారిందని…
నీకిష్టమైన జంక్ ఫుడ్‌ని
హెల్త్ ఫుడ్‌గా ఎలా మార్చాలో
నిద్రలో కూడా ఆలోచించే
అమ్మకేం తెలుసు?
నువ్వింకేవేవో రుచులు మరిగావని
నీ ఆకలికర్ధం మారిందని…
నీ గదిలో అర్థరాత్రయినా
ఆరక వెలిగే దీపాల్లో
నువు చదివేది క్లాసు పుస్తకాలనుకునే
అమ్మకేం తెలుసు?
నువు ఫెయిలయ్యే సబ్జెక్టుల లిస్ట్ పెంచుతూ
లాప్‌టాప్‌లో చూసేది పోర్నని…
పొద్దున్నే హడావిడిపడి
రోజుకో రకం టిఫిన్ రుచిగా చేసే
అమ్మకేం తెలుసు?
నువు బయట తాగేదీ, తినేదీ ఏంటో…
నీకిచ్చే పాకెట్ మనీతో నువ్ కొనే
నివ్విష్టపడే మత్తులు, గమ్మత్తులూ ఏంటో…
చెల్లిలాంటి పిల్లల్ని చూసినా
తల్లిలాంటి స్త్రీలని చూసినా
నీక్కలిగే కామ వికారాలు
నువ్వాపుకోలేని స్ఖలనాలు
నోట్లో వేలు పెడితే కొరకలేని
పసివాడవనుకునే అమ్మకేం తెలుసు?
కడుపు చేయగల మగాడయ్యావని…
నీ ఆకలికర్ధం మారిందని…
ఆమె నేర్పిన సంస్కారం
అందరిపై చూపే మమకారం
తన పెంపకంపైన నమ్మకం
నిన్నొక యోగ్యుడ్ని చేస్తుందనుకునే
అమ్మకేం తెలుసు??
నీలో కొన్ని చీడపురుగులు చేరాయని
సగం సమాజాన్ని పీడించే
విషబీజాలు నీలో నాటుకున్నాయని…
ఆటల్లో నీ మోకాళ్ళు చిట్లితే
చిప్పిల్లే కళ్ళు చెరువులు చేసుకుని,
మొరటుగా పెరిగిన గడ్డం మాటున మాయమయిన
పాల బుగ్గలు మరువలేని అమ్మ ప్రేమలో
సున్నితత్వం నీకర్థమయిందెప్పుడని…
నీ ప్రేమనంగీకరించని ఓ ఆడపిల్ల మొహం
నీ ఆసిడ్ దాడిలో దహనమయ్యేదాకా
నీలో దాగిన క్రూరత్వం అమ్మకేం తెలుసు??
కానీ నీకు తెలియని విషయం ఒకటుంది
అమ్మకేం తెలుసు…? అని కొట్టిపారేసే అమ్మ
నీ గురించి తెలుసుకున్ననాడు
అమ్మే కదా అని క్షమిస్తుందనుకోకు…
అప్పుడమ్మ అపర కాళిక అవగలదు
న్యాయస్థానాలు వెయ్యలేని శిక్షలూ వేసి
చెయ్యలేని న్యాయం చెయ్యగలదు…