సెప్టెబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అరవింద స్కూల్, మంగళగిరి పిల్లలు వ్రాసిన అభిప్రాయాలు, కవిత…
ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక స్ధానం ఉంటుంది. అది ఎంతో అమూల్యమైనది. మనం మన తల్లిదండ్రులతో ఎంత స్వేచ్ఛగా ఉంటామో అంతే స్వేచ్ఛ ఉపాధ్యాయుల దగ్గర దొరుకుతుంది. ఇంకా మనం తల్లిదండ్రులతో కన్నా ఉపాధ్యాయులతో ఎక్కువ ఉంటాం. అలాంటి ఉపాధ్యాయులు ఎలా ఉండాలి.
నా దృష్టి లో ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఉపాధ్యాయులు కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలి. పిల్లలు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయులు పిల్లలకు కొత్త విషయాలు చెప్తూ ఉల్లాసపరుస్తూ ఉండాలి. ప్రతీ ఒక్కరికి తమ తల్లిదండ్రులే మొదటి గురువులు. కాని వారి కంటే మనం ఎక్కువ తెలుసుకునేది మన పాఠశాల గురువుల దగ్గరే.
– పి. హిమబిందు, 10 వ తరగతి
అమ్మా నాన్నల తరువాత ఎక్కువగా గడిపేది టీచర్ దగ్గరే. మరి అలాంటి టీచర్ పిల్లల దగ్గర నుండి ఏ మాత్రం తిరిగి ఆశించకుండా ఎంతో గొప్ప విద్యా బుద్థులు నేర్పుతుంది. నా దృష్టిలో టీచర్ అంటే విద్యార్ధులకు ఆదర్శంగా ఉండాలి. పిల్లల బలహీనతలను దూరం చెయ్యాలి. అంతేకాని అందరి ముందు పిల్లలను కించపరచకూడదు. పిల్లలు తాము కూడా పెద్దయిన తరువాత ఆ టీచర్‌లానే అందరికీ విద్యాబుద్ధులు నేర్పేలా ఉండాలని అనుకోవాలి. కొంతమంది చదువు అంటే పారిపోతారు. తమ భావాలను బయటకు చెప్పరు, కాని అలాంటి వారితో కూడా భావాలు బయటకి పలికించే వారే టీచర్.
– ఆర్. శారద, 10 వ తరగతి
ఉపాధ్యాయులు అంటే దైవం. మనం ఉపాధ్యాయులను గౌరవించాలి. వారు మనకి పాఠాలు బోధించడమే కాకుండా జీవితాన్ని కూడా బోధిస్తారు. వారు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటే మన జీవితం చాలా బాగుంటుంది. మనం కూర్చొని పాఠాలు వింటే, వారు నుంచోనే పాఠాలు చెబుతారు. మన జీవితాన్ని మనం సంతోషంగా ఎప్పుడు గడుపుతామో దాన్ని కూడా ఒక పాఠం లాగా మనకి చెబుతారు. ఉపాధ్యాయులు పిల్లలతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడి, బాగా చదువుకోవటానికి ఇష్టపడతారు. ఎప్పుడూ తిడుతూ, కొడుతూ ఉంటే పిల్లలు ఉపాధ్యాయులను ఇష్టపడరు. ఉపాధ్యాయులు పిల్లలు తప్పు చేసినా క్షమించే గుణం కలవారు. కాబట్టే ఈ విశ్వమంతా ఉపాధ్యాయులను గౌరవిస్తుంది.
– ఎస్. కె. షమ్‌షద్, 10 వ తరగతి
టీచర్ అంటే పిల్లలను కొట్టకూడదు, తిట్టకూడదు. ఏ ఒక్క పిల్లవాడిని ప్రత్యేకంగా చూడకూడదు. అందరిని కేలా చూడాలి. పిల్లల్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలి. వారిని అవమానపరచకూడదు.
– నితిన్ రెడ్డి, 10 వ తరగతి
అందమైన జీవితంలో
అ,ఆ,ఇ,ఈ నేర్పించింది టీచర్
అడుగులు నేర్పించింది టీచర్
చదువును నేర్పించింది టీచర్
మంచి జ్ఞానాన్ని అందించేది టీచర్
మంచి మార్గంలో నడిపించేది టీచర్
మా నుంచి ఒక్క మంచి అభివృధ్ది ని
ఆశించేది టీచర్
ప్రతి క్షణం పిల్లల కోసం కష్టపడేదే టీచర్
చదువు అనే పదానికి అర్ధం నేర్పించేది టీచర్
పిల్లల దేవత లాంటిది టీచర్
పిల్లల మనసులలో నిల్చుండేది టీచర్
అమ్మ తరువాత అమ్మ వంటిది టీచర్
మా అభివృధ్దిని కోరుకునేది టీచర్
– బి. నాగలక్ష్మి, 10 వ తరగతి