(సెప్టెంబరు 2006 లో సత్యం పౌండేషన్ “ఆంధ్రప్రదేశ్‌లో యువత – హెచ్ఐవి” అనే అంశం మీద ఒక సమగ్రమైన అధ్యయనం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెళ్ళి కాని యువత జీవన శైలుల గురించి ప్రధానంగా ఈ అధ్యయనం జరిగింది. వారి రోజు వారీ జీవిత విధానం, వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో ఒత్తిళ్ళను వారు ఎలా సంభాళించుకుంటున్నారు, జీవితంలో ఇంటా, బయటా ఎదురయ్యే మిట్ట పల్లాలను ఎలా ఎదుర్కొంటున్నారు అనే అంశం కూడా ఈ అధ్యయనంలో యిమిడి వుంది. సెక్స్ పట్ల వారి అవగాహన,ఆలోచనలు ఏ స్థాయిలో వున్నాయి అనే అంశం కూడా ఇందులో యిమిడి వుంది. హెచ్ఐవి పట్ల వారి అవగాహన ఏ స్థాయిలో వుందో క్రింది సంభాషణలు చదివితే అర్ధం అవుతుంది. అధ్యయనంలోని కొన్ని శకలాలివి. – ఎడిటర్)
(పూర్తి రిపోర్ట్ వచ్చే సంచికల్లో)
“నేను కండోమ్‌ను పెద్దవాడినయ్యాక వాడతాను – అంటే 30 వచ్చాక.”
“కండోమ్ వాడడం నాకిష్టం లేదు.”
“నా క్లాస్ మేట్స్ తో నేను సెక్స్‌లో పాల్గొంటున్నపుడు నేను కండోమ్ ఎందుకు వాడాలి?”
“కండోమ్ గురించి ఆలోచించే తీరిక లేదు. వేరే చాలా అవసరమైన విషయాలు నా బుర్రనిండా వున్నాయి.”
“నా బోయ్ ఫ్రెండ్ని కండోమ్ తొడుక్కోమని అడిగితే, నేను అతన్ని నమ్మడం లేదనుకుంటాడు.”
“చాలా సార్లు… కండోమ్ సంపాదించడం కష్టం. మేము ఏమని చెబుతామంటే…ఇదే మొదటిసారి…నీకు ఫర్వాలేదా? లేదా జాగ్రత్తగా వుండమంటావా?”
“నేను నా షేవింగ్ కిట్ నుండో, మరెక్కడి నుండో కండోమ్ తీస్తే నా భాగస్వామి నేను తిరుగుబోతుననుకునే ప్రమాదం వుంది.”
“నేను సెక్స్‌లో పాల్గొనేటపుడు భావప్రాప్తి సమయంలో విరమించుకుంటాను. కండోమ్ అవసరమేముంది?”
“మొదటి సారే కండోమ్ ఎందుకు? చాలా సార్లు వెళ్ళాక వాడితే సరి.”
“ప్రస్తుతం మంచి మందులు దొరుకుతున్నాయి. ఓ టాబ్లెట్ పౌడర్‌గా చేసి పురుషాంగానికి పూసుకుంటే చాలు లైంగిక వ్యాధులు పోతాయి.”
“వాడిన కండోమ్ పారేయడం కష్టం. ఎక్కడంటే అక్కడ పారేస్తే దొరికిపోతాం కదా!”
“కమర్షియల్ సెక్స్ వర్కర్‌తో వెళితేనే హెచ్ఐవి వస్తుంది. అందుకే నేను నాకు తెలిసిన వాళ్ళతోనే వెళతాను.”
“ఎయిడ్స్ నాలాంటి ఆరోగ్యవంతులకు రాదు. నేను బలంగా వున్నాను. బాగా తింటాను.”
“హెచ్ఐవి కి ఎయిడ్స్ కి వున్న తేడా ఏమిటో నాకు తెలియదు.”
“నేను ఎయిడ్స్ గురించి భయపడను. అది ఎక్కడో వుంది. నా చుట్టూ అయితే లేదు.”
“నా స్నేహితుల్లో హెచ్ఐవి/ ఎయిడ్స్ తో బాధపడేవాళ్ళెవరూ లేరు”.
“ఒక్కసారి సెక్స్‌లో పాల్గొంటే హెచ్ఐవి లాంటి పెద్ద రోగం నాకు రాదు.”
“ఓ రెండు దశాబ్దాల తర్వాత ఎలాగూ నేను కాన్సర్‌తోనో, గుండె జబ్బుతోనో చస్తాను. ఎయిడ్స్ గురించి భయమెందుకు?”
“ఒక్కసారి పాల్గొంటేనే ఎయిడ్స్ వస్తే, రానీయండి ఒక్కసారి సెక్స్‌లో నేను పొందిన ఆనందం ముందు ఇదెంత.”
“సెక్స్ వర్కర్లు, ట్రక్ డ్రైవర్లు ఎయిడ్స్ గురించి బాధపడాలి గాని మేమందుకు బాధపడాలి.”
“మేము పబ్ల్లో కలుస్తాం. తాగుతాం. హడావుడిగా సెక్స్ ముగించేసి అక్కడి నుంచి వెళ్ల పోతాం.”